29, డిసెంబర్ 2010, బుధవారం

26, డిసెంబర్ 2010, ఆదివారం

గడ్డిపువ్వు గడ్డికరిచింది


ఐ అబ్జెక్ట్ యువరానర్ !
పికిలిపిట్టను చూశాం.ఇప్పుడది మ్యూజికల్ నొటేషన్ రొదచేయట్లేదు.ప్రపంచీకరణ పక్కవాయిద్యానికి బోరున ఏడుస్తూ ప్రకృతిని ఖాళీ చేసి పత్తాలేకుండా పోయింది..ఇప్పుడు మిగిలింది ట్విట్టర్ పిట్టే.
మబ్బుల్ని చూశాం..అవి ఏట్లోకి వంగిచూడట్లేదు..టోల్గేటు ఎత్తేసింది..మేఘమధనం అంటూ ప్రాణంతీస్తారాని వసంతమేఘంతో కలిసి పరుగోపరుగు.
గట్టుమీది గడ్డిపూలు మెల్లగా ఊపడానికి వాటికి తలలు లేవు."సెజ్"లు సజ్జాల్లా వలిచి నోట్లో వేసుకొని ఖతం చేశాయి.. గడ్డిపువ్వు గడ్డికరిచింది.the grass blade has cut itself!..కాంక్రీట్ జంగల్ లోని గడ్డపూవు హెల్మెట్ పెట్టుకుంది..దానిపిచ్చిని మేమూ తలకెక్కించుకున్నాం..మేమూ హెల్మెట్ వాడుతున్నాం.
కొండల్ని పరాయిదేశాలకు ఎక్స్ పోర్టు చేసే ఎక్సుపర్టులు పంచభూతాలను పంచామృతాలుగా స్వాహాచేసిన సంసారుల రాజకీయాలు గ్లోబును కమ్ముకోక ఏం చేస్తాయి?
మీరు వర్ణించిన ప్రకృతి సైనవుట్ చేసి చాలారోజులయ్యింది.
నోస్టాల్జియా మాకు రొమాంటిక్ గానే వుంది ఆదిత్యాచానల్లో భాలకృష్ణ,సుహాసిని పాటలు చూసిన ప్రతీసారీ తెలుస్తూనే వుంది.మిలియన్ల జనాన్ని నరికిన మంగోలుల చరిత్ర ఎవడిక్కావాలి?రక్తచరిత్ర పైరేటెడ్ సి.డి లు దొరుకుతుంటేనూ..
డావిన్సీ,మైకెలాంజిలోల గురించి ఆదివారం ఆబిడ్స్ ఫుట్ పాత్ పై తెలుగు అనువాదాలుకొనుక్కొనికూడా చదివిన అనుభవాలులేవు కానీ, గోల్డ్ స్పాట్ తాగుతూ బ్లాగ్ స్పాట్ రాసి జనాలను బరస్ట్ చేయగలం..ప్లేటో,అరిస్టాటిల్,రికార్డో,కార్ల్ మార్క్స్ లను చదవడం కాదుకదా కనీసం వాటిపేర్లు కుదురుగా రాసి పలకలేము..
వ్యవస్థ గురించి తెలియదు,మేము ఎడ్యుకేటెడ్ కాదు,మాకు నాలెడ్జ్ లేదు అయినా కరెప్ట్ అవుతాం....అయినా మా అందానికి రేటుంది.
గొర్రెల్లా,బర్రెల్లా ఈ మందల్లో పడి కొట్టుకుపోతాం..
గుండెకు పట్టిన తుప్పునొదిలించడం సాధ్యంకాదు..ఎందుకంటే ఆ తుప్పు గుండెను ఎప్పుడో వదిలించింది.
కాలంతో పరిగెత్తలేకపోతున్నాం..భవభందాలు ఏ కీలుకాకీలు పట్టుకుపీక్కుతింటున్నాయి..కూపస్థం దాటి రావడానికి ఈ బండబారిన మండూకాలకు సాధ్యంకాదు.
పోయిన దశాబ్ధాన్ని పొమ్మని లాగి తన్నగలము కానీ,ముందుకు నడవలేము..మీరొక్కరే వెళ్ళండి..అది మీకే సాధ్యం.

21, డిసెంబర్ 2010, మంగళవారం

ఒక రూమీ పద్యం
మణిరత్నం "గురు" సినిమాలో ఏ.ఆర్ రెహమాన్ ట్యూనుకు "మయ్య మయ్య .."అంటూ మల్లికా శరావత్ పెదాలాడించిన గీతానికి ఈ ఇరాన్ అమ్మాయి ఉక్రెయిన్ ఆర్కెస్ట్రా తో పాడిన రూమీ పోయెమ్[మొలానా] ప్రేరణ కావొచ్చని లేదా కాకపోనూవచ్చని నా ప్రగాఢ అనుమానం.

9, డిసెంబర్ 2010, గురువారం

తరతరాలతలరాతలతరాలుమానాయిన రేడియోలో అక్కినేని నాగెస్రావ్ సైన్మా పాటలు వినుకుంటా ఇనాయకుడి బొమ్మనేసాడు..నేను యూట్యూబులో అక్కినేని నాగార్జన డాన్సులు సూస్తా ఇనాయకుడి కార్టూనేసా...నా కొడుకు ఐపాడ్ లో అక్కినేని నాగసైతన్య పాటలు వింటా ఇనాయకుడి బొమ్మ గీసాడు.
అచ్చం మానాయిన ఇందిరాగాంధి బొమ్మనేసినట్టే నేను రాజివు గాంధి కార్టూన్లు గీసినట్టే మావోడు రాహులుగాంధి ఆనిమేసను సేసి సూపెట్టేటట్టుంది ఆడి వాలకం సూస్తుంటే..
సిట్టసివరికి తొట్టతొల్త ఎట్టకేలకు ఇంకోడు తయారయ్యిండు మూడొతరానికి... మా ఇంటిమీద మూడో ప్రమాద సూచిక ఎగురుతోంది.....పైపోటోలో క్యూపద్ధతిల కూసున్న త్రీ జనరేషన్ ఆఫ్ గనేషాస్ సాక్షిగా..
మా నాయిన చనిపోయినంక సరింగ తొమ్మిదినెల్లకు పుట్టిండు మావాడు..అందుకే అంతా జూ.రామ్ లింగం అంటుండ్రు.
వాడు సదివేది దూగ[రొండో తరగతి] అయినా ఆడు కూసుంటె గనపతి లేస్తే గనపతి పనుకుంటె గనపతి..రాత్రికి రాత్రి ఇంటిని గనపతి ఉత్పత్తికేంద్రం చేసిపడేస్తాడాడు.
దూల్ పేటకు సీజనుందేమోగానీ,ఈడికి మాత్రం లె.
ఆడిప్పుడు మాస్కుతీసిన ఫాంటమ్ లెక్కన,శ్రీవిద్య స్కూలు డ్రెస్సేసుకున్న సూపరుమ్యాను లెక్కనా,కురుకురె కరకర నమిల్తూ డోరెమాన్ చూసే స్పైడరు మ్యాన్ లెక్కన, మఫ్టీలో వున్న మిస్టరు బిన్ లెక్కన కనబడ్తడు...
మనపిచ్చిగానీ,కలెక్టర్ మనవడు కండక్టర్ అవుతాడా..కాంట్రాక్టర్ మనవడు ట్రాక్టర్ తోలుతాడా..తాత ఫాక్షనిస్టయితే మనవడు పత్తిత్తవుతాడా ఎక్కడన్నా?

"ఈజిట్ ఇన్ హెరిడటరీ ఫాక్టర్?" అన్న అంశం మీద యాడ్లులేని దినపత్రికలపుటల్లో పుంఖాను పుంఖాల సచిత్ర వ్యాసాలు రావాలి. ఇరవైనాలుగ్గంటల నూసు చానల్లల్లో బ్రేకుల్లేని చర్చ జరగాలి ఒకేళ జరగకుంటే ఎందుకు జరుగుతలేవ్ అన్న అంశం మీద చర్చ జరగాలి...!

21, నవంబర్ 2010, ఆదివారం

ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీఆ మధ్య హిందూ కార్టూనిస్టు సురేంద్ర గారితో కీపిన్ టచ్చులో వుండగా ధన్ మని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దర్శనమయ్యారు.
మా ముగ్గురిమధ్య ముక్కోణపు ప్రేమ ముగిశాక ఎఫెక్ట్ కోసం నేను గీసిన క్యారికేచర్ మీరు అతిత్వరలో అందుకోబోతున్నారనే సరికి తన బుగ్గసొట్టలు నవ్వినట్టనిపించింది.
ఇంకా గడ్డం కుంచించవచ్చు..నోసు నొక్కవచ్చు..మీసాలు లాగవచ్చు..దవడలు పీకనూవచ్చు..కానీ.,
గౌరవంతో కూడిన సిగ్గువల్ల ఏర్పడ్డ భయం వల్ల ఇంతకన్నాఎక్కువ లాగలేకపోయా మరి..!

15, నవంబర్ 2010, సోమవారం

మిణుగురులు మెరిసాయిసండే చలంతో కలిసి వందపేజీల మైదానంలో నడిచేసరికి అర్థరాత్రయ్యింది..
నక్క కూసింది..నక్షత్రం రాలింది..మిణుగురులు మెరిసాయి...!

17, అక్టోబర్ 2010, ఆదివారం

పాండుకు నా అలయ్.. బలయ్ !!ప్రతి దసరాకు పాండునుంచి వచ్చే దసరా విషెస్ ఎసెమ్మెస్ ఈసారి రాలేదు.పాండు లేడు..
నీది సూపరు లైను గురూ,ఆ అడ్డమైన సాప్టువేర్లో నీ హార్డువర్కేంటి గురూ..నీ మొహం..నీ శ్రాద్ధం..నీ పిండాకుడు..అన్న నిందాస్థుతులు ఇక లేవు..మా నాయిన బొమ్మ గీసిస్తానన్న పాండు లేడు.దసరాకు మూడురోజులముందు ఆర్టిస్టు,కార్టూనిస్టు పాండు చనిపోయాడు.44 ఏళ్ళకే వెళ్ళిపోయాడు.దసరాకు అంతా సొంతూరుకు ట్రావెల్సులో వెళుతుంటే,పాండు అంబులెన్సులో వెళతాడని కలలోకూడా అనుకోలేదు

1997 వార్తపేపరులో అకాలనిద్రనుంచి మేల్కొన్న దేవెగౌడ కాంగ్రెస్ ఫ్రంట్ గవర్న్మెంటును బాణం వేసి కూల్చేస్తాడు పైగా "ఇది వెన్నుపోటుకాదు,ఫ్రంట్ పోటే" అంటాడు నిద్రకళ్ళతో.షార్ప్ బ్రష్షు స్ట్రోకు,జబర్దస్తీ కంపోజిషను,లెక్కతో గీసిన బార్డరు హెచ్చింగ్స్..కార్టూను కింద పాండు అన్న సంతకం..జలక్ మంది నాకు..మోహన్ గీతతో చాచి కొట్టిన వీడు ఎవడబ్బా అని ఆరా తీసా ..రెడ్ హిల్స్ మెడ్ ఆర్సీ పక్కరూము గొళ్లెం తీసా..నవ్వుతూ పాండు..ఓ కౌగిలింత విత్ ఇస్మైల్ ఫ్లేవర్..ఇక వన్ బై టూ చాయ్ లు..షేరింగు ఆటోలు..కొండొకచో కోఠి బస్సులు..మోహన్ లైను పట్టుకొని ఖరారు చేసుకొనే పరుగుపందెంలో పాండు స్పీడు ఆశ్చర్యం.. మోహన్ గీతలేకాదు,ఆ గీతల్ని గీసే చేతివేళ్ళ కదలికలనుకూడా కాపీ చేసేవాడు పాండు..సిగరెట్ పీల్చి పొగొదులుతూ మీసపు అంచుల్ని కొనగోట మీటుతూ ప్యాంటును పైకిలాగుతూ అచ్చం మోహన్ మినియేచర్ లా కనిపించేవాడు..పెన్సిల్ ను మొనకు దూరంగాపట్టుకొని రపారప్ గీతలుగీసే పాండు స్టైల్ నాకిష్టం.
మా దోస్తానా అలా అలా ట్యాంకుబండు పాన్ డబ్బాపక్కసందునుంచి,పంజాగుట్టా కేఫ్ ల గుండా చిక్కడపల్లి బడ్డికొట్టు మీదినుంచి విద్యానగర్ సందుతిరిగి రామంతాపూర్ గల్లీ లో ఆగింది..
జ్నానవైరాగ్యసిద్ధర్ద్యం బాగ్ లింగం పల్లిలో మా అడ్డా కేఫ్ లో నేను కలిస్తే సిగరెట్ కో శ్లోకం,వక్కపొడికో పద్యం,ఛాయ్ కో చంపకమాలతో పాండు నన్ను అలరించాడు,నేను అభిమానించాను..నేను దుఖం పంచితే సంతోషం ఇచ్చాడు..తాదాత్మ్యతచెందే ఆధ్యాత్మిక విషయాలు భోధించాడు..ఛెగువేరా,శంకరాచార్యుల తత్వాలు..అష్టాదశపురాణాలు,అష్టకాలు,బాగవతాల సిన్మాలు విత్ ఓషో,రెంబ్రెంట్ల న్యూస్ రీల్సు..గంజాయి దమ్ము బిగించికొట్టిన కమ్మటి మత్తు..రిలీఫ్ మస్తు..ఇప్పటికీ చిక్కడపల్లి టర్నింగు పాయింట్లో పాండు బరనబబరవలు,నజబజజజరాలు,మసజసతతగాలు....కృతులు ..కీర్తనలు..
వినకుండా వినుకొండ నుంచి వచ్చి దినపత్రికలో కార్టూనిస్టు ఉజ్జోగం వెలగబెట్టినపాపానికి నాలుగునెల్లకో నెలజీతం తీసుకొని ఆకలిపేగులు అరగక లోయరుటాంకుబండు బండలకింద నలిగిపోతూ "టౌనుపక్కకెళ్ళొద్దురో డింగరీ ఢాంభికాలు పోవొద్దురో.. " అంటూ పాడిన పాట ఇంకా గుర్తు.
జయలలిత వాజ్ పేయి దవడలు వాచిపోయేలా సతాయించి చంపుకుతింటున్న హయాంలో.."మీరజాలగలడా నా యానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి.."అంటూ జయలలిత లేని జడను ఊపుతూ గీసిన కార్టూను ఎట్లామరిచిపోతామబ్బా ??
రోడ్డుపక్క కూలిన గోడలమధ్య ఓ వెంకాయమ్మ తన పెనిమిటితో.. పెద్దాడు సాప్టువేరు అంటుంది..లాంగ్ షాట్లో ఆ పెద్దాడు చాయ్ చాయ్ అని అరుస్తావుంటాడు..
చిన్నాడు హర్డ్ వేరు అంటుంది..క్లోజప్ లో ఆ చిన్నాడు కాల్చిన ఇనుముకడ్డీలను సుత్తితో హర్డుగా కొడుతుంటాడు.. పాథటిక్ పొలిటికల్ హ్యూమరు.పాండు గీసిన కార్టూను.
బ్రహ్మకడిగినపాదము బ్రహ్మముతానెనిపాదమూ..అంటూ హమ్ చేస్తూ 6x4 అడుగుల అద్దెగదిలో 12x8 అడుగుల నిలువెత్తు వెంకటేశ్వరస్వామిని పెయింట్ చేస్తున్న పాండును చూసా..ఏడుకొండలూ దిగి వయా వినుకొండనుంచి విద్యానగర్ కు వచ్చిన శ్రీ వేంకటాచలపతినీ చూసా.ప్రతిలేని గోపురప్రభలు గంటి..శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి..హరిగంటి..గురుగంటి..
ఒక చెంప సెల్ షీట్ల కట్టలమీద తాండవకృష్ణుడి కాళీయమర్ధనం..కళ్ళకింపైన ఆక్రిలిక్ లో భజగోవిందం,అశోకశోకం,స్వరార్చన,గోపికావస్త్రాపహరణం,పారిజాతం,గోపాలచూడామణి,గరుడవాహనం ఇత్యాది పెయింటింగులు..

నిజానికి పాండు మరణించలేదు ప్రశాంతంగా పడుకున్నాడు..
"గురూ నేను చాలాప్రశాంతంగా వున్నాగురూ..శివసాయుజ్యం పొందానుగురూ..తుఛ్ఛమైన ఏహ్యమైన భవబందాలను వీడి విష్ణువులో ఐక్యమయ్యి విముక్తుడినయ్యాను గురూ...నేను స్థితప్రజ్ఞుడిని గురూ !" అంటున్నాడు.."మీరు బొమ్మలేసి చావండ్రా..గీసి చంపకండ్రా..!" అంటూ "గీతో"పదేశం కూడా చేస్తున్నాడు.

దండిగా ధనం సమకూర్చి తోటికళాకారులు పాండు పెయింటింగులు,కార్టూనులతో ఓ అందమైన పుస్తకం అచ్చువేయిస్తే ఎంత బాగుణ్ణు..లేదంటే యాచన,దొంగతనం,కిడ్నాప్,నకిలీ కరెన్సీముద్రణ,డిటోనేటర్, హాకింగ్,హైజాకింగ్ లాంటి అత్యాధునిక పద్ధతులద్వారా డబ్బు సంపాయించి ఆ పుస్తకమేదో నాకే తీసుకురావాలనుంది..అందులో ఒక పుస్తకం దాచుకో నీ పాదాలకు తగ నే జేసిన పూజలివి...అంటూ తిరుపతి వేంకటేశుడి హుండీకి సమర్పించాలనుంది.

నా బడాదోస్తు పాండుకు నా దసరా అలయ్...బలయ్!
[పాండు గీసి నాకు పంపిన ఇరవైతొమ్మిది పెయింటింగుల్లోంచి తన ఇష్టదైవమైన శ్రీమహావిష్ణువు చిత్తరువును ఇక్కడ పోస్టు చేస్తున్నా]
పాండు పెయింటింగిలకోసం ఈ లింకు నొక్కండి..

3, అక్టోబర్ 2010, ఆదివారం

నా స్ట్రోకులో "నాగభైరవం"
నాగభైరవ కోటేశ్వరరావు పద్యకావ్యాలు,సాహితీ రూపకం కోసరమని..దినాం మొత్తం పెయింట్ చేస్తా చేస్తా వుంటే గానీ నాగభైరవ గారు ప్రసన్నం కాలేదు..చౌదరిగారు ఫోన్జేసి "అబ్భ మా నాన్నగారికి మళ్ళి ప్రాణం పోసి నా ముందుంచారండి మృత్యుంజయ్ గారూ !" అన్నారు కాదు.

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

జ్ఞాపకాల జిరాక్సులుమా నాయిన పుట్టినరోజు మార్చి 31 నుంచి నా బ్లాగులో రాసిన నాయిన జ్ఞాపకాల పోస్టులు ఎనిమిది కాపీల జిరాక్సుల స్పైరల్ బైండింగులు మొన్న సెప్టెంబరు 25 మా నాయిన వర్థంతి రోజు ఐదుగురు అన్నదమ్ములకు, ఇద్దరు అక్కలకు ,చెల్లెకు ఆస్తి పంపకాలుగా..

22, సెప్టెంబర్ 2010, బుధవారం

మా నాయిన నేసిన నూలు గణపతివందల పోగులు కలిస్తే ఒక పాయ..వందల పాయలు,వేల రబ్బర్లు,బోలెడు రంగులు,నేత కలిస్తే పై వినాయకుడి బొమ్మ..ఆ నేత బొమ్మ పైన భూదాన్ పోచంపల్లి,కింద ఆర్ట్ బై చిలువేరు రామలింగం..
గణెష్ పండగకు పోచంపల్లిలో ఏ షావుకారింటికి వెళ్ళినా లేదా పట్టుచీరెల షాపులకెళ్ళినా మా నాయిన నేసిన వినాయకుడి బొమ్మ ముందు "వాతాపి గణపతింపజే" లే..
వేలరూపాయల జీతం ఇస్తాం "ఆప్కో"లో ఉజ్జోగం చేసి పెట్టండి..లేదా "వీవర్స్ సొసైటీ సెంటర్" లో పిల్లగాండ్లకు "టై అండ్ డై" లో ట్రెయినింగ్ ఇవ్వండని గవర్నమెంటు ఎంత చెప్పిన మా నాయిన వింటేనా..!"లే.. లే..లే.. లే..వేలు కాదు లచ్చలిచ్చినా అసుమంటి నౌకరి చేసే సొవాయితం కాదు నాది..మా ఊళ్ళోనే.. మా ఇంట్లోనే నాకిస్టమయన పనే చేసుకుంటా ..మా ఇంటి ఆకిలి మీద రంగు రంగుల నూలు దారాలతో ఇంద్రధనుస్సు పరుచుకుంటా.."అనేవాడు.

వందకు ఐదు రూపాయల మిత్తీ లెక్కన పదివేలకు పోగయ్యే మిత్తీ వసూళ్ళకు ఫైనాన్సు షాపులనుంచి వచ్చి మాఇంటి వాకిట్లోనే బజాజ్ చేతక్ హర్న్ మోగిస్తూ మనాయినకు వార్నింగులిచ్చి విసిగించే డబ్బు వ్యాపారులు..రాత్రికి బియ్యం లేవు అంటూ మా అమ్మ సతాయింపులు..పరీచ్చ పీజులు ఇమ్మని జులూమ్ చేసే మాకు సమాదానం చెబుతూ అవదానం చేసినంత శ్రద్ధతో నేసిన వినాయకుడి బొమ్మ అది.


