28, మే 2010, శుక్రవారం
నా మొగం!
ఒంగటో పోటో : బెల్జియం ఫుడింగి "ఒప్డెబీక్" ఒక్కటిపీకి వదిలిండు నన్ను.
రొండో పోటో : పోటో పంపంగనే అర్జంటుగా అర్జెంటీనా జగజ్జట్టి "మార్సెలో గుర్ర" నా సక్కదనం సెడీ సెడకుండా రప్పరప్ప గీతల్తో చెడుగుడాడాడు నన్ను.
మూడో పోటో : ఇట్ల నా పోటో పంపిన్నో లేదో అట్ల ఇటలీ నుంచి "మారియో మాగ్నట్టి" నా చెవులకు స్పైడర్ లోలకం తగిలించి తన్నొదిలాడు.
నాలుగో పోటో : మనది ఇస్త్రీలను పూజించే దేశం గాబట్టి వాండ్లకు కేటాయించిన సీట్లలల్ల వాండ్లనే కూసొమ్మనాలిగదానిజెప్పి.. ఆడపిల్లకాయ "రమన్ జిత్"
ఢిల్లీలో గీసి పార్సిల్ పంపితే వచ్చి అంబరుపేట అలీకేఫ్ గల్లీలో పడ్డా.
"నీకేమ్రా..ముక్కొంకరా?మూతొంకరా?..నువ్వు బంగారమ్రా.."అని మా అమ్మంటే.."ఎహే నీకు అన్నీ వంకరేరా భడవా.."అంటూ నన్నిట్లా జాడిచ్చొదిలారు.
26, మే 2010, బుధవారం
చిలకలగూడ కల్లు కాంపౌండు లో "ఆయాన్ రాండ్"
"కాలేజి కరిక్యులం మీద ఆయాన్ రాండ్ ప్రభావం" అన్న ఆర్టికల్ కోసం ఒ అమెరికా మ్యాగజిను ఫ్యాకల్టి ఎడిటరు కం ప్రొఫెసరు "You are incredibly talented." అంటూ ఇరవైవేల రూపాయలకు నే గీసిన అయాన్ రాండ్ బొమ్మని వన్ టైము కాపీ రైటు కింద బేరం చేసి ఎగరేసుకుపోయాడు[డిజిటల్ బొమ్మ కాబట్టి డిమాండు,సాంప్రదాయ చిత్రకళకు వాడిచ్చే రూకలకు నూకలుకూడా రావు..పైగా ఆ కళ నాకు రాదు..థాంక్ గాడ్!] క్రెడిట్ లైను కింద నా "బ్లాగో"తం.."వెబ్"చారం కూడా అచ్చేసి మ్యాగజిన్లు మా ఇంటికి బట్వాడ చేస్తానని మెయిల్లో సెండాడు.
ఆ డబ్బుల్తో ఆటోజానీ కి తన అడ్డా చిలకలగూడ కల్లు కాంపౌండు లో కాళ్ళషోర్వ,బోటి పేగుల్తో ఓ భారీ దావత్ నేను ఇవ్వకుంటే ఈ టపాకు అర్థమే లేదు.
"ఆయాన్ రాండ్__ఆటోజానీ" కోసం నా ఆంగ్లబ్లాగు నొక్కండి.
అన్నట్టు ఆయాన్ రాండ్ కొటేషను ఇచ్చట నేను కొట్టేసెను.
"Money demands that you sell, not your weakness to men's stupidity, but your talent to their reason. "
24, మే 2010, సోమవారం
భూగోళం.. జలగోళం...గందరగోళం..
పేపర్లో బుక్కెడు బువ్వ,గుక్కెడు నీళ్ళమీద పుంఖాను పుంఖాలుగా కార్టూన్లు గీస్తూ గీస్తూ వుండగా ఓ పాలి పోరం పర్ పొలిటికల్ కార్టూనిస్టుల పోరగాళ్ళం కాలక్రుత్యాలను వాయిదావేస్తూ,కొండా కోనొకచో నిషేధిస్తూ నీటి పరమాణువులను ఎట్లా పొదుపు చేయవచ్చునో అనే అంశం మీద పోటీలు పెట్టి దేశ దేశాలనుంచి వ్యంగబాణాలను ఆహ్వానించగా నాలుగు నూర్ల బొమ్మలు ముప్పై సిక్స్ దేశాల్నుంచి డౌన్లోడ్ అయ్యాయి,కొన్ని ల్యాండ్ అయ్యాయి..వాటిలో కొన్ని శ్రీరమణ గారి హయాంలోని "నవ్య"లో ఇలా ప్రింటయ్యాయి.
