23, జూన్ 2010, బుధవారం

వనితయందు సృజన వర్ధిల్లుతున్నది

మూడు బాగోక మాడు పగలకముందే మధుబాలకు మిస్సుడుకాలివ్వరాదా?..ఆర్పిన ట్యూబులైటు వెలుతురులో యూట్యూబులో ప్యార్ కియాతో పాటేసుకోరాదా..
అబ్బ..జైలుగోడలమధ్య మసిపూసిన బుగ్గలమాటు అందం ముందు దాస్యశృంఖలాల బిగితనమెంత..దిలిప్ కుమార్ పై ఒలకపోసిన వేల టిఎంసీల పరిశుద్ధమైన ప్రేమజలపాతం వాల్యూ కట్టేదెలా..?
ఆఫ్టరాల్ అమ్మమ్మ వయసైతే ఎంత..? అడ్జెస్టబులిటికి లేని అభ్యంతరం నీకెందుకంటా..?
మొనాటనీ ఎరగని అనాటమీతో నా రకతంలో ఈస్థటిక్ ఎనస్థీషియా..
ఐమాక్సుకు మించిన నా మైక్రోమాక్సులో రోజుకు మూడొందల అరై మొగలే ఆజమ్ లో.. ఓ వుమెన్!యూ ఆర్ మార్వలెస్..యూ ఆర్ ఇన్సిపిరేషన్ ఫర్ క్రియేషన్..
ఈ వనితయందు సృజన వర్ధిల్లుతున్నది

