3, మే 2011, మంగళవారం

మన చాకలి ఐలమ్మ



నాలుగేళ్ళు టీ.వీ ఫైవ్ లో డిజిటల్ పెన్నుతో చెవిలోగులుం తీసుకుంటూ సైన్మ ప్రమోషన్లకోసం వచ్చే ఇలియానా డెనిం జీన్సు ప్యాంటు బేబీసాఫ్టు అత్తరువాసన పీలుస్తూ..వైవల్ సోపుతో తడిసిన జెనీలియా జఘన ద్రుశ్యాల వైరల్ ఫీవరుతో ..తాప్సీ పెప్సి లిప్పుల సెక్సీచూపుల్లో పడికొట్టుకుపోయి మన చాకలి ఐలమ్మ బ్యూటీనే మరిచి పోయా..
ప్రతి ముడత వెనకాతల దాగిన స్ట్రగులు మడతలను గీయాలనే ఆలోచన వచ్చీరాగానే తొర తొరగా గీసిన బొమ్మిది.

25, ఏప్రిల్ 2011, సోమవారం

ఊరవతల మామిడితోటలో మా ఊరి పోరగాళ్ళం.

ప్రవీణ్ గాడు,జ్ఞానిగాడు ఫోన్ జేసి "ఉరే మన టెంత్ కిలాసు బ్యాచ్ పోరగాండ్లం కలిసి సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నాం వస్తావ్ రా?"అనడిగేసరికి గుండెల్లో మా పదోతరగతి రోజులనాటి ఖైదీనెం.786 గువ్వా గోరింకతో ..పాట బిగినింగు డ్రమ్ము మోగింది.పోచంపల్లి ఊరవతల కొంగరిభాస్కర్ మావిడి తోటల మా బ్యాచి పోరగాండ్ల సెలబ్రేషన్ దావత్ ఇంతెజాం చూసే సరికి వైబ్రేషన్ వచ్చింది.ఓ పక్క పాండు గాడి పంచులు..మరో పక్క ఆడిపోరలు ఎందుకు రాలేదని దామోదర్ గాడు ఒహటే గులుగుడు ..సాహేస్ గాడేమో పిలుద్దాంరా మళ్ళీ చేసుకుందాంరా అని ఊకుంచుడే సరిపాయె.
ఇంగ తినితాగి ఇరవై ఏళ్ళక్రితం జ్ఞాపకాలు పంచుకున్నంక, గద్దర్ పాటలకు మా గద్దగాల్ల గంతులకు ..మాయదారి మైసమ్మపాటల తీన్ మార్ల అదుర్లకు తోటలోని మావిడిపిందెలు రాలి కిందపడినయ్..మేము పద్నాలుగేండ్ల పిల్లలమైపోయినం.

"ఇంట్ల పెండ్లాం,బయట బాసే కాదురా,సమ్మచ్చారానికి ఒక్కరోజైనా దోస్తుగాండ్లకోసం కేటాయించుకోవాల్రా..నామటుకు నాకేమనిపిస్తుందంటే నాకు ఉంకో పదేల్ల ఆయుష్శు పెరిగిందనిపిస్తుందిరా !" అన్నాడు సుదర్సన్ గాడు మత్తుకండ్లతో సొలుగుతూ బండి తోల్తా..

[ఈ బ్లాగులోని నా జ్ఞాపకాల పోస్టునొకదాన్ని ప్రింట్లు దీసి మా టెంత్ బ్యాచి పొలగాండ్లకు పంచిపెట్టిన ఇషయాన్ని మళ్ళి ఇక్కడ పోస్టు చేయడం జరిగింది.]

10, ఏప్రిల్ 2011, ఆదివారం

లంచ్ టైముకు గంట ముందే..

తెలుగు పొలిటికల్ కార్టూనిస్టుల్లో మోహన్,సురేన్ద్ర,శ్రీధర్ లు వాడిన శ్లేషలు నా స్కూలుడేస్ లో లంచ్ టైమ్ కు గంటముందే నా కడుపునింపేవి.
సందుచూసుకొని పసందుగా వాడిన పదప్రయోగాలు రంజుగాతోచేవి.
పొగరాయుళ్ళను "బీడితులు"అని మోహన్ వాడినా, "హ్యాట్సాఫ్"కు పేరడీగా "తుండుగుడ్డాఫ్" అని సురేన్ద్ర రాసినా,"మన "మేయరు" అసలేమీ మేయరు" అని శ్రీధర్ అన్నా టేస్టు టేస్టుగా వుండేయి.అందుకే రెండు దశాబ్ధాలు దాటినా "ఉదయం","ఈనాడు" కార్టూన్లు కంఠతా వచ్చే భాగ్యం కలిగింది."పన్"డితులతో కలిసి మాట్లాడే అదృష్టమూ కలిగింది.