వినాయకుడి ఫొటొ కోసం మా నాయిన సెర్చ్ ఇంజను హైద్రాబాద్ బేగం బజార్ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్యాలండరు షాపులు..
గ్రాఫ్ పేపరుమీద ముందు పెన్సిలు స్కెచ్చు..ఆ పేపరు సాయంతొ దారాల పాయలమీద గంజిలో నూరిన బొగ్గు ఇంకుతో మార్కులు...ఆ పై రబ్బర్లు...ఆ తర్వాత రంగులద్దడం..మరో రంగులకోసం మళ్ళి గుర్తులు..మళ్ళీ రబ్బర్లు..మళ్ళీరంగులు..ఇలా నాలుగైదుసార్లు..ఆ తర్వాత గంజిపెట్టిన రంగురంగుల దారాల గణెశుడు ఎండకు ఆరతాడు..అటునుంచి అచ్చుకు జాయింటు..ఇహ అటునుంచి సరాసరి మగ్గానికి దేవుడు..మగ్గంలో దేవుడు..
కనీసం రెండునెల్లు..నాలుగు జతల దేదీప్యమాన వినాయకుల్లు..అష్టగణనాధులు మా ఇంట్లో కొలువు..వాటిలో ఓ గణేషుడిని గోడకు వేలాడదీసి లాంగ్ షాట్ కోసం దూరం జరిగి ఓ బీడి వెలిగించి తన ఎడం చేయి నడుముకు ఆన్చి రిలీఫ్ గా పొగ పీల్చి వదిలాడంటే బొమ్మ ఓకె.

సెప్టెంబరు నెల భాద్రపద మాసం,పౌర్ణమి తర్వాత రెండవరోజు విదియ తిథిన ఛాతి నొప్పితో పొద్దున సెవన్ సీటరు ఆటోలో హైద్రాబాదు వెళ్ళి ఓ ఆసుపత్రిలో జాయినయిన మానాయిన రాత్రి పదిన్నరకు మాకు లేడు.. మానాయిన పార్ధివ శరీరంతో మా ఇంటికెళుతున్న అంబులెన్సుకు నిమజ్జనానికెళ్ళే పదమూడు రాత్రుల గణనాధులు ఎదురయ్యి ఎళ్ళుండికి సరిగ్గా ఏడేళ్ళు.

నెలకో ఎగ్జిబిషను..హర్యానా,డిల్లీ,చండీఘడ్,కలకత్తా,బొంబాయి,బెంగుళూరు,మద్రాసు..శిల్పారామంలో హస్తకళా ప్రదర్శనలు... ఏమయ్యాయో..?!

రకరకాల డిజైన్లు..వందలాది బొమ్మలు..బ్యాంకు లోగోలు [బ్యాలెన్సులు కాదు]..కుట్టకుండా ప్యాంటుషర్టులు,బ్యాగులు..మూడుకొంగుల చీరెలు..పచ్చీసులు..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు..ప్రక్రుతి సిద్ద రంగులతో తేలియారుమాళ్ళు..అగ్గిపెట్టెలో పట్టే చీరె... ఎక్కడున్నాయో..?!
ఆ కళ కొనసాగించడానికి చేనేతకళ మాకెవ్వరికీ అబ్బలేదు..

లచ్చకోట్ల డిజైను కాయితాలు,టన్నులకొద్ది కలరు డబ్బాలు,వందలకోట్ల రంగుపెన్సిల్లు ఇంకా సూటుకేసులు పిక్కటిల్లేల శాలువాలు,బీరువాలు బద్ధలయ్యే షీల్డులు,అవార్డుల ఫోటోఫ్రేములు.."అతనిచేతిలోకలవు అపురూప కళలెన్నో" అంటూ రాసిన వార్తాపేజీల కాగితాలు సంపాయించి ఇచ్చిన ఓ పేద చేనేత కళాకారుడి కొడుకు ఏం చేస్తాడు....బ్లాగులో బావురుమంటాడు..ఇరుకింట్లో అద్దెపొదుపు చేసి గీసిన పెయింటింగుకు ఖరీదైన ఫ్రేము తగిలించి గోడకు వేలాడదీసి గోడుచెప్పుకుంటాడు..గుండెనిండా దుఃఖపు నిల్వలు పోగేసుకొని ఓ తెల్లారుజామున కుప్పకూలిపోతాడు..సొంతూరులో పొక్కిలిపడ్డ ఇంటివాకిలి దుఃఖాన్ని ఆపడానికి నెలకో రెండునెల్లకో ఓదార్పుయాత్ర చేపడతాడు.నూలుగణపతికి దండం పెడతాడు.

[25..09..2010 నాడు మా నాయిన వర్థంతి సందర్భంగా..]

4, సెప్టెంబర్ 2010, శనివారం

సేయి నరుక్కుంటా ఖబడ్ధార్ !
సిరిదేవిని పిచ్చపిచ్చగా ప్రేమించిన ఓ మావెరిక్ గారిని అడిగాడో అప్పారావు.
"వొకవేల సిరిదేవే వచ్చి నీ సేయికి రాఖీ కట్టిందనుకో ఏమి సేస్తావ్?"
"నేను ఊకునే మొగోన్నేనా..నా సేయిని గండ్రగొడ్డలితో నరుక్కుంటా బాంచెత్ !"
"ఓహో గట్లనా..మరింకేంది,ఓబులు రెడ్డి మనుషులు నిన్ను సంపాల్సిన రిస్కు లే..ఓ రాఖి సిరిదేవికిచ్చి నీ మెడకాయకు కట్టి రమ్మంటే పాయే !"

19, ఆగస్టు 2010, గురువారం

అంబరుపేటలో డైనోసార్ !ఏ పార్క్ కు ఎళ్దాం..ఇందిరా పార్కా ? లుంబినీ పార్కా ? అంటే జురాసిక్ పార్క్ అనేవోన్ని నేను..ఏ పెద్దాయన కనిపించినా సార్ కు బదులు "డైనోసార్ !" అని పిలిసేవోన్ని.. అట్లుండేది నా పిచ్చి సొవాయితం..
డైనోసార్ ని సైన్మాల్లో సూడ్డం కాదు..సేసి సూడాలి..సూసి సేయాలి అనుకున్నా..సెంద్రుడు పోయి సూర్యుడు వస్తుండు..గనియారం ముల్లు ఓహో ఒకటే తిరగతా వుంది..టిపిను బాక్సులు పెట్టుకొని ఆపీసుకు,ఇంటికి తిరగతా వుంటి..చాయిలమీద చాయిలు తాగుతావుంటి..ఎనక్కి తిరిగి సూస్తే ఏముంది..సేసింది లే...సూసింది లే..సచ్చింది లే..డైనోసార్ కల అట్నే ఏడిసింది..
ఏదైతే అదైతని పట్టుపట్టి సేయనే సేస్తి..డైనోసార్ ని 2డి లో గుసాయించి 3డి లోపటాయించిన.. డైనోసార్ అంబరుపేటకు రానే వచ్చింది.
2డి యా 3డి యా ఏ డి అయితేనేమి??..డి అంటే డి ..
సేయాలన్న కుతకుత నరాల్లో వుండాలి గానీ,నాలుక మీదే వుంటే వస్తందా సస్తందా..?

18, ఆగస్టు 2010, బుధవారం

ఎంగటేస్పర సామి మీదొట్టు !
గిట్ల జేస్తే సామి కార్యం,సకార్యం కాదా..ఏంది ??..ఐనా ఎంగటేస్పర సామికి మనమొవలం సెప్పడానికి..ఆ డ్యూటీ నారదమగర్సికేస్తె పోదా ఏంది...!

14, ఆగస్టు 2010, శనివారం

జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!

mrityunjay

మా ఇస్కూలు మొత్తం పోరగాల్లతో పాటు మా బ్యాచి పిలగాండ్లు పండరినాథ్,కిషోర్ గాడు,సుదర్సన్ గాడు,ఆర్.ఎంకటి గాడు,పి.రవిందర్,దేవకినందన్..ఇద్దరేసి పోరగాల్లం లెక్కన పంద్రాగష్టు రోజు జంటగా మా ఇస్కూల్ నుంచి చెర్వు కట్ట దగ్గర వినోభా మందిరం దగ్గరికెళ్ళి రిటన్ తిరిగి పాతసంఘం,గాంధి బొమ్మ పక్కనుంచి జై భొలో సతంత్రభారత్ కీ.! జై !! అంటూ మార్కండెస్వర స్వామి గుడి ముంగటనుంచి పోచంపల్లి ప్రతి సందూ తిరుగుతూ మా ఇంటి ముందునుంచి మల్లీ ఇస్కూలు కెల్లి జనగనమన పాడేసి ఓ చేత్తో పిప్పర్మెంట్లు,ఇంగో చేత్తో బిస్కత్తులు పట్టుకొని ఇంటికెలుతూ..జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!

11, ఆగస్టు 2010, బుధవారం

ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ !నేను నైన్తు కిలాసులో ఉన్నప్పుడు మా ఇంగిలీసు టీచరు సుమతి మేడం పాటం చెప్తా టెక్స్ట్ బుక్కు ఇవ్వమన్నప్పుడు మా ముందు బెంచి పిలగాల్లం పుస్తకం ఇవ్వడానికి పోటీలు పడేవోళ్ళం..మా పుస్తకం సూస్తూ మేడం పాటం చెప్పడం అంటే మాకారోజు ఆనందం అంబరాన్ని తాకడమే...
ఒకానొకసారి నేను అట్లా ఇవ్వడానికి పుస్తకం తీసేసరికి నా ఇంగిలీసు బుక్కు నుంచి నేను ఇస్టంగా గీసి దాచుకున్న బొమ్మ రాలి కింద పడింది..ఓ చేత్తో నేనిచ్చిన పుస్తకం తీసుకుంటూ మరో చేత్తో కిందపడిన బొమ్మ అందుకుంది సుమతి మేడం..ఏంటా అంటూ మడత విప్పి చూసే సరికి బిఫోర్ మ్యారేజి..ఆఫ్టర్ మ్యారేజి అంటూ బొమ్మ కనబడే సరికి కళ్ళు పెద్దగా చేసి నవ్వింది..ఒకే బొమ్మ రెండు క్యాప్షన్లు ..అమ్మాయి బొమ్మ నవ్వుతా వుంటది కింద బిఫోర్ మ్యారేజి..పేపరు తలకిందుల చేస్తే అదే బొమ్మ మగాడై ఏడుపు మొగం పెడతాడు.. కింద ఆఫ్టర్ మ్యారేజి ....ఆ బొమ్మ మ్యాజిక్కు,క్యాప్షను తాలూకు ఫిలాసఫి సుమతి టీచరుకు తెగనచ్చింది..ఆ పిరేడు సగం నన్ను పొగడడానికే సరిపోయింది..ఆ కాన్నుంచి నేను రోజుకో డ్రెస్సు మార్చేవోన్ని ఎందుకంటే అంగి కాలరు ఎగరేసి ఎగరేసి మాసిపోతుండేది మరి..
పిరేడు అయిపోగానే ఆ బొమ్మ కాయితం తిరిగి ఇవ్వకుండా ఎళ్ళిపోయింది..ఓ అద్దగంట తర్వాత బెల్లు కొట్టే పిలగాడు వచ్చి మృత్యుంజయని హెడ్ మాస్టరు రమ్మంటుండు అని ఎల్లిపోయాడు..వీడొచ్చి నా గుండె బెల్లు కొట్టి పోయినాడేంటి అంటా నాకు ఒకటే వనుకు.. కంప్లైంట్లు ఇస్తే తప్ప పిలిసే బాపతు కాదు మా హెడ్ మాస్టరు లక్ష్మినారాయన రెడ్డి సారు..ఆయన సుమతి టీచరు భర్త..మక్కెలిరగ్గొడ్తా అంటూ బయాలజీ పాటం సెప్పుతుంటే సూడాలి సారు మొగం, ఎంత దయగలమారాజో.. అసుమంటి మా హెడ్ మాస్టరు పిలిసినాడంటే ఎట్లా వుంటది ఎవ్వారం...
ఇంగ నేను హెడ్ మాస్టరు స్టాఫ్ రూముకెళ్ళే సరికి అక్కడ రకరకాల టీచర్లతో రాయలవారి సభాప్రాంగణం కిటకిటలాడుతోంది..వంతులవారిగా పంతుళ్ళు నేను వెలగబెట్టిన బొమ్మని చూస్తూ నాతో నవ్వుతూ మాటలాడుతుంటే సిగ్గుతో నేను వంకీలు తిరిగిపోతుంటే సూళ్ళేక ఎళ్ళి కిలాసులో కూసోమ్మన్నారు..
ఇంగ తెల్లారిందే పాపం మా కిలాసు తెలతెల్లని గోడలన్నీ నా బొమ్మల్తోని నింపి పడేసా..నిజాకది కిలాసు అనడంకంటే ఆర్టు ఎజ్జిబిషను అనడం సమంజసం..సందర్భానుసారం నా ప్రతిభ భయటపడేది అంటే వినాయక చవితికి ఇనాయకుడి బొమ్మ,దసరాకి దుర్గా మాత, క్రిస్ మస్ కు ఏసుక్రీస్తు బొమ్మ ఇట్లా కిలాసు గోడలు నా బొమ్మల్తోని బిజీ బిజీగా వుండేయి.. సుమతి టీచరు ఇంగిలీసే కాకుండా రసాయన శాస్త్రం కూడా సెప్పేది..పరమాణు మూలకాల చార్టు హైడ్రోజను..01,హీలియం..02 నైట్రోజన్...12 ........అంటూ రాసి ఓ పెద్ద పోస్టరు తయారు సేసి బ్లాకు బోర్డు పైన తగిలించిన..
ఆ కాన్నుంచి ఆడామగా కలిసి అరవై నాలుగు మంది కిలాసు పోరల్లో నేను ఇస్పెషల్ స్టూడెంటుగా కీర్తించబడిన..అట్లాగని నేను సదువులో పోటుగాన్నేంగాదు..యావరేజి స్టూడెంటుని..
ఇహ సుమతి టీచరు చెప్పే ఇంగిలీసు గ్రామరైతే ఎంత శ్రద్ధగా ఇనేవోడినో..ఆక్టివ్ వాయిస్,పాసివ్ వాయిస్ లైతే హరికథ చెప్పినంత భక్తిగా చెప్పేది.."డేవిడ్ కాపర్ ఫీల్డ్" పాటం అయితే కంటస్తం చేసే వరకు వదిలేది కాదు..తెగిపడిన శిల్పాల పాఠం "ఒజిమాండియాస్" లెస్సన్ లో "ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ " కొటేసను ఎంత నచ్చిందంటే నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ ఆ కొటేసనుతోనే ఓపెన్ చేసాను..రెండెళ్ళక్రితం ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ అంటూ ఆర్కుట్ లో చేరి నూటా ఇరవై మంది,ఫేసుబుక్కులో మూడొందలమంది దోస్తుగాల్లని ఆ కొటేసను కస్టమ్ మెసెజ్ తోనే గదా సంపాయించింది..
అదే ఆర్కుట్ లో ఈ మెసేజ్ చూసేసరికి గిర్రున కళ్ళెమ్మటి ఫ్లాష్ బ్యాకు దారల చారలు..
"Hi,This is Sumathi laxmareddy.I worked as a Bio science teacher in ZPHS pochampally from 1986 to 2001 did u study during that period?My husband also worked as Headmaster."

[ఇప్పుడు నేను అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసరుతో అంతో ఇంతో ఇంగిలీసు మాటలాడుతున్నా,బ్రెజిల్,బెల్జియం,టర్కీ,కజకిస్తాన్,ఉజ్బెకిస్తాన్,పాకిస్తాన్ కార్టూనిస్టుల్తో బొమ్మల సంగతులకోసం ఇ_మెయిల్ ముచ్చట్ల ఇచ్చకాల గచ్చకాయలు ఆడుతున్నానంటే ఇంగ్లీషు సరస్వతి మా సుమతి టీచరు వేసిన భిక్షే గదా!]


10, ఆగస్టు 2010, మంగళవారం

ఓ వాలు జడ..మల్లెపూల జడ..

"వురే ! మనకు పెల్లీడొచ్చినప్పుడు పెల్లి సూపులకోసం అమ్మాయింటికి సెప్పి పోవొద్దురో..సెప్పకుండా కాల్ల సప్పుడు కాకుండా స్లో మోసన్ల మబ్బుల ఆరుపాంవుకల్లా డోరు కొట్టి అమ్మాయిని అట్ల సూసి ఇట్ల పట్ మని వచ్చేయాలి..సింపిరి జుత్తు,సొల్లు మొకం లోనే పిల్ల అందం పట్టేయాలి..లేకుంటే మనం వస్తమని తెలిస్తే పిల్లకు విగ్గులు పెట్టి ,లిపుస్టికులు,ఇస్నోలు,ఐటెక్సులు,ఐ లాషులు,పౌడర్లు రాసి మనకు మసి పూసి మాయ సేస్తార్రో..జాగురత్తా "అంటూ మా ఇస్కూలు పోరగాండ్లు చెప్పేటోల్లు...అంతేగాదు, "పిల్ల పోటోలు ఇస్తే మాత్రం సూడకుండా అసుంటా నూకెయ్యాలి,ఎందుకంటే గ్రాపిక్సులు చేసి మనల్ని ఒప్పించి పెల్లికి పిక్సు చేసి పడెస్తరు."అంటూ వార్నింగులు..
ఇంగ నా పెల్లి సూపుల ముచ్చట మగా ఇసిత్రంగా వుండేదిలే..
ఏ పిల్లని సూడ్డానికి ఎల్లినా ముందు కంటే ఎనకాలే ఎక్కువ సూసేటోన్ని.. జడ కోసం...జడ సిన్నదా?పెద్దదా? ఒరిజినలా? సవరమా? అని మగా ఎగ్జయిటింగుగా,యాంగ్జటింగుగా వుండెడిది..అసలే "జడని దువ్వనీ,పొగడని మొగడు జడపదార్థమే జడ..." అంటూ ఈ టీ.వి మనోరంజని లో బాపు సిన్మా పాటలు రెచ్చగొట్టేయి..
ఎట్లైతేనేం..సిట్టసివరికి ఆ బగమంతుడుగారు రాధిక బికాం కంప్యూటర్స్ పొడుగు జడకు సక్కగా నూనె రాసి అందంగా దువ్వి అంబరుపేటకు పంపిండు..ఇంకేం ఓ.కే అనేసిన..గ్రహ దోష నివారనకు పేరుమార్చమంటే రాధిక బికాం కంప్యూటర్స్ సుమ బికాం కంప్యూటర్స్ అయ్యింది[ఇంగా నయం జడ మార్చమన్లేదు..] "వురే సుమ అచ్చం ముందునుంచి మోహన్ బొమ్మ,ఎనక నుంచి బాపూ బొమ్మరోయ్" అంటూ నా దోస్తుగాల్లు ఒహటే సతాయింపు..
ఇంగ మోహన్ సార్ దగ్గరికెళ్ళి "సా...సా...నాకు సుమకు పెల్లి సా...నేను కార్టూనిస్టుని అని తెల్వాలి సా...జడ హైలెట్ కావాలి సా...మందిని పెల్లికి పిల్వాలి సా.."అంటూ ఓ డిస్క్రిప్షన్ రాసిచ్చినంక మోహన్ సార్ బొమ్మగీసేసరికి అంగో వెడ్డింగు కార్డు అట్ల తయారయ్యింది..
మా నాయిన కుషీ అట్లా ఇట్లా కాదు జీరాక్సులు తీసి మరీ పంచిండు..
మా ఊళ్ళో మా ఇంటి పక్కనుండే కుర్రి రాజయ్య పెండ్లాం,సంగెం లచ్చుమమ్మ,ఎలగందుల రంగయ్య పెండ్లం ఈ పెండ్లి పత్రిక పట్టుకొని మా అమ్మతోని..
"ఏమమ్మో నీ కొడుకు అప్పుడే నీ కోడలు జడ పట్టుకోని,కొంగు పట్టుకోని ఇడుస్తలేనట్టుందీ..ముందు ముందు ఎట్లనో.." అంటూ మా అమ్మను ఎగేసిండ్రు.
[పెల్లికి నూటా పదారు మంది ఆర్టిస్టులు,కార్టూనిస్టులు [రెండు వేల నాలుగు వందల మంది సుట్టాలు మినహాయించి] కలిసి చేసుకున్న పెల్లి కుషీకి,మజాకు ఈరోజుకు విజయవంతమైన తొమ్మిది సమ్మచ్చరాలు]