22, జూన్ 2010, మంగళవారం

నా బైకు..మానాయిన సైకిలు

నా పెళ్ళికి మా అత్తగారు పెట్టిన వీరోవోండాAP24 F824 ఇస్ప్లెండరు బైకంటే నాకు మస్తు మజా..దాన్ని కొత్తలో ఎక్కితిరిగినదానికంటే కడిగి తుడిసిందే ఎక్కువ.టైర్లు అరక్కుండా గాల్లో తిప్పేవోన్ని..బైకు సీటు అనిగిపోతుందేమోనని బెంగగావుండి పైన కుసోనికుసోనట్టు నడిపేవోన్ని..నా బైకుమీద నా పనిమీదైనాసరే వేరేవోళ్ళు ఎక్కడానికి లే..అంతెందుకు నేను కిక్కు కొడితే వచ్చే ఇంజనాయిలు వాసనకూడా వేరేవోళ్ళు పీల్చడానికి ఈల్లేదంతే..దూరం ఫొ..దూరం పో..అని గెదిమేవోన్నీ..
ఎన్నడెక్కనోడు ఎద్దు ఎక్కితే ఏదో కాయకాసిందన్నట్టు..అట్టా ఎక్కి తిరిగేవోన్ని నా బైకు మీద..
నా బైకుని మా సిన్నతమ్ముడుతప్ప ఇంగే నరమానవుడు ముట్టినా భస్మం..మా సిన్నతమ్ముడు ఎందుకంటే బైకు ఆడు ఎక్కితేనే నేనెక్కేది ,అదెట్లన్నన్ నాకు డ్రైవింగు నేర్పేది ఆడే మరి.నే లేనప్పుడు వాడు నా బైకేసుకొని ఈర సివాజి గుర్రమ్మీద దౌడు తీసిన లెవల్లో వుండేది పోజు..అడ్డుకుంటే "డ్రైవింగు సగం నేర్పి వదిలేస్తా బురద గుంతలో పడి సస్తావ్ జాగురత్తా!" అని బ్లాకుమెయిలింగుకు దిగేవోడు..సరేనని కాంప్రమైజు అయ్యేవోన్ని...స్టీమింజను,ఇమానము తప్ప ఈ బూమండలమ్మీద తిరిగే ప్రతొక్క వాహనాన్ని రోడ్డురోలరుతో సహా నడిపాడు మా సిన్నతమ్ముడు..బండ్లు తోలడంలో వాన్ని మించిన పహిల్వాను మా ఊరు సరవుండు ఏరియాలో ఇంకోడు లేడు. సరే వీడెంత దూరం తిరుగుతాడోనని కనిపెట్టడంకోసం రగస్యంగా మీటరు రీడింగు రాసుకునేవోన్ని..ఆడు నాకంటే గనుడు నాచంటమల్లన్న లెక్కన మీటరు వైరు పీకేసి తిరిగేవోడు..
పూర్తిగా డ్రైవింగు నేర్చుకున్నంక "ఇంగ నా జోలికి రాకు పో రా" అంటా ఆన్ని అసుంటా నూకేసేవోన్ని..వాడు ఏడ్పు మొకంతో అటే పోకడ.
ఇంగ నేను బైకు తీసిన ప్రతీసారీ మా నాయిన తన అట్లాసు సైకిలు తీసేవోడు పోటీగా..మొదట్న ఒకట్రెండుసార్లు మానాయిన నన్ను బైకిమ్మంటే "ఇయ్యనుపో..కస్టపడి మీరు నాకు పెండ్లి సేస్తే సంపాయించుకున్న బైకిది" అన్నాన్నేను..అప్పట్నుంచి నన్నడగలే..కసిగా నా బైకుకు తాతలాగ తన సైకిలు తుడిసి ఎక్కేవోడు..ఇస్పీడుగా నడవడానికి రోజు చక్రంలో గ్రీసు ఏసుకొనేవోడు..నేను బైకు ఇస్టార్టు సేసి మొగలాయిలెక్కన ఎక్కి ఎల్తుంటే మా నాయిన నేనేం తక్కువతిన్నానా అన్నట్టు తన సైకిలు ఎక్కి అలెక్జాండరు లెవల్లో ఎళ్ళెవోడు..నా బైకు కీకీ.. కీకీ.. కీకీ.. కీకీ అంటూంటే మా నాయిన సైకిలు బెల్లు ట్రింగు ట్రింగు మంటూ వెలవెలబోయెది..అది మా నాయినకు సిన్నతనంగా తోచేది..ఇంగ ఇట్లాగాదని ఓరోజు మా ఊర్నుంచి మానాయిన సైకిలేసుకొని హైద్రాద్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ జుమ్మెరాత్ బజారు చేరుకొని [మా నాయిన ఊ అంటే జుమ్మెరాత్ బజారుకొచ్చేవోడు..అక్కడ వాడిపడేసిన వస్తువుల్ని అడ్డికి పావుసేరు లెక్కన అగ్వసగ్వ ధరలకు అంటగడ్తారు] ఇస్కూటరుహార్న్ కొని సైకిలుహ్యండిలుకు బిగించి పీపీ..పీపీ..పీపీ అని హార్ను చప్పుడుచేస్తూ ఇంటికొచ్చడు ఇజయగర్వంతో ..
నా సైకిలుముందు నీ ముష్టి బైకెంతరా అంటూ సైకిలుకున్న హార్ను పీపీ..పీపీ..పీపీ అని మోగిస్తూ చెమటలుకక్కుతూ ఆయాసంతో ఎత్తుగడ్డలు బలంతాన తొక్కుతున్న మానాయిన సైకిల్ ని నా బైకుతో ఓవరుటేకు చేసి నన్నుదాటిపోవద్దని చేయితో కుడేపు సైడు చూపెట్టిన.

