7, ఏప్రిల్ 2010, బుధవారం

ఎలుకపైన ఊరేగి..



పై బొమ్మ మా ఇస్కూల్ హింది పండిట్ కం డ్రాయింగ్ టీచర్ కాళిదాస్ రావ్ సార్ ది.గీసింది మా తమ్ముడు దత్తు.
సారు బొమ్మ గీయని జనమ ఉంటేనేం ఊడితేనేం అని బాధ పడుతుంటే సూల్లేక ప్రింటింగ్ కు పోన్ చేసి పోస్ట్ పోన్ చేయమన్న .. ప్రియశిష్యుడు గీయని సారు ప్రింటింగ్ కు ఎట్లెళ్తడు?
సారు ఇస్కూళ్ళో బోర్డు మీద బొమ్మ దించుతుంటె సూడాలే..ఆ విగ్రహం,ఆ పోజు,ఆ కత,ఆ గీతలూ....ఉత్త గీతలే కాదు,వంటి మీద పోరగాల్లకు వాతలు కూడా..సుద్ద మొద్దు దద్దమ్మల్ని వంగబెట్టి దడ దడ దంచుతుంటె సామిరంగా ఆ రోజు హోళీ పండగేమో అనిపించేది, ముఖమంతా బుక్కగులాల్ జల్లుకున్నట్టు ఎర్రగా..అంత కోపం మరీ.
ఆంధ్రా అమితాబ్బచ్చన్ లెక్క ,సారంటె పోచంపల్లి బాపు మోహన్.
పొట్టిగా,బొర్రతో,వేగంగా నడూస్తుంటే అమీన్సాబ్లు సైతం సలాంలు కొట్టెవాళ్ళు..హవా అట్టాంటిది మరి..నార్త్ ఇండియన్,హిందీ తెల్గు మిక్స్ చేసి మాట్లాడెవాడు.
ఇనాయకుడి బొమ్మలు గీయడం వల్ల,చేయడం వల్ల సారు కూడా ఇనాయకుడి మాదిరి మారిపోయాడేమో అనిపింఛేది.
ఇనాయకుడి బొమ్మలు చేయడంలో సారును కాదని ఇంతవరకు మా ఊళ్ళొ రొమ్ము ఇరుచుకొని వచ్చిన కేతిగాళ్ళు నాకు తెలిసి లేరు.
ఇనాయకుడి బొమ్మల్ని ఆనిమేషన్ చేసేవాడు,అంటే తొండంలో,చేతుళ్ళొ స్ప్రింగులు పెట్టి మట్టితో కప్పెట్టి బొమ్మ పూర్తి చేసోటోడు..ఒక్కసారి చేయి ఎనక్కి లాగి వదిల్తే నవరాత్రులు అయిపోయొ వరకు దేవుడు చేయి వెనక్కి,ముందుకి దీవిస్తూనే వుండేవాడు..అట్లాగే తల,తొండం..తోపుడు బండి మీద ఆ ఇగ్రహాన్ని పెట్టి ఊరు ఊరంతా తిప్పేవోడు..చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు.."ఎలుక పైన ఊరేగి ఎల్లలోకమును తిరిగి.."అంటూ ఎస్.జానకి ప్లే బ్యాక్ సింగింగు...
సారుకు మా నాయినకు మంఛి దోస్తానా..నాగార్జున సిమెంటు,భారతీ సిమెంటంత స్ట్రాంగు..
కౌసు[నీసు]ముట్టడు సారు,కౌసు లేంది ముట్టడు మా నాయిన....అయినా దోస్తానా దోస్తానె..కళకు కౌసు అనోసరం మరి.
సారు ఎకాఎకిన గుండె పోటొచ్చి చచ్చిపోయాడు..
సార్ ని లేపి తీసుకెళ్తూంటే చుట్టూ ఎలకపిల్లల్లాగ ఊరి జనం...డప్పుల దరువు..

2 కామెంట్‌లు: