17, అక్టోబర్ 2010, ఆదివారం

పాండుకు నా అలయ్.. బలయ్ !!



ప్రతి దసరాకు పాండునుంచి వచ్చే దసరా విషెస్ ఎసెమ్మెస్ ఈసారి రాలేదు.పాండు లేడు..
నీది సూపరు లైను గురూ,ఆ అడ్డమైన సాప్టువేర్లో నీ హార్డువర్కేంటి గురూ..నీ మొహం..నీ శ్రాద్ధం..నీ పిండాకుడు..అన్న నిందాస్థుతులు ఇక లేవు..మా నాయిన బొమ్మ గీసిస్తానన్న పాండు లేడు.దసరాకు మూడురోజులముందు ఆర్టిస్టు,కార్టూనిస్టు పాండు చనిపోయాడు.44 ఏళ్ళకే వెళ్ళిపోయాడు.దసరాకు అంతా సొంతూరుకు ట్రావెల్సులో వెళుతుంటే,పాండు అంబులెన్సులో వెళతాడని కలలోకూడా అనుకోలేదు

1997 వార్తపేపరులో అకాలనిద్రనుంచి మేల్కొన్న దేవెగౌడ కాంగ్రెస్ ఫ్రంట్ గవర్న్మెంటును బాణం వేసి కూల్చేస్తాడు పైగా "ఇది వెన్నుపోటుకాదు,ఫ్రంట్ పోటే" అంటాడు నిద్రకళ్ళతో.షార్ప్ బ్రష్షు స్ట్రోకు,జబర్దస్తీ కంపోజిషను,లెక్కతో గీసిన బార్డరు హెచ్చింగ్స్..కార్టూను కింద పాండు అన్న సంతకం..జలక్ మంది నాకు..మోహన్ గీతతో చాచి కొట్టిన వీడు ఎవడబ్బా అని ఆరా తీసా ..రెడ్ హిల్స్ మెడ్ ఆర్సీ పక్కరూము గొళ్లెం తీసా..నవ్వుతూ పాండు..ఓ కౌగిలింత విత్ ఇస్మైల్ ఫ్లేవర్..ఇక వన్ బై టూ చాయ్ లు..షేరింగు ఆటోలు..కొండొకచో కోఠి బస్సులు..మోహన్ లైను పట్టుకొని ఖరారు చేసుకొనే పరుగుపందెంలో పాండు స్పీడు ఆశ్చర్యం.. మోహన్ గీతలేకాదు,ఆ గీతల్ని గీసే చేతివేళ్ళ కదలికలనుకూడా కాపీ చేసేవాడు పాండు..సిగరెట్ పీల్చి పొగొదులుతూ మీసపు అంచుల్ని కొనగోట మీటుతూ ప్యాంటును పైకిలాగుతూ అచ్చం మోహన్ మినియేచర్ లా కనిపించేవాడు..పెన్సిల్ ను మొనకు దూరంగాపట్టుకొని రపారప్ గీతలుగీసే పాండు స్టైల్ నాకిష్టం.
మా దోస్తానా అలా అలా ట్యాంకుబండు పాన్ డబ్బాపక్కసందునుంచి,పంజాగుట్టా కేఫ్ ల గుండా చిక్కడపల్లి బడ్డికొట్టు మీదినుంచి విద్యానగర్ సందుతిరిగి రామంతాపూర్ గల్లీ లో ఆగింది..
జ్నానవైరాగ్యసిద్ధర్ద్యం బాగ్ లింగం పల్లిలో మా అడ్డా కేఫ్ లో నేను కలిస్తే సిగరెట్ కో శ్లోకం,వక్కపొడికో పద్యం,ఛాయ్ కో చంపకమాలతో పాండు నన్ను అలరించాడు,నేను అభిమానించాను..నేను దుఖం పంచితే సంతోషం ఇచ్చాడు..తాదాత్మ్యతచెందే ఆధ్యాత్మిక విషయాలు భోధించాడు..ఛెగువేరా,శంకరాచార్యుల తత్వాలు..అష్టాదశపురాణాలు,అష్టకాలు,బాగవతాల సిన్మాలు విత్ ఓషో,రెంబ్రెంట్ల న్యూస్ రీల్సు..గంజాయి దమ్ము బిగించికొట్టిన కమ్మటి మత్తు..రిలీఫ్ మస్తు..ఇప్పటికీ చిక్కడపల్లి టర్నింగు పాయింట్లో పాండు బరనబబరవలు,నజబజజజరాలు,మసజసతతగాలు....కృతులు ..కీర్తనలు..
వినకుండా వినుకొండ నుంచి వచ్చి దినపత్రికలో కార్టూనిస్టు ఉజ్జోగం వెలగబెట్టినపాపానికి నాలుగునెల్లకో నెలజీతం తీసుకొని ఆకలిపేగులు అరగక లోయరుటాంకుబండు బండలకింద నలిగిపోతూ "టౌనుపక్కకెళ్ళొద్దురో డింగరీ ఢాంభికాలు పోవొద్దురో.. " అంటూ పాడిన పాట ఇంకా గుర్తు.
జయలలిత వాజ్ పేయి దవడలు వాచిపోయేలా సతాయించి చంపుకుతింటున్న హయాంలో.."మీరజాలగలడా నా యానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి.."అంటూ జయలలిత లేని జడను ఊపుతూ గీసిన కార్టూను ఎట్లామరిచిపోతామబ్బా ??
రోడ్డుపక్క కూలిన గోడలమధ్య ఓ వెంకాయమ్మ తన పెనిమిటితో.. పెద్దాడు సాప్టువేరు అంటుంది..లాంగ్ షాట్లో ఆ పెద్దాడు చాయ్ చాయ్ అని అరుస్తావుంటాడు..
చిన్నాడు హర్డ్ వేరు అంటుంది..క్లోజప్ లో ఆ చిన్నాడు కాల్చిన ఇనుముకడ్డీలను సుత్తితో హర్డుగా కొడుతుంటాడు.. పాథటిక్ పొలిటికల్ హ్యూమరు.పాండు గీసిన కార్టూను.
బ్రహ్మకడిగినపాదము బ్రహ్మముతానెనిపాదమూ..అంటూ హమ్ చేస్తూ 6x4 అడుగుల అద్దెగదిలో 12x8 అడుగుల నిలువెత్తు వెంకటేశ్వరస్వామిని పెయింట్ చేస్తున్న పాండును చూసా..ఏడుకొండలూ దిగి వయా వినుకొండనుంచి విద్యానగర్ కు వచ్చిన శ్రీ వేంకటాచలపతినీ చూసా.ప్రతిలేని గోపురప్రభలు గంటి..శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి..హరిగంటి..గురుగంటి..
ఒక చెంప సెల్ షీట్ల కట్టలమీద తాండవకృష్ణుడి కాళీయమర్ధనం..కళ్ళకింపైన ఆక్రిలిక్ లో భజగోవిందం,అశోకశోకం,స్వరార్చన,గోపికావస్త్రాపహరణం,పారిజాతం,గోపాలచూడామణి,గరుడవాహనం ఇత్యాది పెయింటింగులు..

