30, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఎంకటేశ్వరా టాకీసులో శ్రీశ్రీ

నాకు శ్రీశ్రీ బోన్గిర్ లో [మా అమ్మమ్మ ఊరు] ఎంకటేశ్వర టాకీస్ లో పరిచయం.ఆకలిరాజ్యం సిన్మా మొట్టమొదట అక్కడే చూశా..కమ్లాసన్ తినడానికి తిండిలేక అన్నీ అమ్మేయంగ శ్రీశ్రీ పుస్తకాలు మిగిలిపోతాయి..వాటిని పాతపేపర్లోడికి అమ్మేస్తే నాలుగు కిలోలు మూడు రూపాయలంటాడు.."ఇది శ్రీశ్రీ కరీదు కాదు,తూకానికేస్తే వచ్చిన డబ్బులు...విప్లవకవి శ్రీరంగం శ్రీనివాస్ రావ్ గారి విలువ మూడ్రూపాయలు...మానాభిమానాల్ని కూడా అమ్ముకొమ్మంటుంది ఆకలి..ఆఫ్టరాల్ మహాకవి శ్రీశ్రీ ఎంత " అంటాడు కమ్లాసన్..ఆ పాతపేపర్లోడు "ఈ శ్రీశ్రీ పుస్తకాలు సదవడానికేగానీ,మడవడానికి పనికిరావయ్యా..అప్పడంలా నలిగిపోతుంది..ఇవి కాకుండా స్టారుడస్టు,పిలిమ్ ఫేర్లు లేవా?..అవైతే నైసు నైసుగా ఉంటాయి."అంటాడు విసుగ్గా..
"తొండ,తొండలు తినేవి,తొండల్నితినేవి.." లాంటి తొండ జ్నానం నాది అప్పట్లో..ఏరే పెపంచం ఉన్నట్టు తెల్వదు నాకు[ఇప్పటిక్కూడా..] ఆ సిన్మా మొత్తం శ్రీశ్రీ పెద్యాలు,కొటేషన్లు,శ్లోకాలు...సిన్మా నాకర్థంకాలేగానీ,గొప్పసిన్మానే అనుకున్నా..
తర్వాత్తర్వాత శ్రీశ్రీ గురించి వ్యాసాలు "నేను సైతం ప్రపంచాగ్నికి...".."పోనీ పోనీ పోతే పోనీ...".."తాజ్మహాల్ నిర్మాణానికి కూలీలెవ్వరు.."పతితులార,బ్రష్టులార.." లాంటి కవిత్వాలు చదివిన,విన్నగానీ పూర్తిగా శ్రీశ్రీ ని బాసింపట్టేసుకొని జీర్ణం చేసుకున్నపాపానైతే పోలే..పైగా పతంజలి సారు "మహాప్రస్థానం చదివినప్పట్నుంచి నాకేదో అయ్యింది.."అనంటుండేవాడు[నాతో కాదు]..సుకాన వున్న పానాన్ని దుక్కాన పెట్టికోవడం ఇస్టం లేక అటు జూసిన పాపాన పోతె ఒట్టు.
సదవమని సవాల్ చేసే నౌకర్లు కొన్నివుంటాయి...అట్టాంటి పొరఫేషన్లో నేను దినపత్రికలకు కార్టూన్లు గీస్తుండగా ముక్కామల చక్రధర్ అని ఒకాయన వచ్చి" శ్రీశ్రీ ని చదివారా?" అనడిగాడు..నిద్రపోతూ దేశాన్నేలే ప్రధానమంత్రి మీద కార్టూన్లేయడానికి శ్రీశ్రీ కి ఏంటి సమ్మందం??.. వి.వి గిరికి చేసే గుమాస్తాగిరికి లింకేంటీ?" అని నిలదీశా..మరీ ముక్యంగా నాకు శ్రీశ్రీ అనోసరమ్ అని బండ బద్ధలు కొట్టిన.
కానీ ఇప్పుడు ఈ ఇంటలిజెంటిల్మేన్ని చదివితే రక్తంలో జరిగే కెమికల్ రియాక్షను ఎట్లుంటదో సూడాలనిపించి బాసింపట్టు ఏయాలనే అనిపిస్తోంది....వయసు ట్రాఫిక్ లో హారతికర్పూరంలా కరిగిపోతుంటే భయమేస్తోంది..!
"వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో దారికాని దారులలో కానరాని కాంక్షలతో దేనికొరకు పదేపదే దేవులాడతావ్..?" అంటున్నాడు శ్రీశ్రీ.

27, ఏప్రిల్ 2010, మంగళవారం

నా కలల సీతాకొకచిలకలు..



సరిగ్గా పదేళ్ళక్రితం హైద్రాబాదుకార్టూనిస్టులమంతా నీళ్ల కొరతమీద మంచినీళ్ళు తాగినంత కష్టంగా కార్టూన్లేసి రవీంద్రభార్తిలో ప్రదర్శనొకటి పెట్టాం..వాటిలో ఏరికోరి "హిందు" పత్రికవాళ్లు నా కార్టూన్ని మాత్రమే అచ్చేసి "కళ్ళను కట్టిపడేసే కార్టూన్లు"అంటూ వ్యాసం రాసారు.కుండలో నీళ్ళకోసం వంగిన ఓ బాల్ కిషన్ నీళ్ళు దొరక్క తనే కుండలోకి ఇంకిపోతాడన్నమాట..

ఇదిలా వుంటే..........,,,

అధీనరేఖవద్ద కాల్పులు,లోతట్టుప్రాంతాలు జలమయం,ఉగ్రవాదంపైఉక్కుపాదం,అమరవీరులకు అశ్రునివాళి..లాంటి అవకతవక కంగాళి వార్తలు సదివి సదివి ఆటిపై కార్టూన్లు గీసి గీసి బోరు భరించలేక బోరున ఏడుస్తున్న సన్నివేశంలో పతంజలి సారు డస్టుబిన్నుసురేశ్ గాడు జాడిచ్చితంతే ఎల్లి పంజాగుట్ట ఫ్లైఓవర్ప్ పక్కసందులో "మాయా" సాఫ్టువేర్లో వర్కుచేసుకుంటున్న సత్య మెడలమీదపడ్డా...ఇంకేమ్ "మాయా" సాఫ్టువేర్లో ఎచ్చుల పుడింగినైపోయానని వేరే చెప్పాల్నా??పేపర్ కోసం ఎలగబెట్టిన కార్టూను "మయా"లో చేస్తే ఎట్లుంటదో ఒ చిన్న ట్రయలు వేసా...పైన వీడియో నొక్కీవక్కానించండి.దీన్నే కొంతమంది"కలల సీతాకొకచిలకల వెంట...." అంటారు.....నేనేమో "క్యారెట్ బిఫోర్ ది కార్ట్ " అంటాను.