31, జులై 2010, శనివారం

నా రెండ్రూపాయల నోటు

నమో ఎంకటేసా.. నా నమో తిరుమలేసా..అని మా ఊరు ప్రసాంతు టేటర్ మైకు నుంచి గంటశాల పాట ఏసుకున్నదే ఆలస్యం సంకల పిల్లల్తోని అమ్మలక్కలు,మొకాలకు పెయిర్ అండ్ లవ్లీ పూసుకొని మొగపోరగాల్లు,లంగ ఓనీ నెత్తి ల కనకాంబ్రం పూలతోని ఆడిపోరగాల్లు మా ఆకిట్లనుంచి ఉరికిఉరికి పోతుండడం...మేం మాడ్పులగాళ్ళలెక్కన గుమ్మం దగ్గర నిలబడి సూస్తుండడం..ఇదే తంతు..ఎందుకంటే మేం సిన్మా సూడ్డానికిలే..పండగలపూట తప్ప మరో రోజు సినిమాకు పోయినామంటే మా నాయిన సిన్మా కత వేరే వుంటది..ఒగసారి మా అమ్మ కిష్టమ్మత్తమ్మతో కలిసి "మా ఆయన బంగారం" సిన్మాకెళ్ళి వచ్చేసరికి మా నాయిన ఫ్రీ గా "యముడే నా మొగుడు" సిన్మా సూపెట్టిండు.
మా తాతకు మాత్రం సినిమా సోకు ఎక్కువ..ఆ రోజు కౌసు లేకున్నామాయెగానీ సిన్మా మాత్రం ఉండి తీరాల్సిందే.
ప్రతి సిన్మాకు మా నాయినమ్మను ఎంటేసుకొని ఎళ్ళడం అలవాటు..ఓ చేత్తో కర్ర,ఇంకో చేత్తో మా నాయినమ్మ చేయి పట్టుకొని టింగురంగా అంటూ మా తాత సిన్మాకు ఎల్తుంటే నా జెలసీ ఉప్పొంగి ఏరులై పారేది.ఆళ్ళకు మాత్రం సిన్మాకు గ్రీను సిగ్నలు..తనని కన్నోళ్ళకి ఒక నీతి,తను కన్నోళ్ళకి ఒక నీతా అంటూ మా ఇంట్లో దైర్నంగా ఇప్లవం లేవదీసి ఓ రోజు ఏమైతే అది అయితదనిజెప్పి.. "క్సనక్సనం" సిన్మాకు బయలుదేరిన,వచ్చి డోరు నూకేసరికి ఎల్లలే..ఇంకోసారి దబాయించిన పలితం లే..కిటికీలోంచి ఒంగబడి దర్వాద దిక్కు సూసే సరికి గుండే జల్లుమంది..లోపల్నించి తాళం బిగించి ఏసాడు మా నాయిన. ఆ రోజు ఎండబెట్టుకొని బయట అరుగుమీదే పనుకుంటుండగా "సెలి సంపుతున్నా సెమక్కులో సెలి సెంతకొఛ్ఛిందీ.." అంటా సెకండ్ షో సిన్మా పాట లీలగా ఇంటూ బజ్జొని లేసేసరికి మా యమ్మ ఆకిలిఊకుతా కనబడింది..
సిన్మాలమీద మా నాయినకు పెద్ద స్రద్దలేదుగాని,అప్పుడెప్పుడో పట్నం కెళ్ళినప్పుడు మహేస్వరి పరమేస్వరి టేటర్ల రమేశ్ కిష్న కొడుకు గదానిజెప్పి మా అమ్మ బలమంతం మీద "సామ్రాట్" సిన్మా కెళ్ళాడు ..ఆ సిన్మాకంటె మహేస్వరి పరమేస్వరి ఎస్కలేటర్ బాగ నచ్చింది మా నాయినకి.
మా నాయిన సిన్మాకెలితే టాకీసులోకంటే టాకీసు బయటే ఎక్కువ ఇంట్రస్టు సూపిస్తడు..ఒకపాలి దిల్ సుక్ నగర్ కోనార్కు టాకీసుకెల్లి టేటర్ మీదున్న "కోనార్కు వీల్" డిజైను గీసి బెడ్ షీట్ నేసాడు[లింకు]
పొద్దున్నే మొకం కడగతా కుడేపు వున్న కోడి రామసామి ఇంటి గోడ మీద అంటించిన సిన్మా పోస్టరు మారిందా లేదా అంటా సూడడం మా ఈది పోరగాల్లకు అలవాటు ..సిరంజీవి,కిస్న,కిస్నంరాజు సిన్మా బొమ్మ పడిందంటే ఎట్లనో అట్ల పైసల్ సంపాయించి సిన్మాకు లగెత్తాల్సిందే..అన్నట్టె ఓ రోజు కిస్నంరాజు సిన్మా బొమ్మ పడనేపడింది..అమ్మ భడవా అంటా సిన్మా వదిలేది లేదని మా అమ్మని కాకా పట్టడం షురూ చేసిన..అక్కడ సిన్మా ఇస్టార్టు అయ్యే టైము అయిపోతుంది మా అమ్మ పైసలు లేవంటది..పైగా రాత్రికి కూరగాయల్లేవంది..మా అమ్మ జగజ్జట్టి ..ఒప్పించడం నా వల్లకాలే.పైసల్ పుట్టె మార్గం ఆలోచిస్తా వుండగా తెల్లారింది..ఓ ప్రపోజల్ తట్టింది..
మా ఇంటికి పేపర్లు సదవడానికి,టీవీ సూడడానికి,ఇండోర్ గేమ్సు ఆడడానికి మా ఊరి పోరగాల్ల టికానా మొత్తం మా ఇంట్లోనే..వాళ్ళల్లో ఒ పెద్దమనిసిని పట్టి "ఓ రెండ్రూపాయలు నాకు దానం వద్దు,అప్పు వద్దు,ఓ గంట కిరాయికిస్తవా?" అనడిగినా..పైసలు కిరాయికివ్వడమేంటన్నట్టు సూసాడు వాడు.."అవన్నీ నీకు అనోసరం గంటకు చారానా[పావల]లెక్కన రెండ్రూపాయలు నోటు ఇస్తవా ఇవ్వవా?" అనడిగేసరికి బేరం నచ్చి ఇచ్చిండు.ఆ రెండ్రూపాయలు నోటు సైజు తెల్ల కాయితం ఒకటి నీటుగా కట్ చేసి రెడ్డింకు బాల్ పాయింట్ పెన్నుతోటి అచ్చుగుద్దినట్టు రెండ్రూపాయలు నోటు గీసి పడేసా..డిటో డిటో..ధన్ మని సూస్తే అది రెండ్రూపాయలు నోటు కాదని చెప్పడు తలకాయ కింద మెడకాయ వున్నవాడెవడు..లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న ఆ రెండ్రూపాయలు నోటును పైకెత్తి సూద్దునుగదా దాంట్లో కిస్నంరాజు పైటింగు,పాటలు,యాక్సను,క్లైమాక్సు అన్నీ కనబడ్డాయ్ ..
ఆ నోటును పట్టిపట్టి సూస్తే మాత్రం నాకు తన్నులు ఖాయం..నోటు రడీ, ఇంగ సిన్మాకు పోవడమే లేటు అంటా ప్రసాంతు టేటర్ కు బయలుదేరిన..టిక్కెట్లకాడ మంది మస్తుగుంటే ఎవ్వడు గుర్తు పట్టడు..లేకుంటే కొద్ది దూరంలోనే పోలీసుటేసను అనుకున్నా..టాకీసు గేటు దగ్గర పల్లీల బండి కనబడితే చారానా పల్లీలియ్యవయ్యా అసలే అక్కడ సిన్మా ఇస్టార్టు అయిపోయింది అంటా ఆన్ని కంగారుబెట్టిన ..ఆడు తొరతొరగా పల్లీ ఫ్యాక్ చేసి నా డుబ్లికేటు నోటు తీస్కొని వాడిచ్చిన ఒరిజినల్ రూపాయ్ బారానాతో సెకండుక్లాసు టిక్కెట్ కొని టాకీసు లోకి జొరబడ్డా..ఇంగ కాలు మీద కాలెసుకొని ఊపుతూ పల్లికాయ తింటూ పక్కోడికి ఆఫర్ చేస్తూ కిస్నంరాజు సిన్మాని ఎంజాయి చేసిన సన్నివేసం ఇట్లా వర్నించడం నా వల్ల అయ్యే పనిగాదుగానీ,
తెల్లారిపొద్దున్నే ఆ పల్లీ బండీగాడు ఆ రెండ్రూపాయలనోటు పట్టుకొచ్చి మా ఈదిలో తిరగుతూ తిట్టిన తిట్లతో కిస్నంరాజు సిన్మా సూస్తే ఎక్కిన కిక్కు దిగి దిమ్మదిరిగి బోర్లాపడ్డా..ఇంగ ఈ ఇషయం మా నాయినకు తెలిస్తే నా ఈపు సున్నంబెల్లం..మోకాళ్ళు చెక్కల్ చెక్కల్ అని భయపడుతుండగా..
"లేరా..లే..నువ్వు గీసిన రెండ్రూపాయల నోటు విలువ ఒరిజినల్ వందరూపాయలకంటే ఎక్కువేరా !" అంటూ మా నాయిన నన్ను గచ్చు మీద కూసోబెట్టి ఓదార్చిండు.

27, జులై 2010, మంగళవారం

బోయినం మనమే సంపాయించుకోవాలి

నా ఆంగ్ల బ్లాగ్ లో "ఆయాన్ రాండ్_ఆటో జానీ"పోస్టు చూసి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్శిటీ ప్రొఫెసర్స్ వాషింగ్టన్ డి.సి వాళ్ళు
you are incredibily talented అంటూ నాకు ఒక మెయిల్ పంపారని ఇంతకుముందే ఇదే బ్లాగులో చెప్పుకున్నాం..కాట్ వారెన్ సహ్రుదయతతో పంపిన మ్యాగజిన్[500 డాలర్లు కలిపి] నుంచి నా క్యారికేచర్ తాలూకు పేజీలు ఇక్కడ పోస్టు చేస్తున్నాని గమనించగలరు..
నేను Ayn Rand బొమ్మ గీయడానికి కారణమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆటో జానీ లకు ధన్యవాదాలు..జ్నానం వాళ్ళిచ్చారు,బోయినం నేనే సంపాయించుకున్నా..
అచ్చం కె.ఎన్.వై పతంజలి సార్ అన్నట్టుగానే.." జ్నానం ఎవరైనా ఇస్తారు కానీ బోయినం మనమే సంపాయించుకోవాలి"
[Who ever can't read telugu can ignore this,and go to www.mrithyunjaya.blogspot.com]

20, జులై 2010, మంగళవారం

'Inception' ఒక అభిప్రాయం


Conception of 'Inception' is an infection of subsection on my inspection.
ఇన్సెప్షన్ పిచ్చర్ మీద ఇది నా ఏకవాక్యతీర్మానం..నాది తెగులు బ్లాగు అయినా ఇసుమంటియి ఇంగిలిపీసులో రాస్తేనే ఇసుమంత ఇంగితమని ఇందుమూలముగా నా ప్రార్థన.

7, జులై 2010, బుధవారం

అదే పదివేలు !

పదివేలు మా తమ్ముడి ప్రెండు..అవును ఆడి పేరే పదివేలు.ఆడు పుట్టినపుడు ఆళ్ళ నాయినకు పదివేల రూపాయలు కలసి రావడమో,పదివేల విలువైన వస్తువో దొరకడం వల్లో ఆడికి ఆ పేరు పెట్టినట్టు ఓ కత చెప్పాడు ప్రాధమికపాఠశాలలో ఉన్నప్పుడు..
"పదివేలూ..!" "పదివేలూ..!" "పదివేలూ..!" అంటా పిల్వడం..ఆడు పల్కడం..ప్రైమరీ ఇస్కూళ్ళొ వున్నన్ని రోజులు ఆ పేరుమీద బండి బానె నడిచింది.ఇంగ ఆడు ఉన్నతపాఠశాలకు రాంగానే పట్టుకుంది బెంగ..ముక్కుకిందన మనోడికి మీసాలు మొల్వడం,ఆడపిలకాయలను సూడంగనే లొట్టబుగ్గలు ఎర్రంగ మారే వయసొచ్చింది..తోటి మొగపోరల్ని "రమేసా!"గణేసా !" సురేసా !"మహేసా!" అని నైసు నైసు పేర్లతోని పిలుస్తుంటే,తనని మాత్రం "పదివేలా!" అని పిలుస్తూంటే ఆడికి ఎక్కడలేని కోపం వచ్చేది పాపం..పదివేలకు బదులు కనీసం పెంటయ్య పేరైనా వుంటే అదే పదివేలు అనుకునేవోడు..అర్జంటుగా పేరు మార్చుకోవాలనే బుద్ధి పుట్టింది ఆడికి ..పదివేలకు బదులు పరమేస అనో,రమేసా అనో పేరు మార్చుకునే వరకు మళ్ళి ఈ భూదాన్ పోచంపల్లి జిల్లాపరిషత్ హైఇస్కూలుకు వచ్చేదే లేదని,ఒకవేల వస్తే గిట్ల నా పేరు పదివేలే అని చాలెంజి ఇసిరి ఎల్లాడు.ఆన్నీ,ఈన్నీ అడిగి ఎట్లాగోఅట్ల పేరెట్టా మార్చుకోవాలనే కిటుకు సంపాయించాడు..కోర్టుద్వారా ఆ పని ఈజీ అని ఇస్కూలు ప్రెండుగాడొకడు ఆడి చెవుల ఊదాడు..ఇంగ ఆడికి ఆకాన్నుంచి సంతోసంతో కూడిన కంగారు వల్ల ఏర్పడ్డ అత్సుత్సాహంతో ఇస్కూలు ఎగ్గొట్టి ఇదే పనిమీద తిరిగేవోడు..
చిట్టచివర్కి ఒ లాయర్నిపట్టి తనపేరు మార్చుకున్నాడు..దావత్ ఇమ్మని ప్రైమరీస్కూలు పోరలు ఆన్ని ఒకటే పోరు..
పేరు మారిన "పదివేలు" ఓ సారి మాఇంటి ముందునుంచి పోతుంటే నా కంట పడనే పడ్డడు..ఆన్ని నేను " ఏమ్వాయ్ అయిదువేలూ..!" అని పిలిచినా..ఆడు మూతి మూరడుపెట్టుకొని ఇస్సీరియస్ గా నా వైపు సూస్తూ మా ఈది మూలమలుపు తిరిగేవరకు అట్నే సూస్తూ ఎల్లాడు...

ఆన్ని నేను "అయిదువేలు" అని ఎందుకు పిలిసినానంటే,, ఆడి "పదివేలు" పేరును మార్చుకోడానికి ఆడికి అయిన ఖర్చు అయిదువేలు..ఆడి పేరులోనుంచి అయిదువేలు పోను మిగతా ఎమౌంటు అన్నమాట నేను పిలిసింది..నాకసలే వర్బల్ ఐక్యూ {నోటి దుల}.

23, జూన్ 2010, బుధవారం

వనితయందు సృజన వర్ధిల్లుతున్నది

మూడు బాగోక మాడు పగలకముందే మధుబాలకు మిస్సుడుకాలివ్వరాదా?..ఆర్పిన ట్యూబులైటు వెలుతురులో యూట్యూబులో ప్యార్ కియాతో పాటేసుకోరాదా..
అబ్బ..జైలుగోడలమధ్య మసిపూసిన బుగ్గలమాటు అందం ముందు దాస్యశృంఖలాల బిగితనమెంత..దిలిప్ కుమార్ పై ఒలకపోసిన వేల టిఎంసీల పరిశుద్ధమైన ప్రేమజలపాతం వాల్యూ కట్టేదెలా..?
ఆఫ్టరాల్ అమ్మమ్మ వయసైతే ఎంత..? అడ్జెస్టబులిటికి లేని అభ్యంతరం నీకెందుకంటా..?
మొనాటనీ ఎరగని అనాటమీతో నా రకతంలో ఈస్థటిక్ ఎనస్థీషియా..
ఐమాక్సుకు మించిన నా మైక్రోమాక్సులో రోజుకు మూడొందల అరై మొగలే ఆజమ్ లో.. ఓ వుమెన్!యూ ఆర్ మార్వలెస్..యూ ఆర్ ఇన్సిపిరేషన్ ఫర్ క్రియేషన్..
ఈ వనితయందు సృజన వర్ధిల్లుతున్నది

22, జూన్ 2010, మంగళవారం

నా బైకు..మానాయిన సైకిలు

నా పెళ్ళికి మా అత్తగారు పెట్టిన వీరోవోండాAP24 F824 ఇస్ప్లెండరు బైకంటే నాకు మస్తు మజా..దాన్ని కొత్తలో ఎక్కితిరిగినదానికంటే కడిగి తుడిసిందే ఎక్కువ.టైర్లు అరక్కుండా గాల్లో తిప్పేవోన్ని..బైకు సీటు అనిగిపోతుందేమోనని బెంగగావుండి పైన కుసోనికుసోనట్టు నడిపేవోన్ని..నా బైకుమీద నా పనిమీదైనాసరే వేరేవోళ్ళు ఎక్కడానికి లే..అంతెందుకు నేను కిక్కు కొడితే వచ్చే ఇంజనాయిలు వాసనకూడా వేరేవోళ్ళు పీల్చడానికి ఈల్లేదంతే..దూరం ఫొ..దూరం పో..అని గెదిమేవోన్నీ..
ఎన్నడెక్కనోడు ఎద్దు ఎక్కితే ఏదో కాయకాసిందన్నట్టు..అట్టా ఎక్కి తిరిగేవోన్ని నా బైకు మీద..
నా బైకుని మా సిన్నతమ్ముడుతప్ప ఇంగే నరమానవుడు ముట్టినా భస్మం..మా సిన్నతమ్ముడు ఎందుకంటే బైకు ఆడు ఎక్కితేనే నేనెక్కేది ,అదెట్లన్నన్ నాకు డ్రైవింగు నేర్పేది ఆడే మరి.నే లేనప్పుడు వాడు నా బైకేసుకొని ఈర సివాజి గుర్రమ్మీద దౌడు తీసిన లెవల్లో వుండేది పోజు..అడ్డుకుంటే "డ్రైవింగు సగం నేర్పి వదిలేస్తా బురద గుంతలో పడి సస్తావ్ జాగురత్తా!" అని బ్లాకుమెయిలింగుకు దిగేవోడు..సరేనని కాంప్రమైజు అయ్యేవోన్ని...స్టీమింజను,ఇమానము తప్ప ఈ బూమండలమ్మీద తిరిగే ప్రతొక్క వాహనాన్ని రోడ్డురోలరుతో సహా నడిపాడు మా సిన్నతమ్ముడు..బండ్లు తోలడంలో వాన్ని మించిన పహిల్వాను మా ఊరు సరవుండు ఏరియాలో ఇంకోడు లేడు. సరే వీడెంత దూరం తిరుగుతాడోనని కనిపెట్టడంకోసం రగస్యంగా మీటరు రీడింగు రాసుకునేవోన్ని..ఆడు నాకంటే గనుడు నాచంటమల్లన్న లెక్కన మీటరు వైరు పీకేసి తిరిగేవోడు..
పూర్తిగా డ్రైవింగు నేర్చుకున్నంక "ఇంగ నా జోలికి రాకు పో రా" అంటా ఆన్ని అసుంటా నూకేసేవోన్ని..వాడు ఏడ్పు మొకంతో అటే పోకడ.
ఇంగ నేను బైకు తీసిన ప్రతీసారీ మా నాయిన తన అట్లాసు సైకిలు తీసేవోడు పోటీగా..మొదట్న ఒకట్రెండుసార్లు మానాయిన నన్ను బైకిమ్మంటే "ఇయ్యనుపో..కస్టపడి మీరు నాకు పెండ్లి సేస్తే సంపాయించుకున్న బైకిది" అన్నాన్నేను..అప్పట్నుంచి నన్నడగలే..కసిగా నా బైకుకు తాతలాగ తన సైకిలు తుడిసి ఎక్కేవోడు..ఇస్పీడుగా నడవడానికి రోజు చక్రంలో గ్రీసు ఏసుకొనేవోడు..నేను బైకు ఇస్టార్టు సేసి మొగలాయిలెక్కన ఎక్కి ఎల్తుంటే మా నాయిన నేనేం తక్కువతిన్నానా అన్నట్టు తన సైకిలు ఎక్కి అలెక్జాండరు లెవల్లో ఎళ్ళెవోడు..నా బైకు కీకీ.. కీకీ.. కీకీ.. కీకీ అంటూంటే మా నాయిన సైకిలు బెల్లు ట్రింగు ట్రింగు మంటూ వెలవెలబోయెది..అది మా నాయినకు సిన్నతనంగా తోచేది..ఇంగ ఇట్లాగాదని ఓరోజు మా ఊర్నుంచి మానాయిన సైకిలేసుకొని హైద్రాద్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ జుమ్మెరాత్ బజారు చేరుకొని [మా నాయిన ఊ అంటే జుమ్మెరాత్ బజారుకొచ్చేవోడు..అక్కడ వాడిపడేసిన వస్తువుల్ని అడ్డికి పావుసేరు లెక్కన అగ్వసగ్వ ధరలకు అంటగడ్తారు] ఇస్కూటరుహార్న్ కొని సైకిలుహ్యండిలుకు బిగించి పీపీ..పీపీ..పీపీ అని హార్ను చప్పుడుచేస్తూ ఇంటికొచ్చడు ఇజయగర్వంతో ..
నా సైకిలుముందు నీ ముష్టి బైకెంతరా అంటూ సైకిలుకున్న హార్ను పీపీ..పీపీ..పీపీ అని మోగిస్తూ చెమటలుకక్కుతూ ఆయాసంతో ఎత్తుగడ్డలు బలంతాన తొక్కుతున్న మానాయిన సైకిల్ ని నా బైకుతో ఓవరుటేకు చేసి నన్నుదాటిపోవద్దని చేయితో కుడేపు సైడు చూపెట్టిన.