18, జూన్ 2010, శుక్రవారం

గోరి బండ

పొద్దంతా చేనేతపని ఐపోగానే మా నాయిన హాబీకింద పొద్దుగూకినంక స్టవ్వురిపేర్లు,సైకిలురిపేర్లతో పాటు సచ్చిపోయినోళ్ళ గోరి బండపై ఆ మనిషి తాలూకు వివరాలు రాసి చెక్కే పని చేసేవోడు.ఈ పనిలో మా నాయినకు భలే గిరాకీ వుండేది మా ఊళ్ళో.
ఇట్లా బండలపై బొమ్మలు,పేర్లు చెక్కి బ్యాంకు బ్యాలెన్సులు,బంగళాలు,బొచ్చుకుక్కలు,బెంజికార్లు సంపాయించాలని కాదు..మా నాయినకు అదో తుత్తి.
"శ్రీ ప్రజోత్పత్తి నామ సంవత్సరం జ్యేష్ట బహుళ శనివారం ది:29..06..1991 న శ్రీ మస్నరాములు గారు స్వర్గస్తులైనారు!
జననం:06..04..1921 మరణం:29..06..1991"
అని చెక్కి ,ఇరువైపుల సచ్చిపోయిన సదరు మనిషి శివభక్తుడైతే లింగం,పాము..విష్ణు భక్తుడైతే శంఖు చక్రాలు..రామ భక్తుడైతే భాణం బొమ్మలను చెక్కేవోడు.
బండలపై పేర్లు చెక్కడానికి అవసరమయ్యే పనిముట్లను కూడా మా నాయినే సొయంగా తయారుచేసేవోడు..సన్న ఇనుపముక్కల్ని బాగా కాల్చి పెన్సిలు మాదిరి చివర్న సన్న మొనతేలేటట్టు రకరకాల సైజుల్లో ఇనుప పెన్సిల్లను తయారుచేసి పెట్టేవాడు.ఏ ఫాంటు సైజుకు ఆ పెన్సిలన్నమాట..
ఇంగ మా ఊళ్ళో సావుడప్పు సప్పుడు కాంగానే మా నాయినకు గిరాకి తగిలిందన్నమాటే..పొద్దున్నే సచ్చిపోయిన సుట్టాలు బండలు పట్టుకొని మా ఇంటికొచ్చేవోళ్ళు..వివరాలు రాసిపెట్టిన కాయితాలను{ఒక్కోసారి సచ్చిపోయిన సమయం,గడియల వివరాలు మా నాయినే గంటలపంచాంగం చూసి చెప్పేవాడు] మా నాయిన చేతిలో పెట్టి "ఎంత?" అనడిగేవోళ్ళు.."పైసల్దేముందిలే.."అని పంపించి పొద్దుగూకాక పని మొదలెట్టేవోడు.
మొదట బండను సుబ్భరంగా కడిగి ఆరిన తర్వాత అక్షరాలు గుండ్రంగా కుదరడానికి చాక్ పీసుతో అడ్డగీతలు కొట్టి మద్యలో అక్షరాలు రాసేవోడు..మొదటి ఒకటి రెండు అక్షరాలను ఇనుపపెన్సిల్లపై సుత్తితో కొడుతూ మిగతాపని మా అన్నకు పురమాయించేవోడు..
పొద్దున్నే ఐదారుగంటలకు టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ మంటూ బండ మీద సచ్చిపోయిన మనిషి ఆత్మను మెప్పించేటట్టు మా నాయిన సుత్తితో చేసే శబ్ధంతో మేం నిద్రలేసేవోళ్ళం..రెండో రోజు సాయంత్రంనాటికి బండ రెడీ.
మా తాత రోజూ సాయంత్రం మా ఇంటికొచ్చి మానాయిన పని కనిపెట్టేవోడు..గోరిబండలు ఇంట్లో కనిపిస్తే "ఎందుకురా..సచ్చినోళ్ళ బండలు రాయడం..మంచిదికాదురా అరిష్టం..అష్టదరిద్రం..వద్దని ఎన్నిసార్లు సెప్పినా వినవేంరా??"అనేవాడు మా తాత మా నాయిన్ని.."ఆ ఏంది అయ్యేది,లొట్టపీసు..అందరం సచ్చేటోళ్ళమే..అందరికీ గోరీలు కట్టేదే.."ఇదీ మా నాయిన రిప్లే...బండకు ఇరవయ్యో,ముప్పై రూపాయలో తీసుకున్నట్టు గుర్తు..ఇస్తే తీసుకునేది..లేకుంటే లే..అడిగేవోడు కాదు..కాని మా అమ్మ వదిలే బాపతేనా...క్లయింట్లు పైసలిస్తేనే గుమ్మం దాటేది.
మా నాయిన చాతి నొప్పితో దిల్ షుక్ నగర్ సాయికమల్ ఆసుపత్రిలో 2003 సెప్టెంబర్ 12 మద్యాన్నం జాయినయ్యాడు..చికిత్స చేస్తుండగా రాత్రి పదిన్నరకు గుండెపోటుతో చచ్చిపోయాడన్నారు డాక్టర్లు.
మా ఊళ్ళో మా నాయిన కాష్టం అవీ కార్యక్రమాలు ముగిసాక గోరీ కట్టే స్తలం కోసం చూస్తుండగా మా ఊరి పెద్దమనిషి ఎంటరయ్యి "వద్దొద్దు..ఇక్కడ ఇంగ గోరీలు కట్టేది లేదని ఉపసర్పంచి చెప్పాడు...ఈ జాగలల్ల ఇండ్లు కడ్తరంటా.."అన్నాడు..ఎంత బతిమిలాడినా విన్లే..మా నాయినకు గోరి కట్టడం కుదర్లే..
పోచంపల్లి నుండి భీమన్ పల్లికి వెల్తుంటే మధ్యలో ఎడమ కుడి వైపుల మొత్తం మా నాయిన రాసిన గోరీబండలే...వాటి మధ్యలో మా నాయిన గోరీ లేదు,బండ లేదు.