26, ఏప్రిల్ 2010, సోమవారం

మా ఊరి పోస్టుమ్యాను

మా ఊరి పోస్టుమ్యాను పేరు పిట్టనారాయన.సినిమాల్లో చూపించే తరిఖా అస్సలుండేడిదికాదు ఆయనది అంటే, ఖాకి డ్రెస్సు,టోపీ,సంకకు ఓ బ్యాగుతో ట్రీంగు ట్రింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ సైకిలుమీదవచ్చి విసురుగా దర్వాజ సందుల్లోంచి ఉత్తరాలు గిరాటేసేరకం కాదు.
సఛ్ఛమైన తెల్లపంచె,అంతే తెల్ల బుశ్షోటు[షర్టు]ను మోచేతులవరకు మడిచేటోడు.వయసు 55 అట్లా ఉండొచ్చు.రెండుచేతులా ఉత్తరాలు కళకళలాడుతూవుండేయి.అవి ఉత్తరాలన్నమటేగానీ,నాకు వాటిని సూస్తుంటే శుభలేఖల్లాగ అగుపింఛేయి..శుభలేఖలు పంచినట్టే పంచేవోడు..
పేరుకు పోస్టుమ్యానే అయినా జిల్లా కలెకటర్ లెవల్లో వుండేది సూరత్.
మా నాయిన ఆయన్ని గౌరంగా "నమస్తే పటేలా?"అనేవోడు..రెడ్లకులం..రెడ్లకులస్తుల్లో మగాళ్ళనైతే పటేలా అనీ,ఆడాళ్ళనైతే పటేలమ్మా అనడం రివాజు మా ఊళ్ళో.
టెన్త్ కిలాసు నుంచే నాకు పేపర్లకు ఉత్తరాలు రాయడం మహామోజుగా వుండేది."పలాన కతలో రావులమ్మ అత్తకు ఇషం పెట్టే విశ్లేషణ మీ కతకే హైలెట్" లాంటి ఉత్తరాలు రాసి పోస్టు చేయగా పత్రికల్లో నా పేరు సూసుకొని తెగ ఇదై పోతుండేటోన్ని.ఉత్తరాలమోజు క్రమక్రమంగా జోకులు రాసుకునే వరకెళ్ళింది..
అట్లాజోకులతర్వాత ఇట్లాకాదని ఏకంగా కార్టూన్లు గీకడం మొదలెట్టా..మొదట్లో పొస్టుకార్డులమీదే గీకడం ఎలగపెట్టేవోన్ని..పోస్టల్ స్టాంపులు,కవర్ల గురించి తెలిసేంత క్లవర్ని కాదునేను.ఏదో వీక్లీలో సదివా.."కార్టూన్లు తెల్లపేపర్ మీదే ఇండియనింకుతో మాత్రమే గీయాలి" అని..అది ఏ గడియలో సదివినానోగానీ నాయనా..పొద్దుగూకిందే లేటు హోమువర్కులు,బుక్కులు మూలకు పడెయ్యా..ఓ సాప కింద పరవా.. సక్లముక్ల కూసోనూ.. ఏకంగా ఓ కార్టూన్ల ఫ్యాక్టరీనే తెరిచి పారేసా బాంచెత్..ఇగ కూసుంటె కార్టూను.. లేస్తె కార్టూను..
తెల్లారెగట్ల బస్తా లోడు కార్టూన్లు పోస్టాపీసుకు పయానం కట్టేయి..రెండు రోజులాగి ఆ బస్తా లోడు టంచనుగా మొగమాటాల్లేకుండా నాకు రిటన్ ముట్టేయి.
అట్లా రిటను వచ్చిన కార్టూన్లను ఇసుగూ ఇరామం లేకుండా భూదేవంత ఓర్పుతో పిట్టనారాయన తెచ్చిచ్చేవోడు..కనీసం "అయేంటయి?" అని అడిగేవోడుకాదు పాపం{బోన్గిరిలో వుండే మా సిన్నమామయితే లేని అడ్రస్సులతో ఉత్తరాలు తెగరాసి పిట్టనారాయన్ని ఏడిపించేవాడు పైగా ఉత్తరాలు టైముకు అందడంలేదని పిర్యాదులు...అది మరో కత}
బస్తాలు లోడు ఎల్లేవి.. బస్తాలు రిటను దిగేవి.. ఇదే యవ్వారం..పిట్టనారాయనకు నేను పెట్టినట్టు ఇంకెవ్వడూ పని పెట్టేవోడు కాదు మా ఊళ్ళో.
ఒసారి అడగనే అడిగిండు.."అయ్యన్ని ఏంది..కట్టలు కట్టలు..?"అని నేనేదో చెప్పా.."అట్లాగా..మరి దానికి ఏమన్నముట్టజెబుతారా?" అన్నాడు..మళ్ళీ ఏదో ఎడిచా.
అప్పట్లొ నా కతావస్తువు పోస్టుమ్యానే[ పిట్టనారాయనే] ఆయన అవస్థలు చూల్లేకపోయేటోన్ని..నేనేసిన అత్యధిక కార్టున్లు పోస్టుమ్యాను,కండక్టర్లమీదే,ఎక్కువగా ఈళ్ళమీదే ద్రుష్టి పెట్టేవోన్ని.. అయితే అవన్నీ వాళ్ళను ఎక్కిరిస్తున్నట్టె వుండేవి.
ఇట్లా కొన్నిరోజులు గడిచాక...
బస్తా కార్టూన్లు ఎళ్ళిపోయి మర్యాదగా అరబస్తా మాత్రమే రిటను వచ్చేయి..అచ్చుకావడానికి అలవాటు పడ్డాయి నా బొమ్మలు..ఆంధ్రప్రభలో కార్టూను పడితే 20 రూపాయలతో పాటు ఓ కాంప్లిమెంటరీ కాపీ పంపేవోళ్ళు.
తెల్లారి తొమ్మిదిన్నర పది దాటింది మొదలు ఇగ మాఇంటి అరుగుమీదే నా మకాం..తెల్లబట్టల్తో,చేతిలో ఉత్తరాలు,మనియార్డరు,వీక్లీలతో పిట్టనారాయన
వచ్చే దివ్యమంగళ ద్రుశ్యాలను చూడడానికి నా కళ్ళు నకనకలాడేయి..సోమారంమల్లయ్య ఇంటి ఎదురు సందునుంచి ఎప్పుడెప్పుడు ఇటువైపు తిరిగివస్తాడా అని తెగ సూసేటోన్ని..వీక్లీ మ్యాగజైను రవుండుగా రూలుకర్రమాదిరి చేతిలో పట్టుకుని వస్తుంటే ఆ రోజు నా పంటపండినట్టే.
"బాబూ!"అంటూ పిలిచేటొడు["బాబూ!" అన్నపిలుపు మీద ఎన్నికలలు కనుంటానో..??} ఆ పిలుపింటే నేను బాత్ రూంలోవున్నా,దేవునర్రలో వున్న ఇస్పీడుగా బయట వాలేవోన్ని..ఏంతెచ్చాడో..?ఏంతెచ్చాడో..? అని తెగ ఇదైపోయేటోన్ని..నా టెన్షన్ కనిపెట్టేవోడుగానీ,ఏమీ అడిగేవోడు కాదు..M.O వస్తే ఇక్కడ సంతకం పెట్టు అనేటోడు లేదంటే రూలుకర్ర ఇచ్చేవోడు..అదీకాదంటే బస్తాకు అరబస్తా రిటను ఇచ్చేవోడు..ఈ మూడు ఆప్షన్లుండేయి..
మా ఇంటి కిటికి దగ్గర నిలబడి"బాబూ!" అంటే చాలు ఈ మూడు ఆప్షన్లతో నా బేజాలో రసాయనక్రియ జరిగేది.. M.O లమీద సంతకాలు పెడుతుంటే మా నాయిన నా కంటపడకుండా నేను నెలకు ఎంత కమాయిస్తున్నానో తెల్వక కిందామీదా పడేటోడు.."అవునే..వున్నావే! ఈడెంత సంపాయిస్తున్నాడే?"అనడిగేవోడు వంటరూములోనికెళుతూ మా అమ్మ దగ్గరికి.."ఏమో నాకేం తెల్సు..నువ్వేంకట్టలుకడుతున్నావో..నీ కొడుకేం కట్టలుకడుతున్నాడో..ఎవ్వరి సంగతులేం తెల్వదు నాకు..నాకెమన్న తెచ్చెపట్కెనా?ఇచ్చె పట్కెనా నాకు తెల్వ.." అనేది మా అమ్మ.
ఒక్కోసారి పిట్టనారాయన హాలత్ బాలేకపోతే కార్డులు పంచే డ్యుటీ వాళ్ళకొడుకు హ్యండిల్ చేసేటోడు..వాళ్ళకొడుకు చేతిల్నుంచి వందా,రెండొందలు m.o తీసుకున్నా పిట్టనారాయన ఇస్తే కలిగే ఫీలింగు వుండేది కాదు..
దసరా,దీపావళి పండుగలకు మామూళ్ళలెక్కన పదో,పరకో ఇస్తే "వద్దు బాబూ..గవర్నమెంటు మాకు జీతాలు ఇస్తుంది" అనేవాడు..
పండుగమామూళ్ళ కోసం రచయితలను,కార్టూనిస్టులను పోస్టుమ్యాన్లు పీడించేటట్టు కార్టూన్లు ఏస్తే బరాబర్ బట్వాడా చేసే పిట్టనారాయన చచ్చిపోయాడని తెలిసి తెగ బాధ పడ్డా.
ఇప్పుడు మా ఊరెళితే మార్కండేయ గుడి ఎదురు సందులో ఉండే పోస్టాపీసు లేదు..పిట్టనారాయన లేడు..మా నాయిన లేడు... పోచంపల్లి వీదివీదిలో కనబడే పోస్టుడబ్బాలను చూస్తుంటే మాత్రం పిట్టనారాయాన విగ్రహాల్లాగే వుంటాయి..

ఇప్పుడైతే పూర్తిగా ఈ..మెయిళ్ళు వచ్చాక పోస్టాపీసునే మర్చిపోయా..
ఇప్పటికీ నా ఈ..మెయిల్ ఇన్ బాక్స్ క్లిక్ చేస్తున్నప్రతిసారీ నిజ్జంగా పిట్టనారాయనే గుర్తుకొస్తుంటాడు.

22, ఏప్రిల్ 2010, గురువారం

పుస్తకాలదినం

పుస్తకాలరోజున పుస్తకాలకు దినం పెట్టేయాలి.. ఇంట్లో పేరుకుపోయిన నానా చెత్త పుస్తకాలను అడ్డికిపావుషేరు లెక్కన బజార్లో అమ్మేసి వచ్చిన డబ్బులను కేబులోడికి కట్టి టి.వీ ఆన్ చేస్తే వచ్చే బోసినవ్వుల బుజ్జాయిల బుడిబుడి పలుకుల "నీ పుంజూ నా పెట్టను ముద్దాడుకోనీ..కొక్కొకో క్కో కొక్కోక్కో......" పాటల తాదాత్మ్యతను తరిస్తూజయజయద్వానాలతో మార్కులేస్తూ కళ్ళనుంచి ధారాళంగా కారే ఆనందబాష్పాలను కొన నాలుకతో చప్పరిస్తూ "పాఠాలు వద్దు,పాటలే ముద్దు.." అంటూ బాలగానగంధర్వుల జబ్బలు చరిచే జడ్జీల ద్రుశ్యాలను ఈరోజు చూసి తరించాలనుంది..!
[టాప్ సీక్రెట్:చెక్కుబుక్కుకు మించిన బుక్కు మరోటి లేదు, వేరే బుక్కులు సేకరించి అనోసరంగా బుక్కయిపోకండి.]

21, ఏప్రిల్ 2010, బుధవారం

జింకపిల్లల ఎంకటసామి తాత


ఎంకటసామి తాత మా నాయినకు అప్పయ్య[చిన్నాన్న] మా తాత తమ్ముడు.
పైసా పని చేతకాదు,మాటలమరాఠి,మంగళారతులు పాడడం, నడవడం,ఈతాకుల్తో జింకపిల్లల్ని అల్లడం హాబీ.
నడవడం తనకు ఎంతిస్టమంటే నడిచి ఎనకేసిన ఆర్టీసి టిక్కెట్ పైసల్తో ఏకంగా ఓ రైలింజన్ కొనాలనేంత !
తన నడకతో మా పరుగుపందెం..చూచువారలకు చూడముచ్చట...
మా తాతల ముత్తాతల తాతల జనన మరణాలు,పెళ్ళిల్లు,జతకాలు అన్నీ తన నాలుకమీదే...అసాధారణమైన ధారణ.
పంచెకట్టిన గూగుల్ సెర్చ్ కి పొడుగు కాళ్ళు తొడిగి ముందు రైలింజన్ అమర్చినట్టుంది మా తాత సూరత్.
హైటు అమితాబచ్చన్,మా నాయినమ్మ అనుమానం లేకుండా జయా బచ్చన్.
కొంతమంది ఇంటికి ఎవ్వరొచ్చినా పేరడుగుతారు లేదా "మీరు అలమండ రాజులా?ఏలూరు కాపులా?వైజాగ్ వడ్డేర్లా? కర్నూలు కోమట్లా..ఏమట్లు?? "..వగైరా అడుగుతుంటారు..కాని ఇక్కడ మా తాత కతే వేరు..
రెప్పలు ఎగరేస్తూ మొట్టమొదట "నీ హైటు ఎంతా?" అనడుగుతాడు..తెల్సిన వాళ్ళు చెబుతారు,,లేదంటే రెడీమేడ్ మెజర్మెంట్ ఎక్విప్ మెంట్ తో "జర ఇసుంట రా" అంటూ
గోడకు నిలబెట్టి తన కిందిపెదవిని పై పళ్ళతో నొక్కిపట్టి తలపై ఓ గీత గీసి నీకత గింతె అని తేల్చిపారేస్తాడు.
ఇంతవరకు మా తాత హైటును కొట్టినోడు మా కాందాన్ లో పుట్టలే.
కషాయానికి శొంఠి ఎంతవసరమో,కర్ణుడు లేని మహభారతం ఎంత టేస్టులెస్సో మా చిలువేరు వంశానికి మా తాత పాత్ర అంత బలిష్టం.
పోచంపల్లికి మూడు కిలోమీటర్ల ఆవల చుట్టూ మర్రి చెట్లు..మధ్యలో తాటిచెట్లు..పిల్లకాలువలు..ఒక చెరువు..అక్కడక్కడా మావిడి చెట్లు...
ఉగాది ముందు మా ఊళ్ళో చెట్లకిందికెళ్లడం అలవాటు[మెట్రోపాలిటన్ లో వనభోజనాలంటారు] మిట్టమధ్యాన్నం మర్రి చెట్టు నీడన చక్కటి కల్లు తాగి బహుచక్కటి నీసు ముక్కలు నమిలి ఆయన ఎగ్జిబిషన్ చూసి అవాక్కుకానివాళ్ళు అరుదు.
కింద గొంగలి పరిచి,ఓ కాలు చాపి మరో కాలు మడిచి కుసోని నాలుక చప్పరిస్తూ ఈతాకుల్ని మూరపొడువు,అంగుళం వెడల్పు లెక్కన చీరి
జింకపిల్లల్ని అల్లుతుంటే చూడాలి తన నిగ్రహం,విగ్రహం..
[త్వరలో "మేకింగ్ ఆఫ్ జింకపిల్లలు" మీ యూట్యూబ్ లో..తప్పక చూడండి]
ఇక మాఇంట్లో పెళ్లి కుదిరిందంటే చాలు తెల్లారె మా డిస్ట్రిబ్యూటర్ రెడీ..శుభలేఖలు పంచడానికి.. కాలినడకన ఫిల్మ్ సిటీ టూ హైటెక్ సిటీ..
తన సెన్సార్ హ్యూమర్ కు తట్టుకొని గెలిచినవాళ్ళను వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు.శ్లేషల్తో [pun]కొడితే శోష వచ్చి పడతారు..బాధితులకు పచ్చి వానాకాలంలో వడదెబ్బ సింప్టమ్స్..
ఫంక్షన్లో ఇక గొంతు సవరించి "శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ..సిత్రమై తోచునమ్మా...."అంటూ మంగళారతులు పాడితే నా సామిరంగా ఊరుఊరంతా జాతరే.
ఇంతవరకు బస్సెక్కడం ఎరగని మా తాతను చూడాలనుంటే ఒక్కసారి మిస్స్ డ్ కాలివ్వండి చాలు..తనే మిమ్మల్ని వెతుక్కుంటూ కొలనుప్యాకలో వున్నా,ఫలక్ నుమా ప్యాలస్ లో వున్నా కాలినడకన వచ్చివాల్తాడు.
పెట్రోల్ ఖర్చు లేని,ట్రాఫిక్ పోలీసుల ఫికర్లూ లేని మా తాత ప్రయాణం చూస్తూంటే ఒకింత జెలసీ..ఇంకొకింత గర్వము...
రాంనగర్,పార్శీగుట్ట సందుల్లో అడ్డపంచెతో చేతిలో ఓ సంచితో ఇప్పటికీ కుంటుకుంటూ నడుస్తూ వెళ్ళే మా తాత పాద ముద్దరలో భూమాత పులకరింత కనిపిస్తొంది..
[మా తాతల ముత్తాతల తాతల తరాలను[18 వ శతాబ్ధం] తను చెబుతుంటే నే రాసిపెట్టాను..పై మ్యాపులో ఎర్ర మార్కు ఉన్నచోట నేనున్నాను.]
[దీనికి "రీడర్స్ డైజస్ట్" బోనస్ కత ప్రేరణ]

18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఓ సండే సాయంత్రం




ఈవిడ పైరేన బెస్సోన్..ఊరు చీలీ.
ఇంట్లో సండే సాయంకాలం మొదలెట్టిన స్కెచ్చు పూర్తయ్యాక టైం చూస్తే అర్ధరాత్రి 12:48 అయ్యింది.
నీతి: రాత్రిళ్లు నిద్రలేకుండా పంజేయడంవల్ల "లో బీపీ" తో పాటు అప్పుడప్పుడూ బొమ్మలుకూడా వచ్చును.