21, మే 2010, శుక్రవారం
ఒక నదివోలె ఆనందం ఎద పొంగెనే..
టీ.వీ లో ఆదివారప్పూట సాయింత్రం అమితాబ్బచ్చన్ సిన్మా వస్తుందంటే చూసేవోన్ని..లేకుంటే లే..శనివారం తెల్గు సిన్మాతో సరి..దోస్తులు కూడా తెల్గు దోస్తులే ..ఒక్కనాకొడుక్కి హిందీ,ఇంగిలిపీసు వస్తే ఒట్టు.శుక్కురోరం సిత్రలహరి తోనె అడ్జెస్టు.
కొంతమంది వీరోలని జూసి,వీరోయిన్లని జూసి ఇంగొంతమంది పోటుగాళ్ళైతే డైరెట్టర్లని జూసి సిన్మాకెళ్ళెవోళ్ళు..నేను అట్టాంటిట్టాంటి మొగోన్ని కాదు కాబట్టి చిత్ర పాడిన పాటలు తెరమీద సూడాలని మాత్రమే ఎల్లేవోన్ని.చిత్ర బొమ్మ గీసి ఏకంగా నా నైన్తుకిలాసు పుస్తకాల అల్మారాలో అంటించుకుని ఆనందించేవాణ్ణి..అట్ల అంటుకుపోయిన చిత్ర బొమ్మ ఇప్పటికీ నన్నొదల్లే..ఉజ్జోగం ఊడినా,ఉండి వచ్చిన జీతం చాలకున్నా,ఇంటద్దె నెలనెలకు పెరిగినా,పోరగాల్ల సతాయింపులు సతాయించినా చిత్ర వాయిస్ ఇంటే బలే స్ట్రెస్ బస్టరబ్బా!
చిత్ర పాటలిన్న అనుభవమేగాని ఆమెను చూసింది లే..ఎట్లుంటదో ,ఎట్లుంటదో అని వాయిస్ వింటూ ఊహించి బొమ్మలేసేవాణ్ణి..ఓసారి అంతరాయానికి చింతిస్తున్నాం దూరదర్శన్లో చుడీదార్తో పాటలు పాడుతున్న చిత్రను చూసి గుండెలు లబలబా కొట్టుకున్నా..అదే మొదటిసారి..మలయాలి అమ్మాయని తెలిసి గుండుగుత్తగా ఏకంగా కేరళనే అబిమానించేవరకెళ్ళింది నా మోజు. "సింధూరపువ్వాతేనె చిందించరావా.."పాట ఎన్నిసార్లు విని పావనమయ్యానో లెక్కపెట్టడానికి లెక్కలు తెలియని వయసునాదప్పట్లో..నిరోషా ఇస్కూలుకు ఎల్తుంటే రాంకీ అట్కాయిస్తాడు..మొదట్లో నిరోషా టక్రాయించినా తర్వాత్తర్వాత దారికొస్తుంది ,చిత్ర పాటేసుకుంటుంది "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అని.. ఇంకేం ఇక్కడ అబ్భ ఏమి గొంతు భళిరా..అది సోకెనంటె భలిరా !!.....రాయడానికి తెల్వని ఐక్యూ.
ఆ సిన్మాని మా అమ్మానాన్నల కళ్ళద్దాలుగప్పి ఎన్నిసార్లు చూసుంటానో చిత్ర కోసం.
విజగశాంతికి చిత్ర పాటేసుకుందంటే ఇంగ నాకారోజు అరకోడికూర,కొరమీను పులుసు అంచుకు చిల్లిగారెలు,రొయ్యవేపుడుతో బోయినమే!ఆ కాంబినేషను పాటలు విని వినీ విన్సెంట్ వాంగో అయింది నామొగం[చెవి కోసుకున్నంత పని] బోన్గిరిలో సదువుతూ వుండగా నాకు రెండే రెండు పిరేడ్లు..మార్నింగ్ పిరేడ్ ఓంకార్ టాకీసులో,రెండో పిరేడ్ మ్యాట్నీ ఎంగటేస్పరా టాకీసులో ..చిత్ర పాటేసుకుందని చెప్పడమే ఆలస్యం ఎనకాముందు సూడకుండా లగెత్తడమే లగెత్తడం..
