నమో ఎంకటేసా.. నా నమో తిరుమలేసా..అని మా ఊరు ప్రసాంతు టేటర్ మైకు నుంచి గంటశాల పాట ఏసుకున్నదే ఆలస్యం సంకల పిల్లల్తోని అమ్మలక్కలు,మొకాలకు పెయిర్ అండ్ లవ్లీ పూసుకొని మొగపోరగాల్లు,లంగ ఓనీ నెత్తి ల కనకాంబ్రం పూలతోని ఆడిపోరగాల్లు మా ఆకిట్లనుంచి ఉరికిఉరికి పోతుండడం...మేం మాడ్పులగాళ్ళలెక్కన గుమ్మం దగ్గర నిలబడి సూస్తుండడం..ఇదే తంతు..ఎందుకంటే మేం సిన్మా సూడ్డానికిలే..పండగలపూట తప్ప మరో రోజు సినిమాకు పోయినామంటే మా నాయిన సిన్మా కత వేరే వుంటది..ఒగసారి మా అమ్మ కిష్టమ్మత్తమ్మతో కలిసి "మా ఆయన బంగారం" సిన్మాకెళ్ళి వచ్చేసరికి మా నాయిన ఫ్రీ గా "యముడే నా మొగుడు" సిన్మా సూపెట్టిండు.
మా తాతకు మాత్రం సినిమా సోకు ఎక్కువ..ఆ రోజు కౌసు లేకున్నామాయెగానీ సిన్మా మాత్రం ఉండి తీరాల్సిందే.
ప్రతి సిన్మాకు మా నాయినమ్మను ఎంటేసుకొని ఎళ్ళడం అలవాటు..ఓ చేత్తో కర్ర,ఇంకో చేత్తో మా నాయినమ్మ చేయి పట్టుకొని టింగురంగా అంటూ మా తాత సిన్మాకు ఎల్తుంటే నా జెలసీ ఉప్పొంగి ఏరులై పారేది.ఆళ్ళకు మాత్రం సిన్మాకు గ్రీను సిగ్నలు..తనని కన్నోళ్ళకి ఒక నీతి,తను కన్నోళ్ళకి ఒక నీతా అంటూ మా ఇంట్లో దైర్నంగా ఇప్లవం లేవదీసి ఓ రోజు ఏమైతే అది అయితదనిజెప్పి.. "క్సనక్సనం" సిన్మాకు బయలుదేరిన,వచ్చి డోరు నూకేసరికి ఎల్లలే..ఇంకోసారి దబాయించిన పలితం లే..కిటికీలోంచి ఒంగబడి దర్వాద దిక్కు సూసే సరికి గుండే జల్లుమంది..లోపల్నించి తాళం బిగించి ఏసాడు మా నాయిన. ఆ రోజు ఎండబెట్టుకొని బయట అరుగుమీదే పనుకుంటుండగా "సెలి సంపుతున్నా సెమక్కులో సెలి సెంతకొఛ్ఛిందీ.." అంటా సెకండ్ షో సిన్మా పాట లీలగా ఇంటూ బజ్జొని లేసేసరికి మా యమ్మ ఆకిలిఊకుతా కనబడింది..
సిన్మాలమీద మా నాయినకు పెద్ద స్రద్దలేదుగాని,అప్పుడెప్పుడో పట్నం కెళ్ళినప్పుడు మహేస్వరి పరమేస్వరి టేటర్ల రమేశ్ కిష్న కొడుకు గదానిజెప్పి మా అమ్మ బలమంతం మీద "సామ్రాట్" సిన్మా కెళ్ళాడు ..ఆ సిన్మాకంటె మహేస్వరి పరమేస్వరి ఎస్కలేటర్ బాగ నచ్చింది మా నాయినకి.
