8, ఏప్రిల్ 2010, గురువారం
ఒక దెయ్యం ఆత్మకథ
దాసరి నారాయణ్రావ్ పేపర్ పెట్టేటట్టున్నాడు..ఓ సారి ట్రై చేయరాదంది మా అమ్మ...సరేనని చేస్తే మూడు రోజుల తర్వాత పిట్ట నారాయణ[మా ఊరి పోస్ట్ మ్యాను]మూడు గ్రాముల టెలిగ్రాము ఒకటి తెచ్చాడు..దాసరి హౌజాఫ్ పబ్లికేషన్ [బొబ్బిలి పులి వీక్లీ]
అనుంది..కింద ఎడిటర్ పతంజలి ..దాన్ని టెలిగ్రాము అంటారని సైన్ చేస్తే తప్ప ఇవ్వరని ఈ పసి,పాశి మనసుకు తెలియదు..అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!
దాన్ని పట్టుకుని సరాసరి పంజగుట్టా దళసరి బొబ్బిలి పులి ఆపీసుకెళ్ళా.అక్కడ నా పక్కన ఇంకోడు సన్నగా అచ్చు నా కజిన్ తమ్ముడికి అన్నలా ఉన్నాడు. నా పోటి కంటెస్టాంట్ అన్నమాట..కార్టూనిస్టు పోస్టు కై ఇంటర్వ్యూ కోసమని వచ్చాడు..నన్ను ఆందోళనగా సూస్తున్నాడు..పేరడిగితే చెప్పాను..వాడి పేరు సురేష్ అని అడక్కున్నా చెప్పాడు. .వాణ్ణి పిలిచారు లోపలికి ఏదడిగినా "బయట మా వాడున్నాడు..వాన్నడగండి.. వాడికివ్వండి ఉజ్జోగం.."ఇదీ వాడి వరస..అడిగింది పతంజలి గారు,చెప్పింది సురేష్ గాడు..వీడికి గమ్యం సినిమా దర్షకుడు "క్రిష్" దోస్తు,సింగర్ సునీతతో ప్లాష్ బ్యాక్ లో గుంటూర్ లో గోలీకాయలు ఆడిన అనుభవం. ఇంతకు మించి వీడికి వేరే స్పెషాలిటీలు ఉన్నట్టు నాకు తెలియదు.అప్పట్లో వీడికి బొమ్మలు గీయడం రావు కాని,అభిమానం..మనిషి మంచోడు..వయస్సు పందొమ్మిది సమ్మచ్చారాలు.
తర్వాత నా వంతు.. నేను లోపలికెళ్ళే సరికి పొడవైన బెండు ముక్కు,షార్ప్ చూపు,సన్నటి పెదాలు..ఈజీగా క్యారికేచర్ గీయగల ముఖంతో పతంజలి గారు..పతంజలి గారి గురుంచి నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోవడంతో ఇంటర్వ్యూ పెద్ద కష్టంగా తోచలేదు.
పతంజలి సారుకు సురేష్ హైటూ,టేస్టు నచ్చి శాపవిమోచనం కలిగించి నాతోపాటూ వాడికీ ఉజ్జోగం ఇచ్చాడు..అయితే ఒక కండిషను,ఆఫీసు స్టాఫ్ కు ఎవడి కుర్ఛీ,బల్ల వాడిదే గానీ మాకు మాత్రం ఒకే బల్ల,రెండు కుర్చీలు..ఇదీ సారు కాన్సెప్టు.
మేం పోరగాల్లం అని అలా అరేంజ్ చేసారా? అలా అరేంజ్ అయ్యి అడ్జెస్ట్ అయ్యిందా అరేంజ్ కాని అయోమయం..
అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!..వీడికి పందొమ్మిది సమ్మచ్చారాలు...
మోహన్ బొమ్మ కాంచినా మోక్షం లభించును అన్న పొజిషన్ లో ఉన్న మాకు ఏకంగా మోహనే వచ్చి పోతూంటే మా ఎమోషన్ కంపొజిషన్ లేఅవుట్ చెదిరిపోయేది.సురేంద్ర,రాజు,తల్లావఝల శివాజి,జి.వి.రమణా ...ఇట్లా మెగాస్టార్లంతా[మెగా స్టార్ అప్పట్లో పాపులరే..ఇప్పట్లా కాదు}క్యూ పద్దతిన వచ్చేవాళ్ళు.