17, ఏప్రిల్ 2010, శనివారం

షాపులు...షేపులు


పోటోషాపులో బొమ్మలేసేవాళ్ళను పాన్ షాపు ఓనర్లలా చూస్తారు కంట్రీజనం.
ఏదిఏమైనా పేపర్ మీది గీతలు అజరామరం..దీన్ని కాదని ఖండించే వాడిది ఎక్సర్ సైజు బాడీ అయినా వాడి మూలుగ తీయాల్సిందే.
గీతకు కొంచెం సాంకేతికత తోడయితే పోయేదేముంది..?పోనిదేముంది..??
చేతిలో చెక్కపెన్సిలా?డిజిటల్ పెన్నా..అనవసరంగా అనోసరం..
స్కెచ్ మాష్టర్లు జాసన్ సైలర్,డామ్నిక్ ఫిల్బర్ట్,జాన్ ఒప్డేబీక్,నికో డి మిట్టా,డామియన్,మేరియన్,రస్కుక్..ఎట్ సెట్రాలకు లేని మొగమాటాలు మనకేటో ??
గుడ్డిదీపాల్లో మనం వెలిగిస్తున్న "చిత్రకల"కు అప్పుడప్పుడూ మనకు అందుబాటులో ఉన్న కరెంటును వాడడంలో తప్పేంవున్నది..?పైగా మన బొమ్మ పాడవకుండా మిగిలిపోయిందేటి??
చివరికి రంగస్తల కళాకారులతో జేమ్స్ కేమరూను మోషన్ కాప్చర్ కూడా వాడుతున్నాడు.
ఎవ్వడి షాపులు వాడివే..ఎవ్వడి షేపులు వాడివే అనుకుంటే ఏ గొడవాలేదు.

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

అనగనగా ఒక రాజు...





రెండేళ్ళనాటి ట్రంకు పెట్టె దులుపుతుండగా రెండు సాలెపురుగులు,కొన్ని నల్లచీమల్తో పాటు "జిహాద్"లో వున్న శ్రీ రాజు గారు బయటపడ్డాడు..
కుప్పకూలుతున్న సత్యం హయాంలో ఓ జెంటిల్మేను కోసం అప్పటికప్పుడు గీసిన కార్టూన్ ఇది..
ఇప్పుడిది అప్రస్తుతమని తెలిసికూడా పోస్టు చేయక తప్పేట్టులేదు మరి...

బుగ్గసొట్టలు

సెంద్రబాబు గడ్డం..కే.సి.ఆర్ ముక్కు..రోశయ్య బట్టతల..చిరు బొర్రతో లైపులో కైపు లేకుండా పోతున్నదశలో కరీనా బుగ్గలు తగిలాయి...
సొట్టబుగ్గల కోసం కరీనా ఆపరేషను..దానిపై యానిమేషను..దాంతాలూకు ఫ్రేములు....






భద్రం కొడుకో!




పూర్వాశ్రమంలో నే గీసిన ఈ కార్టూన్లు రిజెక్ట్ అయ్యి నా సొంతాశ్రమంలో తలదాచుకోగా తీసి రంగులద్ది బ్లాగులో భద్రపరుద్దామని....!

15, ఏప్రిల్ 2010, గురువారం

సుజల నయనం

జయదేవ్ కార్టూన్ల బుక్కేస్తే నేను పంజేసే డైలీ పేపర్లో అన్ నెసెసర్లీ సీరియస్లీ భయపడుతూ,భయపడుతూ రివ్యూ ఒహటి వెలగబెట్టా.
ఈ విషయం ఓ నాట్ బ్యాడ్ గుడ్ ఫ్రైడే రోజు మోహన్ సార్ ముందు మోకరిల్లి చెబితే,
"అరెరెరెరె..అవునాబ్బా..నువ్వురచనలు కూడా చేస్తున్నావా?ప్రపంచంలో వింతవింత సంఘటనలు జరుగుతున్నాయబ్బా.."అన్నాడు తన సోకాల్డ్ అర్థనిమీలిత నేత్రాలతో...

ఉప్పూకారం దట్టంగా పులుముకున్న నా కసి నాలుగేళ్ల తర్వాత ఊరగాయజాడి నుంచి బ్లోఅవుట్ అయింది..
ఇప్పుడు ఈ బ్లాగ్ చూపెట్టి తన అరమోడ్ఫు కళ్లల్లో మెరుపు చూడాలనుంది నా సుజలనయనాలతో.....


ఒకాయన

మా ఊళ్లో "ఒకాయన"కు[పేరు మార్చబడినది] పెళ్లీడొచ్చింది..పెళ్లిసూపులు...
అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు,ఆమె తండ్రి కూడా సక్కదనంతో తొణికిసలాడాలి..మామగారి ముఖం చూస్తే మతి పోగొట్టేట్టుండాలి..ఇదీ "ఒకాయన" కండిషను.ఫస్టునైట్ కు మామగారు నాట్ ఎలౌడ్ అన్నా విన్లే.
అద్దకిల పౌడరు ముఖానికి రాసి ..పెళ్లిసూపుల డ్యూటీకి బయల్దేరేవాడు...
పెళ్లిసూపులు___ కుండెడు వడియాలు కూసుండి మెక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అటుకులు గటుక్కున మింగడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ అడ్డెడు శనిగలను ఆగమాగం బుక్కడం..బయటపడడం..
పెళ్లిసూపులు___ గంపెడు గారెలు గరగర నమలడం..బయటపడడం..
సూస్తా,సూస్తా వందకి పైగా పెళ్లిసూపులు..బ్రేవ్ లు.. కాని నో కాంప్రమైజు..
కొసకు ఓ అందమైన పిల్లకు జనమ నిచ్చిన హ్యండ్సమ్ జనకుడు దొరికాడు..
ఇంకేం, అంగరంగ వైభవంగా విస్తరాకులు,టెంటు,భాజాభజంత్రీలు,"ఒకాయన", బోయినం....
.................... .............
ఓ పదేళ్లు తిరక్కుండానే ఆ "ఒకాయన" బార్య చచ్చిపోయింది.
సూరీడు పడమటి కొండల్లో ఇంకిపోతుండగా దహనసంస్కారాలు..
లాంగ్ షాట్ "సిల్ హౌట్" లో మామగారి పక్కనే "ఒకాయన" .

14, ఏప్రిల్ 2010, బుధవారం

గంధము పూయరుగా..

ఊరూరా తిరుగుతూ..,జగన్ జనాలకు గంధం పూస్తూ..వీపులు రాస్తూ..
"నాన్న బాటలోనే నడుస్తా !"
"నడిస్తే నడిచావ్ గాని, అటేపు ఎగరకు నాయనా!" తిరిగి ఆయనకు గంధం పూస్తూ గంధం ముఖంతో నుదిటిమీద పేద్దబొట్టుతో ఓ ఊరావిడ.

13, ఏప్రిల్ 2010, మంగళవారం

పులిరాజు


ఓ పెద్దాయన పోన్ చేసి "ఏమోయ్..మృత్యుంజయం..నీకు ఎయిడ్స్ వచ్చిందటగా..అదేలేవోయ్ ఎయిడ్స్ కార్టూన్ పోటీలో ప్రైజ్ వచ్చిందటగా..పదివేలంటగా..
మీ యావిడకు నగా,నట్రా గట్రానా??మరి మనకేమైనా గట్రాలు గట్రా ఉన్నాయా??"
ఇది సత్యం రామలింగరాజు రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య 1800 లకు చేరకమునుపు..

ఎందుకే రవణమ్మ..పెళ్ళెందుకే రవణమ్మ

రోజు రోజుకీ ముఖాలకి,తలరాతలకి బొత్తిగా సమ్మందం లేకుండా పోతోంది..బ్రమ్మ దేవుడి హ్యండ్ రైటింగ్ బాలేదు..ఇంప్రూవ్ చేసుకోవాలి.
అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్,వ్యాకరణ దోషాలు,ముద్రా"రాక్షసాలు".కమ్ ధమాఖ్ వర్సెస్ మూడు బుర్రలు....ఫాంట్ మార్చాలి..!
సరస్వతి దేవి ఇంటిపని పూర్తి కాగానే టీ.వీ లో వంటలప్రోగ్రాంలు అవీ చూడకుండా బ్రమ్మకు హోంవర్క్ చేసిపెట్టాలి..ట్యూషన్లు తీసుకుంటే
మరీ మంచిది..గోడకుర్చీ అయినా పర్వలే..
పిల్లల పంచాయితి ఉరుము ఉరుమి పెద్దలు జుట్టు పీక్కొని విగ్గులు ధరించి అశ్విన్ హేరాయిల్ వాడేవరకెళ్తుంది.ఇంటి పక్కవాళ్ళనుంచి వినోదప్పన్ను వసూల్ చేసి ఓ అందమైన అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాలని నా టార్గెట్.
బరహ సాఫ్ట్ వేర్ లో నేను...ఆల్గడ్డలు కోస్తూ మా యావిడ...ఎస్ మీద ఒ పెడితే "కి" అని చదివే మా బుడ్డోడు "ఎందుకే రవణమ్మ..పెళ్ళెందుకే రవణమ్మ..."