మరణమ్రుదంగంలో "గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.." పాటకు నేనున్నాను లో "ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో.."పాటలో చిత్ర గాత్రం తాలూకూ విప్లవాత్మకమైన మార్పును నేను గమనించితి.
పాపం అందరూ గొప్పసింగర్లే గానీ,నన్ను మెప్పించేటట్టు పాడే రగస్యం మాత్రం ఈ జగాన ఒక్క చిత్రకే తెల్సునని నా అభిప్రాయం.
నూనూగు మీసాల నూత్నయవ్వనముతో కళకళ లాడుతూ కౌమారదశకు చేరుతున్న టైములో చిత్రను ప్రేమించిన ఇధంగా ఏ ఆడదాన్నిగూడా కనీసం కన్నెత్తికూడా చూల్లే.
ఇప్పటీకీ "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అన్న పాటింటే చాలు నైన్తు కిలాసు పుస్తకాలు పడేసి టాకీసు వేపుకు పరిగెడుతున్న పీలింగు.
చిత్ర పాటల్ని కళ్ళతో వినీ,చెవుల్తో చూసే అలవాటయ్యాక నేను కలవాలనుకుంటున్న వ్యక్తుల లిస్టులో తర్వాత పేరు ఈ దేవతాకంఠం.
చిత్ర పాడిన పాటల్లో నన్ను గిల్లిగింతలు పెట్టిన కొన్ని వాక్యాలు..
"జుంటితేనె తొనికించగా..ముని పంటి పదును పెదవంటగా.."
"సవ్వడి చేయని యవ్వని వీణలు అలా అలా సవరించు ..పదే పదే పలికించు.."
"గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.."
"అబ్బ రూపమెంత రుచిరా..అహ చూపుకెంత కసిరా.."
"నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంభరం..నీ నవ్వు ముద్దాడితే మల్లెపూవాయె నా యవ్వనం.."
"మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో.."
"నీతోనే డంకాపలాసు..అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వేనా కళావరాసు.."
"ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే."
"మూసిన ముత్యాలకేలే మొరుగులు.."
"శ్రుంగార స్నేహాల సంకెళ్ళు వేయాలా సింగారి చిందాటతో.."
"మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.."
"పొద్దున్నే పుట్టింది చందామామ మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మా.."
ఇంతవరకే అంటే మిగిలిన పాటలు కోప్పడతాయ్ అందుకే అన్నీనూ..
9, మే 2010, ఆదివారం
మనసున మల్లెల మాలలూగెనే..
"ఏమోనండీ..మల్లెపూలు పెట్టుకునే అలవాటైతే లేదునాకు..సిన్నప్పట్నుంచి కూడా ఆ పూల వాసన పడదునాకు"అంది ఆ ఇంటావిడ.
"అట్లాంటప్పుడు ప్రతి నాలుగు మల్లెపూల మధ్యన ఒహ వట్టిచాప[ఎండు చేప] చొప్పున అల్లి పెట్టుకోవచ్చుగదా..పీలిస్తే గుమగుమ..సూస్తే స్రుజనాత్మకత.."
అని ఓ ఉచిత సలహా పారేసి వచ్చిన.
వొకర్తో వొకరికి ఈ మాత్రం తమాస గూడ లేకుంటే ఇంగ మిగిలింది అమాసేనబ్బా!
[శాంతాడంత నల్లటి జడ మీద బొక్కెన నిండ తెలతెల్లటి మల్లెపూల కలరు కాంబినేషను,కంపొజిషను బలే బాగుంటది.]
8, మే 2010, శనివారం
ఖాకీవనం
7, మే 2010, శుక్రవారం
చాపలపులుసా...మజాకా...! పార్ట్..2
పొద్దున్నే మా డోరు సాధారణంగా రెండు సార్లు మోగుతుంది..ఒహటి పాలోడు..రెండోది పేపరోడు..మొన్నోరోజు మూడుసార్లు మోగింది మా డోరు ఇసిత్రంగా..అట్లెట్లా??అంటూ డోరు తీసేసరికి ఎదురుగా మాధవి,హసీనా,ముగ్గురు కెమరామెన్లు,ఒక అసిస్టెంటు,మేకప్ మేను..బయట tv5 వ్యాను..