మరి మా పోస్టులేంటో అర్తం కాకపోతుండె..ఏముద్దరిద్దామని మమ్ములను తీసుకున్నాడో..అసలు మమ్మల్ని ఏం చేసుకుందామనుకున్నాడొ తెలీదు..ఆ సీక్రెట్ ఎప్పటికైనా సార్ చే కాకా పట్టైనా కక్కించాలనుకున్నాం..
అంతా అర్తంకాని అట్మాస్పియర్.
సంజయ్ దత్ జుత్తును జూలు మాదిరి గీసి గుర్రంలా వేశా..ఓ జీబ్రా ఇంకో జీబ్రా తో "దూరం వెళ్ళు,నీకో రహస్యం చెబుతా" అంటూంది.దూరం వెళ్ళిన జీబ్రాల తలలు దగ్గరవుతాయని ఇక్కడ కవి భావన....ఈ రెండు కార్టూన్లు సారు నన్ను ప్రేమించడానికి,
నాకు రెండున్నరేళ్ళు బోయినం,మాంసం పెట్టడానికి కారణమయ్యాయి..
ఆంధ్రా టాకీస్ నుంచి క్రిష్నవంశీ ఫోన్లు చేస్తుండేవాడు సింధూరం సినిమా కోసమని..భోగాది వెంకటరాయుడేమో సారుకు ఎడమవైపు కూసొని కుడిభుజంలా ఉండేవాడు..ఆయన దేవుడయితే ఈయన పూజారన్నమాట..
నేను ఏది గీస్తె అది అచ్చయిపోయేది,రిజక్టు చేస్తే మా ఊరి నుంచి మా అమ్మ,నాయినలను పట్టుకొస్తాననుకొనేవాడేమో????
సురేశ్ ఏది గీసినా,గీయకున్నా సారు చెత్తబుట్టలో వేసేవాడు ..ఇట్లా కాదని సురేశ్ గాడు సారుకు కార్టూన్లిచ్చి చెత్తబుట్ట లాగి వెనక దాచేసుకున్నట్టు,సారు చెత్తబుట్ట కనబడక ఖంగు తిన్నట్టు ఓ కార్టూన్ గీసా.. సారు పడీ పడీ నవ్వి ఆఫీసుకు ఎవ్వడొచ్చినా చూపెట్టి మమ్మల్ని పరిచయం చేసేవాడు..వాళ్ళెమో మమ్మల్ని అక్భర్_భీర్భల్ అనేవాళ్ళు..ఆకాన్నుంచి సురేశ్ గాడిని "వాట్ మిష్టర్ డస్ట్ బిన్?" అనే వాడు.
బొబ్బిలిపులి లో నేను పత్రిక కోసం వేసిన కార్టూన్లకంటే సారు మీదేసిన కార్టూన్లే ఎక్కువ..అంతా పిల్లలాట లాగుండేది..పైగా సారు అలాగే ఉండాలనే వాడు..భోగాది వెంకటరాయుడు గారి పంచ్ లే పంచ్ లు ..
ఈలోపు ఒసే రాములమ్మ సూపర్ డూపరు హిట్టుకావడం,దాసరి జోష్ మీద రాణిగంజ్ లో రెండుకోట్లుపెట్టి ఓ అపార్టుమెంటుకొని కంప్యూటర్లు,బల్లలతో పాటు మమ్మల్నీ అక్కడికి బదలాయించడం జరిగిపోయింది.
అక్కడ హాలంతా టాల్ స్టాయ్,దాస్తోవ్ విస్కి,మపాసా,ఆస్కార్ వైల్డ్,చెఖొవ్,మార్క్యుజ్,కొకు.గురజాడ,రావిశాస్త్రి శాభ్ధాలతో రీ సౌండ్ వచ్చేది..
