21, ఏప్రిల్ 2010, బుధవారం

జింకపిల్లల ఎంకటసామి తాత


ఎంకటసామి తాత మా నాయినకు అప్పయ్య[చిన్నాన్న] మా తాత తమ్ముడు.
పైసా పని చేతకాదు,మాటలమరాఠి,మంగళారతులు పాడడం, నడవడం,ఈతాకుల్తో జింకపిల్లల్ని అల్లడం హాబీ.
నడవడం తనకు ఎంతిస్టమంటే నడిచి ఎనకేసిన ఆర్టీసి టిక్కెట్ పైసల్తో ఏకంగా ఓ రైలింజన్ కొనాలనేంత !
తన నడకతో మా పరుగుపందెం..చూచువారలకు చూడముచ్చట...
మా తాతల ముత్తాతల తాతల జనన మరణాలు,పెళ్ళిల్లు,జతకాలు అన్నీ తన నాలుకమీదే...అసాధారణమైన ధారణ.
పంచెకట్టిన గూగుల్ సెర్చ్ కి పొడుగు కాళ్ళు తొడిగి ముందు రైలింజన్ అమర్చినట్టుంది మా తాత సూరత్.
హైటు అమితాబచ్చన్,మా నాయినమ్మ అనుమానం లేకుండా జయా బచ్చన్.
కొంతమంది ఇంటికి ఎవ్వరొచ్చినా పేరడుగుతారు లేదా "మీరు అలమండ రాజులా?ఏలూరు కాపులా?వైజాగ్ వడ్డేర్లా? కర్నూలు కోమట్లా..ఏమట్లు?? "..వగైరా అడుగుతుంటారు..కాని ఇక్కడ మా తాత కతే వేరు..
రెప్పలు ఎగరేస్తూ మొట్టమొదట "నీ హైటు ఎంతా?" అనడుగుతాడు..తెల్సిన వాళ్ళు చెబుతారు,,లేదంటే రెడీమేడ్ మెజర్మెంట్ ఎక్విప్ మెంట్ తో "జర ఇసుంట రా" అంటూ
గోడకు నిలబెట్టి తన కిందిపెదవిని పై పళ్ళతో నొక్కిపట్టి తలపై ఓ గీత గీసి నీకత గింతె అని తేల్చిపారేస్తాడు.
ఇంతవరకు మా తాత హైటును కొట్టినోడు మా కాందాన్ లో పుట్టలే.
కషాయానికి శొంఠి ఎంతవసరమో,కర్ణుడు లేని మహభారతం ఎంత టేస్టులెస్సో మా చిలువేరు వంశానికి మా తాత పాత్ర అంత బలిష్టం.
పోచంపల్లికి మూడు కిలోమీటర్ల ఆవల చుట్టూ మర్రి చెట్లు..మధ్యలో తాటిచెట్లు..పిల్లకాలువలు..ఒక చెరువు..అక్కడక్కడా మావిడి చెట్లు...
ఉగాది ముందు మా ఊళ్ళో చెట్లకిందికెళ్లడం అలవాటు[మెట్రోపాలిటన్ లో వనభోజనాలంటారు] మిట్టమధ్యాన్నం మర్రి చెట్టు నీడన చక్కటి కల్లు తాగి బహుచక్కటి నీసు ముక్కలు నమిలి ఆయన ఎగ్జిబిషన్ చూసి అవాక్కుకానివాళ్ళు అరుదు.
కింద గొంగలి పరిచి,ఓ కాలు చాపి మరో కాలు మడిచి కుసోని నాలుక చప్పరిస్తూ ఈతాకుల్ని మూరపొడువు,అంగుళం వెడల్పు లెక్కన చీరి
జింకపిల్లల్ని అల్లుతుంటే చూడాలి తన నిగ్రహం,విగ్రహం..
[త్వరలో "మేకింగ్ ఆఫ్ జింకపిల్లలు" మీ యూట్యూబ్ లో..తప్పక చూడండి]
ఇక మాఇంట్లో పెళ్లి కుదిరిందంటే చాలు తెల్లారె మా డిస్ట్రిబ్యూటర్ రెడీ..శుభలేఖలు పంచడానికి.. కాలినడకన ఫిల్మ్ సిటీ టూ హైటెక్ సిటీ..
తన సెన్సార్ హ్యూమర్ కు తట్టుకొని గెలిచినవాళ్ళను వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు.శ్లేషల్తో [pun]కొడితే శోష వచ్చి పడతారు..బాధితులకు పచ్చి వానాకాలంలో వడదెబ్బ సింప్టమ్స్..
ఫంక్షన్లో ఇక గొంతు సవరించి "శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ..సిత్రమై తోచునమ్మా...."అంటూ మంగళారతులు పాడితే నా సామిరంగా ఊరుఊరంతా జాతరే.
ఇంతవరకు బస్సెక్కడం ఎరగని మా తాతను చూడాలనుంటే ఒక్కసారి మిస్స్ డ్ కాలివ్వండి చాలు..తనే మిమ్మల్ని వెతుక్కుంటూ కొలనుప్యాకలో వున్నా,ఫలక్ నుమా ప్యాలస్ లో వున్నా కాలినడకన వచ్చివాల్తాడు.
పెట్రోల్ ఖర్చు లేని,ట్రాఫిక్ పోలీసుల ఫికర్లూ లేని మా తాత ప్రయాణం చూస్తూంటే ఒకింత జెలసీ..ఇంకొకింత గర్వము...
రాంనగర్,పార్శీగుట్ట సందుల్లో అడ్డపంచెతో చేతిలో ఓ సంచితో ఇప్పటికీ కుంటుకుంటూ నడుస్తూ వెళ్ళే మా తాత పాద ముద్దరలో భూమాత పులకరింత కనిపిస్తొంది..
[మా తాతల ముత్తాతల తాతల తరాలను[18 వ శతాబ్ధం] తను చెబుతుంటే నే రాసిపెట్టాను..పై మ్యాపులో ఎర్ర మార్కు ఉన్నచోట నేనున్నాను.]
[దీనికి "రీడర్స్ డైజస్ట్" బోనస్ కత ప్రేరణ]

4 కామెంట్‌లు:

  1. baagundandi mee blog..anni post lu chadiveshaa.konni naaku sariggaa ardham kaaledu..konchem twist,mari edo unnatlu undi..maalanti saadharana paatakula kosam konchem vipulangaa vraastaarani praardhana.

    రిప్లయితొలగించండి
  2. అజ్ణాతలకు...
    ధన్యవాదాలు.. ఎందుకీ అజ్ణాతవాసం???పేర్లు చెప్పి పట్టాభిషిక్తులుకండి.
    అస్సలస్సలు నాకు రాయడం రాదు.

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ మీ తాతగారి కథ....మీ మార్కు చమక్కులు బాగా పండాయి.

    రిప్లయితొలగించండి