"నీ బ్లాగులో చాపలపులుసా...మజాకా.. చదివి వచ్చాం..ఆరుచీ బాపతు సీక్రెట్ ఏంటో మా tv5 ప్రేక్షకులకు చెబుదురు పా.."అంది మాధవి........అవునన్నట్టు తలూపింది హసీనా.
"ఇప్పటికిప్పుడు చేయాలంటే ఎట్లా..అందుబాటులో మా అమ్మకూడా లేదాయె."అన్నాన్నేను.."మరేం పర్లే..పిలిపించు"అన్నారు ఇవ్వాల మాకిదే పని అన్నట్టు.
ఊరినుంచి ఉరికి రాలేరుకదా..ఇప్పటికిప్పుడు అట్లా అరెంజ్ చేయడం మిషన్ ఇంపాజిబుల్ 2 అనిచెప్పా..టుమారో నెవ్వర్ కమ్స్ అన్నారు వాళ్ళు.డే ఆఫ్టర్ టుమారో అన్నాన్నేను..ఫైండింగ్ నెమో అన్నారు వాళ్ళు మళ్ళీ..ఇట్లాకాదని చాపలపులుసు వంట సింహాసనం మీద తాత్కాలిక అధికారిగా సుమ[నా పెళ్ళామ్] ను అధిష్టిస్తే ఎవన్న అభ్యంతరమా?అనడిగినాను..సర్సరే కానీయ్ అన్నారువాళ్ళు.గోల్నాక ఫిష్ మార్కెట్ కెళ్ళి బొచ్చెడు బొచ్చెలు తెచ్చా..
క్షణాల్లో పదండివిందుకు..
పైన వీడియో అదే..
చూసి ఫాలో అయితే లోకకళ్యాణం కోసం ప్రక్రుతి పులకిస్తుంది.. వరుణుడు విస్తారంగా వర్షాలు కురిపిస్తాడు..చెరువులు,సముద్రాలు తిరిగి కొత్త చాపలతో కళకళలాడతాయి..మళ్ళీ వాటిని మనం కూరొండుకొని తినొచ్చు..మళ్ళి వర్షాలు..మళ్ళి కూర....
5, మే 2010, బుధవారం
నంజుకోడానికి ఆర్కెలక్ష్మణ్..చప్పరించాడానికి బాపు..
రోజూ తినే రొటీన్ తిండి బోరుకొట్టి ఆల్టో కారేసుకొని ఓ ఐదుగురం ది స్పైస్ విలేజ్ కెళ్ళాం..అద్దాలమేడ..సెకండు ఫ్లోరుకెళ్ళి ఈసారి లెఫ్ట్ తిరిగి మూలమీద కూర్చున్నాం..
అందరిటేబుళ్ళమీద బాపు,ఆర్కెలక్ష్మన్ కార్టున్లు వడ్డించాడు సర్వర్..దిమ్మదిరిగింది..ఉరే రామేశ్వర్ వెళ్ళినా మిష్టర్ శనీశ్వర్ తప్పడా??అనుకున్నా..
"ఇదేందిబై అన్నానికొస్తే విస్తర్లు వేయకుండా సెటైర్లు వేస్తారేం?"అన్నాన్నేను..ఇక్కడంతే బై అన్నాడువాడు..కార్టున్లు చూస్తూ భలే ఎంజాయ్ చేసారు "ది స్పైస్ విలేజ్" కస్టమర్లు.. వంటలు లేటయితే వాడి మాడుపగులుతుందని మనకు సంకలగులగుల పెట్టే ప్రయత్నం తాలూకు కాన్సెప్టు అయ్యుంటుంది.
కార్టూను పోస్టర్లమీద ప్లేట్లు,వాటిమీద బోయినం,నంజుకోడానికి ఆర్కెలక్ష్మన్..మజ్జిగలో చప్పరించాడానికి బాపు..భలే భోయినం..బ్రేవ్!!
"ఈ ఇషయం కూడా రాస్తారా?ఏంది..బ్లాగులో..?"అన్నారు తోటి ఎంప్లాయీస్...
ఇంకేం అన్నంతపనయ్యింది..!
