21, మే 2010, శుక్రవారం

ఒక నదివోలె ఆనందం ఎద పొంగెనే..


నా బాల్యమంతా పల్లెటూళ్ళో గడవడంవల్లేమో సిన్మాలు ఎక్కువ చూసి ఎంజాయి చేసినవి ..తిట్టుకున్నవి తెలుగు సిన్మాలనే!
టీ.వీ లో ఆదివారప్పూట సాయింత్రం అమితాబ్బచ్చన్ సిన్మా వస్తుందంటే చూసేవోన్ని..లేకుంటే లే..శనివారం తెల్గు సిన్మాతో సరి..దోస్తులు కూడా తెల్గు దోస్తులే ..ఒక్కనాకొడుక్కి హిందీ,ఇంగిలిపీసు వస్తే ఒట్టు.శుక్కురోరం సిత్రలహరి తోనె అడ్జెస్టు.
కొంతమంది వీరోలని జూసి,వీరోయిన్లని జూసి ఇంగొంతమంది పోటుగాళ్ళైతే డైరెట్టర్లని జూసి సిన్మాకెళ్ళెవోళ్ళు..నేను అట్టాంటిట్టాంటి మొగోన్ని కాదు కాబట్టి చిత్ర పాడిన పాటలు తెరమీద సూడాలని మాత్రమే ఎల్లేవోన్ని.చిత్ర బొమ్మ గీసి ఏకంగా నా నైన్తుకిలాసు పుస్తకాల అల్మారాలో అంటించుకుని ఆనందించేవాణ్ణి..అట్ల అంటుకుపోయిన చిత్ర బొమ్మ ఇప్పటికీ నన్నొదల్లే..ఉజ్జోగం ఊడినా,ఉండి వచ్చిన జీతం చాలకున్నా,ఇంటద్దె నెలనెలకు పెరిగినా,పోరగాల్ల సతాయింపులు సతాయించినా చిత్ర వాయిస్ ఇంటే బలే స్ట్రెస్ బస్టరబ్బా!
చిత్ర పాటలిన్న అనుభవమేగాని ఆమెను చూసింది లే..ఎట్లుంటదో ,ఎట్లుంటదో అని వాయిస్ వింటూ ఊహించి బొమ్మలేసేవాణ్ణి..ఓసారి అంతరాయానికి చింతిస్తున్నాం దూరదర్శన్లో చుడీదార్తో పాటలు పాడుతున్న చిత్రను చూసి గుండెలు లబలబా కొట్టుకున్నా..అదే మొదటిసారి..మలయాలి అమ్మాయని తెలిసి గుండుగుత్తగా ఏకంగా కేరళనే అబిమానించేవరకెళ్ళింది నా మోజు. "సింధూరపువ్వాతేనె చిందించరావా.."పాట ఎన్నిసార్లు విని పావనమయ్యానో లెక్కపెట్టడానికి లెక్కలు తెలియని వయసునాదప్పట్లో..నిరోషా ఇస్కూలుకు ఎల్తుంటే రాంకీ అట్కాయిస్తాడు..మొదట్లో నిరోషా టక్రాయించినా తర్వాత్తర్వాత దారికొస్తుంది ,చిత్ర పాటేసుకుంటుంది "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అని.. ఇంకేం ఇక్కడ అబ్భ ఏమి గొంతు భళిరా..అది సోకెనంటె భలిరా !!.....రాయడానికి తెల్వని ఐక్యూ.
ఆ సిన్మాని మా అమ్మానాన్నల కళ్ళద్దాలుగప్పి ఎన్నిసార్లు చూసుంటానో చిత్ర కోసం.
విజగశాంతికి చిత్ర పాటేసుకుందంటే ఇంగ నాకారోజు అరకోడికూర,కొరమీను పులుసు అంచుకు చిల్లిగారెలు,రొయ్యవేపుడుతో బోయినమే!ఆ కాంబినేషను పాటలు విని వినీ విన్సెంట్ వాంగో అయింది నామొగం[చెవి కోసుకున్నంత పని] బోన్గిరిలో సదువుతూ వుండగా నాకు రెండే రెండు పిరేడ్లు..మార్నింగ్ పిరేడ్ ఓంకార్ టాకీసులో,రెండో పిరేడ్ మ్యాట్నీ ఎంగటేస్పరా టాకీసులో ..చిత్ర పాటేసుకుందని చెప్పడమే ఆలస్యం ఎనకాముందు సూడకుండా లగెత్తడమే లగెత్తడం..
