22, సెప్టెంబర్ 2010, బుధవారం
మా నాయిన నేసిన నూలు గణపతి
వందల పోగులు కలిస్తే ఒక పాయ..వందల పాయలు,వేల రబ్బర్లు,బోలెడు రంగులు,నేత కలిస్తే పై వినాయకుడి బొమ్మ..ఆ నేత బొమ్మ పైన భూదాన్ పోచంపల్లి,కింద ఆర్ట్ బై చిలువేరు రామలింగం..
గణెష్ పండగకు పోచంపల్లిలో ఏ షావుకారింటికి వెళ్ళినా లేదా పట్టుచీరెల షాపులకెళ్ళినా మా నాయిన నేసిన వినాయకుడి బొమ్మ ముందు "వాతాపి గణపతింపజే" లే..
వేలరూపాయల జీతం ఇస్తాం "ఆప్కో"లో ఉజ్జోగం చేసి పెట్టండి..లేదా "వీవర్స్ సొసైటీ సెంటర్" లో పిల్లగాండ్లకు "టై అండ్ డై" లో ట్రెయినింగ్ ఇవ్వండని గవర్నమెంటు ఎంత చెప్పిన మా నాయిన వింటేనా..!"లే.. లే..లే.. లే..వేలు కాదు లచ్చలిచ్చినా అసుమంటి నౌకరి చేసే సొవాయితం కాదు నాది..మా ఊళ్ళోనే.. మా ఇంట్లోనే నాకిస్టమయన పనే చేసుకుంటా ..మా ఇంటి ఆకిలి మీద రంగు రంగుల నూలు దారాలతో ఇంద్రధనుస్సు పరుచుకుంటా.."అనేవాడు.
వందకు ఐదు రూపాయల మిత్తీ లెక్కన పదివేలకు పోగయ్యే మిత్తీ వసూళ్ళకు ఫైనాన్సు షాపులనుంచి వచ్చి మాఇంటి వాకిట్లోనే బజాజ్ చేతక్ హర్న్ మోగిస్తూ మనాయినకు వార్నింగులిచ్చి విసిగించే డబ్బు వ్యాపారులు..రాత్రికి బియ్యం లేవు అంటూ మా అమ్మ సతాయింపులు..పరీచ్చ పీజులు ఇమ్మని జులూమ్ చేసే మాకు సమాదానం చెబుతూ అవదానం చేసినంత శ్రద్ధతో నేసిన వినాయకుడి బొమ్మ అది.
వినాయకుడి ఫొటొ కోసం మా నాయిన సెర్చ్ ఇంజను హైద్రాబాద్ బేగం బజార్ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్యాలండరు షాపులు..
గ్రాఫ్ పేపరుమీద ముందు పెన్సిలు స్కెచ్చు..ఆ పేపరు సాయంతొ దారాల పాయలమీద గంజిలో నూరిన బొగ్గు ఇంకుతో మార్కులు...ఆ పై రబ్బర్లు...ఆ తర్వాత రంగులద్దడం..మరో రంగులకోసం మళ్ళి గుర్తులు..మళ్ళీ రబ్బర్లు..మళ్ళీరంగులు..ఇలా నాలుగైదుసార్లు..ఆ తర్వాత గంజిపెట్టిన రంగురంగుల దారాల గణెశుడు ఎండకు ఆరతాడు..అటునుంచి అచ్చుకు జాయింటు..ఇహ అటునుంచి సరాసరి మగ్గానికి దేవుడు..మగ్గంలో దేవుడు..
కనీసం రెండునెల్లు..నాలుగు జతల దేదీప్యమాన వినాయకుల్లు..అష్టగణనాధులు మా ఇంట్లో కొలువు..వాటిలో ఓ గణేషుడిని గోడకు వేలాడదీసి లాంగ్ షాట్ కోసం దూరం జరిగి ఓ బీడి వెలిగించి తన ఎడం చేయి నడుముకు ఆన్చి రిలీఫ్ గా పొగ పీల్చి వదిలాడంటే బొమ్మ ఓకె.
సెప్టెంబరు నెల భాద్రపద మాసం,పౌర్ణమి తర్వాత రెండవరోజు విదియ తిథిన ఛాతి నొప్పితో పొద్దున సెవన్ సీటరు ఆటోలో హైద్రాబాదు వెళ్ళి ఓ ఆసుపత్రిలో జాయినయిన మానాయిన రాత్రి పదిన్నరకు మాకు లేడు.. మానాయిన పార్ధివ శరీరంతో మా ఇంటికెళుతున్న అంబులెన్సుకు నిమజ్జనానికెళ్ళే పదమూడు రాత్రుల గణనాధులు ఎదురయ్యి ఎళ్ళుండికి సరిగ్గా ఏడేళ్ళు.