{శిల్పారామం ఒసారెళ్ళి "ది స్పైస్ విలేజ్"కి దారెటూ?అనడగండి చాలు తర్వాత వాడే చూసుకుంటాడు.}
4, మే 2010, మంగళవారం
మానాయిన తీర్పు
ఒకప్పుడు వాళ్ళు మా ఇంటి ఎనకాల ఇంట్లో వుండేవోళ్ళు[అది మా చిన్నకాకయ్య వాళ్ళది].మగ్గం నేయగా సంపాయించిన డబ్బుల్తో సొంతంగా ఇండ్లు కట్టుకునే స్థాయికి ఎదిగిపోయి పొలిమెరకెళ్ళిపోయారు.
పెంటయ్య భార్య రాములమ్మ వీళ్ళిద్దరూ మా ఇంటెనకాల వున్నన్ని రోజులు కాపురం బానే చేసేవోళ్ళు..ఎందుకంటే మేం వుండే కాలనీలో మా నాయిన పలుకుబడి తాలూకు వైబ్రేషను నలుదిక్కులా కిలోమీటరు వరకుండేది..ఎవరింట్లో పంచాయతీ అయినా మా నాయిన తశ్వె[solve] చేయాల్సిందే..ఏ పెళ్ళాం మొగుడు పీకులాడాలన్నా మానాయిన పర్మిషన్ అవసరం అయేటట్టుండేది అక్కడ పొజిషను.బొంగురుగొంతుతో పెంకుటిల్లు టాపులు లేచిపోయేటట్టుండేయి మా నాయిన తీర్పులు.వెనకా ముందులు మొగమాటాల్లేకుండా వుండేయి వాదనలు..
దేశనాయకుల బొమ్మలు బట్టపై నేయడం,కొత్తకొత్త డిజైన్లు కనిపెట్టడం,కుట్టకుండా ప్యాంటు షర్టు నేయడం,అగ్గిపెట్టెలో పట్టేచీర నేయడం.. లాంటి ఎక్స్ పెరిమెంట్లు చేయడం మూలాన మా నాయినను కలవడానికి థాయిలాండ్,ఆఫ్రికా,జపాన్,మలేషియా,సింగపూర్,పారిస్,అమెరికా.....ల నుంచి ఫ్యామిలి ఫ్యామిలీతొపాటు టిఫిన్ బాక్సులు కట్టుకొని మరీ మా ఇంటిని దర్శించడంవల్ల మా నాయిన ప్రతిష్ట వద్దువద్దన్నా అమాంతం పోచంపల్లి పొలిమెరలు దాటి ఎటో ఎళ్ళిపోయింది..అందుకే మా ఊళ్ళో మా నాయినన్నా,మా నాయిన తీర్పులన్నా ఎనలేని గౌరవం.
పెంటయ్య,రాములమ్మలు మాఇంటికి దూరంగా ఊరిపొలిమెరల్లోకి ఎళ్ళిపోవడం..రోజూ గొడవలు షురూ కావడం ఏకకాలంలో జరిగిపోయాయి.ఇద్దరికీ క్షణం పడకపోవడం..తీర్పులకోసం మా నాయిన దగ్గరికి నువ్వానేనా?అన్నట్టు రన్నింగ్ పోటీలు..ఈవిడ గురించి ఆయన,ఆయన గురించి ఈవిడ..ఇదే తతంగం..
అసలు గొడవేంటని ఆరాతీస్తె తెలిసిందేంటంటే సదరు రాములమ్మకు దైవభక్తి రోజు రోజుకు పెరిగిపోయి పతిభక్తిని పక్కకుపడేసింది..వేళకు భర్తగారిని ఎండబెట్ట
డం..భార్యాభర్తలు చేయాల్సిన పనులు ఏవీ జరిగేయికావు..ఈవిడకు భక్తి పెరిగిపోవడం,ఆయనకు బీ.పీ పెరిగిపోవడం...లేసింది మొదలు ఇదే డ్యూటి..పెంటయ్యకు సావు గోస పాపం..పొద్దస్తమానం దేవుడిరూములోనే రాములమ్మకు డ్యూటి.దేవుడి రూముని చక్కగాపేడతో అలికి పసుపుకుంకుమతో బొట్లు అలంకరించి ధూపధీప నైవేద్యాలను దేవుడికి అర్పించి ఆనక పెంటయ్యకు సమర్పించేది...తరవాత ధ్యానముద్రలోకి జారుకునేది రాములమ్మ.
