30, మార్చి 2010, మంగళవారం

బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి ..

హెచ్.బి.ఒ లో ఏమొస్తుందోనన్న బెంగ తో రిమోట్ తో సెర్చుతుండగా "ఒక్కొక్క ఎలిగె పండూ గౌరమ్మా...దూరాన దోరపండూ గౌరమ్మా.."అంటూ ఒకానొక చానల్లో
బతుకమ్మ పాటొస్తుంటే పానం కాంతి వేగంతో నా పుట్టింట్టికి పారిపోయింది.
ఫ్లాష్ బాక్ లో..,మా ఊళ్ళో పెత్తరమాస.. వీది వీదంతా తంగేడు,బంతి.చామంతి ఇంకా రక రకాల పూలతో,పండ్లతో మొజంజాహి మార్కెట్లా ఉండేది..
ఆ పూలతో అమ్మలక్కలు బతుకమ్మలు పేరుస్తుంటే, మా నాయిన మాత్రం బయట చాపేసుకొని మిద్దెరాములు ఒగ్గుకత వింటూ రంగురంగుల దారాలతో,రంగుదారాలతో మధ్య మధ్యలో తంగేడు,జిల్లేడు,బంతి,ఉప్పు పువ్వుతో ఈఫీల్ టవర్ ఎత్తంత భలే కళాత్మకమైన బతుకమ్మను పేర్చి మా అమ్మకిచ్చేవాడు..
పొద్దుగూకాక గంజి పెట్టీ ఇస్త్రీ చేసిన పట్టు బట్టల్తో లేడీసు గౌరవంగా పట్టుకొచ్చే గౌరమ్మలను చూస్తుంటే కలిగే ఆనందం

చెప్పనలవి కాకుండా ఉండేది..
సరిగ్గా ఆరు,ఆరున్నరకు "బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి మంగలంబున నిన్ను మధ్యనా నిల్పియు..రంగు గుమ్మడి పువ్వులూ గౌరమ్మ రాశిగా నర్పింతురూ..."అంటూ బతుకమ్మగీతాలు కోరస్ గా మొదలయ్యేవి..... మా అమ్మచేసిన మల్లిద ముద్దలు తింటూ
ఆ పూల బతుకమ్మల మధ్యలో రంగుపూల దారాల ఎత్తైన ఈఫీల్ టవర్ ను చూస్తుంటె అచ్చం మా నాయినను చూస్తున్నట్టే ఉండేది..
ఠీవీగా..దర్పంగా..స్పెషల్ స్పెషల్ గా .....

[మా నాయిన గుర్తొచ్చిన ప్రతిసారి ఏదో రాయాలి,ఏదో గీయాలి అనిపిస్తుంటుంది..నాకేమో Dyslexia [అచ్చరాలను గుర్తు పట్టకపోవడం]జబ్బాయె..
మార్చి ముప్పైయ్యో,ముప్పై ఒకటో మా నాయిన పుట్టిన రోజని లీలగా గుర్తు........

కనీసం ఈ రోజన్నా విస్మరణకు బదులు స్మరణ చేద్దామని..

29, మార్చి 2010, సోమవారం

సంకనాకిన సదువులు

సదువులు నానా విదాలు..
సదివినట్టు నటించే సదువు..సదివి సదవలేదని నటించబోయి సదివినట్టు జీవించే సదువు..ఇంటి నిండా ఫోటోల మాదిరి గోడలకు పుస్తకాలు అలంకరించి ఎగ్జిబిషన్లు పెట్టే సదువు..తమకు చేతకాని సదువును సదవమని చెప్పే సదువు..
తెలిసిన మిడి మిడి ప్రాస ప్రకోపాలను ఎదుటోడి మీద విసర్జించే సదువు..ఒళ్ళంతా అహం తప్ప అచ్చరం ముక్క అడ్రస్ లేని సూపర్ ఈగోతో ఎంటర్ నొక్కే సదువు..
నేను చాలా చాలా ఇస్పెషల్.. ఎహే నేను తినే తిండే వేరు,నేను తాగేదే వేరు..నేను సదివింది అంతా ఇంతా కాదు అంటూ ఓ మూలన నిలబడి ముంజేతి తాయత్తును చూపించే సదువు....మిగతా సదువులు మొదలగునవి...

అందుకే "ఈట్ అండ్ వామిట్"[సజ్జలు తిని సజ్జలు విసర్జించే] బాపతు సంకనాకిన సదువులు మానేసి వివేకానందుడి కోట్ ని హండ్రెండ్ పర్సెంట్ ఒపాసిటీ రెడ్ కలర్తో అండర్ లైన్ చేశా !!
"Education is not the amount of information that is put into your brain and runs, riots there,
Undigested all your life .
If you have assimilated your ideas and made them life and character,you have more Education
than those who byheart a whole library."