నిజానికి పాండు మరణించలేదు ప్రశాంతంగా పడుకున్నాడు..
"గురూ నేను చాలాప్రశాంతంగా వున్నాగురూ..శివసాయుజ్యం పొందానుగురూ..తుఛ్ఛమైన ఏహ్యమైన భవబందాలను వీడి విష్ణువులో ఐక్యమయ్యి విముక్తుడినయ్యాను గురూ...నేను స్థితప్రజ్ఞుడిని గురూ !" అంటున్నాడు.."మీరు బొమ్మలేసి చావండ్రా..గీసి చంపకండ్రా..!" అంటూ "గీతో"పదేశం కూడా చేస్తున్నాడు.

దండిగా ధనం సమకూర్చి తోటికళాకారులు పాండు పెయింటింగులు,కార్టూనులతో ఓ అందమైన పుస్తకం అచ్చువేయిస్తే ఎంత బాగుణ్ణు..లేదంటే యాచన,దొంగతనం,కిడ్నాప్,నకిలీ కరెన్సీముద్రణ,డిటోనేటర్, హాకింగ్,హైజాకింగ్ లాంటి అత్యాధునిక పద్ధతులద్వారా డబ్బు సంపాయించి ఆ పుస్తకమేదో నాకే తీసుకురావాలనుంది..అందులో ఒక పుస్తకం దాచుకో నీ పాదాలకు తగ నే జేసిన పూజలివి...అంటూ తిరుపతి వేంకటేశుడి హుండీకి సమర్పించాలనుంది.

నా బడాదోస్తు పాండుకు నా దసరా అలయ్...బలయ్!
[పాండు గీసి నాకు పంపిన ఇరవైతొమ్మిది పెయింటింగుల్లోంచి తన ఇష్టదైవమైన శ్రీమహావిష్ణువు చిత్తరువును ఇక్కడ పోస్టు చేస్తున్నా]
పాండు పెయింటింగిలకోసం ఈ లింకు నొక్కండి..

3, అక్టోబర్ 2010, ఆదివారం

నా స్ట్రోకులో "నాగభైరవం"




నాగభైరవ కోటేశ్వరరావు పద్యకావ్యాలు,సాహితీ రూపకం కోసరమని..దినాం మొత్తం పెయింట్ చేస్తా చేస్తా వుంటే గానీ నాగభైరవ గారు ప్రసన్నం కాలేదు..చౌదరిగారు ఫోన్జేసి "అబ్భ మా నాన్నగారికి మళ్ళి ప్రాణం పోసి నా ముందుంచారండి మృత్యుంజయ్ గారూ !" అన్నారు కాదు.