రాములవ్వ.పెంటయ్యతాతలమనేవాళ్ళం మేము..
ఇంటిపై,ఒంటిపై ధ్యాసే లేకుండా చక్కగా శుభ్బరంగా దీపాలు ఎలిగించడం..నన్ను ఎండబెట్టడం"ఇదీ పెంటయ్యగారి ప్రథమ ఫిర్యాదు..
ఈ పంచాయతీ తీర్పుకు మా పోచంపల్లి హేమాహేమీలంతా హాజరయ్యి తోచిన తలా ఓ తీర్పు చెప్పారు..మానాయిన తీర్పు మిగిలిపోయింది..అంతా ఉత్కంటా..తీర్పు ఎలావుంటుందని...
"దేవుడికి ఇన్ని సార్లు నైవేద్యం పెడుతున్నావ్..పూజలు చేస్తున్నావ్..దీపాలు ఎలిగిస్తున్నావ్..అయినా మీ ఇంట్లో శాంతి వుంటలేదు అవునా?" అనడిగాడు రాములమ్మని మానాయిన.
"అవును"అంది రాములమ్మ
"అందుకని దీపాలు ఎప్పుడుపడితే అప్పుడు ఎలిగించకు."అన్నడు మా నాయిన
మరెప్పుడు ఎలిగించమంటావ్? అంది రాములమ్మ
"కరెంటు పోయినప్పుడే ఎలిగించు" ఫైనల్ గా మా నాయిన తీర్పు.
ఊరి జనం నోరెల్లబెట్టిన ఎక్స్ ప్రెషను మళ్ళీ వర్ణించడం కూడానా??
1998వ సంవత్సరంలో కోఠీ సుల్తాన్ బజార్లో రాములమ్మ ఒక్కతే గుర్తుపట్టరానివిధమైన వేషంతో వేగంగా ఫుట్ పాత్ పై నడుచుకుంటూపోతూంటే బస్సులోంచి చూసా..తర్వాత కొన్నిరోజులకే చచ్చిపోయింది రాములమ్మ.
[ఆరోగ్యం,అయిశ్వర్యం కోసం పూజలు చేసి ఉపవాసాలుంటే అవిరావు..గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుంది____మానాయిన]
3, మే 2010, సోమవారం
విష్ణుమూర్తి అవతారం
పండగపూట పెళ్ళాం మెగుళ్ళు చక్కగాస్నానం చేసి గుడికి కొబ్బరికాయలు తీసుకెళుతుంటే మా నాయిన మాత్రం
తలకాయకూరతో ఎదురుపడతాడు.ఆ రోజు పండగన్న ధ్యాసకూడా వుండదు.
ఉపవాసాలు,ఫాస్టింగుల పదాలింటే మా నాయినకు సివ్వరలేస్తది.పొట్టేలు మాంసమో,పొట్టపేగులో ఏది దొరికితే అది అప్పుచేసైనా కొని కొయ్యాల్సిందే,మా అమ్మచేత ఏ అర్ధరాత్రి అయినాసరే వండించి తిని తీరాల్సిందే..ఇదీ మానాయిన ఫిలాసఫి.అంతేగానీ పూజలు,వ్రతాలు,తీర్ధప్రసాదాలు బాపతు పదాలు మా నాయిన డిక్షనరీలోనే లేవు..
శివరాత్రి రోజు ఊరుఊరంతా దేవుని విగ్రహాలను భక్తిగా కడుగుతుంటే మా నాయినమాత్రం మా ఇంటి ఎదురుగా టెంకలో ఉప్పేసి చాపల్ని కడిగి శుద్ధంచేస్తాడు.
దేవుడికి సొంతాభిప్రాయాలున్నట్టే మా నాయినక్కూడా సొంతాభిప్రాయాలున్నాయి.."ఎవడి అభిప్రాయాలు వాడివే..ఎవడిష్టం వాడిదే"అంటూ చాపల్ని కడిగిన నీళ్ళను పక్కనేవున్న చెట్లకు పోస్తాడు.
మా నాయిన మనుషుల్ని ఎంత ప్రేమిస్తాడో జంతువుల్నికూడా అంతే ప్రేమిస్తాడు..పక్షులు,జంతువులు ఎంతప్రేమంటే వాటిని అమాంతం కూరొండుకొని తినేసేంత.