14, జూన్ 2010, సోమవారం

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు నిండితే ఎట్లుంటదో ఇరవై నిమిషాల్లో చేసి చూపెట్టమంటే పటాపట్ చేసి ఇసిరిపడేసా..
ప్రియాంకకు అరవైనిండి అమ్మమ్మ మరియూ నాయినమ్మగా మారి స్వెట్టర్లు గట్రా కుడుతూ ఓ మూల రామ్ ఔర్ క్రుష్ణ చాటింగు చేసే కాలం నాటి నా కూలి [టైం మిషన్ చార్జీలు ]లెక్కలు చెప్పి డిమాండు చేస్తే కాదు కూడదన్నారు..ఇది న్యాయంగా అన్యాయం..

12, జూన్ 2010, శనివారం

పచ్చనాకుసాక్షిగా!

సాచ్చాత్తు పానవాయువునిచ్చే సెట్లను నరికితే ఏం పీల్చి బతుకుతావ్రా సన్నాసి ? అనే సందేశాత్మక,సందేహాత్మక కార్టూన్లు గీసే ప్రయత్నంలో తటుక్కున తట్టిన అవిడియాలతొ పుటుక్కున గీసిన గీతలివి.
పచ్చదనం పచ్చ"ధనం"గా మారుట పాపము...సెట్లను నరికితే నరకబడేవు...సమస్త భూమండలము పచ్చనాకుసాక్షిగా కళకళలాడలని నా ఉద్దార్కం.
అయినా జూలియన్ పెనాపాయ్,బొలిగన్ ముందు మనమెంతా..మనబతుకెంతా..మనబొమ్మలెంతా..మన సందేసమెంతా?????

8, జూన్ 2010, మంగళవారం

మట్టిపరిమళం మా నాయిన

మొన్న మా ఊరెళ్ళినప్పుడు నా పాత పుస్తకాల అట్టడబ్బ దులిపితే బయటపడ్డ మా నాయిన మీద రాసిన ఈ వ్యాసం మీద నా కన్నీటిచుక్కలు బొట్లుబొట్లుగా రాలగా తడిసిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటే కొంతలోకొంత గుండె దిటవవుతుందని....


5, జూన్ 2010, శనివారం

చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ !

దినపత్రిక కోసం గీకే బొమ్మకు,టీ.వీ ఛానలు కోసం గీకితే గోకే బొమ్మకు చాలా దగ్గర సంబంధం ఉంది..ఒకరకంగా బొత్తిగా సంబంధం లేదు...
పరపంచ పర్యావరన దినం కోసం శ్యామ్ మోగనుగారు పోన్జేసి "మ్రుత్యుంజయ్ గారూ !మరే మీరు కార్టూన్లు పంపండి స్సార్..లుంబినీ పార్కులో ఎజ్జిబిషను పెట్టి ఎగసెక్కాలాడదాం స్సార్.."అంటూ బండ మర్యాదలాడాడు..సరేలే అన్జెప్పి ఓ మూన్నాలుగు బరబరా గీకి లుంబినీ పార్కులో సూపర్ ఇగో ఎజ్జిబిషను ప్రదర్శించి పక్కనే వున్న ఉస్సేను సాగర్లో దూకి సద్దాం..లేదా పక్క కలాకారులను నూకేసి బుద్ధభగమంతుడికి సెల్యూట్ సేద్దామని గీకిన కార్టూన్లో ఒహటి ఆనిమేసనుకు సవులబ్యంగా తోచీతోచగానే ఓ యానివేషం కట్టా........[లేటెస్టు ఇన్పర్మేసను ఏంటంటే వెన్యూ మారిందంటా.]
చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ ! అని మనమిక్కడ గమనించాల్సిన ఘట్టం.

