18, జూన్ 2010, శుక్రవారం

గోరి బండ

పొద్దంతా చేనేతపని ఐపోగానే మా నాయిన హాబీకింద పొద్దుగూకినంక స్టవ్వురిపేర్లు,సైకిలురిపేర్లతో పాటు సచ్చిపోయినోళ్ళ గోరి బండపై ఆ మనిషి తాలూకు వివరాలు రాసి చెక్కే పని చేసేవోడు.ఈ పనిలో మా నాయినకు భలే గిరాకీ వుండేది మా ఊళ్ళో.
ఇట్లా బండలపై బొమ్మలు,పేర్లు చెక్కి బ్యాంకు బ్యాలెన్సులు,బంగళాలు,బొచ్చుకుక్కలు,బెంజికార్లు సంపాయించాలని కాదు..మా నాయినకు అదో తుత్తి.
"శ్రీ ప్రజోత్పత్తి నామ సంవత్సరం జ్యేష్ట బహుళ శనివారం ది:29..06..1991 న శ్రీ మస్నరాములు గారు స్వర్గస్తులైనారు!
జననం:06..04..1921 మరణం:29..06..1991"
అని చెక్కి ,ఇరువైపుల సచ్చిపోయిన సదరు మనిషి శివభక్తుడైతే లింగం,పాము..విష్ణు భక్తుడైతే శంఖు చక్రాలు..రామ భక్తుడైతే భాణం బొమ్మలను చెక్కేవోడు.
బండలపై పేర్లు చెక్కడానికి అవసరమయ్యే పనిముట్లను కూడా మా నాయినే సొయంగా తయారుచేసేవోడు..సన్న ఇనుపముక్కల్ని బాగా కాల్చి పెన్సిలు మాదిరి చివర్న సన్న మొనతేలేటట్టు రకరకాల సైజుల్లో ఇనుప పెన్సిల్లను తయారుచేసి పెట్టేవాడు.ఏ ఫాంటు సైజుకు ఆ పెన్సిలన్నమాట..
ఇంగ మా ఊళ్ళో సావుడప్పు సప్పుడు కాంగానే మా నాయినకు గిరాకి తగిలిందన్నమాటే..పొద్దున్నే సచ్చిపోయిన సుట్టాలు బండలు పట్టుకొని మా ఇంటికొచ్చేవోళ్ళు..వివరాలు రాసిపెట్టిన కాయితాలను{ఒక్కోసారి సచ్చిపోయిన సమయం,గడియల వివరాలు మా నాయినే గంటలపంచాంగం చూసి చెప్పేవాడు] మా నాయిన చేతిలో పెట్టి "ఎంత?" అనడిగేవోళ్ళు.."పైసల్దేముందిలే.."అని పంపించి పొద్దుగూకాక పని మొదలెట్టేవోడు.
మొదట బండను సుబ్భరంగా కడిగి ఆరిన తర్వాత అక్షరాలు గుండ్రంగా కుదరడానికి చాక్ పీసుతో అడ్డగీతలు కొట్టి మద్యలో అక్షరాలు రాసేవోడు..మొదటి ఒకటి రెండు అక్షరాలను ఇనుపపెన్సిల్లపై సుత్తితో కొడుతూ మిగతాపని మా అన్నకు పురమాయించేవోడు..
పొద్దున్నే ఐదారుగంటలకు టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ మంటూ బండ మీద సచ్చిపోయిన మనిషి ఆత్మను మెప్పించేటట్టు మా నాయిన సుత్తితో చేసే శబ్ధంతో మేం నిద్రలేసేవోళ్ళం..రెండో రోజు సాయంత్రంనాటికి బండ రెడీ.
మా తాత రోజూ సాయంత్రం మా ఇంటికొచ్చి మానాయిన పని కనిపెట్టేవోడు..గోరిబండలు ఇంట్లో కనిపిస్తే "ఎందుకురా..సచ్చినోళ్ళ బండలు రాయడం..మంచిదికాదురా అరిష్టం..అష్టదరిద్రం..వద్దని ఎన్నిసార్లు సెప్పినా వినవేంరా??"అనేవాడు మా తాత మా నాయిన్ని.."ఆ ఏంది అయ్యేది,లొట్టపీసు..అందరం సచ్చేటోళ్ళమే..అందరికీ గోరీలు కట్టేదే.."ఇదీ మా నాయిన రిప్లే...బండకు ఇరవయ్యో,ముప్పై రూపాయలో తీసుకున్నట్టు గుర్తు..ఇస్తే తీసుకునేది..లేకుంటే లే..అడిగేవోడు కాదు..కాని మా అమ్మ వదిలే బాపతేనా...క్లయింట్లు పైసలిస్తేనే గుమ్మం దాటేది.
మా నాయిన చాతి నొప్పితో దిల్ షుక్ నగర్ సాయికమల్ ఆసుపత్రిలో 2003 సెప్టెంబర్ 12 మద్యాన్నం జాయినయ్యాడు..చికిత్స చేస్తుండగా రాత్రి పదిన్నరకు గుండెపోటుతో చచ్చిపోయాడన్నారు డాక్టర్లు.
మా ఊళ్ళో మా నాయిన కాష్టం అవీ కార్యక్రమాలు ముగిసాక గోరీ కట్టే స్తలం కోసం చూస్తుండగా మా ఊరి పెద్దమనిషి ఎంటరయ్యి "వద్దొద్దు..ఇక్కడ ఇంగ గోరీలు కట్టేది లేదని ఉపసర్పంచి చెప్పాడు...ఈ జాగలల్ల ఇండ్లు కడ్తరంటా.."అన్నాడు..ఎంత బతిమిలాడినా విన్లే..మా నాయినకు గోరి కట్టడం కుదర్లే..
పోచంపల్లి నుండి భీమన్ పల్లికి వెల్తుంటే మధ్యలో ఎడమ కుడి వైపుల మొత్తం మా నాయిన రాసిన గోరీబండలే...వాటి మధ్యలో మా నాయిన గోరీ లేదు,బండ లేదు.

4 కామెంట్‌లు:

  1. manachuttu unnavarini gamaniste rayadaniki boledu masala dorukutundi godava lekunda perlu prastavinchakunda raya vachu

    రిప్లయితొలగించండి
  2. @murali
    థాంక్యూ.నిజమే రాయవచ్చు కానీ,బతుకు జట్కాబండి..జర్ అసుంట ఇసుంట సూసి రాయాలి..తేడావస్తే లైపు వన్నాట్ సెవన్ బస్టాఫు అవుద్ది.
    @what to say about me!!
    అవునా??!

    రిప్లయితొలగించండి