18, జూన్ 2010, శుక్రవారం

గోరి బండ

పొద్దంతా చేనేతపని ఐపోగానే మా నాయిన హాబీకింద పొద్దుగూకినంక స్టవ్వురిపేర్లు,సైకిలురిపేర్లతో పాటు సచ్చిపోయినోళ్ళ గోరి బండపై ఆ మనిషి తాలూకు వివరాలు రాసి చెక్కే పని చేసేవోడు.ఈ పనిలో మా నాయినకు భలే గిరాకీ వుండేది మా ఊళ్ళో.
ఇట్లా బండలపై బొమ్మలు,పేర్లు చెక్కి బ్యాంకు బ్యాలెన్సులు,బంగళాలు,బొచ్చుకుక్కలు,బెంజికార్లు సంపాయించాలని కాదు..మా నాయినకు అదో తుత్తి.
"శ్రీ ప్రజోత్పత్తి నామ సంవత్సరం జ్యేష్ట బహుళ శనివారం ది:29..06..1991 న శ్రీ మస్నరాములు గారు స్వర్గస్తులైనారు!
జననం:06..04..1921 మరణం:29..06..1991"
అని చెక్కి ,ఇరువైపుల సచ్చిపోయిన సదరు మనిషి శివభక్తుడైతే లింగం,పాము..విష్ణు భక్తుడైతే శంఖు చక్రాలు..రామ భక్తుడైతే భాణం బొమ్మలను చెక్కేవోడు.
బండలపై పేర్లు చెక్కడానికి అవసరమయ్యే పనిముట్లను కూడా మా నాయినే సొయంగా తయారుచేసేవోడు..సన్న ఇనుపముక్కల్ని బాగా కాల్చి పెన్సిలు మాదిరి చివర్న సన్న మొనతేలేటట్టు రకరకాల సైజుల్లో ఇనుప పెన్సిల్లను తయారుచేసి పెట్టేవాడు.ఏ ఫాంటు సైజుకు ఆ పెన్సిలన్నమాట..
ఇంగ మా ఊళ్ళో సావుడప్పు సప్పుడు కాంగానే మా నాయినకు గిరాకి తగిలిందన్నమాటే..పొద్దున్నే సచ్చిపోయిన సుట్టాలు బండలు పట్టుకొని మా ఇంటికొచ్చేవోళ్ళు..వివరాలు రాసిపెట్టిన కాయితాలను{ఒక్కోసారి సచ్చిపోయిన సమయం,గడియల వివరాలు మా నాయినే గంటలపంచాంగం చూసి చెప్పేవాడు] మా నాయిన చేతిలో పెట్టి "ఎంత?" అనడిగేవోళ్ళు.."పైసల్దేముందిలే.."అని పంపించి పొద్దుగూకాక పని మొదలెట్టేవోడు.
మొదట బండను సుబ్భరంగా కడిగి ఆరిన తర్వాత అక్షరాలు గుండ్రంగా కుదరడానికి చాక్ పీసుతో అడ్డగీతలు కొట్టి మద్యలో అక్షరాలు రాసేవోడు..మొదటి ఒకటి రెండు అక్షరాలను ఇనుపపెన్సిల్లపై సుత్తితో కొడుతూ మిగతాపని మా అన్నకు పురమాయించేవోడు..
పొద్దున్నే ఐదారుగంటలకు టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ మంటూ బండ మీద సచ్చిపోయిన మనిషి ఆత్మను మెప్పించేటట్టు మా నాయిన సుత్తితో చేసే శబ్ధంతో మేం నిద్రలేసేవోళ్ళం..రెండో రోజు సాయంత్రంనాటికి బండ రెడీ.
మా తాత రోజూ సాయంత్రం మా ఇంటికొచ్చి మానాయిన పని కనిపెట్టేవోడు..గోరిబండలు ఇంట్లో కనిపిస్తే "ఎందుకురా..సచ్చినోళ్ళ బండలు రాయడం..మంచిదికాదురా అరిష్టం..అష్టదరిద్రం..వద్దని ఎన్నిసార్లు సెప్పినా వినవేంరా??"అనేవాడు మా తాత మా నాయిన్ని.."ఆ ఏంది అయ్యేది,లొట్టపీసు..అందరం సచ్చేటోళ్ళమే..అందరికీ గోరీలు కట్టేదే.."ఇదీ మా నాయిన రిప్లే...బండకు ఇరవయ్యో,ముప్పై రూపాయలో తీసుకున్నట్టు గుర్తు..ఇస్తే తీసుకునేది..లేకుంటే లే..అడిగేవోడు కాదు..కాని మా అమ్మ వదిలే బాపతేనా...క్లయింట్లు పైసలిస్తేనే గుమ్మం దాటేది.
మా నాయిన చాతి నొప్పితో దిల్ షుక్ నగర్ సాయికమల్ ఆసుపత్రిలో 2003 సెప్టెంబర్ 12 మద్యాన్నం జాయినయ్యాడు..చికిత్స చేస్తుండగా రాత్రి పదిన్నరకు గుండెపోటుతో చచ్చిపోయాడన్నారు డాక్టర్లు.
మా ఊళ్ళో మా నాయిన కాష్టం అవీ కార్యక్రమాలు ముగిసాక గోరీ కట్టే స్తలం కోసం చూస్తుండగా మా ఊరి పెద్దమనిషి ఎంటరయ్యి "వద్దొద్దు..ఇక్కడ ఇంగ గోరీలు కట్టేది లేదని ఉపసర్పంచి చెప్పాడు...ఈ జాగలల్ల ఇండ్లు కడ్తరంటా.."అన్నాడు..ఎంత బతిమిలాడినా విన్లే..మా నాయినకు గోరి కట్టడం కుదర్లే..
పోచంపల్లి నుండి భీమన్ పల్లికి వెల్తుంటే మధ్యలో ఎడమ కుడి వైపుల మొత్తం మా నాయిన రాసిన గోరీబండలే...వాటి మధ్యలో మా నాయిన గోరీ లేదు,బండ లేదు.

14, జూన్ 2010, సోమవారం

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు నిండితే ఎట్లుంటదో ఇరవై నిమిషాల్లో చేసి చూపెట్టమంటే పటాపట్ చేసి ఇసిరిపడేసా..
ప్రియాంకకు అరవైనిండి అమ్మమ్మ మరియూ నాయినమ్మగా మారి స్వెట్టర్లు గట్రా కుడుతూ ఓ మూల రామ్ ఔర్ క్రుష్ణ చాటింగు చేసే కాలం నాటి నా కూలి [టైం మిషన్ చార్జీలు ]లెక్కలు చెప్పి డిమాండు చేస్తే కాదు కూడదన్నారు..ఇది న్యాయంగా అన్యాయం..

12, జూన్ 2010, శనివారం

పచ్చనాకుసాక్షిగా!

సాచ్చాత్తు పానవాయువునిచ్చే సెట్లను నరికితే ఏం పీల్చి బతుకుతావ్రా సన్నాసి ? అనే సందేశాత్మక,సందేహాత్మక కార్టూన్లు గీసే ప్రయత్నంలో తటుక్కున తట్టిన అవిడియాలతొ పుటుక్కున గీసిన గీతలివి.
పచ్చదనం పచ్చ"ధనం"గా మారుట పాపము...సెట్లను నరికితే నరకబడేవు...సమస్త భూమండలము పచ్చనాకుసాక్షిగా కళకళలాడలని నా ఉద్దార్కం.
అయినా జూలియన్ పెనాపాయ్,బొలిగన్ ముందు మనమెంతా..మనబతుకెంతా..మనబొమ్మలెంతా..మన సందేసమెంతా?????

8, జూన్ 2010, మంగళవారం

మట్టిపరిమళం మా నాయిన

మొన్న మా ఊరెళ్ళినప్పుడు నా పాత పుస్తకాల అట్టడబ్బ దులిపితే బయటపడ్డ మా నాయిన మీద రాసిన ఈ వ్యాసం మీద నా కన్నీటిచుక్కలు బొట్లుబొట్లుగా రాలగా తడిసిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటే కొంతలోకొంత గుండె దిటవవుతుందని....


5, జూన్ 2010, శనివారం

చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ !

దినపత్రిక కోసం గీకే బొమ్మకు,టీ.వీ ఛానలు కోసం గీకితే గోకే బొమ్మకు చాలా దగ్గర సంబంధం ఉంది..ఒకరకంగా బొత్తిగా సంబంధం లేదు...
పరపంచ పర్యావరన దినం కోసం శ్యామ్ మోగనుగారు పోన్జేసి "మ్రుత్యుంజయ్ గారూ !మరే మీరు కార్టూన్లు పంపండి స్సార్..లుంబినీ పార్కులో ఎజ్జిబిషను పెట్టి ఎగసెక్కాలాడదాం స్సార్.."అంటూ బండ మర్యాదలాడాడు..సరేలే అన్జెప్పి ఓ మూన్నాలుగు బరబరా గీకి లుంబినీ పార్కులో సూపర్ ఇగో ఎజ్జిబిషను ప్రదర్శించి పక్కనే వున్న ఉస్సేను సాగర్లో దూకి సద్దాం..లేదా పక్క కలాకారులను నూకేసి బుద్ధభగమంతుడికి సెల్యూట్ సేద్దామని గీకిన కార్టూన్లో ఒహటి ఆనిమేసనుకు సవులబ్యంగా తోచీతోచగానే ఓ యానివేషం కట్టా........[లేటెస్టు ఇన్పర్మేసను ఏంటంటే వెన్యూ మారిందంటా.]
చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ ! అని మనమిక్కడ గమనించాల్సిన ఘట్టం.

3, జూన్ 2010, గురువారం

3D ధన్యవాదాలు

నా రాతల్ గీతల్ బాగున్నయని మీరు పొగిడేస్తూంటే అందర్లెక్కన రిటెన్లీ రొటీన్ గా ధన్యవాదాలు,థాంక్సు సెప్పడం బాలేదని నన్నునేను 3D లోకి గుసాయించుకొని ఇట్లా ధన్యవాదాల్ సెప్తున్నా.

1, జూన్ 2010, మంగళవారం

కట్టెలపొయ్యి


మా దోస్తుగాడి ప్రెండుగాడొకడు "పార్టీకి హోటల్ తాజ్ క్రుష్ణకు రారోయ్!" అంటే ఎగేసుకుంటూ ఎళ్ళా..లజ్జలేకుండా పిజ్జాలు,బగ్గ బర్గర్లు ఇంకా నానాగ్రాసం భోంచేసి బయటకొచ్చి బొజ్జరాసుకుంటూ మెడకాయ్ మీద తలకాయ్ పైకెత్తి సూద్దునుగదా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె...హోటల్ తాజ్ క్రుష్ణకు బ్యాగ్రౌండ్ లో పదింతల ఎత్తైన మా అమ్మ ఇశ్వరూపం దర్శనమయ్యింది..ఓ సేతిలో పెద్దచెమ్చా,ఇంకో సేతిలో పొగగొట్టం,అవతల సేతిలో సర్వపిండి,ఇటుపక్కల సేతిలో నూనెడబ్బ..మింగతా నాలుగు సేతుల్లో ఉప్పు,కారం,పసుపు డబ్బాలు..
కట్టెలపొయ్యిమీద కంపమండల్తో నిప్పురాజేసి మా అమ్మ చేసే సర్వపిండి రుచి చూసిన నా నాలుకేనా ఇంత అంకచండాలమైన నానాగడ్డి భోంచేసింది???
బియ్యప్పిండిలో ఇంత పసుపు,అంతకారం,మరికొంత ఉప్పు,ఇంగొంత జిలకర గట్రాగట్రాలేసి నాన్చి ఆ పిండిని సర్వ[చిన్న బిందె]కు వత్తి,రంద్రాలయ్యేట్టు వేళ్ళతో నొక్కి పొయ్యిమీదెట్టి పొగగొట్టంతో ఉఫ్ఫూ.. ఉఫ్ఫూ మంటూ ఊదుతూ పొగతో నిండిన కళ్ళను కొంగుఅంచుతో తుడుసుకుంటుంది.. కంపమండల ముళ్ళను మునేళ్ళకు తాకకుండా జాగురత్తతో ఇరిచి పొయ్యిలోకి ఎగదోస్తూ ఆ వంటకం పూర్తయ్యెవరకు అక్కడే కూలబడి పొగతో ఎర్రగామారిన కళ్ళతో పొయ్యిమీద ఎర్రగా మాగిన సర్వపిండిని మాకు వడ్డిస్తుంది మా అమ్మ..ఇంగ వళ్ళు తెల్వకుండా తిని సొర్గంలో ఊగిపోవడమే మా పని.
మా అమ్మ కట్టెలపొయ్యిముందు హోటల్ తాజ్ క్రుష్ణ విలువ అచ్చరాల రుప్పాయ్ ప్పావలా అయినా ఎక్కువే.

28, మే 2010, శుక్రవారం

నా మొగం!

బొమ్మలు గీకడం రొండు రొకాలు..ఒంగటి మనం గీకేది,ఇంగోటి మనల్ని గీకేది..దీంట్లో రొండో రొకం కింద విదేశీ తురుమ్ ఖాన్లు తుపుక్కున గీకిన నా మొగాలివి.
ఒంగటో పోటో : బెల్జియం ఫుడింగి "ఒప్డెబీక్" ఒక్కటిపీకి వదిలిండు నన్ను.
రొండో పోటో : పోటో పంపంగనే అర్జంటుగా అర్జెంటీనా జగజ్జట్టి "మార్సెలో గుర్ర" నా సక్కదనం సెడీ సెడకుండా రప్పరప్ప గీతల్తో చెడుగుడాడాడు నన్ను.
మూడో పోటో : ఇట్ల నా పోటో పంపిన్నో లేదో అట్ల ఇటలీ నుంచి "మారియో మాగ్నట్టి" నా చెవులకు స్పైడర్ లోలకం తగిలించి తన్నొదిలాడు.
నాలుగో పోటో : మనది ఇస్త్రీలను పూజించే దేశం గాబట్టి వాండ్లకు కేటాయించిన సీట్లలల్ల వాండ్లనే కూసొమ్మనాలిగదానిజెప్పి.. ఆడపిల్లకాయ "రమన్ జిత్"
ఢిల్లీలో గీసి పార్సిల్ పంపితే వచ్చి అంబరుపేట అలీకేఫ్ గల్లీలో పడ్డా.
"నీకేమ్రా..ముక్కొంకరా?మూతొంకరా?..నువ్వు బంగారమ్రా.."అని మా అమ్మంటే.."ఎహే నీకు అన్నీ వంకరేరా భడవా.."అంటూ నన్నిట్లా జాడిచ్చొదిలారు.

26, మే 2010, బుధవారం

చిలకలగూడ కల్లు కాంపౌండు లో "ఆయాన్ రాండ్"


స్కూలు చదువు అచ్చిరాని జానీ ,ఆటోడ్రైవరుగా మారి..తన ఆటో మీద ఆయాన్ రాండ్,నీషే కోటేషన్లు తగిలించి చిలకలగూడ టూ చింతలబస్తీ వయా చిక్కడపల్లికి జనాలను తర్జుమా చేస్తుంటాడు..అలా ఆటోజానీ మీద నాకు శ్రద్ధపెరిగి అలాఅలా ఆయాన్ రాండ్ మీదికి ఆసక్తి మళ్ళి "ది ఫౌంటెన్ హెడ్" చదివే వరకెళ్ళింది..ఆపై ఆయాన్ రాండ్ చిత్రం వేసే ద్రుశ్యం నాకు రానే వచ్చింది..
"కాలేజి కరిక్యులం మీద ఆయాన్ రాండ్ ప్రభావం" అన్న ఆర్టికల్ కోసం ఒ అమెరికా మ్యాగజిను ఫ్యాకల్టి ఎడిటరు కం ప్రొఫెసరు "You are incredibly talented." అంటూ ఇరవైవేల రూపాయలకు నే గీసిన అయాన్ రాండ్ బొమ్మని వన్ టైము కాపీ రైటు కింద బేరం చేసి ఎగరేసుకుపోయాడు[డిజిటల్ బొమ్మ కాబట్టి డిమాండు,సాంప్రదాయ చిత్రకళకు వాడిచ్చే రూకలకు నూకలుకూడా రావు..పైగా ఆ కళ నాకు రాదు..థాంక్ గాడ్!] క్రెడిట్ లైను కింద నా "బ్లాగో"తం.."వెబ్"చారం కూడా అచ్చేసి మ్యాగజిన్లు మా ఇంటికి బట్వాడ చేస్తానని మెయిల్లో సెండాడు.
ఆ డబ్బుల్తో ఆటోజానీ కి తన అడ్డా చిలకలగూడ కల్లు కాంపౌండు లో కాళ్ళషోర్వ,బోటి పేగుల్తో ఓ భారీ దావత్ నేను ఇవ్వకుంటే ఈ టపాకు అర్థమే లేదు.
"ఆయాన్ రాండ్__ఆటోజానీ" కోసం నా ఆంగ్లబ్లాగు నొక్కండి.
అన్నట్టు ఆయాన్ రాండ్ కొటేషను ఇచ్చట నేను కొట్టేసెను.
"Money demands that you sell, not your weakness to men's stupidity, but your talent to their reason. "

24, మే 2010, సోమవారం

భూగోళం.. జలగోళం...గందరగోళం..

భూమ్మీద మూడొంతుల నీళ్ళున్నప్పుడు జలగోళం అనాలిగానీ,భూగోళం అంటారేందో..ఏందో ఈ గందరగోళం..
పేపర్లో బుక్కెడు బువ్వ,గుక్కెడు నీళ్ళమీద పుంఖాను పుంఖాలుగా కార్టూన్లు గీస్తూ గీస్తూ వుండగా ఓ పాలి పోరం పర్ పొలిటికల్ కార్టూనిస్టుల పోరగాళ్ళం కాలక్రుత్యాలను వాయిదావేస్తూ,కొండా కోనొకచో నిషేధిస్తూ నీటి పరమాణువులను ఎట్లా పొదుపు చేయవచ్చునో అనే అంశం మీద పోటీలు పెట్టి దేశ దేశాలనుంచి వ్యంగబాణాలను ఆహ్వానించగా నాలుగు నూర్ల బొమ్మలు ముప్పై సిక్స్ దేశాల్నుంచి డౌన్లోడ్ అయ్యాయి,కొన్ని ల్యాండ్ అయ్యాయి..వాటిలో కొన్ని శ్రీరమణ గారి హయాంలోని "నవ్య"లో ఇలా ప్రింటయ్యాయి.

21, మే 2010, శుక్రవారం

ఒక నదివోలె ఆనందం ఎద పొంగెనే..