3, జూన్ 2010, గురువారం

3D ధన్యవాదాలు

నా రాతల్ గీతల్ బాగున్నయని మీరు పొగిడేస్తూంటే అందర్లెక్కన రిటెన్లీ రొటీన్ గా ధన్యవాదాలు,థాంక్సు సెప్పడం బాలేదని నన్నునేను 3D లోకి గుసాయించుకొని ఇట్లా ధన్యవాదాల్ సెప్తున్నా.

1, జూన్ 2010, మంగళవారం

కట్టెలపొయ్యి


మా దోస్తుగాడి ప్రెండుగాడొకడు "పార్టీకి హోటల్ తాజ్ క్రుష్ణకు రారోయ్!" అంటే ఎగేసుకుంటూ ఎళ్ళా..లజ్జలేకుండా పిజ్జాలు,బగ్గ బర్గర్లు ఇంకా నానాగ్రాసం భోంచేసి బయటకొచ్చి బొజ్జరాసుకుంటూ మెడకాయ్ మీద తలకాయ్ పైకెత్తి సూద్దునుగదా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె...హోటల్ తాజ్ క్రుష్ణకు బ్యాగ్రౌండ్ లో పదింతల ఎత్తైన మా అమ్మ ఇశ్వరూపం దర్శనమయ్యింది..ఓ సేతిలో పెద్దచెమ్చా,ఇంకో సేతిలో పొగగొట్టం,అవతల సేతిలో సర్వపిండి,ఇటుపక్కల సేతిలో నూనెడబ్బ..మింగతా నాలుగు సేతుల్లో ఉప్పు,కారం,పసుపు డబ్బాలు..
కట్టెలపొయ్యిమీద కంపమండల్తో నిప్పురాజేసి మా అమ్మ చేసే సర్వపిండి రుచి చూసిన నా నాలుకేనా ఇంత అంకచండాలమైన నానాగడ్డి భోంచేసింది???
బియ్యప్పిండిలో ఇంత పసుపు,అంతకారం,మరికొంత ఉప్పు,ఇంగొంత జిలకర గట్రాగట్రాలేసి నాన్చి ఆ పిండిని సర్వ[చిన్న బిందె]కు వత్తి,రంద్రాలయ్యేట్టు వేళ్ళతో నొక్కి పొయ్యిమీదెట్టి పొగగొట్టంతో ఉఫ్ఫూ.. ఉఫ్ఫూ మంటూ ఊదుతూ పొగతో నిండిన కళ్ళను కొంగుఅంచుతో తుడుసుకుంటుంది.. కంపమండల ముళ్ళను మునేళ్ళకు తాకకుండా జాగురత్తతో ఇరిచి పొయ్యిలోకి ఎగదోస్తూ ఆ వంటకం పూర్తయ్యెవరకు అక్కడే కూలబడి పొగతో ఎర్రగామారిన కళ్ళతో పొయ్యిమీద ఎర్రగా మాగిన సర్వపిండిని మాకు వడ్డిస్తుంది మా అమ్మ..ఇంగ వళ్ళు తెల్వకుండా తిని సొర్గంలో ఊగిపోవడమే మా పని.
మా అమ్మ కట్టెలపొయ్యిముందు హోటల్ తాజ్ క్రుష్ణ విలువ అచ్చరాల రుప్పాయ్ ప్పావలా అయినా ఎక్కువే.