మా ఊరి పోస్టుమ్యాను పేరు పిట్టనారాయన.సినిమాల్లో చూపించే తరిఖా అస్సలుండేడిదికాదు ఆయనది అంటే, ఖాకి డ్రెస్సు,టోపీ,సంకకు ఓ బ్యాగుతో ట్రీంగు ట్రింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ సైకిలుమీదవచ్చి విసురుగా దర్వాజ సందుల్లోంచి ఉత్తరాలు గిరాటేసేరకం కాదు.
సఛ్ఛమైన తెల్లపంచె,అంతే తెల్ల బుశ్షోటు[షర్టు]ను మోచేతులవరకు మడిచేటోడు.వయసు 55 అట్లా ఉండొచ్చు.రెండుచేతులా ఉత్తరాలు కళకళలాడుతూవుండేయి.అవి ఉత్తరాలన్నమటేగానీ,నాకు వాటిని సూస్తుంటే శుభలేఖల్లాగ అగుపింఛేయి..శుభలేఖలు పంచినట్టే పంచేవోడు..
పేరుకు పోస్టుమ్యానే అయినా జిల్లా కలెకటర్ లెవల్లో వుండేది సూరత్.
మా నాయిన ఆయన్ని గౌరంగా "నమస్తే పటేలా?"అనేవోడు..రెడ్లకులం..రెడ్లకులస్తుల్లో మగాళ్ళనైతే పటేలా అనీ,ఆడాళ్ళనైతే పటేలమ్మా అనడం రివాజు మా ఊళ్ళో.
టెన్త్ కిలాసు నుంచే నాకు పేపర్లకు ఉత్తరాలు రాయడం మహామోజుగా వుండేది."పలాన కతలో రావులమ్మ అత్తకు ఇషం పెట్టే విశ్లేషణ మీ కతకే హైలెట్" లాంటి ఉత్తరాలు రాసి పోస్టు చేయగా పత్రికల్లో నా పేరు సూసుకొని తెగ ఇదై పోతుండేటోన్ని.ఉత్తరాలమోజు క్రమక్రమంగా జోకులు రాసుకునే వరకెళ్ళింది..
అట్లాజోకులతర్వాత ఇట్లాకాదని ఏకంగా కార్టూన్లు గీకడం మొదలెట్టా..మొదట్లో పొస్టుకార్డులమీదే గీకడం ఎలగపెట్టేవోన్ని..పోస్టల్ స్టాంపులు,కవర్ల గురించి తెలిసేంత క్లవర్ని కాదునేను.ఏదో వీక్లీలో సదివా.."కార్టూన్లు తెల్లపేపర్ మీదే ఇండియనింకుతో మాత్రమే గీయాలి" అని..అది ఏ గడియలో సదివినానోగానీ నాయనా..పొద్దుగూకిందే లేటు హోమువర్కులు,బుక్కులు మూలకు పడెయ్యా..ఓ సాప కింద పరవా.. సక్లముక్ల కూసోనూ.. ఏకంగా ఓ కార్టూన్ల ఫ్యాక్టరీనే తెరిచి పారేసా బాంచెత్..ఇగ కూసుంటె కార్టూను.. లేస్తె కార్టూను..
తెల్లారెగట్ల బస్తా లోడు కార్టూన్లు పోస్టాపీసుకు పయానం కట్టేయి..రెండు రోజులాగి ఆ బస్తా లోడు టంచనుగా మొగమాటాల్లేకుండా నాకు రిటన్ ముట్టేయి.
అట్లా రిటను వచ్చిన కార్టూన్లను ఇసుగూ ఇరామం లేకుండా భూదేవంత ఓర్పుతో పిట్టనారాయన తెచ్చిచ్చేవోడు..కనీసం "అయేంటయి?" అని అడిగేవోడుకాదు పాపం{బోన్గిరిలో వుండే మా సిన్నమామయితే లేని అడ్రస్సులతో ఉత్తరాలు తెగరాసి పిట్టనారాయన్ని ఏడిపించేవాడు పైగా ఉత్తరాలు టైముకు అందడంలేదని పిర్యాదులు...అది మరో కత}
బస్తాలు లోడు ఎల్లేవి.. బస్తాలు రిటను దిగేవి.. ఇదే యవ్వారం..పిట్టనారాయనకు నేను పెట్టినట్టు ఇంకెవ్వడూ పని పెట్టేవోడు కాదు మా ఊళ్ళో.
ఒసారి అడగనే అడిగిండు.."అయ్యన్ని ఏంది..కట్టలు కట్టలు..?"అని నేనేదో చెప్పా.."అట్లాగా..మరి దానికి ఏమన్నముట్టజెబుతారా?" అన్నాడు..మళ్ళీ ఏదో ఎడిచా.
అప్పట్లొ నా కతావస్తువు పోస్టుమ్యానే[ పిట్టనారాయనే] ఆయన అవస్థలు చూల్లేకపోయేటోన్ని..నేనేసిన అత్యధిక కార్టున్లు పోస్టుమ్యాను,కండక్టర్లమీదే,ఎక్కువగా ఈళ్ళమీదే ద్రుష్టి పెట్టేవోన్ని.. అయితే అవన్నీ వాళ్ళను ఎక్కిరిస్తున్నట్టె వుండేవి.
ఇట్లా కొన్నిరోజులు గడిచాక...