12, ఏప్రిల్ 2010, సోమవారం

స్కిన్ లెస్ మటన్..బూర్ లెస్ చికెన్..!



జాసన్ స్యిలర్ అని చికాకు పెట్టే చికాగో ఆర్టూనిస్ట్.
సబ్వే నుంచి వాళ్ళావిడ తెచ్చే శాండ్ విచ్ ఎడమ చేత్తో తింటూ కుడిచేత్తో వాడు గీసే బొమ్మలు చూసి "ఒరే! నీ బుగ్గలు కోసి ఈ మెయిల్లో పంపిస్తే కొరికి తిరిగి కొరియల్ లో పంపిస్తారా అన్నా వినకుండా హౌజ్ ఫుల్ బోర్డ్ తగిలిస్తే, లేని బ్లాక్ మనీ ఇచ్చి బ్లాక్ లో కొంటానన్నా లెక్కచేయకుండా బ్లాక్ చేసేసాడు.
వాడు గీసిన వాళ్ళావిడ ఎడమ జబ్బా మీద డ్రాగన్ బొమ్మ చూడని వాడు మనిషి రూపంలో వున్న పశువే కాదని నా ధ్రుడ సదాభిప్రాయం.
మరి వాడి సైట్ అడిగితె చెప్పమరి..ఎళ్ళీ గూగులమ్మని అడిగి తెలుసుకొని చూసి డిప్రెస్ అయిపోయి ఆనందించండి.
లేదంటె..ఎప్పట్లాగే...టెన్ టు సిక్స్..,ఒన్ బై టూ ఛాయ్..,పి.ఎఫ్..,హోమ్ లోన్, సండే స్కిన్ లెస్ మటన్..,బూర్ లెస్ చికెన్..!

8, ఏప్రిల్ 2010, గురువారం

ఒక దెయ్యం ఆత్మకథ



దాసరి నారాయణ్రావ్ పేపర్ పెట్టేటట్టున్నాడు..ఓ సారి ట్రై చేయరాదంది మా అమ్మ...సరేనని చేస్తే మూడు రోజుల తర్వాత పిట్ట నారాయణ[మా ఊరి పోస్ట్ మ్యాను]మూడు గ్రాముల టెలిగ్రాము ఒకటి తెచ్చాడు..దాసరి హౌజాఫ్ పబ్లికేషన్ [బొబ్బిలి పులి వీక్లీ]
అనుంది..కింద ఎడిటర్ పతంజలి ..దాన్ని టెలిగ్రాము అంటారని సైన్ చేస్తే తప్ప ఇవ్వరని ఈ పసి,పాశి మనసుకు తెలియదు..అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!
దాన్ని పట్టుకుని సరాసరి పంజగుట్టా దళసరి బొబ్బిలి పులి ఆపీసుకెళ్ళా.అక్కడ నా పక్కన ఇంకోడు సన్నగా అచ్చు నా కజిన్ తమ్ముడికి అన్నలా ఉన్నాడు. నా పోటి కంటెస్టాంట్ అన్నమాట..కార్టూనిస్టు పోస్టు కై ఇంటర్వ్యూ కోసమని వచ్చాడు..నన్ను ఆందోళనగా సూస్తున్నాడు..పేరడిగితే చెప్పాను..వాడి పేరు సురేష్ అని అడక్కున్నా చెప్పాడు. .వాణ్ణి పిలిచారు లోపలికి ఏదడిగినా "బయట మా వాడున్నాడు..వాన్నడగండి.. వాడికివ్వండి ఉజ్జోగం.."ఇదీ వాడి వరస..అడిగింది పతంజలి గారు,చెప్పింది సురేష్ గాడు..వీడికి గమ్యం సినిమా దర్షకుడు "క్రిష్" దోస్తు,సింగర్ సునీతతో ప్లాష్ బ్యాక్ లో గుంటూర్ లో గోలీకాయలు ఆడిన అనుభవం. ఇంతకు మించి వీడికి వేరే స్పెషాలిటీలు ఉన్నట్టు నాకు తెలియదు.అప్పట్లో వీడికి బొమ్మలు గీయడం రావు కాని,అభిమానం..మనిషి మంచోడు..వయస్సు పందొమ్మిది సమ్మచ్చారాలు.
తర్వాత నా వంతు.. నేను లోపలికెళ్ళే సరికి పొడవైన బెండు ముక్కు,షార్ప్ చూపు,సన్నటి పెదాలు..ఈజీగా క్యారికేచర్ గీయగల ముఖంతో పతంజలి గారు..పతంజలి గారి గురుంచి నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోవడంతో ఇంటర్వ్యూ పెద్ద కష్టంగా తోచలేదు.

పతంజలి సారుకు సురేష్ హైటూ,టేస్టు నచ్చి శాపవిమోచనం కలిగించి నాతోపాటూ వాడికీ ఉజ్జోగం ఇచ్చాడు..అయితే ఒక కండిషను,ఆఫీసు స్టాఫ్ కు ఎవడి కుర్ఛీ,బల్ల వాడిదే గానీ మాకు మాత్రం ఒకే బల్ల,రెండు కుర్చీలు..ఇదీ సారు కాన్సెప్టు.
మేం పోరగాల్లం అని అలా అరేంజ్ చేసారా? అలా అరేంజ్ అయ్యి అడ్జెస్ట్ అయ్యిందా అరేంజ్ కాని అయోమయం..
అప్పటికింకా నా వయసు నిండా ఇరవయ్యే!..వీడికి పందొమ్మిది సమ్మచ్చారాలు...

మోహన్ బొమ్మ కాంచినా మోక్షం లభించును అన్న పొజిషన్ లో ఉన్న మాకు ఏకంగా మోహనే వచ్చి పోతూంటే మా ఎమోషన్ కంపొజిషన్ లేఅవుట్ చెదిరిపోయేది.సురేంద్ర,రాజు,తల్లావఝల శివాజి,జి.వి.రమణా ...ఇట్లా మెగాస్టార్లంతా[మెగా స్టార్ అప్పట్లో పాపులరే..ఇప్పట్లా కాదు}క్యూ పద్దతిన వచ్చేవాళ్ళు.
మరి మా పోస్టులేంటో అర్తం కాకపోతుండె..ఏముద్దరిద్దామని మమ్ములను తీసుకున్నాడో..అసలు మమ్మల్ని ఏం చేసుకుందామనుకున్నాడొ తెలీదు..ఆ సీక్రెట్ ఎప్పటికైనా సార్ చే కాకా పట్టైనా కక్కించాలనుకున్నాం..
అంతా అర్తంకాని అట్మాస్పియర్.
సంజయ్ దత్ జుత్తును జూలు మాదిరి గీసి గుర్రంలా వేశా..ఓ జీబ్రా ఇంకో జీబ్రా తో "దూరం వెళ్ళు,నీకో రహస్యం చెబుతా" అంటూంది.దూరం వెళ్ళిన జీబ్రాల తలలు దగ్గరవుతాయని ఇక్కడ కవి భావన....ఈ రెండు కార్టూన్లు సారు నన్ను ప్రేమించడానికి,
నాకు రెండున్నరేళ్ళు బోయినం,మాంసం పెట్టడానికి కారణమయ్యాయి..