నా బాల్యమంతా పల్లెటూళ్ళో గడవడంవల్లేమో సిన్మాలు ఎక్కువ చూసి ఎంజాయి చేసినవి ..తిట్టుకున్నవి తెలుగు సిన్మాలనే!
టీ.వీ లో ఆదివారప్పూట సాయింత్రం అమితాబ్బచ్చన్ సిన్మా వస్తుందంటే చూసేవోన్ని..లేకుంటే లే..శనివారం తెల్గు సిన్మాతో సరి..దోస్తులు కూడా తెల్గు దోస్తులే ..ఒక్కనాకొడుక్కి హిందీ,ఇంగిలిపీసు వస్తే ఒట్టు.శుక్కురోరం సిత్రలహరి తోనె అడ్జెస్టు.
కొంతమంది వీరోలని జూసి,వీరోయిన్లని జూసి ఇంగొంతమంది పోటుగాళ్ళైతే డైరెట్టర్లని జూసి సిన్మాకెళ్ళెవోళ్ళు..నేను అట్టాంటిట్టాంటి మొగోన్ని కాదు కాబట్టి చిత్ర పాడిన పాటలు తెరమీద సూడాలని మాత్రమే ఎల్లేవోన్ని.చిత్ర బొమ్మ గీసి ఏకంగా నా నైన్తుకిలాసు పుస్తకాల అల్మారాలో అంటించుకుని ఆనందించేవాణ్ణి..అట్ల అంటుకుపోయిన చిత్ర బొమ్మ ఇప్పటికీ నన్నొదల్లే..ఉజ్జోగం ఊడినా,ఉండి వచ్చిన జీతం చాలకున్నా,ఇంటద్దె నెలనెలకు పెరిగినా,పోరగాల్ల సతాయింపులు సతాయించినా చిత్ర వాయిస్ ఇంటే బలే స్ట్రెస్ బస్టరబ్బా!
చిత్ర పాటలిన్న అనుభవమేగాని ఆమెను చూసింది లే..ఎట్లుంటదో ,ఎట్లుంటదో అని వాయిస్ వింటూ ఊహించి బొమ్మలేసేవాణ్ణి..ఓసారి అంతరాయానికి చింతిస్తున్నాం దూరదర్శన్లో చుడీదార్తో పాటలు పాడుతున్న చిత్రను చూసి గుండెలు లబలబా కొట్టుకున్నా..అదే మొదటిసారి..మలయాలి అమ్మాయని తెలిసి గుండుగుత్తగా ఏకంగా కేరళనే అబిమానించేవరకెళ్ళింది నా మోజు. "సింధూరపువ్వాతేనె చిందించరావా.."పాట ఎన్నిసార్లు విని పావనమయ్యానో లెక్కపెట్టడానికి లెక్కలు తెలియని వయసునాదప్పట్లో..నిరోషా ఇస్కూలుకు ఎల్తుంటే రాంకీ అట్కాయిస్తాడు..మొదట్లో నిరోషా టక్రాయించినా తర్వాత్తర్వాత దారికొస్తుంది ,చిత్ర పాటేసుకుంటుంది "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అని.. ఇంకేం ఇక్కడ అబ్భ ఏమి గొంతు భళిరా..అది సోకెనంటె భలిరా !!.....రాయడానికి తెల్వని ఐక్యూ.
ఆ సిన్మాని మా అమ్మానాన్నల కళ్ళద్దాలుగప్పి ఎన్నిసార్లు చూసుంటానో చిత్ర కోసం.
విజగశాంతికి చిత్ర పాటేసుకుందంటే ఇంగ నాకారోజు అరకోడికూర,కొరమీను పులుసు అంచుకు చిల్లిగారెలు,రొయ్యవేపుడుతో బోయినమే!ఆ కాంబినేషను పాటలు విని వినీ విన్సెంట్ వాంగో అయింది నామొగం[చెవి కోసుకున్నంత పని] బోన్గిరిలో సదువుతూ వుండగా నాకు రెండే రెండు పిరేడ్లు..మార్నింగ్ పిరేడ్ ఓంకార్ టాకీసులో,రెండో పిరేడ్ మ్యాట్నీ ఎంగటేస్పరా టాకీసులో ..చిత్ర పాటేసుకుందని చెప్పడమే ఆలస్యం ఎనకాముందు సూడకుండా లగెత్తడమే లగెత్తడం..
మరణమ్రుదంగంలో "గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.." పాటకు నేనున్నాను లో "ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో.."పాటలో చిత్ర గాత్రం తాలూకూ విప్లవాత్మకమైన మార్పును నేను గమనించితి.
పాపం అందరూ గొప్పసింగర్లే గానీ,నన్ను మెప్పించేటట్టు పాడే రగస్యం మాత్రం ఈ జగాన ఒక్క చిత్రకే తెల్సునని నా అభిప్రాయం.
నూనూగు మీసాల నూత్నయవ్వనముతో కళకళ లాడుతూ కౌమారదశకు చేరుతున్న టైములో చిత్రను ప్రేమించిన ఇధంగా ఏ ఆడదాన్నిగూడా కనీసం కన్నెత్తికూడా చూల్లే.
ఇప్పటీకీ "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అన్న పాటింటే చాలు నైన్తు కిలాసు పుస్తకాలు పడేసి టాకీసు వేపుకు పరిగెడుతున్న పీలింగు.
చిత్ర పాటల్ని కళ్ళతో వినీ,చెవుల్తో చూసే అలవాటయ్యాక నేను కలవాలనుకుంటున్న వ్యక్తుల లిస్టులో తర్వాత పేరు ఈ దేవతాకంఠం.
చిత్ర పాడిన పాటల్లో నన్ను గిల్లిగింతలు పెట్టిన కొన్ని వాక్యాలు..
"జుంటితేనె తొనికించగా..ముని పంటి పదును పెదవంటగా.."
"సవ్వడి చేయని యవ్వని వీణలు అలా అలా సవరించు ..పదే పదే పలికించు.."
"గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.."
"అబ్బ రూపమెంత రుచిరా..అహ చూపుకెంత కసిరా.."
"నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంభరం..నీ నవ్వు ముద్దాడితే మల్లెపూవాయె నా యవ్వనం.."
"మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో.."
"నీతోనే డంకాపలాసు..అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వేనా కళావరాసు.."
"ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే."
"మూసిన ముత్యాలకేలే మొరుగులు.."
"శ్రుంగార స్నేహాల సంకెళ్ళు వేయాలా సింగారి చిందాటతో.."
"మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.."
"పొద్దున్నే పుట్టింది చందామామ మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మా.."
ఇంతవరకే అంటే మిగిలిన పాటలు కోప్పడతాయ్ అందుకే అన్నీనూ..
సౌందర్య వొంపుల ఊపులు..చిత్ర గాత్రం సొంపుల సొబగులు ఇచ్చట నొక్కితే గుండెల్లో కాంభోజి రాగమే !
[ పాటే చిత్ర కోసం ఓ పాటేసుకోదా "నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ ఈ గీతాంజలీ..!" అని.]

9, మే 2010, ఆదివారం

మనసున మల్లెల మాలలూగెనే..

సుట్టాలింటికెళ్ళాక ఈ మాటా ఆ మాటా అయిపోయి,ఇంగ తిరిగి ఇంటికొచ్చెద్దామనుకునేసరికి మాట నెత్తిలో తురుముకునే మల్లెపూల దగ్గరికెళ్ళింది.
"ఏమోనండీ..మల్లెపూలు పెట్టుకునే అలవాటైతే లేదునాకు..సిన్నప్పట్నుంచి కూడా ఆ పూల వాసన పడదునాకు"అంది ఆ ఇంటావిడ.
"అట్లాంటప్పుడు ప్రతి నాలుగు మల్లెపూల మధ్యన ఒహ వట్టిచాప[ఎండు చేప] చొప్పున అల్లి పెట్టుకోవచ్చుగదా..పీలిస్తే గుమగుమ..సూస్తే స్రుజనాత్మకత.."
అని ఓ ఉచిత సలహా పారేసి వచ్చిన.
వొకర్తో వొకరికి ఈ మాత్రం తమాస గూడ లేకుంటే ఇంగ మిగిలింది అమాసేనబ్బా!
[శాంతాడంత నల్లటి జడ మీద బొక్కెన నిండ తెలతెల్లటి మల్లెపూల కలరు కాంబినేషను,కంపొజిషను బలే బాగుంటది.]

8, మే 2010, శనివారం

ఖాకీవనం

ఖాకీవనంలో లాఠీలు మొలకెత్తి మీడియాపాలిట ముళ్ళుకర్రలుగా మారిన సందర్భమున పనికొస్తాయని నా రెడీమేడ్ షాపునుంచి కొన్నిటిని తీసి పోస్ట్ పోను చేయకుండా పోస్టు చేసా..!

7, మే 2010, శుక్రవారం

చాపలపులుసా...మజాకా...! పార్ట్..2

పొద్దున్నే మా డోరు సాధారణంగా రెండు సార్లు మోగుతుంది..ఒహటి పాలోడు..రెండోది పేపరోడు..మొన్నోరోజు మూడుసార్లు మోగింది మా డోరు ఇసిత్రంగా..అట్లెట్లా??అంటూ డోరు తీసేసరికి ఎదురుగా మాధవి,హసీనా,ముగ్గురు కెమరామెన్లు,ఒక అసిస్టెంటు,మేకప్ మేను..బయట tv5 వ్యాను..
"నీ బ్లాగులో చాపలపులుసా...మజాకా.. చదివి వచ్చాం..ఆరుచీ బాపతు సీక్రెట్ ఏంటో మా tv5 ప్రేక్షకులకు చెబుదురు పా.."అంది మాధవి........అవునన్నట్టు తలూపింది హసీనా.
"ఇప్పటికిప్పుడు చేయాలంటే ఎట్లా..అందుబాటులో మా అమ్మకూడా లేదాయె."అన్నాన్నేను.."మరేం పర్లే..పిలిపించు"అన్నారు ఇవ్వాల మాకిదే పని అన్నట్టు.
ఊరినుంచి ఉరికి రాలేరుకదా..ఇప్పటికిప్పుడు అట్లా అరెంజ్ చేయడం మిషన్ ఇంపాజిబుల్ 2 అనిచెప్పా..టుమారో నెవ్వర్ కమ్స్ అన్నారు వాళ్ళు.డే ఆఫ్టర్ టుమారో అన్నాన్నేను..ఫైండింగ్ నెమో అన్నారు వాళ్ళు మళ్ళీ..ఇట్లాకాదని చాపలపులుసు వంట సింహాసనం మీద తాత్కాలిక అధికారిగా సుమ[నా పెళ్ళామ్] ను అధిష్టిస్తే ఎవన్న అభ్యంతరమా?అనడిగినాను..సర్సరే కానీయ్ అన్నారువాళ్ళు.గోల్నాక ఫిష్ మార్కెట్ కెళ్ళి బొచ్చెడు బొచ్చెలు తెచ్చా..
క్షణాల్లో పదండివిందుకు..
పైన వీడియో అదే..
చూసి ఫాలో అయితే లోకకళ్యాణం కోసం ప్రక్రుతి పులకిస్తుంది.. వరుణుడు విస్తారంగా వర్షాలు కురిపిస్తాడు..చెరువులు,సముద్రాలు తిరిగి కొత్త చాపలతో కళకళలాడతాయి..మళ్ళీ వాటిని మనం కూరొండుకొని తినొచ్చు..మళ్ళి వర్షాలు..మళ్ళి కూర....

5, మే 2010, బుధవారం

నంజుకోడానికి ఆర్కెలక్ష్మణ్..చప్పరించాడానికి బాపు..


శిల్పారామం దాటి ఓ కిలోమీటరు పోయి రైటు తిరిగితే "ది స్పైస్ విలేజ్"వస్తుంది..
రోజూ తినే రొటీన్ తిండి బోరుకొట్టి ఆల్టో కారేసుకొని ఓ ఐదుగురం ది స్పైస్ విలేజ్ కెళ్ళాం..అద్దాలమేడ..సెకండు ఫ్లోరుకెళ్ళి ఈసారి లెఫ్ట్ తిరిగి మూలమీద కూర్చున్నాం..
అందరిటేబుళ్ళమీద బాపు,ఆర్కెలక్ష్మన్ కార్టున్లు వడ్డించాడు సర్వర్..దిమ్మదిరిగింది..ఉరే రామేశ్వర్ వెళ్ళినా మిష్టర్ శనీశ్వర్ తప్పడా??అనుకున్నా..
"ఇదేందిబై అన్నానికొస్తే విస్తర్లు వేయకుండా సెటైర్లు వేస్తారేం?"అన్నాన్నేను..ఇక్కడంతే బై అన్నాడువాడు..కార్టున్లు చూస్తూ భలే ఎంజాయ్ చేసారు "ది స్పైస్ విలేజ్" కస్టమర్లు.. వంటలు లేటయితే వాడి మాడుపగులుతుందని మనకు సంకలగులగుల పెట్టే ప్రయత్నం తాలూకు కాన్సెప్టు అయ్యుంటుంది.
కార్టూను పోస్టర్లమీద ప్లేట్లు,వాటిమీద బోయినం,నంజుకోడానికి ఆర్కెలక్ష్మన్..మజ్జిగలో చప్పరించాడానికి బాపు..భలే భోయినం..బ్రేవ్!!
"ఈ ఇషయం కూడా రాస్తారా?ఏంది..బ్లాగులో..?"అన్నారు తోటి ఎంప్లాయీస్...
ఇంకేం అన్నంతపనయ్యింది..!
{శిల్పారామం ఒసారెళ్ళి "ది స్పైస్ విలేజ్"కి దారెటూ?అనడగండి చాలు తర్వాత వాడే చూసుకుంటాడు.}

4, మే 2010, మంగళవారం

మానాయిన తీర్పు

మస్నం పెంటయ్య.మస్నం చిన్నయ్య అన్నదమ్ములు.మా ఊరిపొలిమెరల్లో వుంటాయ్ వాళ్ళిళ్ళు..అన్నదమ్ములు అచ్చం అన్నదమ్ముల్లాగే వుంటారు.వాళ్ళు కట్టుకున్న ఇండ్లుమాత్రం అచ్చం అమ్డాల[twins]పిల్లల్లాగుంటాయ్..
ఒకప్పుడు వాళ్ళు మా ఇంటి ఎనకాల ఇంట్లో వుండేవోళ్ళు[అది మా చిన్నకాకయ్య వాళ్ళది].మగ్గం నేయగా సంపాయించిన డబ్బుల్తో సొంతంగా ఇండ్లు కట్టుకునే స్థాయికి ఎదిగిపోయి పొలిమెరకెళ్ళిపోయారు.
పెంటయ్య భార్య రాములమ్మ వీళ్ళిద్దరూ మా ఇంటెనకాల వున్నన్ని రోజులు కాపురం బానే చేసేవోళ్ళు..ఎందుకంటే మేం వుండే కాలనీలో మా నాయిన పలుకుబడి తాలూకు వైబ్రేషను నలుదిక్కులా కిలోమీటరు వరకుండేది..ఎవరింట్లో పంచాయతీ అయినా మా నాయిన తశ్వె[solve] చేయాల్సిందే..ఏ పెళ్ళాం మొగుడు పీకులాడాలన్నా మానాయిన పర్మిషన్ అవసరం అయేటట్టుండేది అక్కడ పొజిషను.బొంగురుగొంతుతో పెంకుటిల్లు టాపులు లేచిపోయేటట్టుండేయి మా నాయిన తీర్పులు.వెనకా ముందులు మొగమాటాల్లేకుండా వుండేయి వాదనలు..
దేశనాయకుల బొమ్మలు బట్టపై నేయడం,కొత్తకొత్త డిజైన్లు కనిపెట్టడం,కుట్టకుండా ప్యాంటు షర్టు నేయడం,అగ్గిపెట్టెలో పట్టేచీర నేయడం.. లాంటి ఎక్స్ పెరిమెంట్లు చేయడం మూలాన మా నాయినను కలవడానికి థాయిలాండ్,ఆఫ్రికా,జపాన్,మలేషియా,సింగపూర్,పారిస్,అమెరికా.....ల నుంచి ఫ్యామిలి ఫ్యామిలీతొపాటు టిఫిన్ బాక్సులు కట్టుకొని మరీ మా ఇంటిని దర్శించడంవల్ల మా నాయిన ప్రతిష్ట వద్దువద్దన్నా అమాంతం పోచంపల్లి పొలిమెరలు దాటి ఎటో ఎళ్ళిపోయింది..అందుకే మా ఊళ్ళో మా నాయినన్నా,మా నాయిన తీర్పులన్నా ఎనలేని గౌరవం.
పెంటయ్య,రాములమ్మలు మాఇంటికి దూరంగా ఊరిపొలిమెరల్లోకి ఎళ్ళిపోవడం..రోజూ గొడవలు షురూ కావడం ఏకకాలంలో జరిగిపోయాయి.ఇద్దరికీ క్షణం పడకపోవడం..తీర్పులకోసం మా నాయిన దగ్గరికి నువ్వానేనా?అన్నట్టు రన్నింగ్ పోటీలు..ఈవిడ గురించి ఆయన,ఆయన గురించి ఈవిడ..ఇదే తతంగం..
అసలు గొడవేంటని ఆరాతీస్తె తెలిసిందేంటంటే సదరు రాములమ్మకు దైవభక్తి రోజు రోజుకు పెరిగిపోయి పతిభక్తిని పక్కకుపడేసింది..వేళకు భర్తగారిని ఎండబెట్ట
డం..భార్యాభర్తలు చేయాల్సిన పనులు ఏవీ జరిగేయికావు..ఈవిడకు భక్తి పెరిగిపోవడం,ఆయనకు బీ.పీ పెరిగిపోవడం...లేసింది మొదలు ఇదే డ్యూటి..పెంటయ్యకు సావు గోస పాపం..పొద్దస్తమానం దేవుడిరూములోనే రాములమ్మకు డ్యూటి.దేవుడి రూముని చక్కగాపేడతో అలికి పసుపుకుంకుమతో బొట్లు అలంకరించి ధూపధీప నైవేద్యాలను దేవుడికి అర్పించి ఆనక పెంటయ్యకు సమర్పించేది...తరవాత ధ్యానముద్రలోకి జారుకునేది రాములమ్మ.
రాములవ్వ.పెంటయ్యతాతలమనేవాళ్ళం మేము..
ఇంటిపై,ఒంటిపై ధ్యాసే లేకుండా చక్కగా శుభ్బరంగా దీపాలు ఎలిగించడం..నన్ను ఎండబెట్టడం"ఇదీ పెంటయ్యగారి ప్రథమ ఫిర్యాదు..
ఈ పంచాయతీ తీర్పుకు మా పోచంపల్లి హేమాహేమీలంతా హాజరయ్యి తోచిన తలా ఓ తీర్పు చెప్పారు..మానాయిన తీర్పు మిగిలిపోయింది..అంతా ఉత్కంటా..తీర్పు ఎలావుంటుందని...
"దేవుడికి ఇన్ని సార్లు నైవేద్యం పెడుతున్నావ్..పూజలు చేస్తున్నావ్..దీపాలు ఎలిగిస్తున్నావ్..అయినా మీ ఇంట్లో శాంతి వుంటలేదు అవునా?" అనడిగాడు రాములమ్మని మానాయిన.
"అవును"అంది రాములమ్మ
"అందుకని దీపాలు ఎప్పుడుపడితే అప్పుడు ఎలిగించకు."అన్నడు మా నాయిన
మరెప్పుడు ఎలిగించమంటావ్? అంది రాములమ్మ
"కరెంటు పోయినప్పుడే ఎలిగించు" ఫైనల్ గా మా నాయిన తీర్పు.
ఊరి జనం నోరెల్లబెట్టిన ఎక్స్ ప్రెషను మళ్ళీ వర్ణించడం కూడానా??
1998వ సంవత్సరంలో కోఠీ సుల్తాన్ బజార్లో రాములమ్మ ఒక్కతే గుర్తుపట్టరానివిధమైన వేషంతో వేగంగా ఫుట్ పాత్ పై నడుచుకుంటూపోతూంటే బస్సులోంచి చూసా..తర్వాత కొన్నిరోజులకే చచ్చిపోయింది రాములమ్మ.
[ఆరోగ్యం,అయిశ్వర్యం కోసం పూజలు చేసి ఉపవాసాలుంటే అవిరావు..గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుంది____మానాయిన]

3, మే 2010, సోమవారం

విష్ణుమూర్తి అవతారం

శ్రీరామనవమి అయినా శివరాత్రి అయినా కౌసు కౌసే ..ఎవ్వరిపండగ వాళ్ళదే..ఇదీ మా నాయిన దరువు..
పండగపూట పెళ్ళాం మెగుళ్ళు చక్కగాస్నానం చేసి గుడికి కొబ్బరికాయలు తీసుకెళుతుంటే మా నాయిన మాత్రం
తలకాయకూరతో ఎదురుపడతాడు.ఆ రోజు పండగన్న ధ్యాసకూడా వుండదు.
ఉపవాసాలు,ఫాస్టింగుల పదాలింటే మా నాయినకు సివ్వరలేస్తది.పొట్టేలు మాంసమో,పొట్టపేగులో ఏది దొరికితే అది అప్పుచేసైనా కొని కొయ్యాల్సిందే,మా అమ్మచేత ఏ అర్ధరాత్రి అయినాసరే వండించి తిని తీరాల్సిందే..ఇదీ మానాయిన ఫిలాసఫి.అంతేగానీ పూజలు,వ్రతాలు,తీర్ధప్రసాదాలు బాపతు పదాలు మా నాయిన డిక్షనరీలోనే లేవు..
శివరాత్రి రోజు ఊరుఊరంతా దేవుని విగ్రహాలను భక్తిగా కడుగుతుంటే మా నాయినమాత్రం మా ఇంటి ఎదురుగా టెంకలో ఉప్పేసి చాపల్ని కడిగి శుద్ధంచేస్తాడు.
దేవుడికి సొంతాభిప్రాయాలున్నట్టే మా నాయినక్కూడా సొంతాభిప్రాయాలున్నాయి.."ఎవడి అభిప్రాయాలు వాడివే..ఎవడిష్టం వాడిదే"అంటూ చాపల్ని కడిగిన నీళ్ళను పక్కనేవున్న చెట్లకు పోస్తాడు.
మా నాయిన మనుషుల్ని ఎంత ప్రేమిస్తాడో జంతువుల్నికూడా అంతే ప్రేమిస్తాడు..పక్షులు,జంతువులు ఎంతప్రేమంటే వాటిని అమాంతం కూరొండుకొని తినేసేంత.
కుందేళ్ళు,ఉడుములు,పావురాలు,కోళ్ళు,చాపలు,అడవిపంది..ఏదొచ్చినా సరుకు నాణ్యత చూసి దానిమీద మా నాయిన I.S.I మార్కు వేయాల్సిందే..
అమ్మడానికి వచ్చినోళ్ళు ముందు మా ఇంటి ముందు ఆగి మా నాయిన బేరం తర్వాతే వాళ్ళు రెండో బేరానికి కదలాలి..చాపలైతే ముందు వాటి చెక్కిళ్ళు సుతారంగా తాకుతూ లాగి చూస్తాడు ఎర్రగా నిగనిగలాడుతూ వుంటే అప్పటికప్పుడు పట్టుకొచ్చినయన్నమాట..ఇట్లా ఉంటాయ్ కోడ్ లు..
మా ఊరిపొలిమెరల్లో రాత్రివేళ టార్చిలైట్ వెలుతురులో కుందేళ్ళని వేటాడి అమ్ముతుంటారు..వాటిని కొనేసి చక్కగా చర్మం పాడవకుండా రెండు కాళ్ళమధ్యనుంచి సన్నగా కోసి లోపలి మాంసం జాగ్రత్తగా తీస్తాడు..ఆ మాంసంతో కూర లేదా ముట్టీలు[కీమాబాల్స్] నూనెలో గోలించి చేయిస్తాడు..తిత్తిని మాత్రం చక్కగా కడిగి లోపల పత్తి[cotton]తో నింపి వాసనరాకుండా డాంబర్ గోళీలు[నాఫ్తలీన్]వేసి కుట్టి ఇంటి ఫ్లవరువాజుల పక్కన షోకేషుగా పెడతాడు..ఉడుములకు కూడా ఇదే గతి..అచ్చుపానమున్నవాటిలాగే చూస్తాయవి మనల్ని..
మా నాయిన ఈ తతంగం పూర్తిచేసేసరికి వాటి మాంసం తాలూకు వంట మా అమ్మ సిద్ధం చేస్తుంది.
ఇగ భోజనాలుకు కూసొని కుందేలుముక్క తింటూ షోకేషులో వున్న కుందేలుతిత్తి ముకాన్ని చూడడం..ఉడుము తునకల్ని నముల్తూ ఉడుము తిత్తిని చూడ్డం....
మానాయిన ఆనందం,త్రుప్తి అప్పుడు చూడాలి..వర్ణించడం ఎవరితరం??? ఏ పని చేసినా కాసింత కళాపోసన వుండాలి అన్నది మా నాయిన సిద్ధాంతం.
దీపావళి ముందు వరకు ఆ బొమ్మలుండేవి..ఇల్లు దులిపి సున్నలేసేటప్పుడు వాటిని మా అమ్మ బయటపడేసి కాల్చేసింది..
ఇక మా ఇంట్లో ఎవ్వరికి జరాలొచ్చినా డాక్టర్ దగ్గరికి ఎళ్ళడం అంటూ వుండదు...ప్రేమ్ లాల్ దగ్గరికో,విటాభా దగ్గరికో ఎల్తాడు మానాయిన.ప్రేమ్ లాల్ ,విటోభా లు మా ఊళ్ళొ పేరుమోసిన మాంసం కొట్టిచ్చేవాళ్ళు..[సాయెబులు,చాకలి,మంగలి,కటిక,..ఏ కులపోన్నైనా మానాయిన వరస పెట్టి పిలుస్తాడు..మామా అనో,అప్పయ్యా అనో,తాతా అనో అంతేతప్పా పేరుపెట్టి పిలిచిన పాపాన పోలె బతికున్నంతవరకు]
మా నాయిన ప్రిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది..
జలుబుకు కాళ్ళషోర్వ..గొంతు గరగరకు తలకాయ కూర..మోకాళ్ళనొప్పులకు పావురాళ్ళను కోసిన రక్తంతొ నొప్పిదగ్గర మర్ధన చేస్తాడు[ఈ వైద్యం మా మూడోవాడు దత్తు పై చాలాసార్లు ప్రయోగించాడు..దత్తు కట్టబడుతున్న బిల్డింగులపైనుంచి దూకే స్పెషలిస్టు కావడం మూలాన మోకాళ్ళనొప్పులు ఎక్కువగా వస్తుండేయి వాడికి]
మా ఇంట్లో వస్తుగుణప్రకాశిక అని ఒక పుస్తకం వుండేది..దాన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఎప్పుడో నేను పుట్టకముందుకొనిపెట్టాడు..ఆ పుస్తకంలో ఏ వస్తువ తింటే శరీరానికి ఏం జరుగుతుంది అని వివరంగా ఉండేది..ఆ పుస్తకం కోసం మా వీధిలో క్యూ పద్దతి పాటించేవాళ్ళు..ఆ బుక్కుని చక్కగా బైండింగు చేసి పెట్టాడు..బ్యాంకు లెడ్జర్ పుస్తకం మాదిరి వుండేది..హైటు అమితాబ్బచ్చన్,వెయిటు కల్పనారాయ్..
"పండగ పూట ఈ నీసు వంటలేందిరా"అని అంటూండేవాడు మా తాతా.మా నాయినేమో చాపలకూరని విష్ణుమూర్తి [మత్స్యావతారం]అవతారం అనేవాడు..
"పూటకో అవతారాన్ని తెచ్చి ఖతం చేస్తే సంపాదనెట్లా..పిల్లల పెల్లిండ్లు ఎట్లారా??"అంటూ ఒహటే గులుగుడు మా తాత.

1, మే 2010, శనివారం

యుధ్ వీర్ సు"బాణి" కి అభినందనలు

"ముక్కలుకాబడ్డ పాము సూర్యాస్తమయం లోపు ఒక్కదెగ్గరికి చేర్చబడితే తిరిగి ఆ పాము జీవం పోసుకొని వయ్యరంగా బుసలుకొట్టును" అని అమెరికాలో ఓ మూడనమ్మకం..దీన్ని ఆధారం చేసుకొని అనైకమత్య బ్రిటీష్ అమెరికన్ ప్రాంతాలను ఏకతాటి మీదికి తెచ్చే సంకల్పంతో 1754 లో బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే ఒ పెద్దాయన "పెన్సిల్వేనియన్ మెగజెట్"లో ఓ కార్టూనేశాడు..ఎనిమిది ముక్కలైన పాము మీద ఎనిమిది ప్రాంతాలను గుర్తిస్తూ "జాయిన్ ఆర్ డై"[కలిస్తే కలువ్..సస్తే చావ్] అంటూ వేసిన కార్టూన్ ప్రభావం అమెరికన్ విప్లవంలో చెరగని ముద్దరేసింది.
ఇట్లా చెరగని ముద్దర్లేస్తూ గీస్తున్న కార్టూనిస్టుల్లో ఇండియా తరుపున సుభాని గారు ఒకరని నా అభిప్రాయం.
ఓ చేత్తో జారుతున్న చెడ్డిని పైకి లాక్కుంటూ మరో చేత్తో ఆంధ్రభూమి లో సుభాని ఇలస్ట్రేషన్లు,D.C కార్టూన్లు చూసిన అనుభవముంది నాకు.
1998 జూన్లో బట్టతలతో అబ్దుల్ కలాం క్యారికేచర్ మిజైల్ మాదిరిగా గీస్తున్న ఒకాయన కనిపిస్తే కలిసి మాట్లాడాను.నేనూహించిన సుభానికి చూస్తున్నసుభానిముకానికి ఎక్కడా పొంతనలేదు..సమ్మందంకూడా లేదు.కాని అతను సుభానినే.
పదేళ్ళు సుభాని గారితో కలిసి ఆంధ్రభూమిలో కార్టూన్లేశా..పేపర్ లేకపోతె అడిగేవోన్ని...రబ్బర్ లేకపోతె అడిగేవోన్ని...పెన్సిల్ ముక్కు ఇరిగిపోతే అడిగేవోన్ని..అయిడియాలేకపోయినా అడిగేవోన్ని..!
సుభానిగారికి కట్ ఆయ్యె ఇన్ కమ్ టాక్స్ లో సగం వుండేది నా జీతం.
విశాలనేత్రుడు,ఆజానుబావుడు,చక్కటి మేనిచాయ అని నేను అననుకాని..చదువుకున్నకార్టూనిస్ట్ అని చెప్పగలను..అంత మాత్రంచేత గర్వవతుడు మాత్రం కాదు.తక్కువమాట్లాడతాడు..తక్కువ మాట్లాడే బొమ్మలున్న కార్టూన్లే వేస్తాడు..ఇంటర్నల్ పాలిటిక్స్ కంటే కరెంట్ పాలిటిక్స్ పైనే ఫోకస్ ఎక్కువ.జర్నలిస్ట్ క్ ఇన్ స్టింక్టు ఇంకు బాటిల్ సంపాయించి పెట్టుకున్నాడు.
సుభాని గారు గీసిన "గ్రేట్ వాల్ ఆఫ్ చైన" కంపొజిషను ఉంకో పదేళ్ళయినా నేను గీయలేనని చాతి విరుచుకొని చెప్పగల్ను.చంద్ర గారి ఇన్ ఫ్లూయేన్స్ ఉన్నట్టు నాకు డవుటు.
ప్రతిష్టాత్మక యుధ్ వీర్ అవార్డు అందుకున్న సు"బాణి" కి అభినందనలు.
[సంపాయిస్తున్నది నెలకు లక్షా,అర లక్షా కాదు,మన బంగారం మార్కెట్లో క్యారెట్టా,కాడ్మియమా,రోల్డుగోల్డా? ఏకంగా కాకిబంగారమా ??? ]

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఎంకటేశ్వరా టాకీసులో శ్రీశ్రీ

నాకు శ్రీశ్రీ బోన్గిర్ లో [మా అమ్మమ్మ ఊరు] ఎంకటేశ్వర టాకీస్ లో పరిచయం.ఆకలిరాజ్యం సిన్మా మొట్టమొదట అక్కడే చూశా..కమ్లాసన్ తినడానికి తిండిలేక అన్నీ అమ్మేయంగ శ్రీశ్రీ పుస్తకాలు మిగిలిపోతాయి..వాటిని పాతపేపర్లోడికి అమ్మేస్తే నాలుగు కిలోలు మూడు రూపాయలంటాడు.."ఇది శ్రీశ్రీ కరీదు కాదు,తూకానికేస్తే వచ్చిన డబ్బులు...విప్లవకవి శ్రీరంగం శ్రీనివాస్ రావ్ గారి విలువ మూడ్రూపాయలు...మానాభిమానాల్ని కూడా అమ్ముకొమ్మంటుంది ఆకలి..ఆఫ్టరాల్ మహాకవి శ్రీశ్రీ ఎంత " అంటాడు కమ్లాసన్..ఆ పాతపేపర్లోడు "ఈ శ్రీశ్రీ పుస్తకాలు సదవడానికేగానీ,మడవడానికి పనికిరావయ్యా..అప్పడంలా నలిగిపోతుంది..ఇవి కాకుండా స్టారుడస్టు,పిలిమ్ ఫేర్లు లేవా?..అవైతే నైసు నైసుగా ఉంటాయి."అంటాడు విసుగ్గా..
"తొండ,తొండలు తినేవి,తొండల్నితినేవి.." లాంటి తొండ జ్నానం నాది అప్పట్లో..ఏరే పెపంచం ఉన్నట్టు తెల్వదు నాకు[ఇప్పటిక్కూడా..] ఆ సిన్మా మొత్తం శ్రీశ్రీ పెద్యాలు,కొటేషన్లు,శ్లోకాలు...సిన్మా నాకర్థంకాలేగానీ,గొప్పసిన్మానే అనుకున్నా..
తర్వాత్తర్వాత శ్రీశ్రీ గురించి వ్యాసాలు "నేను సైతం ప్రపంచాగ్నికి...".."పోనీ పోనీ పోతే పోనీ...".."తాజ్మహాల్ నిర్మాణానికి కూలీలెవ్వరు.."పతితులార,బ్రష్టులార.." లాంటి కవిత్వాలు చదివిన,విన్నగానీ పూర్తిగా శ్రీశ్రీ ని బాసింపట్టేసుకొని జీర్ణం చేసుకున్నపాపానైతే పోలే..పైగా పతంజలి సారు "మహాప్రస్థానం చదివినప్పట్నుంచి నాకేదో అయ్యింది.."అనంటుండేవాడు[నాతో కాదు]..సుకాన వున్న పానాన్ని దుక్కాన పెట్టికోవడం ఇస్టం లేక అటు జూసిన పాపాన పోతె ఒట్టు.
సదవమని సవాల్ చేసే నౌకర్లు కొన్నివుంటాయి...అట్టాంటి పొరఫేషన్లో నేను దినపత్రికలకు కార్టూన్లు గీస్తుండగా ముక్కామల చక్రధర్ అని ఒకాయన వచ్చి" శ్రీశ్రీ ని చదివారా?" అనడిగాడు..నిద్రపోతూ దేశాన్నేలే ప్రధానమంత్రి మీద కార్టూన్లేయడానికి శ్రీశ్రీ కి ఏంటి సమ్మందం??.. వి.వి గిరికి చేసే గుమాస్తాగిరికి లింకేంటీ?" అని నిలదీశా..మరీ ముక్యంగా నాకు శ్రీశ్రీ అనోసరమ్ అని బండ బద్ధలు కొట్టిన.
కానీ ఇప్పుడు ఈ ఇంటలిజెంటిల్మేన్ని చదివితే రక్తంలో జరిగే కెమికల్ రియాక్షను ఎట్లుంటదో సూడాలనిపించి బాసింపట్టు ఏయాలనే అనిపిస్తోంది....వయసు ట్రాఫిక్ లో హారతికర్పూరంలా కరిగిపోతుంటే భయమేస్తోంది..!
"వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో దారికాని దారులలో కానరాని కాంక్షలతో దేనికొరకు పదేపదే దేవులాడతావ్..?" అంటున్నాడు శ్రీశ్రీ.

27, ఏప్రిల్ 2010, మంగళవారం

నా కలల సీతాకొకచిలకలు..సరిగ్గా పదేళ్ళక్రితం హైద్రాబాదుకార్టూనిస్టులమంతా నీళ్ల కొరతమీద మంచినీళ్ళు తాగినంత కష్టంగా కార్టూన్లేసి రవీంద్రభార్తిలో ప్రదర్శనొకటి పెట్టాం..వాటిలో ఏరికోరి "హిందు" పత్రికవాళ్లు నా కార్టూన్ని మాత్రమే అచ్చేసి "కళ్ళను కట్టిపడేసే కార్టూన్లు"అంటూ వ్యాసం రాసారు.కుండలో నీళ్ళకోసం వంగిన ఓ బాల్ కిషన్ నీళ్ళు దొరక్క తనే కుండలోకి ఇంకిపోతాడన్నమాట..

ఇదిలా వుంటే..........,,,

అధీనరేఖవద్ద కాల్పులు,లోతట్టుప్రాంతాలు జలమయం,ఉగ్రవాదంపైఉక్కుపాదం,అమరవీరులకు అశ్రునివాళి..లాంటి అవకతవక కంగాళి వార్తలు సదివి సదివి ఆటిపై కార్టూన్లు గీసి గీసి బోరు భరించలేక బోరున ఏడుస్తున్న సన్నివేశంలో పతంజలి సారు డస్టుబిన్నుసురేశ్ గాడు జాడిచ్చితంతే ఎల్లి పంజాగుట్ట ఫ్లైఓవర్ప్ పక్కసందులో "మాయా" సాఫ్టువేర్లో వర్కుచేసుకుంటున్న సత్య మెడలమీదపడ్డా...ఇంకేమ్ "మాయా" సాఫ్టువేర్లో ఎచ్చుల పుడింగినైపోయానని వేరే చెప్పాల్నా??పేపర్ కోసం ఎలగబెట్టిన కార్టూను "మయా"లో చేస్తే ఎట్లుంటదో ఒ చిన్న ట్రయలు వేసా...పైన వీడియో నొక్కీవక్కానించండి.దీన్నే కొంతమంది"కలల సీతాకొకచిలకల వెంట...." అంటారు.....నేనేమో "క్యారెట్ బిఫోర్ ది కార్ట్ " అంటాను.

26, ఏప్రిల్ 2010, సోమవారం

మా ఊరి పోస్టుమ్యాను

మా ఊరి పోస్టుమ్యాను పేరు పిట్టనారాయన.సినిమాల్లో చూపించే తరిఖా అస్సలుండేడిదికాదు ఆయనది అంటే, ఖాకి డ్రెస్సు,టోపీ,సంకకు ఓ బ్యాగుతో ట్రీంగు ట్రింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ సైకిలుమీదవచ్చి విసురుగా దర్వాజ సందుల్లోంచి ఉత్తరాలు గిరాటేసేరకం కాదు.
సఛ్ఛమైన తెల్లపంచె,అంతే తెల్ల బుశ్షోటు[షర్టు]ను మోచేతులవరకు మడిచేటోడు.వయసు 55 అట్లా ఉండొచ్చు.రెండుచేతులా ఉత్తరాలు కళకళలాడుతూవుండేయి.అవి ఉత్తరాలన్నమటేగానీ,నాకు వాటిని సూస్తుంటే శుభలేఖల్లాగ అగుపింఛేయి..శుభలేఖలు పంచినట్టే పంచేవోడు..
పేరుకు పోస్టుమ్యానే అయినా జిల్లా కలెకటర్ లెవల్లో వుండేది సూరత్.
మా నాయిన ఆయన్ని గౌరంగా "నమస్తే పటేలా?"అనేవోడు..రెడ్లకులం..రెడ్లకులస్తుల్లో మగాళ్ళనైతే పటేలా అనీ,ఆడాళ్ళనైతే పటేలమ్మా అనడం రివాజు మా ఊళ్ళో.
టెన్త్ కిలాసు నుంచే నాకు పేపర్లకు ఉత్తరాలు రాయడం మహామోజుగా వుండేది."పలాన కతలో రావులమ్మ అత్తకు ఇషం పెట్టే విశ్లేషణ మీ కతకే హైలెట్" లాంటి ఉత్తరాలు రాసి పోస్టు చేయగా పత్రికల్లో నా పేరు సూసుకొని తెగ ఇదై పోతుండేటోన్ని.ఉత్తరాలమోజు క్రమక్రమంగా జోకులు రాసుకునే వరకెళ్ళింది..
అట్లాజోకులతర్వాత ఇట్లాకాదని ఏకంగా కార్టూన్లు గీకడం మొదలెట్టా..మొదట్లో పొస్టుకార్డులమీదే గీకడం ఎలగపెట్టేవోన్ని..పోస్టల్ స్టాంపులు,కవర్ల గురించి తెలిసేంత క్లవర్ని కాదునేను.ఏదో వీక్లీలో సదివా.."కార్టూన్లు తెల్లపేపర్ మీదే ఇండియనింకుతో మాత్రమే గీయాలి" అని..అది ఏ గడియలో సదివినానోగానీ నాయనా..పొద్దుగూకిందే లేటు హోమువర్కులు,బుక్కులు మూలకు పడెయ్యా..ఓ సాప కింద పరవా.. సక్లముక్ల కూసోనూ.. ఏకంగా ఓ కార్టూన్ల ఫ్యాక్టరీనే తెరిచి పారేసా బాంచెత్..ఇగ కూసుంటె కార్టూను.. లేస్తె కార్టూను..
తెల్లారెగట్ల బస్తా లోడు కార్టూన్లు పోస్టాపీసుకు పయానం కట్టేయి..రెండు రోజులాగి ఆ బస్తా లోడు టంచనుగా మొగమాటాల్లేకుండా నాకు రిటన్ ముట్టేయి.
అట్లా రిటను వచ్చిన కార్టూన్లను ఇసుగూ ఇరామం లేకుండా భూదేవంత ఓర్పుతో పిట్టనారాయన తెచ్చిచ్చేవోడు..కనీసం "అయేంటయి?" అని అడిగేవోడుకాదు పాపం{బోన్గిరిలో వుండే మా సిన్నమామయితే లేని అడ్రస్సులతో ఉత్తరాలు తెగరాసి పిట్టనారాయన్ని ఏడిపించేవాడు పైగా ఉత్తరాలు టైముకు అందడంలేదని పిర్యాదులు...అది మరో కత}
బస్తాలు లోడు ఎల్లేవి.. బస్తాలు రిటను దిగేవి.. ఇదే యవ్వారం..పిట్టనారాయనకు నేను పెట్టినట్టు ఇంకెవ్వడూ పని పెట్టేవోడు కాదు మా ఊళ్ళో.
ఒసారి అడగనే అడిగిండు.."అయ్యన్ని ఏంది..కట్టలు కట్టలు..?"అని నేనేదో చెప్పా.."అట్లాగా..మరి దానికి ఏమన్నముట్టజెబుతారా?" అన్నాడు..మళ్ళీ ఏదో ఎడిచా.
అప్పట్లొ నా కతావస్తువు పోస్టుమ్యానే[ పిట్టనారాయనే] ఆయన అవస్థలు చూల్లేకపోయేటోన్ని..నేనేసిన అత్యధిక కార్టున్లు పోస్టుమ్యాను,కండక్టర్లమీదే,ఎక్కువగా ఈళ్ళమీదే ద్రుష్టి పెట్టేవోన్ని.. అయితే అవన్నీ వాళ్ళను ఎక్కిరిస్తున్నట్టె వుండేవి.
ఇట్లా కొన్నిరోజులు గడిచాక...
బస్తా కార్టూన్లు ఎళ్ళిపోయి మర్యాదగా అరబస్తా మాత్రమే రిటను వచ్చేయి..అచ్చుకావడానికి అలవాటు పడ్డాయి నా బొమ్మలు..ఆంధ్రప్రభలో కార్టూను పడితే 20 రూపాయలతో పాటు ఓ కాంప్లిమెంటరీ కాపీ పంపేవోళ్ళు.
తెల్లారి తొమ్మిదిన్నర పది దాటింది మొదలు ఇగ మాఇంటి అరుగుమీదే నా మకాం..తెల్లబట్టల్తో,చేతిలో ఉత్తరాలు,మనియార్డరు,వీక్లీలతో పిట్టనారాయన
వచ్చే దివ్యమంగళ ద్రుశ్యాలను చూడడానికి నా కళ్ళు నకనకలాడేయి..సోమారంమల్లయ్య ఇంటి ఎదురు సందునుంచి ఎప్పుడెప్పుడు ఇటువైపు తిరిగివస్తాడా అని తెగ సూసేటోన్ని..వీక్లీ మ్యాగజైను రవుండుగా రూలుకర్రమాదిరి చేతిలో పట్టుకుని వస్తుంటే ఆ రోజు నా పంటపండినట్టే.
"బాబూ!"అంటూ పిలిచేటొడు["బాబూ!" అన్నపిలుపు మీద ఎన్నికలలు కనుంటానో..??} ఆ పిలుపింటే నేను బాత్ రూంలోవున్నా,దేవునర్రలో వున్న ఇస్పీడుగా బయట వాలేవోన్ని..ఏంతెచ్చాడో..?ఏంతెచ్చాడో..? అని తెగ ఇదైపోయేటోన్ని..నా టెన్షన్ కనిపెట్టేవోడుగానీ,ఏమీ అడిగేవోడు కాదు..M.O వస్తే ఇక్కడ సంతకం పెట్టు అనేటోడు లేదంటే రూలుకర్ర ఇచ్చేవోడు..అదీకాదంటే బస్తాకు అరబస్తా రిటను ఇచ్చేవోడు..ఈ మూడు ఆప్షన్లుండేయి..
మా ఇంటి కిటికి దగ్గర నిలబడి"బాబూ!" అంటే చాలు ఈ మూడు ఆప్షన్లతో నా బేజాలో రసాయనక్రియ జరిగేది.. M.O లమీద సంతకాలు పెడుతుంటే మా నాయిన నా కంటపడకుండా నేను నెలకు ఎంత కమాయిస్తున్నానో తెల్వక కిందామీదా పడేటోడు.."అవునే..వున్నావే! ఈడెంత సంపాయిస్తున్నాడే?"అనడిగేవోడు వంటరూములోనికెళుతూ మా అమ్మ దగ్గరికి.."ఏమో నాకేం తెల్సు..నువ్వేంకట్టలుకడుతున్నావో..నీ కొడుకేం కట్టలుకడుతున్నాడో..ఎవ్వరి సంగతులేం తెల్వదు నాకు..నాకెమన్న తెచ్చెపట్కెనా?ఇచ్చె పట్కెనా నాకు తెల్వ.." అనేది మా అమ్మ.
ఒక్కోసారి పిట్టనారాయన హాలత్ బాలేకపోతే కార్డులు పంచే డ్యుటీ వాళ్ళకొడుకు హ్యండిల్ చేసేటోడు..వాళ్ళకొడుకు చేతిల్నుంచి వందా,రెండొందలు m.o తీసుకున్నా పిట్టనారాయన ఇస్తే కలిగే ఫీలింగు వుండేది కాదు..
దసరా,దీపావళి పండుగలకు మామూళ్ళలెక్కన పదో,పరకో ఇస్తే "వద్దు బాబూ..గవర్నమెంటు మాకు జీతాలు ఇస్తుంది" అనేవాడు..
పండుగమామూళ్ళ కోసం రచయితలను,కార్టూనిస్టులను పోస్టుమ్యాన్లు పీడించేటట్టు కార్టూన్లు ఏస్తే బరాబర్ బట్వాడా చేసే పిట్టనారాయన చచ్చిపోయాడని తెలిసి తెగ బాధ పడ్డా.
ఇప్పుడు మా ఊరెళితే మార్కండేయ గుడి ఎదురు సందులో ఉండే పోస్టాపీసు లేదు..పిట్టనారాయన లేడు..మా నాయిన లేడు... పోచంపల్లి వీదివీదిలో కనబడే పోస్టుడబ్బాలను చూస్తుంటే మాత్రం పిట్టనారాయాన విగ్రహాల్లాగే వుంటాయి..