ఆ పేర్లు వింటూంటే తను చేసే ఆయుర్వేదం తాలూకు జుమ్మెరాత్ బజార్లో దొరికే వనమూలికలేమో అనుకునేవాణ్ణి.
కార్టూన్లు గీసి పక్కనపెడితే తనే స్కానింగ్ కు తీసుకెళ్ళేవాడు..లంచ్ టైంలో టెర్రస్ పై భోంచేస్తూంటే వచ్చి సిగరెట్ పీల్చి పొగొదులుతూ "ఏంతింటున్నారేటీ ?ఏం నంజుకుంటున్నారేటీ? అనడిగేవాడు..ఓసినీ ఎడిటరు అంటే ఇంతేనా? ఈజీ అనుకునేవోన్ని మనుసులో.. ఓసారి సారు ఎంటరవుతుండగా ఆర్టీస్టు జీ.వి.రమణ బాత్ రూముకు వెళ్ళడం గమనించి రమణకు నేనంటే ఇది అంటూ తన చిటికెనవేలు చూపించాడు.కార్టూన్లు గీసి చూపెడితే నీకు,నాకు అర్థమైతే కుదరదండీ,అందరూ మనలామేధావులు వుండరుకదా..జనాలకు అర్థంకావాలి అనేవాడు ముక్కుపైపడ్డ కళ్ళజోడు పైనుంచి చూస్తూ..
పచ్చడి చేసేట్టు ఎడిటోరియళ్లు రాస్తూ,పచ్చళ్ళ యాపారం ఏంటొ అర్ధం అయ్యీ కాకుండా ఉండేది.
ఎక్కువగా కుక్కల్లాంటి మనుషులమీద కథలు రాసేవాడు..వాటికి మా తమ్ముడు దత్తాత్రేయ చేత బొమ్మలేయించే వాడు..క్యారికేచర్లంటె మా ప్రాణం..
సారు రాసిన బుక్సు చదివి సారు అర్ధం అవుతుండగా ..సారుకు చాలా దూరం ఆయిపోయాను...గౌరవంతో కూడిన భయం వల్ల ఏర్పడ్డ బిడియంతో కలవబుద్ది కాకపోయేది..ఎంత భయం అంటే సారు ఎళ్ళి పోయె టైంకు నేను ఎంటరయ్యేట్టు షిఫ్ట్ మార్చుకునేంత.
తను కనిపెట్టిన గ్లోయల్ ఫేస్ ఆయిల్,గ్రోయల్ హెయిర్ ఆయిల్ లకు లోగోలు,బొమ్మలు వేసి పెట్టేవాడిని..భగీరదుడు తపస్సు చేస్తుండగా శివుడి జటాజుటం నుంచి గంగకు బదులు గ్రోయల్ హెయిర్ ఆయిల్ వస్తున్నట్టు,బ్యాక్ గ్రౌండ్ లో బాపు "సీతా కళ్యాణం"లోని ఉప్పొంగె, ఉప్పొంగె గంగా..అనే పాట వాడి యానిమేషన్ చేయించి టీవీలకు యాడ్ లు ఇస్తే హెయిర్ ఆయిల్ బిజినెస్ లో వచ్చే లాభాలతో దళసరి నారాయణ్రావ్ ని వదిలేసి మనమే సొంతంగా ఓ డయిలీ పేపర్ మొదలెడదాం అని సలహాలు ఇచ్చేవరకు ఎల్లాయి నా తెలివితేటలు.
పతంజలిసారు తన రచనలకు బొమ్మలుగీయమని స్క్రిప్టుకాయితాలిచ్చి దూరంగా రగస్యంగా నన్ను కనిపెట్టేవోడు..నా ఎక్సుప్రెషన్స్ ని బట్టి తన రచనలోని వ్యంగ్యం అంచనావేసుకునేవాడు..ముష్టి ఇరవై ఒక్కసంవత్సరాల ఈ అజ్నాపు కుర్రకుంకకు అంతటి విలువెందుకో అర్థంకాక జుట్టుపీక్కొని గ్రోయల్ హెయిర్ ఆయిల్ మర్థన చేసుకున్నా సస్పెన్స్ గానే వుండింది.
ఇట్లా రకరకాల జ్నాపకాలు..