ఇక నేను గీసిన ఏ కార్టూనూ నేను చూసుకొని దాచుకొని చూసుకొని మురిసిపోలేదని చెప్పడానికి గర్వపడుతున్నా.ఖమ్మం ,వెస్ట్ గోదారి ,గుంటూర్ నుంచి అభిమానులు పంపిన అటూఇటూగా పదీ,పన్నెండేళ్ళనాటి ఈ నా కార్టూన్లు రిపేర్లు లేకుండా ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.





8, ఏప్రిల్ 2011, శుక్రవారం

పతంజలి తలపులు....ఒక దెయ్యం ఆత్మకథ

నా బ్లాగులో నేను పెడుతున్న ముచ్చట్లు చూసి సంబూరపడి ఓ పెద్దాయన "పతంజలి తలపులు" బుక్కు ప్రింటింగు మధ్యలో ఆపేసి నా బ్లాగు లింకు అందగానే అచ్చేసి వజను అనుకోకుండా డజను కాపీలు తెచ్చిచ్చెళ్ళాడు.
సరసమైన ధరలకు "పతంజలి తలపులు" కావాలనుకునేటోళ్ళు ఈ నెంబరుకు ఎసెమ్మెస్ పంపండి..9848555243.

12, జనవరి 2011, బుధవారం

మండల్ ని ప్రేమిద్దాం..మధుబాలను ఆరాధిద్దాం..