ఇప్పుడైతే పూర్తిగా ఈ..మెయిళ్ళు వచ్చాక పోస్టాపీసునే మర్చిపోయా..
ఇప్పటికీ నా ఈ..మెయిల్ ఇన్ బాక్స్ క్లిక్ చేస్తున్నప్రతిసారీ నిజ్జంగా పిట్టనారాయనే గుర్తుకొస్తుంటాడు.

22, ఏప్రిల్ 2010, గురువారం

పుస్తకాలదినం

పుస్తకాలరోజున పుస్తకాలకు దినం పెట్టేయాలి.. ఇంట్లో పేరుకుపోయిన నానా చెత్త పుస్తకాలను అడ్డికిపావుషేరు లెక్కన బజార్లో అమ్మేసి వచ్చిన డబ్బులను కేబులోడికి కట్టి టి.వీ ఆన్ చేస్తే వచ్చే బోసినవ్వుల బుజ్జాయిల బుడిబుడి పలుకుల "నీ పుంజూ నా పెట్టను ముద్దాడుకోనీ..కొక్కొకో క్కో కొక్కోక్కో......" పాటల తాదాత్మ్యతను తరిస్తూజయజయద్వానాలతో మార్కులేస్తూ కళ్ళనుంచి ధారాళంగా కారే ఆనందబాష్పాలను కొన నాలుకతో చప్పరిస్తూ "పాఠాలు వద్దు,పాటలే ముద్దు.." అంటూ బాలగానగంధర్వుల జబ్బలు చరిచే జడ్జీల ద్రుశ్యాలను ఈరోజు చూసి తరించాలనుంది..!
[టాప్ సీక్రెట్:చెక్కుబుక్కుకు మించిన బుక్కు మరోటి లేదు, వేరే బుక్కులు సేకరించి అనోసరంగా బుక్కయిపోకండి.]

21, ఏప్రిల్ 2010, బుధవారం

జింకపిల్లల ఎంకటసామి తాత


ఎంకటసామి తాత మా నాయినకు అప్పయ్య[చిన్నాన్న] మా తాత తమ్ముడు.
పైసా పని చేతకాదు,మాటలమరాఠి,మంగళారతులు పాడడం, నడవడం,ఈతాకుల్తో జింకపిల్లల్ని అల్లడం హాబీ.
నడవడం తనకు ఎంతిస్టమంటే నడిచి ఎనకేసిన ఆర్టీసి టిక్కెట్ పైసల్తో ఏకంగా ఓ రైలింజన్ కొనాలనేంత !
తన నడకతో మా పరుగుపందెం..చూచువారలకు చూడముచ్చట...
మా తాతల ముత్తాతల తాతల జనన మరణాలు,పెళ్ళిల్లు,జతకాలు అన్నీ తన నాలుకమీదే...అసాధారణమైన ధారణ.
పంచెకట్టిన గూగుల్ సెర్చ్ కి పొడుగు కాళ్ళు తొడిగి ముందు రైలింజన్ అమర్చినట్టుంది మా తాత సూరత్.
హైటు అమితాబచ్చన్,మా నాయినమ్మ అనుమానం లేకుండా జయా బచ్చన్.
కొంతమంది ఇంటికి ఎవ్వరొచ్చినా పేరడుగుతారు లేదా "మీరు అలమండ రాజులా?ఏలూరు కాపులా?వైజాగ్ వడ్డేర్లా? కర్నూలు కోమట్లా..ఏమట్లు?? "..వగైరా అడుగుతుంటారు..కాని ఇక్కడ మా తాత కతే వేరు..
రెప్పలు ఎగరేస్తూ మొట్టమొదట "నీ హైటు ఎంతా?" అనడుగుతాడు..తెల్సిన వాళ్ళు చెబుతారు,,లేదంటే రెడీమేడ్ మెజర్మెంట్ ఎక్విప్ మెంట్ తో "జర ఇసుంట రా" అంటూ
గోడకు నిలబెట్టి తన కిందిపెదవిని పై పళ్ళతో నొక్కిపట్టి తలపై ఓ గీత గీసి నీకత గింతె అని తేల్చిపారేస్తాడు.
ఇంతవరకు మా తాత హైటును కొట్టినోడు మా కాందాన్ లో పుట్టలే.
కషాయానికి శొంఠి ఎంతవసరమో,కర్ణుడు లేని మహభారతం ఎంత టేస్టులెస్సో మా చిలువేరు వంశానికి మా తాత పాత్ర అంత బలిష్టం.
పోచంపల్లికి మూడు కిలోమీటర్ల ఆవల చుట్టూ మర్రి చెట్లు..మధ్యలో తాటిచెట్లు..పిల్లకాలువలు..ఒక చెరువు..అక్కడక్కడా మావిడి చెట్లు...
ఉగాది ముందు మా ఊళ్ళో చెట్లకిందికెళ్లడం అలవాటు[మెట్రోపాలిటన్ లో వనభోజనాలంటారు] మిట్టమధ్యాన్నం మర్రి చెట్టు నీడన చక్కటి కల్లు తాగి బహుచక్కటి నీసు ముక్కలు నమిలి ఆయన ఎగ్జిబిషన్ చూసి అవాక్కుకానివాళ్ళు అరుదు.
కింద గొంగలి పరిచి,ఓ కాలు చాపి మరో కాలు మడిచి కుసోని నాలుక చప్పరిస్తూ ఈతాకుల్ని మూరపొడువు,అంగుళం వెడల్పు లెక్కన చీరి
జింకపిల్లల్ని అల్లుతుంటే చూడాలి తన నిగ్రహం,విగ్రహం..
[త్వరలో "మేకింగ్ ఆఫ్ జింకపిల్లలు" మీ యూట్యూబ్ లో..తప్పక చూడండి]
ఇక మాఇంట్లో పెళ్లి కుదిరిందంటే చాలు తెల్లారె మా డిస్ట్రిబ్యూటర్ రెడీ..శుభలేఖలు పంచడానికి.. కాలినడకన ఫిల్మ్ సిటీ టూ హైటెక్ సిటీ..
తన సెన్సార్ హ్యూమర్ కు తట్టుకొని గెలిచినవాళ్ళను వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు.శ్లేషల్తో [pun]కొడితే శోష వచ్చి పడతారు..బాధితులకు పచ్చి వానాకాలంలో వడదెబ్బ సింప్టమ్స్..
ఫంక్షన్లో ఇక గొంతు సవరించి "శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ..సిత్రమై తోచునమ్మా...."అంటూ మంగళారతులు పాడితే నా సామిరంగా ఊరుఊరంతా జాతరే.
ఇంతవరకు బస్సెక్కడం ఎరగని మా తాతను చూడాలనుంటే ఒక్కసారి మిస్స్ డ్ కాలివ్వండి చాలు..తనే మిమ్మల్ని వెతుక్కుంటూ కొలనుప్యాకలో వున్నా,ఫలక్ నుమా ప్యాలస్ లో వున్నా కాలినడకన వచ్చివాల్తాడు.
పెట్రోల్ ఖర్చు లేని,ట్రాఫిక్ పోలీసుల ఫికర్లూ లేని మా తాత ప్రయాణం చూస్తూంటే ఒకింత జెలసీ..ఇంకొకింత గర్వము...
రాంనగర్,పార్శీగుట్ట సందుల్లో అడ్డపంచెతో చేతిలో ఓ సంచితో ఇప్పటికీ కుంటుకుంటూ నడుస్తూ వెళ్ళే మా తాత పాద ముద్దరలో భూమాత పులకరింత కనిపిస్తొంది..
[మా తాతల ముత్తాతల తాతల తరాలను[18 వ శతాబ్ధం] తను చెబుతుంటే నే రాసిపెట్టాను..పై మ్యాపులో ఎర్ర మార్కు ఉన్నచోట నేనున్నాను.]
[దీనికి "రీడర్స్ డైజస్ట్" బోనస్ కత ప్రేరణ]

18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఓ సండే సాయంత్రం
ఈవిడ పైరేన బెస్సోన్..ఊరు చీలీ.
ఇంట్లో సండే సాయంకాలం మొదలెట్టిన స్కెచ్చు పూర్తయ్యాక టైం చూస్తే అర్ధరాత్రి 12:48 అయ్యింది.
నీతి: రాత్రిళ్లు నిద్రలేకుండా పంజేయడంవల్ల "లో బీపీ" తో పాటు అప్పుడప్పుడూ బొమ్మలుకూడా వచ్చును.


17, ఏప్రిల్ 2010, శనివారం

షాపులు...షేపులు


పోటోషాపులో బొమ్మలేసేవాళ్ళను పాన్ షాపు ఓనర్లలా చూస్తారు కంట్రీజనం.
ఏదిఏమైనా పేపర్ మీది గీతలు అజరామరం..దీన్ని కాదని ఖండించే వాడిది ఎక్సర్ సైజు బాడీ అయినా వాడి మూలుగ తీయాల్సిందే.
గీతకు కొంచెం సాంకేతికత తోడయితే పోయేదేముంది..?పోనిదేముంది..??
చేతిలో చెక్కపెన్సిలా?డిజిటల్ పెన్నా..అనవసరంగా అనోసరం..
స్కెచ్ మాష్టర్లు జాసన్ సైలర్,డామ్నిక్ ఫిల్బర్ట్,జాన్ ఒప్డేబీక్,నికో డి మిట్టా,డామియన్,మేరియన్,రస్కుక్..ఎట్ సెట్రాలకు లేని మొగమాటాలు మనకేటో ??
గుడ్డిదీపాల్లో మనం వెలిగిస్తున్న "చిత్రకల"కు అప్పుడప్పుడూ మనకు అందుబాటులో ఉన్న కరెంటును వాడడంలో తప్పేంవున్నది..?పైగా మన బొమ్మ పాడవకుండా మిగిలిపోయిందేటి??
చివరికి రంగస్తల కళాకారులతో జేమ్స్ కేమరూను మోషన్ కాప్చర్ కూడా వాడుతున్నాడు.
ఎవ్వడి షాపులు వాడివే..ఎవ్వడి షేపులు వాడివే అనుకుంటే ఏ గొడవాలేదు.

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

అనగనగా ఒక రాజు...

రెండేళ్ళనాటి ట్రంకు పెట్టె దులుపుతుండగా రెండు సాలెపురుగులు,కొన్ని నల్లచీమల్తో పాటు "జిహాద్"లో వున్న శ్రీ రాజు గారు బయటపడ్డాడు..
కుప్పకూలుతున్న సత్యం హయాంలో ఓ జెంటిల్మేను కోసం అప్పటికప్పుడు గీసిన కార్టూన్ ఇది..
ఇప్పుడిది అప్రస్తుతమని తెలిసికూడా పోస్టు చేయక తప్పేట్టులేదు మరి...

బుగ్గసొట్టలు

సెంద్రబాబు గడ్డం..కే.సి.ఆర్ ముక్కు..రోశయ్య బట్టతల..చిరు బొర్రతో లైపులో కైపు లేకుండా పోతున్నదశలో కరీనా బుగ్గలు తగిలాయి...
సొట్టబుగ్గల కోసం కరీనా ఆపరేషను..దానిపై యానిమేషను..దాంతాలూకు ఫ్రేములు....


భద్రం కొడుకో!
పూర్వాశ్రమంలో నే గీసిన ఈ కార్టూన్లు రిజెక్ట్ అయ్యి నా సొంతాశ్రమంలో తలదాచుకోగా తీసి రంగులద్ది బ్లాగులో భద్రపరుద్దామని....!

15, ఏప్రిల్ 2010, గురువారం

సుజల నయనం

జయదేవ్ కార్టూన్ల బుక్కేస్తే నేను పంజేసే డైలీ పేపర్లో అన్ నెసెసర్లీ సీరియస్లీ భయపడుతూ,భయపడుతూ రివ్యూ ఒహటి వెలగబెట్టా.
ఈ విషయం ఓ నాట్ బ్యాడ్ గుడ్ ఫ్రైడే రోజు మోహన్ సార్ ముందు మోకరిల్లి చెబితే,
"అరెరెరెరె..అవునాబ్బా..నువ్వురచనలు కూడా చేస్తున్నావా?ప్రపంచంలో వింతవింత సంఘటనలు జరుగుతున్నాయబ్బా.."అన్నాడు తన సోకాల్డ్ అర్థనిమీలిత నేత్రాలతో...

ఉప్పూకారం దట్టంగా పులుముకున్న నా కసి నాలుగేళ్ల తర్వాత ఊరగాయజాడి నుంచి బ్లోఅవుట్ అయింది..
ఇప్పుడు ఈ బ్లాగ్ చూపెట్టి తన అరమోడ్ఫు కళ్లల్లో మెరుపు చూడాలనుంది నా సుజలనయనాలతో.....


ఒకాయన

మా ఊళ్లో "ఒకాయన"కు[పేరు మార్చబడినది] పెళ్లీడొచ్చింది..పెళ్లిసూపులు...
అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు,ఆమె తండ్రి కూడా సక్కదనంతో తొణికిసలాడాలి..మామగారి ముఖం చూస్తే మతి పోగొట్టేట్టుండాలి..ఇదీ "ఒకాయన" కండిషను.ఫస్టునైట్ కు మామగారు నాట్ ఎలౌడ్ అన్నా విన్లే.
అద్దకిల పౌడరు ముఖానికి రాసి ..పెళ్లిసూపుల డ్యూటీకి బయల్దేరేవాడు...
పెళ్లిసూపులు___ కుండెడు వడియాలు కూసుండి మెక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అటుకులు గటుక్కున మింగడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అడ్డెడు శనిగలను ఆగమాగం బుక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ గంపెడు గారెలు గరగర నమలడం..బయటపడడం..
సూస్తా,సూస్తా వందకి పైగా పెళ్లిసూపులు..బ్రేవ్ లు.. కాని నో కాంప్రమైజు..
కొసకు ఓ అందమైన పిల్లకు జనమ నిచ్చిన హ్యండ్సమ్ జనకుడు దొరికాడు..
ఇంకేం, అంగరంగ వైభవంగా విస్తరాకులు,టెంటు,భాజాభజంత్రీలు,"ఒకాయన", బోయినం....
.................... .............
ఓ పదేళ్లు తిరక్కుండానే ఆ "ఒకాయన" బార్య చచ్చిపోయింది.
సూరీడు పడమటి కొండల్లో ఇంకిపోతుండగా దహనసంస్కారాలు..
లాంగ్ షాట్ "సిల్ హౌట్" లో మామగారి పక్కనే "ఒకాయన" .

14, ఏప్రిల్ 2010, బుధవారం

గంధము పూయరుగా..

ఊరూరా తిరుగుతూ..,జగన్ జనాలకు గంధం పూస్తూ..వీపులు రాస్తూ..
"నాన్న బాటలోనే నడుస్తా !"
"నడిస్తే నడిచావ్ గాని, అటేపు ఎగరకు నాయనా!" తిరిగి ఆయనకు గంధం పూస్తూ గంధం ముఖంతో నుదిటిమీద పేద్దబొట్టుతో ఓ ఊరావిడ.

13, ఏప్రిల్ 2010, మంగళవారం

పులిరాజు


ఓ పెద్దాయన పోన్ చేసి "ఏమోయ్..మృత్యుంజయం..నీకు ఎయిడ్స్ వచ్చిందటగా..అదేలేవోయ్ ఎయిడ్స్ కార్టూన్ పోటీలో ప్రైజ్ వచ్చిందటగా..పదివేలంటగా..
మీ యావిడకు నగా,నట్రా గట్రానా??మరి మనకేమైనా గట్రాలు గట్రా ఉన్నాయా??"
ఇది సత్యం రామలింగరాజు రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య 1800 లకు చేరకమునుపు..

ఎందుకే రవణమ్మ..పెళ్ళెందుకే రవణమ్మ

రోజు రోజుకీ ముఖాలకి,తలరాతలకి బొత్తిగా సమ్మందం లేకుండా పోతోంది..బ్రమ్మ దేవుడి హ్యండ్ రైటింగ్ బాలేదు..ఇంప్రూవ్ చేసుకోవాలి.
అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్,వ్యాకరణ దోషాలు,ముద్రా"రాక్షసాలు".కమ్ ధమాఖ్ వర్సెస్ మూడు బుర్రలు....ఫాంట్ మార్చాలి..!
సరస్వతి దేవి ఇంటిపని పూర్తి కాగానే టీ.వీ లో వంటలప్రోగ్రాంలు అవీ చూడకుండా బ్రమ్మకు హోంవర్క్ చేసిపెట్టాలి..ట్యూషన్లు తీసుకుంటే
మరీ మంచిది..గోడకుర్చీ అయినా పర్వలే..
పిల్లల పంచాయితి ఉరుము ఉరుమి పెద్దలు జుట్టు పీక్కొని విగ్గులు ధరించి అశ్విన్ హేరాయిల్ వాడేవరకెళ్తుంది.ఇంటి పక్కవాళ్ళనుంచి వినోదప్పన్ను వసూల్ చేసి ఓ అందమైన అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాలని నా టార్గెట్.
బరహ సాఫ్ట్ వేర్ లో నేను...ఆల్గడ్డలు కోస్తూ మా యావిడ...ఎస్ మీద ఒ పెడితే "కి" అని చదివే మా బుడ్డోడు "ఎందుకే రవణమ్మ..పెళ్ళెందుకే రవణమ్మ..."