మరణమ్రుదంగంలో "గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.." పాటకు నేనున్నాను లో "ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో.."పాటలో చిత్ర గాత్రం తాలూకూ విప్లవాత్మకమైన మార్పును నేను గమనించితి.
పాపం అందరూ గొప్పసింగర్లే గానీ,నన్ను మెప్పించేటట్టు పాడే రగస్యం మాత్రం ఈ జగాన ఒక్క చిత్రకే తెల్సునని నా అభిప్రాయం.
నూనూగు మీసాల నూత్నయవ్వనముతో కళకళ లాడుతూ కౌమారదశకు చేరుతున్న టైములో చిత్రను ప్రేమించిన ఇధంగా ఏ ఆడదాన్నిగూడా కనీసం కన్నెత్తికూడా చూల్లే.
ఇప్పటీకీ "సింధూరపువ్వాతేనె చిందించరావా.." అన్న పాటింటే చాలు నైన్తు కిలాసు పుస్తకాలు పడేసి టాకీసు వేపుకు పరిగెడుతున్న పీలింగు.
చిత్ర పాటల్ని కళ్ళతో వినీ,చెవుల్తో చూసే అలవాటయ్యాక నేను కలవాలనుకుంటున్న వ్యక్తుల లిస్టులో తర్వాత పేరు ఈ దేవతాకంఠం.
చిత్ర పాడిన పాటల్లో నన్ను గిల్లిగింతలు పెట్టిన కొన్ని వాక్యాలు..
"జుంటితేనె తొనికించగా..ముని పంటి పదును పెదవంటగా.."
"సవ్వడి చేయని యవ్వని వీణలు అలా అలా సవరించు ..పదే పదే పలికించు.."
"గొడవేగొడవమ్మా చేయిపట్టే చిలిపీ వాడమ్మా.."
"అబ్బ రూపమెంత రుచిరా..అహ చూపుకెంత కసిరా.."
"నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంభరం..నీ నవ్వు ముద్దాడితే మల్లెపూవాయె నా యవ్వనం.."
"మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో.."
"నీతోనే డంకాపలాసు..అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వేనా కళావరాసు.."
"ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే."
"మూసిన ముత్యాలకేలే మొరుగులు.."
"శ్రుంగార స్నేహాల సంకెళ్ళు వేయాలా సింగారి చిందాటతో.."
"మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.."
"పొద్దున్నే పుట్టింది చందామామ మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మా.."
ఇంతవరకే అంటే మిగిలిన పాటలు కోప్పడతాయ్ అందుకే అన్నీనూ..
సౌందర్య వొంపుల ఊపులు..చిత్ర గాత్రం సొంపుల సొబగులు ఇచ్చట నొక్కితే గుండెల్లో కాంభోజి రాగమే !
[ పాటే చిత్ర కోసం ఓ పాటేసుకోదా "నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ ఈ గీతాంజలీ..!" అని.]

13 కామెంట్‌లు:

  1. "విజగశాంతికి చిత్ర పాటేసుకుందంటే ఇంగ నాకారోజు అరకోడికూర,కొరమీను పులుసు అంచుకు చిల్లిగారెలు,రొయ్యవేపుడుతో బోయినమే!"

    :)))

    భలే ఉందండి మీ చిత్రాభిమానం.. వాణి జయరాం, చిత్ర లాంటివాళ్ళ తెలుగు ఉఛ్చారణ వింటుంటే వాళ్ళు పరభాషా గాయనీమణులంటే అస్సలు నమ్మబుద్ది కాదు!

    రిప్లయితొలగించండి
  2. 'ee shwasalo cherithe' pata shreya ghoshal padinid anukutunna

    రిప్లయితొలగించండి
  3. "బోన్గిరిలో సదువుతూ వుండగా నాకు రెండే రెండు పిరేడ్లు..మార్నింగ్ పిరేడ్ ఓంకార్ టాకీసులో,రెండో పిరేడ్ మ్యాట్నీ ఎంగటేస్పరా టాకీసులో .."

    hahahah...excellent and extra-ordinary timetable. ;)

    Amazing style of writing posts :)

    Way to go...

    రిప్లయితొలగించండి
  4. @నిషిగంధ
    మీకు ధన్యవాదాలు.
    @అజ్ణాత
    అలా అనుకోవద్దు..చిత్ర శ్వాసలో చేరిన గాలి గాంధర్వమయ్యింది.
    @what to say about me.
    థాంక్యూ వెరీమచ్.

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుందండీ. చిత్ర మీద ఉన్న అభిమానాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పారు. నేను కూడా ఆవిడ అభిమానినే. తన గొంతులో వున్న తియ్యదనం నాకు ఎవరి గొంతులోనూ కనబడదు. ఆవిడ పాటలు అన్నీ మీకు తెలిసే వుంటాయి. నాకు నచ్చిన కొన్ని పాటలున్నాయి. అవి మీరూ వినే వుంటారు. వినకపోతే వొకసారి విని చూడండి.

    * ఎవరో ఒకరు ఎపుడో అపుడు (అంకురం)
    * పాటగా నాలో పరువాలు పలికే (క్షత్రియుడు)
    * పాడలేను పల్లవైనా భాష రాని దానను, నేనొక సింధు కాటుక చిందే (సింధు భైరవి)
    * సుందరి నీవు (మైఖెల్ మదన కామరాజు)
    * అంజలీ అంజలీ పుష్పాంజలి (డ్యూయెట్)
    * మనసున మనసున (లవ్ బర్డ్స్)
    * పొద్దే రాని లోకం నీది (గోకులంలో సీత)
    * మానస వీన మౌన స్వరాన (హ్రుదయాంజలి)

    ఇంకా చాలా వున్నయిలెండి. ఇలా రాసుకుంటూ పొతే మీ బ్లాగులో నా సోది ఎక్కువైపోతుంది. అందుకే ఆపేస్తున్నా.

    రిప్లయితొలగించండి
  6. @ఇది సమీర లోకం
    ధాంక్సండి..
    ఆ పాటలన్నీ నాకు కంఠతా వచ్చును అన్నట్టు,మీ పేరు మీద చిత్ర పాడిన ఈ పాట విని పరవశించండి.
    "ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలీ...."

    రిప్లయితొలగించండి
  7. its very interesting... i virtually enjoyed a lot.. especially the slang which u had used it.... tooo gud..

    రిప్లయితొలగించండి
  8. అబ్బ... అబ్బ... మీ తెలంగాణ బాస ఇన్నంక (అదే సదివినాక) నాగ్గాని మా సీమ బాసలో చించేయాలనిపిస్తాంది.. మీ చిత్రార్చన బలే ఇదిగా ఉందన్నో..ఇట్లా నాగ్గాని అబిమానము ఉన్నా గాని ఇట్ల రాయడం చానా బాగుండాది.. మంచి ఇచ్చినావన్నొ.. ఇంగ ఉంటా మడి..

    రిప్లయితొలగించండి
  9. అబ్బ... అబ్బ... మీ తెలంగాణ బాస ఇన్నంక (అదే సదివినాక) నాగ్గాని మా సీమ బాసలో చించేయాలనిపిస్తాంది.. మీ చిత్రార్చన బలే ఇదిగా ఉందన్నో..ఇట్లా నాగ్గాని అబిమానము ఉన్నా గాని ఇట్ల రాయడం చానా బాగుండాది.. మంచి ఐడియ ఇచ్చినావన్నొ.. ఇంగ ఉంటా మడి..

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఇందిర గారికి ధన్యవాదాలు.
    చించేయమని చాలారోజుల్నుంచి చెబుతూనేవున్నా..వింటేగా???

    రిప్లయితొలగించండి
  12. సిరంజీవీ, నీ బలాగులు సదూతుంటే సేపల పులుసు తిన్నంత కమ్మంగుంది బాసూ!

    రిప్లయితొలగించండి