నెలకో ఎగ్జిబిషను..హర్యానా,డిల్లీ,చండీఘడ్,కలకత్తా,బొంబాయి,బెంగుళూరు,మద్రాసు..శిల్పారామంలో హస్తకళా ప్రదర్శనలు... ఏమయ్యాయో..?!
రకరకాల డిజైన్లు..వందలాది బొమ్మలు..బ్యాంకు లోగోలు [బ్యాలెన్సులు కాదు]..కుట్టకుండా ప్యాంటుషర్టులు,బ్యాగులు..మూడుకొంగుల చీరెలు..పచ్చీసులు..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు..ప్రక్రుతి సిద్ద రంగులతో తేలియారుమాళ్ళు..అగ్గిపెట్టెలో పట్టే చీరె... ఎక్కడున్నాయో..?!
ఆ కళ కొనసాగించడానికి చేనేతకళ మాకెవ్వరికీ అబ్బలేదు..
లచ్చకోట్ల డిజైను కాయితాలు,టన్నులకొద్ది కలరు డబ్బాలు,వందలకోట్ల రంగుపెన్సిల్లు ఇంకా సూటుకేసులు పిక్కటిల్లేల శాలువాలు,బీరువాలు బద్ధలయ్యే షీల్డులు,అవార్డుల ఫోటోఫ్రేములు.."అతనిచేతిలోకలవు అపురూప కళలెన్నో" అంటూ రాసిన వార్తాపేజీల కాగితాలు సంపాయించి ఇచ్చిన ఓ పేద చేనేత కళాకారుడి కొడుకు ఏం చేస్తాడు....బ్లాగులో బావురుమంటాడు..ఇరుకింట్లో అద్దెపొదుపు చేసి గీసిన పెయింటింగుకు ఖరీదైన ఫ్రేము తగిలించి గోడకు వేలాడదీసి గోడుచెప్పుకుంటాడు..గుండెనిండా దుఃఖపు నిల్వలు పోగేసుకొని ఓ తెల్లారుజామున కుప్పకూలిపోతాడు..సొంతూరులో పొక్కిలిపడ్డ ఇంటివాకిలి దుఃఖాన్ని ఆపడానికి నెలకో రెండునెల్లకో ఓదార్పుయాత్ర చేపడతాడు.నూలుగణపతికి దండం పెడతాడు.
[25..09..2010 నాడు మా నాయిన వర్థంతి సందర్భంగా..]
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
very good tribute your father. Now we will pay only homage on their well and wishes to us.
రిప్లయితొలగించండిI am sorry.Really a good tribute to your father.
రిప్లయితొలగించండిbagundi. poyinollanta mancholle.
రిప్లయితొలగించండిthanq.
రిప్లయితొలగించండిHis life was gentle,and the elements
So mix'd in him,that the nature might stand up,
And say to all the world,this was a man.
-Shakspear[in julius Caeser]
మనసుకి హత్తుకున్నదండి.
రిప్లయితొలగించండిజయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం
అన్నాడు భర్తృహరి, మీ నాయనలాంటి వాళ్ళని గురించే (ఈ శ్లోకం సాగరసంగమం సినిమా క్లైమాక్సుచివర్లో బాలు గొంతులో వినిపిస్తుంది) . ఇటువంటి కళాకారులందరూ కవీశ్వరులే. వారి కీర్తికి జరామరణాల భయం లేదు.
miru rasindi nannu chalaa kadinchindandi .I am sorry.
రిప్లయితొలగించండిannaa..!ganapathi story chadivanu chaala bagundhi ! me gunday taditho rasi mammalni kantathadi pettinchaav me feelki evay na vandhanalu ! me nandu
రిప్లయితొలగించండిమా నాన్న గారికోసం మీ బ్లాగ్ లోకి వస్తే ఇక్కడ నాలాగే నాన్నని పోగొట్టుకున్న మరో దుఃఖపు తడి... నా కళ్ళు చెమ్మగిల్లాయి... మీ నాన్న కోసం, మా నాన్న కోసం కూడా...
రిప్లయితొలగించండి@వీరబాబు నాగభైరవ
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్.."పితాహి దైవతం"