యే మాయ చేసెనో ఏమో??

మా ఇంటి పక్కాయనకు కొరల్ పెయింటర్ ఇచ్చిన పాపానికి వద్దు వద్దన్నా పర్లేదు ఉంచమని యే మాయ చేసెనో పైరేట్లీ
డవున్లోడెడ్ డీ వి డీ ఇచ్చి ఎల్లాడు.
అసలే నా సిస్టమ్ కిరన్ కుమార్ రెడ్డి పాడయ్యాడు[స్పీకర్]
హెడ్ ఫోన్స్ కొందుము కదాని షాప్ కెల్లా..వాడు హోం దియేటర్ చూపెట్టాడు..వద్దులే హోం కొన్నాక దియేటర్ ఇద్దువులే ముందు హెడ్ ఫోన్స్
చూపెట్టమన్న..దానికి హెడ్ వుండాలి కదా అన్నాడు..
కుక్క దెబ్బకు షూ కాటు..
ఇగ ఇంటికొచ్చాక సిన్మా షురూ అయింది..
సమయమంతా సమంతా వాయిస్సే..ఆభ్భాభ్భా అద్ధిరా వాయిస్ అంటే..
ఓవర్ వాయిస్ కాదది వాయిస్ఓవర్!
మాటాల్లో మళయాళ అలిపి యాస కలిపి కొడుతుంటే కేరళ నారికేళంతో పూజ చేయాలనిపించింది.
సీన్ ఆఫీస్ కు షిఫ్ట్ అయింది..నా డెస్క్ నిండా ఫ్లాష్ యానిమేటర్ శివ గీసిన సమంతా పోట్రయిట్లే..
అన్నా !చాన్సొస్తే సమంతకు సీమంతం చేసేస్తానన్నా అన్నాడు..
వెల్డింగ్ చేసిన నాగచైతన్య మూతి మీద ఒట్టన్నా అని కూడా అన్నాడు.

మహాత్మా!

నాలుగేళ్ళా ఏడున్నర నెల్ల క్రితం..
ఓ జర్నలిస్తు అనబడే మిత్రుడు బుక్కేశాడు..
అది చూసి కడుపు మండిపోయిన తోటి కరడు కట్టిన జర్నలిస్తు అనుకునే సదరు శాల్తి "బుక్కులేయొద్దూ,చదవాలి" అన్నాడు.
నువ్వు చదవాలంటే ఆయన వేయాలి కదా అన్నాన్నేను.
అప్పట్నున్చి నాతో మాటలాడ్డం మానేసి భదిరులకు వార్తల టైపు సంభాసిస్తున్నాడు.
పాపం ఇప్పుడా జర్నలిస్టు హౌజ్ కు వెల్లడమే మానేసి మాన్షన్ హౌజు లోనే కాపురమ్ పెట్టాడట..
ఫ్రీడం ఆఫ్ డ్రింకింగ్ ని టెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో,
వాటర్ కలపని క్వార్టర్ సేవిస్తూ అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి సెల్యూట్
చేయబోయి తుళ్ళిపడిపోతే పచ్చి మందునీళ్ళు చల్లితే తప్ప కాంప్రమైజు కావడం లేదట.

అన్నట్టు.. అతని గుండెకు చిల్లు..ఆ చిల్లు లోంచి చూస్తే కే.ఎన్.వై పతంజలి గారు దర్శనమిస్తారు.
ఓ సారి బోరున ఏడుస్తూ ఆఫీసుకొచ్చాడు...ఏంటని అడిగితే ఓ కత చూపెట్టాడు,ఆ కతని నూట యాబై ప్రింట్లు తీసి
మూడొందల మంది మిత్రులకి చదివి వినిపించే వరకు తన ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక పోయాడు.
ఆ కత "సీతమ్మ లోగిట్లో...."..రచయిత కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి.
ఇది చిల్లిగవ్వకు రెండో సైడు.

కిరి కిరి


జీ చాట్లో హవ్ ఈజ్ లైఫ్?----సజిత్ కుమార్
కన్‌ఫ్యూజింగ్--నేను
సేం..రోజుకో సినిమా నేను డౌన్లోడ్ చేసుకోని,నాకు అప్లోడ్ చేసుకునే ఒక పాసన్ తప్ప వేరే కిరి కిరీలు లేకపొవడం వల్ల...--సజిత్
షేం టూ షేం...ఉండేది 'ఛే' నెంబర్ పంజేసేది పాంచ్ నెంబర్ మధ్యలో వేరే నెంబర్లే లేకపోవడంతో...--నేను