కుందేళ్ళు,ఉడుములు,పావురాలు,కోళ్ళు,చాపలు,అడవిపంది..ఏదొచ్చినా సరుకు నాణ్యత చూసి దానిమీద మా నాయిన I.S.I మార్కు వేయాల్సిందే..
అమ్మడానికి వచ్చినోళ్ళు ముందు మా ఇంటి ముందు ఆగి మా నాయిన బేరం తర్వాతే వాళ్ళు రెండో బేరానికి కదలాలి..చాపలైతే ముందు వాటి చెక్కిళ్ళు సుతారంగా తాకుతూ లాగి చూస్తాడు ఎర్రగా నిగనిగలాడుతూ వుంటే అప్పటికప్పుడు పట్టుకొచ్చినయన్నమాట..ఇట్లా ఉంటాయ్ కోడ్ లు..
మా ఊరిపొలిమెరల్లో రాత్రివేళ టార్చిలైట్ వెలుతురులో కుందేళ్ళని వేటాడి అమ్ముతుంటారు..వాటిని కొనేసి చక్కగా చర్మం పాడవకుండా రెండు కాళ్ళమధ్యనుంచి సన్నగా కోసి లోపలి మాంసం జాగ్రత్తగా తీస్తాడు..ఆ మాంసంతో కూర లేదా ముట్టీలు[కీమాబాల్స్] నూనెలో గోలించి చేయిస్తాడు..తిత్తిని మాత్రం చక్కగా కడిగి లోపల పత్తి[cotton]తో నింపి వాసనరాకుండా డాంబర్ గోళీలు[నాఫ్తలీన్]వేసి కుట్టి ఇంటి ఫ్లవరువాజుల పక్కన షోకేషుగా పెడతాడు..ఉడుములకు కూడా ఇదే గతి..అచ్చుపానమున్నవాటిలాగే చూస్తాయవి మనల్ని..
మా నాయిన ఈ తతంగం పూర్తిచేసేసరికి వాటి మాంసం తాలూకు వంట మా అమ్మ సిద్ధం చేస్తుంది.
ఇగ భోజనాలుకు కూసొని కుందేలుముక్క తింటూ షోకేషులో వున్న కుందేలుతిత్తి ముకాన్ని చూడడం..ఉడుము తునకల్ని నముల్తూ ఉడుము తిత్తిని చూడ్డం....
మానాయిన ఆనందం,త్రుప్తి అప్పుడు చూడాలి..వర్ణించడం ఎవరితరం??? ఏ పని చేసినా కాసింత కళాపోసన వుండాలి అన్నది మా నాయిన సిద్ధాంతం.
దీపావళి ముందు వరకు ఆ బొమ్మలుండేవి..ఇల్లు దులిపి సున్నలేసేటప్పుడు వాటిని మా అమ్మ బయటపడేసి కాల్చేసింది..
ఇక మా ఇంట్లో ఎవ్వరికి జరాలొచ్చినా డాక్టర్ దగ్గరికి ఎళ్ళడం అంటూ వుండదు...ప్రేమ్ లాల్ దగ్గరికో,విటాభా దగ్గరికో ఎల్తాడు మానాయిన.ప్రేమ్ లాల్ ,విటోభా లు మా ఊళ్ళొ పేరుమోసిన మాంసం కొట్టిచ్చేవాళ్ళు..[సాయెబులు,చాకలి,మంగలి,కటిక,..ఏ కులపోన్నైనా మానాయిన వరస పెట్టి పిలుస్తాడు..మామా అనో,అప్పయ్యా అనో,తాతా అనో అంతేతప్పా పేరుపెట్టి పిలిచిన పాపాన పోలె బతికున్నంతవరకు]
మా నాయిన ప్రిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది..
జలుబుకు కాళ్ళషోర్వ..గొంతు గరగరకు తలకాయ కూర..మోకాళ్ళనొప్పులకు పావురాళ్ళను కోసిన రక్తంతొ నొప్పిదగ్గర మర్ధన చేస్తాడు[ఈ వైద్యం మా మూడోవాడు దత్తు పై చాలాసార్లు ప్రయోగించాడు..దత్తు కట్టబడుతున్న బిల్డింగులపైనుంచి దూకే స్పెషలిస్టు కావడం మూలాన మోకాళ్ళనొప్పులు ఎక్కువగా వస్తుండేయి వాడికి]
మా ఇంట్లో వస్తుగుణప్రకాశిక అని ఒక పుస్తకం వుండేది..దాన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఎప్పుడో నేను పుట్టకముందుకొనిపెట్టాడు..ఆ పుస్తకంలో ఏ వస్తువ తింటే శరీరానికి ఏం జరుగుతుంది అని వివరంగా ఉండేది..ఆ పుస్తకం కోసం మా వీధిలో క్యూ పద్దతి పాటించేవాళ్ళు..ఆ బుక్కుని చక్కగా బైండింగు చేసి పెట్టాడు..బ్యాంకు లెడ్జర్ పుస్తకం మాదిరి వుండేది..హైటు అమితాబ్బచ్చన్,వెయిటు కల్పనారాయ్..