12, ఏప్రిల్ 2010, సోమవారం

స్కిన్ లెస్ మటన్..బూర్ లెస్ చికెన్..!జాసన్ స్యిలర్ అని చికాకు పెట్టే చికాగో ఆర్టూనిస్ట్.
సబ్వే నుంచి వాళ్ళావిడ తెచ్చే శాండ్ విచ్ ఎడమ చేత్తో తింటూ కుడిచేత్తో వాడు గీసే బొమ్మలు చూసి "ఒరే! నీ బుగ్గలు కోసి ఈ మెయిల్లో పంపిస్తే కొరికి తిరిగి కొరియల్ లో పంపిస్తారా అన్నా వినకుండా హౌజ్ ఫుల్ బోర్డ్ తగిలిస్తే, లేని బ్లాక్ మనీ ఇచ్చి బ్లాక్ లో కొంటానన్నా లెక్కచేయకుండా బ్లాక్ చేసేసాడు.
వాడు గీసిన వాళ్ళావిడ ఎడమ జబ్బా మీద డ్రాగన్ బొమ్మ చూడని వాడు మనిషి రూపంలో వున్న పశువే కాదని నా ధ్రుడ సదాభిప్రాయం.
మరి వాడి సైట్ అడిగితె చెప్పమరి..ఎళ్ళీ గూగులమ్మని అడిగి తెలుసుకొని చూసి డిప్రెస్ అయిపోయి ఆనందించండి.
లేదంటె..ఎప్పట్లాగే...టెన్ టు సిక్స్..,ఒన్ బై టూ ఛాయ్..,పి.ఎఫ్..,హోమ్ లోన్, సండే స్కిన్ లెస్ మటన్..,బూర్ లెస్ చికెన్..!

8, ఏప్రిల్ 2010, గురువారం

ఒక దెయ్యం ఆత్మకథదాసరి నారాయణ్రావ్ పేపర్ పెట్టేటట్టున్నాడు..ఓ సారి ట్రై చేయరాదంది మా అమ్మ...సరేనని చేస్తే మూడు రోజుల తర్వాత పిట్ట నారాయణ[మా ఊరి పోస్ట్ మ్యాను]మూడు గ్రాముల టెలిగ్రాము ఒకటి తెచ్చాడు..దాసరి హౌజాఫ్ పబ్లికేషన్ [బొబ్బిలి పులి వీక్లీ]
అనుంది..కింద ఎడిటర్ పతంజలి ..దాన్ని టెలిగ్రాము అంటారని సైన్ చేస్తే తప్ప ఇవ్వరని ఈ పసి,పాశి మనసుకు తెలియదు..అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!
దాన్ని పట్టుకుని సరాసరి పంజగుట్టా దళసరి బొబ్బిలి పులి ఆపీసుకెళ్ళా.అక్కడ నా పక్కన ఇంకోడు సన్నగా అచ్చు నా కజిన్ తమ్ముడికి అన్నలా ఉన్నాడు. నా పోటి కంటెస్టాంట్ అన్నమాట..కార్టూనిస్టు పోస్టు కై ఇంటర్వ్యూ కోసమని వచ్చాడు..నన్ను ఆందోళనగా సూస్తున్నాడు..పేరడిగితే చెప్పాను..వాడి పేరు సురేష్ అని అడక్కున్నా చెప్పాడు. .వాణ్ణి పిలిచారు లోపలికి ఏదడిగినా "బయట మా వాడున్నాడు..వాన్నడగండి.. వాడికివ్వండి ఉజ్జోగం.."ఇదీ వాడి వరస..అడిగింది పతంజలి గారు,చెప్పింది సురేష్ గాడు..వీడికి గమ్యం సినిమా దర్షకుడు "క్రిష్" దోస్తు,సింగర్ సునీతతో ప్లాష్ బ్యాక్ లో గుంటూర్ లో గోలీకాయలు ఆడిన అనుభవం. ఇంతకు మించి వీడికి వేరే స్పెషాలిటీలు ఉన్నట్టు నాకు తెలియదు.అప్పట్లో వీడికి బొమ్మలు గీయడం రావు కాని,అభిమానం..మనిషి మంచోడు..వయస్సు పందొమ్మిది సమ్మచ్చారాలు.
తర్వాత నా వంతు.. నేను లోపలికెళ్ళే సరికి పొడవైన బెండు ముక్కు,షార్ప్ చూపు,సన్నటి పెదాలు..ఈజీగా క్యారికేచర్ గీయగల ముఖంతో పతంజలి గారు..పతంజలి గారి గురుంచి నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోవడంతో ఇంటర్వ్యూ పెద్ద కష్టంగా తోచలేదు.

పతంజలి సారుకు సురేష్ హైటూ,టేస్టు నచ్చి శాపవిమోచనం కలిగించి నాతోపాటూ వాడికీ ఉజ్జోగం ఇచ్చాడు..అయితే ఒక కండిషను,ఆఫీసు స్టాఫ్ కు ఎవడి కుర్ఛీ,బల్ల వాడిదే గానీ మాకు మాత్రం ఒకే బల్ల,రెండు కుర్చీలు..ఇదీ సారు కాన్సెప్టు.
మేం పోరగాల్లం అని అలా అరేంజ్ చేసారా? అలా అరేంజ్ అయ్యి అడ్జెస్ట్ అయ్యిందా అరేంజ్ కాని అయోమయం..
అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!..వీడికి పందొమ్మిది సమ్మచ్చారాలు...

మోహన్ బొమ్మ కాంచినా మోక్షం లభించును అన్న పొజిషన్ లో ఉన్న మాకు ఏకంగా మోహనే వచ్చి పోతూంటే మా ఎమోషన్ కంపొజిషన్ లేఅవుట్ చెదిరిపోయేది.సురేంద్ర,రాజు,తల్లావఝల శివాజి,జి.వి.రమణా ...ఇట్లా మెగాస్టార్లంతా[మెగా స్టార్ అప్పట్లో పాపులరే..ఇప్పట్లా కాదు}క్యూ పద్దతిన వచ్చేవాళ్ళు.
మరి మా పోస్టులేంటో అర్తం కాకపోతుండె..ఏముద్దరిద్దామని మమ్ములను తీసుకున్నాడో..అసలు మమ్మల్ని ఏం చేసుకుందామనుకున్నాడొ తెలీదు..ఆ సీక్రెట్ ఎప్పటికైనా సార్ చే కాకా పట్టైనా కక్కించాలనుకున్నాం..
అంతా అర్తంకాని అట్మాస్పియర్.
సంజయ్ దత్ జుత్తును జూలు మాదిరి గీసి గుర్రంలా వేశా..ఓ జీబ్రా ఇంకో జీబ్రా తో "దూరం వెళ్ళు,నీకో రహస్యం చెబుతా" అంటూంది.దూరం వెళ్ళిన జీబ్రాల తలలు దగ్గరవుతాయని ఇక్కడ కవి భావన....ఈ రెండు కార్టూన్లు సారు నన్ను ప్రేమించడానికి,
నాకు రెండున్నరేళ్ళు బోయినం,మాంసం పెట్టడానికి కారణమయ్యాయి..

ఆంధ్రా టాకీస్ నుంచి క్రిష్నవంశీ ఫోన్లు చేస్తుండేవాడు సింధూరం సినిమా కోసమని..భోగాది వెంకటరాయుడేమో సారుకు ఎడమవైపు కూసొని కుడిభుజంలా ఉండేవాడు..ఆయన దేవుడయితే ఈయన పూజారన్నమాట..
నేను ఏది గీస్తె అది అచ్చయిపోయేది,రిజక్టు చేస్తే మా ఊరి నుంచి మా అమ్మ,నాయినలను పట్టుకొస్తాననుకొనేవాడేమో????
సురేశ్ ఏది గీసినా,గీయకున్నా సారు చెత్తబుట్టలో వేసేవాడు ..ఇట్లా కాదని సురేశ్ గాడు సారుకు కార్టూన్లిచ్చి చెత్తబుట్ట లాగి వెనక దాచేసుకున్నట్టు,సారు చెత్తబుట్ట కనబడక ఖంగు తిన్నట్టు ఓ కార్టూన్ గీసా.. సారు పడీ పడీ నవ్వి ఆఫీసుకు ఎవ్వడొచ్చినా చూపెట్టి మమ్మల్ని పరిచయం చేసేవాడు..వాళ్ళెమో మమ్మల్ని అక్భర్_భీర్భల్ అనేవాళ్ళు..ఆకాన్నుంచి సురేశ్ గాడిని "వాట్ మిష్టర్ డస్ట్ బిన్?" అనే వాడు.
బొబ్బిలిపులి లో నేను పత్రిక కోసం వేసిన కార్టూన్లకంటే సారు మీదేసిన కార్టూన్లే ఎక్కువ..అంతా పిల్లలాట లాగుండేది..పైగా సారు అలాగే ఉండాలనే వాడు..భోగాది వెంకటరాయుడు గారి పంచ్ లే పంచ్ లు ..
ఈలోపు ఒసే రాములమ్మ సూపర్ డూపరు హిట్టుకావడం,దాసరి జోష్ మీద రాణిగంజ్ లో రెండుకోట్లుపెట్టి ఓ అపార్టుమెంటుకొని కంప్యూటర్లు,బల్లలతో పాటు మమ్మల్నీ అక్కడికి బదలాయించడం జరిగిపోయింది.

అక్కడ హాలంతా టాల్ స్టాయ్,దాస్తోవ్ విస్కి,మపాసా,ఆస్కార్ వైల్డ్,చెఖొవ్,మార్క్యుజ్,కొకు.గురజాడ,రావిశాస్త్రి శాభ్ధాలతో రీ సౌండ్ వచ్చేది..
ఆ పేర్లు వింటూంటే తను చేసే ఆయుర్వేదం తాలూకు జుమ్మెరాత్ బజార్లో దొరికే వనమూలికలేమో అనుకునేవాణ్ణి.
కార్టూన్లు గీసి పక్కనపెడితే తనే స్కానింగ్ కు తీసుకెళ్ళేవాడు..లంచ్ టైంలో టెర్రస్ పై భోంచేస్తూంటే వచ్చి సిగరెట్ పీల్చి పొగొదులుతూ "ఏంతింటున్నారేటీ ?ఏం నంజుకుంటున్నారేటీ? అనడిగేవాడు..ఓసినీ ఎడిటరు అంటే ఇంతేనా? ఈజీ అనుకునేవోన్ని మనుసులో.. ఓసారి సారు ఎంటరవుతుండగా ఆర్టీస్టు జీ.వి.రమణ బాత్ రూముకు వెళ్ళడం గమనించి రమణకు నేనంటే ఇది అంటూ తన చిటికెనవేలు చూపించాడు.కార్టూన్లు గీసి చూపెడితే నీకు,నాకు అర్థమైతే కుదరదండీ,అందరూ మనలామేధావులు వుండరుకదా..జనాలకు అర్థంకావాలి అనేవాడు ముక్కుపైపడ్డ కళ్ళజోడు పైనుంచి చూస్తూ..

పచ్చడి చేసేట్టు ఎడిటోరియళ్లు రాస్తూ,పచ్చళ్ళ యాపారం ఏంటొ అర్ధం అయ్యీ కాకుండా ఉండేది.
ఎక్కువగా కుక్కల్లాంటి మనుషులమీద కథలు రాసేవాడు..వాటికి మా తమ్ముడు దత్తాత్రేయ చేత బొమ్మలేయించే వాడు..క్యారికేచర్లంటె మా ప్రాణం..

సారు రాసిన బుక్సు చదివి సారు అర్ధం అవుతుండగా ..సారుకు చాలా దూరం ఆయిపోయాను...గౌరవంతో కూడిన భయం వల్ల ఏర్పడ్డ బిడియంతో కలవబుద్ది కాకపోయేది..ఎంత భయం అంటే సారు ఎళ్ళి పోయె టైంకు నేను ఎంటరయ్యేట్టు షిఫ్ట్ మార్చుకునేంత.
తను కనిపెట్టిన గ్లోయల్ ఫేస్ ఆయిల్,గ్రోయల్ హెయిర్ ఆయిల్ లకు లోగోలు,బొమ్మలు వేసి పెట్టేవాడిని..భగీరదుడు తపస్సు చేస్తుండగా శివుడి జటాజుటం నుంచి గంగకు బదులు గ్రోయల్ హెయిర్ ఆయిల్ వస్తున్నట్టు,బ్యాక్ గ్రౌండ్ లో బాపు "సీతా కళ్యాణం"లోని ఉప్పొంగె, ఉప్పొంగె గంగా..అనే పాట వాడి యానిమేషన్ చేయించి టీవీలకు యాడ్ లు ఇస్తే హెయిర్ ఆయిల్ బిజినెస్ లో వచ్చే లాభాలతో దళసరి నారాయణ్రావ్ ని వదిలేసి మనమే సొంతంగా ఓ డయిలీ పేపర్ మొదలెడదాం అని సలహాలు ఇచ్చేవరకు ఎల్లాయి నా తెలివితేటలు.
పతంజలిసారు తన రచనలకు బొమ్మలుగీయమని స్క్రిప్టుకాయితాలిచ్చి దూరంగా రగస్యంగా నన్ను కనిపెట్టేవోడు..నా ఎక్సుప్రెషన్స్ ని బట్టి తన రచనలోని వ్యంగ్యం అంచనావేసుకునేవాడు..ముష్టి ఇరవై ఒక్కసంవత్సరాల ఈ అజ్నాపు కుర్రకుంకకు అంతటి విలువెందుకో అర్థంకాక జుట్టుపీక్కొని గ్రోయల్ హెయిర్ ఆయిల్ మర్థన చేసుకున్నా సస్పెన్స్ గానే వుండింది.
ఇట్లా రకరకాల జ్నాపకాలు..
దెబ్బకు ఆ వీక్లీ దుకాణం మూత పడ్డాక నేను ఆంధ్రభూమి లో జొరబడ్డాక.....కొన్నాళ్ళకు...
ప్రెస్ క్లబ్ లో కదీర్ బాబు పోలేరమ్మబండ కతల ఆవిష్కరణ కు పతంజలి సారు వచ్చాడని తెలిసి అట్కాయించా..."కొడుకు పుట్టాడట గదా నా తరపున కార్టూన్ అని పేరు పెట్టండని అన్నాడు..తర్వాత ఆర్టిస్టూ నివాస్ పెళ్ళికి శుభలేక ఇవ్వడం కోసం ఓ సారి ఆంధ్రపభ లో కలిశా..ఓ సాయం కోసం TV9 లో కలిస్తే సాయం చేసి పంపాడు.
ఇందిరాపార్క్ మోహన్ సార్ ఫ్లాట్ లొ ఉండగా ఓ ఫ్రెండ్ తో వచ్చాడు అప్పుడు ఏదో టి.వీ లకు సీరియళ్ళు రాస్తున్నట్టు తెలిసింది,,,ఆ జీబ్రాల కార్టూన్ చెప్పి "విద్వత్తున్న కార్టూనిస్టు" అని తన ఫ్రెండ్ కు పరిచయం చేసాడు.
ఇంకోసారెప్పుడొ మా నాయిన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అగ్గిపెట్టెలో పట్టె చీరె నేస్తాడండి అని ఎవరో చెబితే "అగ్గిపెట్టెలో చీరెలు గట్రా పెట్టొద్దండీ..అసెంబ్లీ ని పెట్టమనండి"అన్నాడు..

ఇంట్లోకి వెచ్చాలు,వెల్లుల్లి తెస్తూ పిల్లలకు టీవీలో టాం అండ్ జెర్రీ చూపిస్తూ,అక్శయతృతీయకు కెంపులహారం కొనమని మా ఆవిడ ఫత్వాలకు తలొంచి కుటుంబరావుగా మారిన తర్వాత పతంజలిసారుకు మళ్ళీ ఫోన్లు చేసిన పాపాన పోలె...కలిసిన పాపాన పోలె...ఓ సారి కార్మెల్ పాయింట్లో కార్పెంటర్ వర్క్ నడుస్తున్నప్పుడు కలిసా...అదే లాస్టు.
2009 మార్చిలో టీ.వీ లో సార్ ని చూసినపుడు భయం వేసింది.. భయంతో కూడిన ఏడుపు వచ్చింది..మృత్యువు బతికున్నప్పుడే మనిషిని అంతగా నామరూపాల్లేకుండా చేసేస్తుందా అని.నేను భయపడిన,జడుసుకున్న,మానసికంగా కకావికలైపోయిన సందర్భం అది.ఇలా రాస్తున్నప్పుడు కూడా నా గుండె దడ దడా కొట్టుకుంటున్నది.[ఇంకొన్ని అనుభవాలు కింది పోస్టుల్లో..]

పతంజలి సారు పుస్తకంలోని నా పేజి ఇంతటితో సమాప్తం..సంపూర్ణం.!!


ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, మళ్ళీ పతంజలి సారు మాటే నా మాట.
Some write to please the god and some to please the king,while some write to please the society and I write to please the worlds within me.

7, ఏప్రిల్ 2010, బుధవారం

ఇంట్రోస్పెక్షన్

బొమ్మ గీస్తే ఎదుటోడి ఇగో అవుట్ బరస్ట్ కావాలె..బొమ్మ పుట్టాలి గురూ..!
నీ పక్షవాతపు బొమ్మలు,నీ సదువూ,నీ పిండాకూడూ,అట్లాగే నీ దేబ్యమొఖమూనూ...
పెన్సిల్ పట్టే తరీఖ మార్చు..గుండేలోతుల్లో బ్రష్శు ముంచి గీయి..
చాతకాకపోతె వదిలేసి వట్టిచాపల బేరం చేసుకో..అంతేగాని,
నంజి నఖరాల్ చేస్తే పెన్సిల్ ఇరగ్గొడ్తా కొడఖా.!
డిస్ క్లైమర్:ఇంట్రాస్పెక్షన్ అనగా అంతర్మథనం [ఆంగ్ల సౌండ్ బాందని వాడా..] ఇది ఎవ్వరినీ నొప్పించే ప్రయత్నం కాదు..సొంత నొప్పి కోసమే..
ఎవరి నొప్పిని వాళ్ళె గిల్లి నొచ్చుకోవాలని మనవి...బయట నాకు వేరే పన్లున్నాయ్...!

ఎలుకపైన ఊరేగి..పై బొమ్మ మా ఇస్కూల్ హింది పండిట్ కం డ్రాయింగ్ టీచర్ కాళిదాస్ రావ్ సార్ ది.గీసింది మా తమ్ముడు దత్తు.
సారు బొమ్మ గీయని జనమ ఉంటేనేం ఊడితేనేం అని బాధ పడుతుంటే సూల్లేక ప్రింటింగ్ కు పోన్ చేసి పోస్ట్ పోన్ చేయమన్న .. ప్రియశిష్యుడు గీయని సారు ప్రింటింగ్ కు ఎట్లెళ్తడు?
సారు ఇస్కూళ్ళో బోర్డు మీద బొమ్మ దించుతుంటె సూడాలే..ఆ విగ్రహం,ఆ పోజు,ఆ కత,ఆ గీతలూ....ఉత్త గీతలే కాదు,వంటి మీద పోరగాల్లకు వాతలు కూడా..సుద్ద మొద్దు దద్దమ్మల్ని వంగబెట్టి దడ దడ దంచుతుంటె సామిరంగా ఆ రోజు హోళీ పండగేమో అనిపించేది, ముఖమంతా బుక్కగులాల్ జల్లుకున్నట్టు ఎర్రగా..అంత కోపం మరీ.
ఆంధ్రా అమితాబ్బచ్చన్ లెక్క ,సారంటె పోచంపల్లి బాపు మోహన్.
పొట్టిగా,బొర్రతో,వేగంగా నడూస్తుంటే అమీన్సాబ్లు సైతం సలాంలు కొట్టెవాళ్ళు..హవా అట్టాంటిది మరి..నార్త్ ఇండియన్,హిందీ తెల్గు మిక్స్ చేసి మాట్లాడెవాడు.
ఇనాయకుడి బొమ్మలు గీయడం వల్ల,చేయడం వల్ల సారు కూడా ఇనాయకుడి మాదిరి మారిపోయాడేమో అనిపింఛేది.
ఇనాయకుడి బొమ్మలు చేయడంలో సారును కాదని ఇంతవరకు మా ఊళ్ళొ రొమ్ము ఇరుచుకొని వచ్చిన కేతిగాళ్ళు నాకు తెలిసి లేరు.
ఇనాయకుడి బొమ్మల్ని ఆనిమేషన్ చేసేవాడు,అంటే తొండంలో,చేతుళ్ళొ స్ప్రింగులు పెట్టి మట్టితో కప్పెట్టి బొమ్మ పూర్తి చేసోటోడు..ఒక్కసారి చేయి ఎనక్కి లాగి వదిల్తే నవరాత్రులు అయిపోయొ వరకు దేవుడు చేయి వెనక్కి,ముందుకి దీవిస్తూనే వుండేవాడు..అట్లాగే తల,తొండం..తోపుడు బండి మీద ఆ ఇగ్రహాన్ని పెట్టి ఊరు ఊరంతా తిప్పేవోడు..చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు.."ఎలుక పైన ఊరేగి ఎల్లలోకమును తిరిగి.."అంటూ ఎస్.జానకి ప్లే బ్యాక్ సింగింగు...
సారుకు మా నాయినకు మంఛి దోస్తానా..నాగార్జున సిమెంటు,భారతీ సిమెంటంత స్ట్రాంగు..
కౌసు[నీసు]ముట్టడు సారు,కౌసు లేంది ముట్టడు మా నాయిన....అయినా దోస్తానా దోస్తానె..కళకు కౌసు అనోసరం మరి.
సారు ఎకాఎకిన గుండె పోటొచ్చి చచ్చిపోయాడు..
సార్ ని లేపి తీసుకెళ్తూంటే చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు..