17, అక్టోబర్ 2010, ఆదివారం

పాండుకు నా అలయ్.. బలయ్ !!



ప్రతి దసరాకు పాండునుంచి వచ్చే దసరా విషెస్ ఎసెమ్మెస్ ఈసారి రాలేదు.పాండు లేడు..
నీది సూపరు లైను గురూ,ఆ అడ్డమైన సాప్టువేర్లో నీ హార్డువర్కేంటి గురూ..నీ మొహం..నీ శ్రాద్ధం..నీ పిండాకుడు..అన్న నిందాస్థుతులు ఇక లేవు..మా నాయిన బొమ్మ గీసిస్తానన్న పాండు లేడు.దసరాకు మూడురోజులముందు ఆర్టిస్టు,కార్టూనిస్టు పాండు చనిపోయాడు.44 ఏళ్ళకే వెళ్ళిపోయాడు.దసరాకు అంతా సొంతూరుకు ట్రావెల్సులో వెళుతుంటే,పాండు అంబులెన్సులో వెళతాడని కలలోకూడా అనుకోలేదు

1997 వార్తపేపరులో అకాలనిద్రనుంచి మేల్కొన్న దేవెగౌడ కాంగ్రెస్ ఫ్రంట్ గవర్న్మెంటును బాణం వేసి కూల్చేస్తాడు పైగా "ఇది వెన్నుపోటుకాదు,ఫ్రంట్ పోటే" అంటాడు నిద్రకళ్ళతో.షార్ప్ బ్రష్షు స్ట్రోకు,జబర్దస్తీ కంపోజిషను,లెక్కతో గీసిన బార్డరు హెచ్చింగ్స్..కార్టూను కింద పాండు అన్న సంతకం..జలక్ మంది నాకు..మోహన్ గీతతో చాచి కొట్టిన వీడు ఎవడబ్బా అని ఆరా తీసా ..రెడ్ హిల్స్ మెడ్ ఆర్సీ పక్కరూము గొళ్లెం తీసా..నవ్వుతూ పాండు..ఓ కౌగిలింత విత్ ఇస్మైల్ ఫ్లేవర్..ఇక వన్ బై టూ చాయ్ లు..షేరింగు ఆటోలు..కొండొకచో కోఠి బస్సులు..మోహన్ లైను పట్టుకొని ఖరారు చేసుకొనే పరుగుపందెంలో పాండు స్పీడు ఆశ్చర్యం.. మోహన్ గీతలేకాదు,ఆ గీతల్ని గీసే చేతివేళ్ళ కదలికలనుకూడా కాపీ చేసేవాడు పాండు..సిగరెట్ పీల్చి పొగొదులుతూ మీసపు అంచుల్ని కొనగోట మీటుతూ ప్యాంటును పైకిలాగుతూ అచ్చం మోహన్ మినియేచర్ లా కనిపించేవాడు..పెన్సిల్ ను మొనకు దూరంగాపట్టుకొని రపారప్ గీతలుగీసే పాండు స్టైల్ నాకిష్టం.
మా దోస్తానా అలా అలా ట్యాంకుబండు పాన్ డబ్బాపక్కసందునుంచి,పంజాగుట్టా కేఫ్ ల గుండా చిక్కడపల్లి బడ్డికొట్టు మీదినుంచి విద్యానగర్ సందుతిరిగి రామంతాపూర్ గల్లీ లో ఆగింది..
జ్నానవైరాగ్యసిద్ధర్ద్యం బాగ్ లింగం పల్లిలో మా అడ్డా కేఫ్ లో నేను కలిస్తే సిగరెట్ కో శ్లోకం,వక్కపొడికో పద్యం,ఛాయ్ కో చంపకమాలతో పాండు నన్ను అలరించాడు,నేను అభిమానించాను..నేను దుఖం పంచితే సంతోషం ఇచ్చాడు..తాదాత్మ్యతచెందే ఆధ్యాత్మిక విషయాలు భోధించాడు..ఛెగువేరా,శంకరాచార్యుల తత్వాలు..అష్టాదశపురాణాలు,అష్టకాలు,బాగవతాల సిన్మాలు విత్ ఓషో,రెంబ్రెంట్ల న్యూస్ రీల్సు..గంజాయి దమ్ము బిగించికొట్టిన కమ్మటి మత్తు..రిలీఫ్ మస్తు..ఇప్పటికీ చిక్కడపల్లి టర్నింగు పాయింట్లో పాండు బరనబబరవలు,నజబజజజరాలు,మసజసతతగాలు....కృతులు ..కీర్తనలు..
వినకుండా వినుకొండ నుంచి వచ్చి దినపత్రికలో కార్టూనిస్టు ఉజ్జోగం వెలగబెట్టినపాపానికి నాలుగునెల్లకో నెలజీతం తీసుకొని ఆకలిపేగులు అరగక లోయరుటాంకుబండు బండలకింద నలిగిపోతూ "టౌనుపక్కకెళ్ళొద్దురో డింగరీ ఢాంభికాలు పోవొద్దురో.. " అంటూ పాడిన పాట ఇంకా గుర్తు.
జయలలిత వాజ్ పేయి దవడలు వాచిపోయేలా సతాయించి చంపుకుతింటున్న హయాంలో.."మీరజాలగలడా నా యానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి.."అంటూ జయలలిత లేని జడను ఊపుతూ గీసిన కార్టూను ఎట్లామరిచిపోతామబ్బా ??
రోడ్డుపక్క కూలిన గోడలమధ్య ఓ వెంకాయమ్మ తన పెనిమిటితో.. పెద్దాడు సాప్టువేరు అంటుంది..లాంగ్ షాట్లో ఆ పెద్దాడు చాయ్ చాయ్ అని అరుస్తావుంటాడు..
చిన్నాడు హర్డ్ వేరు అంటుంది..క్లోజప్ లో ఆ చిన్నాడు కాల్చిన ఇనుముకడ్డీలను సుత్తితో హర్డుగా కొడుతుంటాడు.. పాథటిక్ పొలిటికల్ హ్యూమరు.పాండు గీసిన కార్టూను.
బ్రహ్మకడిగినపాదము బ్రహ్మముతానెనిపాదమూ..అంటూ హమ్ చేస్తూ 6x4 అడుగుల అద్దెగదిలో 12x8 అడుగుల నిలువెత్తు వెంకటేశ్వరస్వామిని పెయింట్ చేస్తున్న పాండును చూసా..ఏడుకొండలూ దిగి వయా వినుకొండనుంచి విద్యానగర్ కు వచ్చిన శ్రీ వేంకటాచలపతినీ చూసా.ప్రతిలేని గోపురప్రభలు గంటి..శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి..హరిగంటి..గురుగంటి..
ఒక చెంప సెల్ షీట్ల కట్టలమీద తాండవకృష్ణుడి కాళీయమర్ధనం..కళ్ళకింపైన ఆక్రిలిక్ లో భజగోవిందం,అశోకశోకం,స్వరార్చన,గోపికావస్త్రాపహరణం,పారిజాతం,గోపాలచూడామణి,గరుడవాహనం ఇత్యాది పెయింటింగులు..

నిజానికి పాండు మరణించలేదు ప్రశాంతంగా పడుకున్నాడు..
"గురూ నేను చాలాప్రశాంతంగా వున్నాగురూ..శివసాయుజ్యం పొందానుగురూ..తుఛ్ఛమైన ఏహ్యమైన భవబందాలను వీడి విష్ణువులో ఐక్యమయ్యి విముక్తుడినయ్యాను గురూ...నేను స్థితప్రజ్ఞుడిని గురూ !" అంటున్నాడు.."మీరు బొమ్మలేసి చావండ్రా..గీసి చంపకండ్రా..!" అంటూ "గీతో"పదేశం కూడా చేస్తున్నాడు.

దండిగా ధనం సమకూర్చి తోటికళాకారులు పాండు పెయింటింగులు,కార్టూనులతో ఓ అందమైన పుస్తకం అచ్చువేయిస్తే ఎంత బాగుణ్ణు..లేదంటే యాచన,దొంగతనం,కిడ్నాప్,నకిలీ కరెన్సీముద్రణ,డిటోనేటర్, హాకింగ్,హైజాకింగ్ లాంటి అత్యాధునిక పద్ధతులద్వారా డబ్బు సంపాయించి ఆ పుస్తకమేదో నాకే తీసుకురావాలనుంది..అందులో ఒక పుస్తకం దాచుకో నీ పాదాలకు తగ నే జేసిన పూజలివి...అంటూ తిరుపతి వేంకటేశుడి హుండీకి సమర్పించాలనుంది.

నా బడాదోస్తు పాండుకు నా దసరా అలయ్...బలయ్!
[పాండు గీసి నాకు పంపిన ఇరవైతొమ్మిది పెయింటింగుల్లోంచి తన ఇష్టదైవమైన శ్రీమహావిష్ణువు చిత్తరువును ఇక్కడ పోస్టు చేస్తున్నా]
పాండు పెయింటింగిలకోసం ఈ లింకు నొక్కండి..

18 కామెంట్‌లు:

  1. By going thru dis i wanna comment dese words:

    Friendship perhaps loomed larger than family..!!!

    Even i 2 agree wid ur comment dat 2 publish his paintings & cartoons in a book Named as: Touches our heart forever...

    anyways my Friend Mr. Mrityunjay did a gud effort...

    రిప్లయితొలగించండి
  2. బొమ్మ అద్భుతం, మీ మాటల్లో పాండుగారూ అజరామరం...బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  3. pand pai baga rasharu. pandu yevaro teliyani variki vivarinchalsindi. yeppudu maranincharu suchana prayanga naina prastaviste bagundedi. mitrudi ki mi nivali bagundi

    రిప్లయితొలగించండి
  4. పెయింటింగ్ అద్భుతంగా ఉంది.
    పాండు లేడని తెలిసి బాధగా ఉంది

    రిప్లయితొలగించండి
  5. ధన్యవాదాలు..
    @మురళి
    మార్చాను చూడండి.

    రిప్లయితొలగించండి
  6. sirji... hatsoff... mee' paandu ku alay balay' chadivi... naa kanneellu aagadam ledu....
    intakante emi vraayaleka potunnaanu... kallaku mottam kanneelle teraluterealu addu vastunnai mari...
    untaanu...
    IndiraTaamakrishna

    రిప్లయితొలగించండి
  7. Pandu garu kalam chesarani thelisi badhapaddanu,
    aayana cartoons blog link kani/mee vadha vunnavi kani pampamani manavi.

    రిప్లయితొలగించండి
  8. పాండుకు నా అలయ్..బలయ్ బ్రహ్మాండం..మిత్రుడికి నిజమైన నివాళి బావుంది. ఆ చిన్ని పుస్తకానికి కావాల్సిన డబ్బుకోసం ఏడురకాల మోడ్రన్ పద్ధతులు అవసరమా? డబ్బు టుది పవారాఫ్ డబ్బు, డబ్బు ప్రపంచంలోని అన్ని బంధాలను including స్నేహాన్నీ శాసిస్తుందని మరోమారు మీదైన శైలిలో అందంగా చెప్పారు.
    ఇకపోతే "జ్నానవైరాగ్య సిద్ధర్ద్యం.." "వినకుండా వినుకొండ" వంటి పదప్రయోగాలు బావున్నాయి.
    vipparthidb@yahoo.co.in

    రిప్లయితొలగించండి
  9. @విప్పర్తి
    కామెంటు రాసినందుకు ధన్యవాదాలు.మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పినందుకు మరీమరీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. హాయ్ అన్నా

    పాండు గురుంచి చాలా గొప్పగా రాసినావు.
    నేను కుడా సాక్షి లో వార్త చూసి షాకయ్యాను. మంచి మిత్రుడనే కాదు, మంచి ఆర్టిస్ట్ ను కుడా కోల్పోయాం.
    విషాదం తో ...
    మీ
    కళాసాగర్

    రిప్లయితొలగించండి
  11. పాండూ.. మళ్ళీ ఎక్కడో ఒక చోట కలుసుకుందాం...
    .......................................................................................................
    ......................................................................................................
    కంటిలో నీరెండి పోయిన ఆర్టిస్టులం మనం.. పక్కన పిడుగుపడ్డా.. ఏమాత్రం పట్టింపులేని జీవితాల్లో మనం

    మునిగిపోయాం. పాండు చనిపోయాడు అని తెలియగానే.. వేగంగా వెళ్ళి కళ్ళారా చూద్దామనుకున్నాను. నిజంగా నా

    జీవితంలో ఎప్పుడూ.. ఇంత ఆత్రంగా చచ్చిపోయిన వాళ్ళనెళ్ళి చూడాలనే కోరిక కలగలేదు. అయినా పాండు..ని చివరి

    చూపు చూసే భాగ్యం మాత్రం కలగలేదు. ఒక రకంగా పాండు నాకివ్వలేదు. బహుశా చాలామందికి.. ఎప్పుడూ నవ్వతూ

    ఉండే తన మొఖాన్ని.. మరోలా చూపించడం ఇష్టంలేకనేమో... అలా చేసుంటాడు.
    `పాండు చనిపోయాడంట.. ` అని సాక్షి వాసుగారు ఫోన్ చేసి చెప్పారు. `ఎక్కడ `అనే లోపే.. `సొంతూరికి తీసుకెళ్ళి

    పోయారట..` అని నొచ్చుకుంటూ చెప్పారు.
    ........
    నిజంగానే ఈ మధ్య చాలామంది కళ్ళల్లో కన్నీరు ‍‍యింకిపోతుంది.
    పాండు లాంటి గొప్ప స్నేహితుడు చనిపోయాడన్న వార్త విన్న తర్వాత కూడా.. నా కళ్ళల్లో నీరు రాలేదు.
    కనీసం చెమ్మగిల్లలేదు.
    ......
    నిజంగానే పాండు వార్త విన్న చాలామంది కళ్ళల్లో కన్నీళ్ళు యింకిపోయాయి...
    పాండు చనిపోతాడని బహుశా ఎవ్వరూ ఊహించకపోవడమే దీనికి కారణం...
    పాండు చనిపోలేదు..
    గీతకారుడికి, రాతకారుడికి.. ఏదో ఒక విధమైన కళాకారుడు ఎప్పటికీ చనిపోడట.
    పాండు బొమ్మలున్నాయి... పాండు చెక్కిలిగింతల గీతలున్నాయి
    అంతకుమించి పాండు మనపైన జల్లిన కల్మషంలేని నవ్వులున్నాయి..
    పాండు చనిపోలేదు....
    అందుకే మనకంట కన్నీరు రాలేదు. రాదు కూడా.
    అదిగో పాండు నవ్వుతూ ఉన్నాడు.. నవ్విస్తున్నాడు.
    పాండు.. స్నేహానికి నిర్వచనం
    ఎందుకంటే..
    పాండు ఎవ్వరికైనా..సరే
    ఎప్పుడు కనిపించినా ఓ మంచి స్నేహితుల్లాగానే కనిపించాడు.
    .......
    ....
    పాండు గురించి రాస్తున్నప్పుడు..
    చేతులు వణుకుతున్నాయ్..
    అక్షరాలు.. కూర్చడం నావల్ల కావడంలేదు..
    పాండూ... ప్లీజ్ ఎక్కడో ఒక చోట మళ్ళీ కలుసుకుందాం.
    _ గంగాధర్ వీర్ల, 21_10_10
    ( మిత్రడు మృత్యంజయకు కృతజ్ఞతలతో)

    రిప్లయితొలగించండి
  12. My dear Mrityunjay,
    You have written a very great tribute.
    I am sure our good friend PANDU would love reading it in
    his heavenly abode.

    Affectionately
    jayadev

    రిప్లయితొలగించండి
  13. ఇటీవల నేను మోతినగర్లో పంజేస్తుండగా పక్క గల్లిలో ఉంటున్న ఫ్రెండ్ ఇంటికి పాండు అన్న వొచాడని తెలిసింది . ఒక్కసారిగా అయన బొమ్మలు నా కళ్ళముందు కదలాడి నా కాళ్ళు ఆయన్ని కలవడానికి పరుగులు తీసాయి . వెళ్ళగానే ఆ కళా పుత్రుడికి చేతులు జోడించి నమస్కారం పెట్టాను .అంతే సంస్కారం తో నమస్తే అన్నారు .అయన వేసిన బొమ్మలు కార్టూన్లు గుర్తుచేసాను . చిరునవ్వులు చిందిస్తూ కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాక కంప్యూటర్ ముందు కూర్చొని నా మెయిల్లో పేయింటింగ్లు ,బొమ్మలు చుపిస్తనన్నారు సమయానికి నెట్ రాలేదు. మరోసారి కలిసినపుడు చూపిస్తాను తమ్ముడు అన్నారు .ఆయన్ని నేను మరోసారి కలవకుండానే స్వర్గానికి రమ్మంటూ దేవుడు వెంట పెట్టుకెల్లాడు. ఆర్టిస్టులు చస్తూ బతుకుతరేమో గానీ చచ్చిన తర్వాత మాత్రం బతేకి వుంటారు .ఓ పాండన్నా నీ బొమ్మలు మేము చూస్తునంత కాలం మా అందరి గుండెల్లో సజీవంగా ఉంటావు . పాండుఅన్నకు నందుగాడి రెండు కన్నీటి చుక్కలు నాతో ఈ రెండుముక్కలు రాయించిన మీ రాతకు కృతగ్నుడను. నందు

    రిప్లయితొలగించండి
  14. ఇన్నాళ్ళు ఈ బొమ్మలు చూడలేనందుకు బాధపడుతున్నాను. ఆ బొమ్మలు వేసే పాండు గారు చనిపోయారని తెలిసి ఇంకా బాధేస్తోంది.

    రిప్లయితొలగించండి
  15. పాండు గూర్చి పండువొలిచి చేతిలో పెట్టినట్టు పాండు జ్ణాపకతొనల్ని రుచి చూపించిన మిత్రుడి "పాండు"వీయం చదివాక మృత్యుంజై అని పిలవాలనిపించింది.

    రిప్లయితొలగించండి
  16. పాండు గారి గురించి కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నందుకు అదృష్టవంతుణ్ణి, ఇల్లా తెలుసుకుంతున్నందుకు దురదృష్టవంతుణ్ణి .

    రిప్లయితొలగించండి
  17. శ్రీనగర్ కాలనీ లో మా ఇంటి దగ్గరలో ఒక painting స్కూలు నడిపేవారు పాండు గారు,రవి గారు .తర్వాత ఆయన మొదటి వన్ మాన్ షో లో ఒక painting నా ద్వారా మంచి ధరకు(అప్పట్లో) అమ్ముడయిందని, మిగిలిన అత్యంత హృద్యమైన అందమైన కళాఖండాలలో ఏదైనా ఒక దాన్ని నన్ను తీసుకోమని అడిగారు. ఎంతో కష్టపడి చిత్రించిన వాటిలోంచి అలా ఒకటి తీసేసుకోలేనని అన్నాను.తరువాత చాలా కాలానికి ఒక framing షాప్ లో ఆయన బొమ్మలు కనిపించి ఆ శైలి వెంటనే గుర్తుపట్టి, పాండు గారి నంబర్ అడిగి తీసుకుని ఫోన్ చేశా. అప్పటికి ఒక ఎటాక్ వచ్చిందని చెప్పి 'రవే బతికించాడు మేడం.కొంచెం వుంటే పోయేవాడినే ' అన్నారు పకపకా నవ్వుతూ.
    ' అప్పుడు బొమ్మ ఇస్తే తీసుకోనన్నారు.ఇప్పుడు లక్షల్లో నడుస్తోంది.సంవత్సరం దాకా బుక్కైపోయా! '' అన్నారు.'ఎక్కువ స్త్రెస్స్ మంచిది కాదు.please take care ' అంటే , 'మనకట్టాంటి జాగ్రత్తలు కుదిరేవి కాదులెండి మేడం ' అని నవ్వేసిన పాండు గారు లేరని ఈమధ్యనే తెలిసింది.'సందేహంతో సంకోచం తో గీతలు గీయకూడదు మేడం!గీసే గీత బలంగా, ఖచ్చితంగా ఉండా'లనే పాండు గారింక గీతలే గీయరంటే చాలా బాధగా ఉంది.

    రిప్లయితొలగించండి