మా చంటిదానికి జొరమొస్తే నల్లకుంట రైల్వేబ్రిడ్జి దాటి కుడి సైడు సందు గూండా "అభయ" ఆసుపత్రికెళ్ళడం అలవాటు.
పోతూ,పోతూ మూలమలుపు దగ్గర ఫ్లూటు వాయించే "చూపున్న పాట"ను తలుచుకోవడం,ఇంకో రెండడుగులు ముందుకేసి పతంజలి సారు కిరాయికుండే ఇంట్లోకి తొంగి చూసి "సారెక్కడో ? తను కనిపెట్టిన "గ్రోయల్" హేరాయిల్ కు నేను వేసిన [భారీగా పెరిగిన జుత్తుతో తపస్సు చేస్తున్న ఓ మునిని చూపిస్తూ పార్వతీదేవి శివుడితో.."దొంగ తపస్సు స్వామీ! అది గ్రోయల్ వాడి పెంచిన జుత్తు" అంటుంది..] కార్టూన్ ను ఫ్రేమ్ కట్టించి వేలాడ తీసిన గోడెక్కడో చూడాలనిపిస్తుంటుంది..గొంతు నొప్పంటే ఏదో పొడిలో అరటి పండు అద్దిచ్చిన తాలూకు మునివేళ్ళ స్పర్శ జ్ణాపకాలు ....అప్పన్న సర్దార్ ఆనవాళ్లు..ఇంకా గోపాత్రుడు...క్రిష్ణ జిల్లా దెయ్యం...
ఆ సందు నుంచి వెళ్తూంటె .,
"టక్ చేయండి..ఇంగ్లీష్ నేర్చుకోండి..చదవండీ.."అన్న మాటలు ఇంకా గింగురుమంటున్నాయి..
అంబర్ పేట నుంచి శివం గూండా "అభయ" ఆసుపత్రికెళ్ళే దగ్గర దారున్నా నాకు కేరాఫ్ పతంజలి సారు బాటంటేనే మక్కువ.