ఆంధ్రా టాకీస్ నుంచి క్రిష్నవంశీ ఫోన్లు చేస్తుండేవాడు సింధూరం సినిమా కోసమని..భోగాది వెంకటరాయుడేమో సారుకు ఎడమవైపు కూసొని కుడిభుజంలా ఉండేవాడు..ఆయన దేవుడయితే ఈయన పూజారన్నమాట..
నేను ఏది గీస్తె అది అచ్చయిపోయేది,రిజక్టు చేస్తే మా ఊరి నుంచి మా అమ్మ,నాయినలను పట్టుకొస్తాననుకొనేవాడేమో????
సురేశ్ ఏది గీసినా,గీయకున్నా సారు చెత్తబుట్టలో వేసేవాడు ..ఇట్లా కాదని సురేశ్ గాడు సారుకు కార్టూన్లిచ్చి చెత్తబుట్ట లాగి వెనక దాచేసుకున్నట్టు,సారు చెత్తబుట్ట కనబడక ఖంగు తిన్నట్టు ఓ కార్టూన్ గీసా.. సారు పడీ పడీ నవ్వి ఆఫీసుకు ఎవ్వడొచ్చినా చూపెట్టి మమ్మల్ని పరిచయం చేసేవాడు..వాళ్ళెమో మమ్మల్ని అక్భర్_భీర్భల్ అనేవాళ్ళు..ఆకాన్నుంచి సురేశ్ గాడిని "వాట్ మిష్టర్ డస్ట్ బిన్?" అనే వాడు.
బొబ్బిలిపులి లో నేను పత్రిక కోసం వేసిన కార్టూన్లకంటే సారు మీదేసిన కార్టూన్లే ఎక్కువ..అంతా పిల్లలాట లాగుండేది..పైగా సారు అలాగే ఉండాలనే వాడు..భోగాది వెంకటరాయుడు గారి పంచ్ లే పంచ్ లు ..
ఈలోపు ఒసే రాములమ్మ సూపర్ డూపరు హిట్టుకావడం,దాసరి జోష్ మీద రాణిగంజ్ లో రెండుకోట్లుపెట్టి ఓ అపార్టుమెంటుకొని కంప్యూటర్లు,బల్లలతో పాటు మమ్మల్నీ అక్కడికి బదలాయించడం జరిగిపోయింది.

అక్కడ హాలంతా టాల్ స్టాయ్,దాస్తోవ్ విస్కి,మపాసా,ఆస్కార్ వైల్డ్,చెఖొవ్,మార్క్యుజ్,కొకు.గురజాడ,రావిశాస్త్రి శాభ్ధాలతో రీ సౌండ్ వచ్చేది..
ఆ పేర్లు వింటూంటే తను చేసే ఆయుర్వేదం తాలూకు జుమ్మెరాత్ బజార్లో దొరికే వనమూలికలేమో అనుకునేవాణ్ణి.
కార్టూన్లు గీసి పక్కనపెడితే తనే స్కానింగ్ కు తీసుకెళ్ళేవాడు..లంచ్ టైంలో టెర్రస్ పై భోంచేస్తూంటే వచ్చి సిగరెట్ పీల్చి పొగొదులుతూ "ఏంతింటున్నారేటీ ?ఏం నంజుకుంటున్నారేటీ? అనడిగేవాడు..ఓసినీ ఎడిటరు అంటే ఇంతేనా? ఈజీ అనుకునేవోన్ని మనుసులో.. ఓసారి సారు ఎంటరవుతుండగా ఆర్టీస్టు జీ.వి.రమణ బాత్ రూముకు వెళ్ళడం గమనించి రమణకు నేనంటే ఇది అంటూ తన చిటికెనవేలు చూపించాడు.కార్టూన్లు గీసి చూపెడితే నీకు,నాకు అర్థమైతే కుదరదండీ,అందరూ మనలామేధావులు వుండరుకదా..జనాలకు అర్థంకావాలి అనేవాడు ముక్కుపైపడ్డ కళ్ళజోడు పైనుంచి చూస్తూ..

పచ్చడి చేసేట్టు ఎడిటోరియళ్లు రాస్తూ,పచ్చళ్ళ యాపారం ఏంటొ అర్ధం అయ్యీ కాకుండా ఉండేది.
ఎక్కువగా కుక్కల్లాంటి మనుషులమీద కథలు రాసేవాడు..వాటికి మా తమ్ముడు దత్తాత్రేయ చేత బొమ్మలేయించే వాడు..క్యారికేచర్లంటె మా ప్రాణం..

సారు రాసిన బుక్సు చదివి సారు అర్ధం అవుతుండగా ..సారుకు చాలా దూరం ఆయిపోయాను...గౌరవంతో కూడిన భయం వల్ల ఏర్పడ్డ బిడియంతో కలవబుద్ది కాకపోయేది..ఎంత భయం అంటే సారు ఎళ్ళి పోయె టైంకు నేను ఎంటరయ్యేట్టు షిఫ్ట్ మార్చుకునేంత.
తను కనిపెట్టిన గ్లోయల్ ఫేస్ ఆయిల్,గ్రోయల్ హెయిర్ ఆయిల్ లకు లోగోలు,బొమ్మలు వేసి పెట్టేవాడిని..భగీరదుడు తపస్సు చేస్తుండగా శివుడి జటాజుటం నుంచి గంగకు బదులు గ్రోయల్ హెయిర్ ఆయిల్ వస్తున్నట్టు,బ్యాక్ గ్రౌండ్ లో బాపు "సీతా కళ్యాణం"లోని ఉప్పొంగె, ఉప్పొంగె గంగా..అనే పాట వాడి యానిమేషన్ చేయించి టీవీలకు యాడ్ లు ఇస్తే హెయిర్ ఆయిల్ బిజినెస్ లో వచ్చే లాభాలతో దళసరి నారాయణ్రావ్ ని వదిలేసి మనమే సొంతంగా ఓ డయిలీ పేపర్ మొదలెడదాం అని సలహాలు ఇచ్చేవరకు ఎల్లాయి నా తెలివితేటలు.
పతంజలిసారు తన రచనలకు బొమ్మలుగీయమని స్క్రిప్టుకాయితాలిచ్చి దూరంగా రగస్యంగా నన్ను కనిపెట్టేవోడు..నా ఎక్సుప్రెషన్స్ ని బట్టి తన రచనలోని వ్యంగ్యం అంచనావేసుకునేవాడు..ముష్టి ఇరవై ఒక్కసంవత్సరాల ఈ అజ్నాపు కుర్రకుంకకు అంతటి విలువెందుకో అర్థంకాక జుట్టుపీక్కొని గ్రోయల్ హెయిర్ ఆయిల్ మర్థన చేసుకున్నా సస్పెన్స్ గానే వుండింది.
ఇట్లా రకరకాల జ్నాపకాలు..
దెబ్బకు ఆ వీక్లీ దుకాణం మూత పడ్డాక నేను ఆంధ్రభూమి లో జొరబడ్డాక.....కొన్నాళ్ళకు...
ప్రెస్ క్లబ్ లో కదీర్ బాబు పోలేరమ్మబండ కతల ఆవిష్కరణ కు పతంజలి సారు వచ్చాడని తెలిసి అట్కాయించా..."కొడుకు పుట్టాడట గదా నా తరపున కార్టూన్ అని పేరు పెట్టండని అన్నాడు..తర్వాత ఆర్టిస్టూ నివాస్ పెళ్ళికి శుభలేక ఇవ్వడం కోసం ఓ సారి ఆంధ్రపభ లో కలిశా..ఓ సాయం కోసం TV9 లో కలిస్తే సాయం చేసి పంపాడు.
ఇందిరాపార్క్ మోహన్ సార్ ఫ్లాట్ లొ ఉండగా ఓ ఫ్రెండ్ తో వచ్చాడు అప్పుడు ఏదో టి.వీ లకు సీరియళ్ళు రాస్తున్నట్టు తెలిసింది,,,ఆ జీబ్రాల కార్టూన్ చెప్పి "విద్వత్తున్న కార్టూనిస్టు" అని తన ఫ్రెండ్ కు పరిచయం చేసాడు.
ఇంకోసారెప్పుడొ మా నాయిన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అగ్గిపెట్టెలో పట్టె చీరె నేస్తాడండి అని ఎవరో చెబితే "అగ్గిపెట్టెలో చీరెలు గట్రా పెట్టొద్దండీ..అసెంబ్లీ ని పెట్టమనండి"అన్నాడు..