వాటర్ కలర్సుతో తలకు నీళ్ళోసుకొని తడియారబోసుకొని నా ఇన్ బాక్స్ కు వచ్చి చేరింది మధుబాల.నా మది క్వార్టర్ కలర్స్ తో మత్తెక్కింది..అది "సమీర్ మండల్" రంగుల స్విమ్మింగ్ ఫూల్ నుంచి వచ్చిన మర్మైడ్ అని తెలిసి ఢామ్మన్నా.
సరాసరి సమీర్ మండల్ కు మెయిల్ కొట్టా.."మరే ! మీ రంగులంటే అభిమానమండి..మీ బొమ్మలంటే మా ప్రాణమండి..ఓవరాల్ గా మీరంటే బొచ్చెడు ప్రేమాభిమానాలండి..!" అని సారాంశం.
"ఎస్".."ఓకె" అంటూ వచ్చిన పొడి పొడి మెసెజ్ లు చూసి నొచ్చుకున్నా.నాకు ఆ శాస్తి జరగాల్సిందే మరి.
ఆర్టు కొంచెము..ఇగో ఘనము రోజుల్లో సమీర్ బొమ్మలున్న క్యాలెండరునొకదాన్ని చూసి అంజాన్ కొట్టాను..నాకప్పుడు ఆర్ట్ పట్ల అనుభవము అండ్ ఆరాధనా లేకపోవడం అండ్ ఆఫ్ కోర్స్ అజ్నానబాండాగారం దండిగా వున్నందున డోంట్ కేర్ చేశా! రోజులు గడుస్తూంటే తెలుస్తూంది ఆ మజా,ఆ పెప్సీ,ఆ ధమ్సప్...!
సరే.,సొంతసోది కాసేపు పక్కన పెడితే..,
సమీర్ మండల్ బెంగాల్ బల్టీ లో పుట్టి కలకత్తాలో చదివి ముంబైలో ఆర్టు దుకాణం తెరిచాడు..1975లో ఆర్టులో గ్రాడ్యుయేషన్ కంప్లీటూ..పెయింటింగుల్లో చేయాల్సిందంతా చేసేశారు సీనియర్లు..తనకేం మిగల్లేదని బాధ..వాటర్ కలర్స్ అంటే ఎంతో ఇష్టం..ఎం చేసినా దాంతోనే చేయాలనే ఆశ..కానీ వాటర్ కలర్సు ఓ నీచం..ఓ వెలితి..ఓ భారరహితం అని తలంచి రోజులతరబడి తడబడి మధనపడి అగాధమవు జలనిధిలో ఆణిముత్యాన్ని వెతికిపట్టాడు..స్టయిలైజ్డ్ పెయిటింగుకు దారి కనిపెట్టాడు.ఆయిల్ పెయింటింగు ఎఫెక్టు వాటర్ కలర్స్ లో తెచ్చి ఎగ్జిబిషను పెడితే సందర్శకులు నీళ్ళుమింగారట..తోటి ఆర్టిస్టులు నీళ్ళు నమిలారట..ఆ దృశ్యాలుచూసి సమీర్ కళ్ళల్లో ఆనందంతో నీళ్ళుతిరిగాయట...ఆ టెక్చర్,స్ట్రక్చరల్ ఫీచర్స్ టెక్కులు చూసి ఆయిల్ పెయింటింగులేమోనని భ్రమపడ్డారట[కొంపదీసి వాళ్ళావిడ కూడా కూరల్లో ఆయిల్స్ వాడకుండా నీళ్ళుపోసి కూరలు కానిచ్చేయడంలేదుగా ??]
కొన్ని దృశ్యాలు తనిని చలింపచేసాయంటాడు..ఓ కుంటినెమలిని చూసి చలించి చెత్తకుప్పపక్కన ఎంగిలిమెతుకులు వెతుకుతున్న కుంటినెమలిని వేసి "బర్డ్స్ ప్యారడైజ్" అంటూ ఓ సిరీస్ వదిలాడట..అది బంపర్ హిట్టు..ముంబాయి స్టన్న్ డ్..దేశం షాక్ డ్..! సండే అబ్జర్వర్ లోఇలస్ట్రేటర్ గా చేరి పేజీలనిండా పంచరంగులు పరిచాడు.ప్రీతీష్ నంది వ్యాసాలకు ప్రీతిపాత్రమైన బొమ్మలేశాడు.నీళ్ళరంగుల్లో తడిసిన మండల్ మడికట్టుకు కూచోలేదు..అరవై ఏళ్ళు దాటిన వయసులోకూడా డిజిటల్ బొమ్మలేస్తున్నాడు.
నిజంగా నేనే సి.ఎం అయితే "మండాలనికో ఉచిత మండల్ ప్రదర్శన పథకం" ఏర్పాటు చేస్తా..టాంకులు కట్టించి "కుళాయిల ద్వారా వాటర్ కలర్స్ సరఫరా స్కీం" ప్రవేశపెడతా..!
వాటర్ కలర్స్ తో నీ రొమన్సు వివరించమని అడిగితే ఏమంటాడంటే "వాటర్ కలర్స్ తో బొమ్మలేయడం ఓ ఉత్కంటభరితమైన ఆట..ఆ ఆటలో రంగులు నాకు ప్రత్యర్థిగా మారి నాప్రతి బ్రష్షుగీతను ప్రతిఘటిస్తాయి..చివరికి నన్ను ఆ రంగుల్లోనిండా ముంచేస్తాయి !"
"తారెజమీన్ పర్"లో అమీర్ ఖాన్ రూపంలో మీరేసిన "దర్సిల్ సఫారి" పెయింటింగు చూస్తే సింహం మీద సవారీ చేసిన ఫీలింగు కలిగిందండీ అంటూ ఎచ్చులుపోతూ "కార్టూన్ కబుర్లు" లో తనమీద మోహన్ రాసిన ఆర్టికల్ కాయితాల్ని స్కాన్ చేసి పంపి కావాలంటే ఏకంగా పుస్తకమే పంపిస్తానని చెప్పాను..దానికి "డియర్ మృత్యుంజయ్ ! సో నైస్ ఆఫ్ యూ ! నైస్ రీడబుల్ ఇమేజ్[తెలుగు రాదు మరి]ఇదే చాలు..దీన్నిఆల్వేస్ నా దగ్గరే అట్టిపెట్టుకుంటా..అన్నట్టు దయచేసి ఆ బుక్కు నాకు పంపొద్దు..థాంక్స్ ఫర్ లైకింగ్ తారెజమీన్ పర్ వర్క్.".....సమీర్
అని రిప్లే వచ్చింది.ఆ ఇ..మెయిల్ లోని అక్షరానికో లక్ష చొప్పున లెక్కేసి ఈ రోజు కూలీ బాగానే గిట్టుబాటయ్యిందని ఇంటిబాట పట్టాను.

మరో గ్రహం మీద నీటిజాడ తేలేవరకు అక్కడో వాటర్ కలర్ స్పెషలిస్టు ఉద్భవించేవరకు "మండల్"ని ప్రేమిస్తూనేవుందాం...మధుబాలను ఆరాధిస్తూనేవుందాం.