బస్తా కార్టూన్లు ఎళ్ళిపోయి మర్యాదగా అరబస్తా మాత్రమే రిటను వచ్చేయి..అచ్చుకావడానికి అలవాటు పడ్డాయి నా బొమ్మలు..ఆంధ్రప్రభలో కార్టూను పడితే 20 రూపాయలతో పాటు ఓ కాంప్లిమెంటరీ కాపీ పంపేవోళ్ళు.
తెల్లారి తొమ్మిదిన్నర పది దాటింది మొదలు ఇగ మాఇంటి అరుగుమీదే నా మకాం..తెల్లబట్టల్తో,చేతిలో ఉత్తరాలు,మనియార్డరు,వీక్లీలతో పిట్టనారాయన
వచ్చే దివ్యమంగళ ద్రుశ్యాలను చూడడానికి నా కళ్ళు నకనకలాడేయి..సోమారంమల్లయ్య ఇంటి ఎదురు సందునుంచి ఎప్పుడెప్పుడు ఇటువైపు తిరిగివస్తాడా అని తెగ సూసేటోన్ని..వీక్లీ మ్యాగజైను రవుండుగా రూలుకర్రమాదిరి చేతిలో పట్టుకుని వస్తుంటే ఆ రోజు నా పంటపండినట్టే.
"బాబూ!"అంటూ పిలిచేటొడు["బాబూ!" అన్నపిలుపు మీద ఎన్నికలలు కనుంటానో..??} ఆ పిలుపింటే నేను బాత్ రూంలోవున్నా,దేవునర్రలో వున్న ఇస్పీడుగా బయట వాలేవోన్ని..ఏంతెచ్చాడో..?ఏంతెచ్చాడో..? అని తెగ ఇదైపోయేటోన్ని..నా టెన్షన్ కనిపెట్టేవోడుగానీ,ఏమీ అడిగేవోడు కాదు..M.O వస్తే ఇక్కడ సంతకం పెట్టు అనేటోడు లేదంటే రూలుకర్ర ఇచ్చేవోడు..అదీకాదంటే బస్తాకు అరబస్తా రిటను ఇచ్చేవోడు..ఈ మూడు ఆప్షన్లుండేయి..
మా ఇంటి కిటికి దగ్గర నిలబడి"బాబూ!" అంటే చాలు ఈ మూడు ఆప్షన్లతో నా బేజాలో రసాయనక్రియ జరిగేది.. M.O లమీద సంతకాలు పెడుతుంటే మా నాయిన నా కంటపడకుండా నేను నెలకు ఎంత కమాయిస్తున్నానో తెల్వక కిందామీదా పడేటోడు.."అవునే..వున్నావే! ఈడెంత సంపాయిస్తున్నాడే?"అనడిగేవోడు వంటరూములోనికెళుతూ మా అమ్మ దగ్గరికి.."ఏమో నాకేం తెల్సు..నువ్వేంకట్టలుకడుతున్నావో..నీ కొడుకేం కట్టలుకడుతున్నాడో..ఎవ్వరి సంగతులేం తెల్వదు నాకు..నాకెమన్న తెచ్చెపట్కెనా?ఇచ్చె పట్కెనా నాకు తెల్వ.." అనేది మా అమ్మ.
ఒక్కోసారి పిట్టనారాయన హాలత్ బాలేకపోతే కార్డులు పంచే డ్యుటీ వాళ్ళకొడుకు హ్యండిల్ చేసేటోడు..వాళ్ళకొడుకు చేతిల్నుంచి వందా,రెండొందలు m.o తీసుకున్నా పిట్టనారాయన ఇస్తే కలిగే ఫీలింగు వుండేది కాదు..
దసరా,దీపావళి పండుగలకు మామూళ్ళలెక్కన పదో,పరకో ఇస్తే "వద్దు బాబూ..గవర్నమెంటు మాకు జీతాలు ఇస్తుంది" అనేవాడు..
పండుగమామూళ్ళ కోసం రచయితలను,కార్టూనిస్టులను పోస్టుమ్యాన్లు పీడించేటట్టు కార్టూన్లు ఏస్తే బరాబర్ బట్వాడా చేసే పిట్టనారాయన చచ్చిపోయాడని తెలిసి తెగ బాధ పడ్డా.
ఇప్పుడు మా ఊరెళితే మార్కండేయ గుడి ఎదురు సందులో ఉండే పోస్టాపీసు లేదు..పిట్టనారాయన లేడు..మా నాయిన లేడు... పోచంపల్లి వీదివీదిలో కనబడే పోస్టుడబ్బాలను చూస్తుంటే మాత్రం పిట్టనారాయాన విగ్రహాల్లాగే వుంటాయి..
ఇప్పుడైతే పూర్తిగా ఈ..మెయిళ్ళు వచ్చాక పోస్టాపీసునే మర్చిపోయా..
ఇప్పటికీ నా ఈ..మెయిల్ ఇన్ బాక్స్ క్లిక్ చేస్తున్నప్రతిసారీ నిజ్జంగా పిట్టనారాయనే గుర్తుకొస్తుంటాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mmmm..........pitaa naarayana garu great......
రిప్లయితొలగించండిNice one, I enjoyed the read!
రిప్లయితొలగించండిNICE NARRATION. YOU SHOULD HAVE UPLOADED HIS PHOTO ALSO INTO THE BLOG ALONG WITH YOUR NARRATION.
రిప్లయితొలగించండిbaagundi
రిప్లయితొలగించండి@ vinay chakravarthi.goginneni
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
@sravya vattikuti
Thanq soooo much..
@siva.
Yes.sir.,
Actually I wanted to post a illustration regarding the story..
soon u can enjoy sir..!