ఇంట్లోకి వెచ్చాలు,వెల్లుల్లి తెస్తూ పిల్లలకు టీవీలో టాం అండ్ జెర్రీ చూపిస్తూ,అక్శయతృతీయకు కెంపులహారం కొనమని మా ఆవిడ ఫత్వాలకు తలొంచి కుటుంబరావుగా మారిన తర్వాత పతంజలిసారుకు మళ్ళీ ఫోన్లు చేసిన పాపాన పోలె...కలిసిన పాపాన పోలె...ఓ సారి కార్మెల్ పాయింట్లో కార్పెంటర్ వర్క్ నడుస్తున్నప్పుడు కలిసా...అదే లాస్టు.
2009 మార్చిలో టీ.వీ లో సార్ ని చూసినపుడు భయం వేసింది.. భయంతో కూడిన ఏడుపు వచ్చింది..మృత్యువు బతికున్నప్పుడే మనిషిని అంతగా నామరూపాల్లేకుండా చేసేస్తుందా అని.నేను భయపడిన,జడుసుకున్న,మానసికంగా కకావికలైపోయిన సందర్భం అది.ఇలా రాస్తున్నప్పుడు కూడా నా గుండె దడ దడా కొట్టుకుంటున్నది.[ఇంకొన్ని అనుభవాలు కింది పోస్టుల్లో..]

పతంజలి సారు పుస్తకంలోని నా పేజి ఇంతటితో సమాప్తం..సంపూర్ణం.!!


ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, మళ్ళీ పతంజలి సారు మాటే నా మాట.
Some write to please the god and some to please the king,while some write to please the society and I write to please the worlds within me.

7, ఏప్రిల్ 2010, బుధవారం

ఇంట్రోస్పెక్షన్

బొమ్మ గీస్తే ఎదుటోడి ఇగో అవుట్ బరస్ట్ కావాలె..బొమ్మ పుట్టాలి గురూ..!
నీ పక్షవాతపు బొమ్మలు,నీ సదువూ,నీ పిండాకూడూ,అట్లాగే నీ దేబ్యమొఖమూనూ...
పెన్సిల్ పట్టే తరీఖ మార్చు..గుండేలోతుల్లో బ్రష్శు ముంచి గీయి..
చాతకాకపోతె వదిలేసి వట్టిచాపల బేరం చేసుకో..అంతేగాని,
నంజి నఖరాల్ చేస్తే పెన్సిల్ ఇరగ్గొడ్తా కొడఖా.!
డిస్ క్లైమర్:ఇంట్రాస్పెక్షన్ అనగా అంతర్మథనం [ఆంగ్ల సౌండ్ బాందని వాడా..] ఇది ఎవ్వరినీ నొప్పించే ప్రయత్నం కాదు..సొంత నొప్పి కోసమే..
ఎవరి నొప్పిని వాళ్ళె గిల్లి నొచ్చుకోవాలని మనవి...బయట నాకు వేరే పన్లున్నాయ్...!

ఎలుకపైన ఊరేగి..



పై బొమ్మ మా ఇస్కూల్ హింది పండిట్ కం డ్రాయింగ్ టీచర్ కాళిదాస్ రావ్ సార్ ది.గీసింది మా తమ్ముడు దత్తు.
సారు బొమ్మ గీయని జనమ ఉంటేనేం ఊడితేనేం అని బాధ పడుతుంటే సూల్లేక ప్రింటింగ్ కు పోన్ చేసి పోస్ట్ పోన్ చేయమన్న .. ప్రియశిష్యుడు గీయని సారు ప్రింటింగ్ కు ఎట్లెళ్తడు?
సారు ఇస్కూళ్ళో బోర్డు మీద బొమ్మ దించుతుంటె సూడాలే..ఆ విగ్రహం,ఆ పోజు,ఆ కత,ఆ గీతలూ....ఉత్త గీతలే కాదు,వంటి మీద పోరగాల్లకు వాతలు కూడా..సుద్ద మొద్దు దద్దమ్మల్ని వంగబెట్టి దడ దడ దంచుతుంటె సామిరంగా ఆ రోజు హోళీ పండగేమో అనిపించేది, ముఖమంతా బుక్కగులాల్ జల్లుకున్నట్టు ఎర్రగా..అంత కోపం మరీ.
ఆంధ్రా అమితాబ్బచ్చన్ లెక్క ,సారంటె పోచంపల్లి బాపు మోహన్.
పొట్టిగా,బొర్రతో,వేగంగా నడూస్తుంటే అమీన్సాబ్లు సైతం సలాంలు కొట్టెవాళ్ళు..హవా అట్టాంటిది మరి..నార్త్ ఇండియన్,హిందీ తెల్గు మిక్స్ చేసి మాట్లాడెవాడు.
ఇనాయకుడి బొమ్మలు గీయడం వల్ల,చేయడం వల్ల సారు కూడా ఇనాయకుడి మాదిరి మారిపోయాడేమో అనిపింఛేది.
ఇనాయకుడి బొమ్మలు చేయడంలో సారును కాదని ఇంతవరకు మా ఊళ్ళొ రొమ్ము ఇరుచుకొని వచ్చిన కేతిగాళ్ళు నాకు తెలిసి లేరు.
ఇనాయకుడి బొమ్మల్ని ఆనిమేషన్ చేసేవాడు,అంటే తొండంలో,చేతుళ్ళొ స్ప్రింగులు పెట్టి మట్టితో కప్పెట్టి బొమ్మ పూర్తి చేసోటోడు..ఒక్కసారి చేయి ఎనక్కి లాగి వదిల్తే నవరాత్రులు అయిపోయొ వరకు దేవుడు చేయి వెనక్కి,ముందుకి దీవిస్తూనే వుండేవాడు..అట్లాగే తల,తొండం..తోపుడు బండి మీద ఆ ఇగ్రహాన్ని పెట్టి ఊరు ఊరంతా తిప్పేవోడు..చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు.."ఎలుక పైన ఊరేగి ఎల్లలోకమును తిరిగి.."అంటూ ఎస్.జానకి ప్లే బ్యాక్ సింగింగు...
సారుకు మా నాయినకు మంఛి దోస్తానా..నాగార్జున సిమెంటు,భారతీ సిమెంటంత స్ట్రాంగు..
కౌసు[నీసు]ముట్టడు సారు,కౌసు లేంది ముట్టడు మా నాయిన....అయినా దోస్తానా దోస్తానె..కళకు కౌసు అనోసరం మరి.
సారు ఎకాఎకిన గుండె పోటొచ్చి చచ్చిపోయాడు..
సార్ ని లేపి తీసుకెళ్తూంటే చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు..

6, ఏప్రిల్ 2010, మంగళవారం

గురు దక్షిణ

ఓ గురువు గారి గురించి ఓ శిష్యపరమాణువు..
"ఎవరి పేరు చెబితె బంజరు భూములు పంటపొలాలుగా మారతాయో,ఎవరి పేరు చెబితె శత్రువుల గుండెలు దడ దడ
లాడతాయో అతను ఈ వారణాసికి ఎందుకొచ్చాడో తెలుసా ?"
సదరు శిష్యుడి గురించి గురువు గారు..
"వాడు ఎవడనుకున్నావ్...ట్రెయిన్డ్ ఇన్ డెహ్రాడూన్..టాపర్ ఇన్ ద బ్యాచ్..దేశానికి పట్టిన చీడ పురుగులని ఏరేస్తున్నాడు.. వాడు నీ అంతు చూస్తాడు,వాడి అంతు చూస్తాడు,వీడి అంతు చూస్తాడు,
ఎవ్వడ్నీ వదలడు..చివరికి వాడు నా అంతు చూసినా చూస్తాడు...వాడు ఒక్కసారి కమిట్ ఆయ్యాడంటే మహేష్ బాబు మాట కూడ వినడు."
[ఇది సొయంగా నా కళ్ళముందు జరిగిన నిజమైన ఓవరాల్ కాన్సెప్ట్...నా ఇస్టైల్లో రాసేసరికి ఇట్టాగొచ్చింది మరి.]

సెంటర్ స్ప్రెడ్డయ్యింది.



నా మీద ఓ ఐటం రాస్తాను రమ్మని ఓ జెంటిల్ మేను చెప్తే నేన్రాన్,నేన్రాన్ అన్నా వినకుండా ఓ స్టోరీ రాసి అచ్చేసి వదిలేసింతర్వాత చదివి చూస్తే RGB లో ఎరుపెక్కిన నా బుగ్గలు అద్దంలో చూసుకుంటే CMYK లో వాయిలెట్ రంగులో వికసించాయి.
ప్రేక్షకులే తప్ప పాఠకులు ఉండొద్దన్న ఉద్దేశ్యంతో మీ అసౌకర్యార్థం చదవడానికి వీల్లేని రెజల్యూషన్లో పైగా బ్లాక్ అండ్ తెలుపులో పోస్ట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నా.
[తుపాను హెచ్చరిక:
అనోసరంగా చదవడానికి ట్రై చేస్తే కళ్లు బైర్లు కమ్మి ఆనందబాష్పాలు రాలటం ఖాయం.]