దెబ్బకు ఆ వీక్లీ దుకాణం మూత పడ్డాక నేను ఆంధ్రభూమి లో జొరబడ్డాక.....కొన్నాళ్ళకు...
ప్రెస్ క్లబ్ లో కదీర్ బాబు పోలేరమ్మబండ కతల ఆవిష్కరణ కు పతంజలి సారు వచ్చాడని తెలిసి అట్కాయించా..."కొడుకు పుట్టాడట గదా నా తరపున కార్టూన్ అని పేరు పెట్టండని అన్నాడు..తర్వాత ఆర్టిస్టూ నివాస్ పెళ్ళికి శుభలేక ఇవ్వడం కోసం ఓ సారి ఆంధ్రపభ లో కలిశా..ఓ సాయం కోసం TV9 లో కలిస్తే సాయం చేసి పంపాడు.
ఇందిరాపార్క్ మోహన్ సార్ ఫ్లాట్ లొ ఉండగా ఓ ఫ్రెండ్ తో వచ్చాడు అప్పుడు ఏదో టి.వీ లకు సీరియళ్ళు రాస్తున్నట్టు తెలిసింది,,,ఆ జీబ్రాల కార్టూన్ చెప్పి "విద్వత్తున్న కార్టూనిస్టు" అని తన ఫ్రెండ్ కు పరిచయం చేసాడు.
ఇంకోసారెప్పుడొ మా నాయిన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అగ్గిపెట్టెలో పట్టె చీరె నేస్తాడండి అని ఎవరో చెబితే "అగ్గిపెట్టెలో చీరెలు గట్రా పెట్టొద్దండీ..అసెంబ్లీ ని పెట్టమనండి"అన్నాడు..
ఇంట్లోకి వెచ్చాలు,వెల్లుల్లి తెస్తూ పిల్లలకు టీవీలో టాం అండ్ జెర్రీ చూపిస్తూ,అక్శయతృతీయకు కెంపులహారం కొనమని మా ఆవిడ ఫత్వాలకు తలొంచి కుటుంబరావుగా మారిన తర్వాత పతంజలిసారుకు మళ్ళీ ఫోన్లు చేసిన పాపాన పోలె...కలిసిన పాపాన పోలె...ఓ సారి కార్మెల్ పాయింట్లో కార్పెంటర్ వర్క్ నడుస్తున్నప్పుడు కలిసా...అదే లాస్టు.
2009 మార్చిలో టీ.వీ లో సార్ ని చూసినపుడు భయం వేసింది.. భయంతో కూడిన ఏడుపు వచ్చింది..మృత్యువు బతికున్నప్పుడే మనిషిని అంతగా నామరూపాల్లేకుండా చేసేస్తుందా అని.నేను భయపడిన,జడుసుకున్న,మానసికంగా కకావికలైపోయిన సందర్భం అది.ఇలా రాస్తున్నప్పుడు కూడా నా గుండె దడ దడా కొట్టుకుంటున్నది.[ఇంకొన్ని అనుభవాలు కింది పోస్టుల్లో..]
పతంజలి సారు పుస్తకంలోని నా పేజి ఇంతటితో సమాప్తం..సంపూర్ణం.!!
ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, మళ్ళీ పతంజలి సారు మాటే నా మాట.
Some write to please the god and some to please the king,while some write to please the society and I write to please the worlds within me.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అక్షరాల లక్షలు విలువ చెసె మాత ఇదె ఆయనకు అక్షర సుమాంజలి
రిప్లయితొలగించండిపతంజలి గురించి మీరు రాస్తున్న కబుర్లు క్రమం తప్పకుండా చదువుతున్నాను.. చదివిన కొద్దీ ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది.. ఆయన అసంపూర్ణ రచన 'రాజుల లోగిళ్ళు' ఎవరైనా ప్రచురిస్తున్నారా? ఆ వివరం తెలిస్తే పంచుకోండి ప్లీజ్..
రిప్లయితొలగించండిమురళి గారికి..చాలా ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిఅసంపూర్ణ రచన 'రాజుల లోగిళ్ళు' గురించి తెలుసుకొని తప్పక తెలియజేస్తాను.