"పండగ పూట ఈ నీసు వంటలేందిరా"అని అంటూండేవాడు మా తాతా.మా నాయినేమో చాపలకూరని విష్ణుమూర్తి [మత్స్యావతారం]అవతారం అనేవాడు..
"పూటకో అవతారాన్ని తెచ్చి ఖతం చేస్తే సంపాదనెట్లా..పిల్లల పెల్లిండ్లు ఎట్లారా??"అంటూ ఒహటే గులుగుడు మా తాత.
1, మే 2010, శనివారం
యుధ్ వీర్ సు"బాణి" కి అభినందనలు
ఇట్లా చెరగని ముద్దర్లేస్తూ గీస్తున్న కార్టూనిస్టుల్లో ఇండియా తరుపున సుభాని గారు ఒకరని నా అభిప్రాయం.
ఓ చేత్తో జారుతున్న చెడ్డిని పైకి లాక్కుంటూ మరో చేత్తో ఆంధ్రభూమి లో సుభాని ఇలస్ట్రేషన్లు,D.C కార్టూన్లు చూసిన అనుభవముంది నాకు.
1998 జూన్లో బట్టతలతో అబ్దుల్ కలాం క్యారికేచర్ మిజైల్ మాదిరిగా గీస్తున్న ఒకాయన కనిపిస్తే కలిసి మాట్లాడాను.నేనూహించిన సుభానికి చూస్తున్నసుభానిముకానికి ఎక్కడా పొంతనలేదు..సమ్మందంకూడా లేదు.కాని అతను సుభానినే.
పదేళ్ళు సుభాని గారితో కలిసి ఆంధ్రభూమిలో కార్టూన్లేశా..పేపర్ లేకపోతె అడిగేవోన్ని...రబ్బర్ లేకపోతె అడిగేవోన్ని...పెన్సిల్ ముక్కు ఇరిగిపోతే అడిగేవోన్ని..అయిడియాలేకపోయినా అడిగేవోన్ని..!
సుభానిగారికి కట్ ఆయ్యె ఇన్ కమ్ టాక్స్ లో సగం వుండేది నా జీతం.
విశాలనేత్రుడు,ఆజానుబావుడు,చక్కటి మేనిచాయ అని నేను అననుకాని..చదువుకున్నకార్టూనిస్ట్ అని చెప్పగలను..అంత మాత్రంచేత గర్వవతుడు మాత్రం కాదు.తక్కువమాట్లాడతాడు..తక్కువ మాట్లాడే బొమ్మలున్న కార్టూన్లే వేస్తాడు..ఇంటర్నల్ పాలిటిక్స్ కంటే కరెంట్ పాలిటిక్స్ పైనే ఫోకస్ ఎక్కువ.జర్నలిస్ట్ క్ ఇన్ స్టింక్టు ఇంకు బాటిల్ సంపాయించి పెట్టుకున్నాడు.
సుభాని గారు గీసిన "గ్రేట్ వాల్ ఆఫ్ చైన" కంపొజిషను ఉంకో పదేళ్ళయినా నేను గీయలేనని చాతి విరుచుకొని చెప్పగల్ను.చంద్ర గారి ఇన్ ఫ్లూయేన్స్ ఉన్నట్టు నాకు డవుటు.
ప్రతిష్టాత్మక యుధ్ వీర్ అవార్డు అందుకున్న సు"బాణి" కి అభినందనలు.
[సంపాయిస్తున్నది నెలకు లక్షా,అర లక్షా కాదు,మన బంగారం మార్కెట్లో క్యారెట్టా,కాడ్మియమా,రోల్డుగోల్డా? ఏకంగా కాకిబంగారమా ??? ]