5, ఏప్రిల్ 2010, సోమవారం

2010 మాడల్ హీరో హోండా

ఆంగ్లంలో బ్లాగి,ఆంగ్లంలో సైట్లు కొట్టి,ఆంగ్లంలో పిచ్చర్లు అనుభవించి చివరికి ఆంగ్లంలో భుజాలు ఎగరేయడం వరకెళ్లింది నా యవ్వారం.
నా తెలుగుకు తెగులు పట్టే సినిమా స్కోపెక్కువని గ్రహించి ఈ బ్లాగు[అసలు "బ్లాగు" ను తెలుగులో ఏమంటారో తెలుసేటీ?]ను తెరవడం జరిగింది.

రకరకాల మానవుల నుంచి అనూయ్యమైన పోన్లు వస్తూంటే{ఇంకా జంతువులనుంచైతే ఇంతవరకు ఏ పోనైతే రాలే మరి...పోన్ చేయనోల్లంతా జంతువులనుకుంటే దానికి నేను చేసేదేం లేదు}పోన్లు రిసీవ్ చేసుకొని బొబ్బలెక్కిన నా వేళ్ళు,ట్రాఫిక్ లో కంట్రోల్ తప్పుతున్న నా బైకు బాధలు ఎన్నని చెప్పను??
మరీ ముఖ్యంగా నా 2001 మాడల్ హీరో హోండా ను కంట్రోల్ చేస్తూ 2010 మాడల్ హీరో అన్వర్ ని హ్యాండిల్ చేయడం మామూలు ఇషయమా?
నా తెగులుకు మెచ్చీ అఖిలాంద్ర కోటి బ్రహ్మాండ నాయకులు అక్షరలక్షలు వేసినా,పాదరక్షలు విసిరినా అందులో సగం షేరు కూడా నాకే దక్కును.

4, ఏప్రిల్ 2010, ఆదివారం

చూపున్న బాట

మా చంటిదానికి జొరమొస్తే నల్లకుంట రైల్వేబ్రిడ్జి దాటి కుడి సైడు సందు గూండా "అభయ" ఆసుపత్రికెళ్ళడం అలవాటు.
పోతూ,పోతూ మూలమలుపు దగ్గర ఫ్లూటు వాయించే "చూపున్న పాట"ను తలుచుకోవడం,ఇంకో రెండడుగులు ముందుకేసి పతంజలి సారు కిరాయికుండే ఇంట్లోకి తొంగి చూసి "సారెక్కడో ? తను కనిపెట్టిన "గ్రోయల్" హేరాయిల్ కు నేను వేసిన [భారీగా పెరిగిన జుత్తుతో తపస్సు చేస్తున్న ఓ మునిని చూపిస్తూ పార్వతీదేవి శివుడితో.."దొంగ తపస్సు స్వామీ! అది గ్రోయల్ వాడి పెంచిన జుత్తు" అంటుంది..] కార్టూన్ ను ఫ్రేమ్ కట్టించి వేలాడ తీసిన గోడెక్కడో చూడాలనిపిస్తుంటుంది..గొంతు నొప్పంటే ఏదో పొడిలో అరటి పండు అద్దిచ్చిన తాలూకు మునివేళ్ళ స్పర్శ జ్ణాపకాలు ....అప్పన్న సర్దార్ ఆనవాళ్లు..ఇంకా గోపాత్రుడు...క్రిష్ణ జిల్లా దెయ్యం...
ఆ సందు నుంచి వెళ్తూంటె .,
"టక్ చేయండి..ఇంగ్లీష్ నేర్చుకోండి..చదవండీ.."అన్న మాటలు ఇంకా గింగురుమంటున్నాయి..
అంబర్ పేట నుంచి శివం గూండా "అభయ" ఆసుపత్రికెళ్ళే దగ్గర దారున్నా నాకు కేరాఫ్ పతంజలి సారు బాటంటేనే మక్కువ.

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

పతంజలి­.....ఓ మెగా పిక్సల్



నాలుగేళ్ళ కింద ఆఫీసుకు పోతు పోతూ మనసులో ఏదో తెలియని రంధి.మధ్యలో పాత ఉదయం ఆఫీసు దగ్గర బండి ఆపి లోపలికెళ్ళా..
రెండో ఫ్లోర్ లో మొత్తం చిమ్మచీకటి..మధ్యలో దివ్యమైన కాంతితో చుట్టూ తామరాకుల్లాంటి దిన పత్రికల నడుమ బ్రహ్మ దేవుడిలా పతంజలి గారు..
ఉదయం పార్ట్..టూ కొసమని గ్రహించా..పెద్దంతరం,చిన్నంతరం లేకుండా లటుక్కున్నెళ్ళి ఎదురుగా కూసున్నా..ఎలా ఉన్నారండి?అన్నాడు.ఏమో సార్..అది తెలుసుకుందామనే వచ్చానన్నా..ఫ్లాటూ అదీ గట్రా కొన్నారా?అన్నాడు..లే,లేద్సార్ అన్నా..
రామోజీరావు,రాగిచెంబు కత దగ్గర్నుంచి
రకరకాల ముచ్చట్ల తర్వాత,

శ్రీమాన్ సెంద్రబాబు గోరి సవుజన్యంతో సంపాయించిన నా నోకియా ఎన్ సిరీస్ మొబైల్ సూపెడితె ముచ్చట పడ్డాడు..
సార్ సార్..ఒక్క పోటో కోసం ఒక్క పోజు అనడిగా.......సూర్యుడు అటేపే ఉన్నాడు,మీరూ అటేపే ఉన్నారు..లైటింగు సరిగ్గా లేదు సార్ మీరు ఇటేపు వచ్చి కూసొండి అంటే..,లేదు,లేదు సూర్యుడినే అటేపు రమ్మనండి నేను ఇక్కన్నుంచి కదలనన్నాడు..
పై పోటొ అలా తీసిందే నా ఒన్ పాయింట్ త్రీ మెగా పిక్సల్ తో..
[నా ఫొన్లో పతంజలి గారు..నా జేబులో నా పోను...నా హ్రుదయానికి దగ్గర్లో నా జేబు...]

1, ఏప్రిల్ 2010, గురువారం

మెహిందీ సజాకె రఖ్ నా...




సానియా పెళ్ళి..ముహూర్తం దాటక ముందే ముచ్చట తీరాలని పురమాయిస్తే ఓ రెండున్నర గంటల్లో
వెలగబెట్టిన వైనం.
మోహన్ సారన్నట్టు..."మజా అంటె మన పెన్సిల్ గీతలు రంగులు గా మారడం..దానికి ప్రాణం రావడం..
ఎగరడం..చివరికది సానియా మీర్జా గా మారడం..ఆవిడ టెన్నిస్ ఆడడం...."

నా ఇంకొన్ని యాని"మోషన్" వీడియోలను ఈ లింకు చోట నొక్కి చూసి తరించి ధన్యులవండి...

చాపల పులుసా ! మజాకా !!




నెలకో,వారానికో మేము పట్నం నుంచి మా ఊరికెళ్లే సమయం వచ్చిందని తెల్వగానే మా నాయిన సైకిలేసుకొని ఊరు ఊరంతా
పచ్చాపల[పచ్చి+చేపలు] కోసం వేట మొదలెట్టే వాడు..
మేము ఊరి పొలిమెరకు చేరుకునే సరికి మా అమ్మ చేసిన కమ్మటి చాపల పులుసు జిలకర మెంతుల వాసన మాకు స్వాగతం చెప్పేది.
మా నాయిన చాపలు తేవడమూ,మా అమ్మ వండడమూ...అబ్బో పసిడికి పరిమళమే...
ఆ చాపల తున్కల్ని మెడిటేషన్ చేస్తున్నంత శ్రద్దగా,ఏకాగ్రతతో మింగుతూ, మింగుతూ..ఎసరు నాకుతూ,నాకుతూ సర్గం లో తేలేవోల్లం...
అట్టి అమ్మ చేసిన చాపల పులుసుతో మోహన్ సారుకు గాలం వేయగా గిల గిలా కొట్టుకుంట్టూ మా నాయిన మీద రాసిన వ్యాసమిది..