మా నాయిన సిన్మాకెలితే టాకీసులోకంటే టాకీసు బయటే ఎక్కువ ఇంట్రస్టు సూపిస్తడు..ఒకపాలి దిల్ సుక్ నగర్ కోనార్కు టాకీసుకెల్లి టేటర్ మీదున్న "కోనార్కు వీల్" డిజైను గీసి బెడ్ షీట్ నేసాడు[లింకు]
పొద్దున్నే మొకం కడగతా కుడేపు వున్న కోడి రామసామి ఇంటి గోడ మీద అంటించిన సిన్మా పోస్టరు మారిందా లేదా అంటా సూడడం మా ఈది పోరగాల్లకు అలవాటు ..సిరంజీవి,కిస్న,కిస్నంరాజు సిన్మా బొమ్మ పడిందంటే ఎట్లనో అట్ల పైసల్ సంపాయించి సిన్మాకు లగెత్తాల్సిందే..అన్నట్టె ఓ రోజు కిస్నంరాజు సిన్మా బొమ్మ పడనేపడింది..అమ్మ భడవా అంటా సిన్మా వదిలేది లేదని మా అమ్మని కాకా పట్టడం షురూ చేసిన..అక్కడ సిన్మా ఇస్టార్టు అయ్యే టైము అయిపోతుంది మా అమ్మ పైసలు లేవంటది..పైగా రాత్రికి కూరగాయల్లేవంది..మా అమ్మ జగజ్జట్టి ..ఒప్పించడం నా వల్లకాలే.పైసల్ పుట్టె మార్గం ఆలోచిస్తా వుండగా తెల్లారింది..ఓ ప్రపోజల్ తట్టింది..
మా ఇంటికి పేపర్లు సదవడానికి,టీవీ సూడడానికి,ఇండోర్ గేమ్సు ఆడడానికి మా ఊరి పోరగాల్ల టికానా మొత్తం మా ఇంట్లోనే..వాళ్ళల్లో ఒ పెద్దమనిసిని పట్టి "ఓ రెండ్రూపాయలు నాకు దానం వద్దు,అప్పు వద్దు,ఓ గంట కిరాయికిస్తవా?" అనడిగినా..పైసలు కిరాయికివ్వడమేంటన్నట్టు సూసాడు వాడు.."అవన్నీ నీకు అనోసరం గంటకు చారానా[పావల]లెక్కన రెండ్రూపాయలు నోటు ఇస్తవా ఇవ్వవా?" అనడిగేసరికి బేరం నచ్చి ఇచ్చిండు.ఆ రెండ్రూపాయలు నోటు సైజు తెల్ల కాయితం ఒకటి నీటుగా కట్ చేసి రెడ్డింకు బాల్ పాయింట్ పెన్నుతోటి అచ్చుగుద్దినట్టు రెండ్రూపాయలు నోటు గీసి పడేసా..డిటో డిటో..ధన్ మని సూస్తే అది రెండ్రూపాయలు నోటు కాదని చెప్పడు తలకాయ కింద మెడకాయ వున్నవాడెవడు..లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న ఆ రెండ్రూపాయలు నోటును పైకెత్తి సూద్దునుగదా దాంట్లో కిస్నంరాజు పైటింగు,పాటలు,యాక్సను,క్లైమాక్సు అన్నీ కనబడ్డాయ్ ..
ఆ నోటును పట్టిపట్టి సూస్తే మాత్రం నాకు తన్నులు ఖాయం..నోటు రడీ, ఇంగ సిన్మాకు పోవడమే లేటు అంటా ప్రసాంతు టేటర్ కు బయలుదేరిన..టిక్కెట్లకాడ మంది మస్తుగుంటే ఎవ్వడు గుర్తు పట్టడు..లేకుంటే కొద్ది దూరంలోనే పోలీసుటేసను అనుకున్నా..టాకీసు గేటు దగ్గర పల్లీల బండి కనబడితే చారానా పల్లీలియ్యవయ్యా అసలే అక్కడ సిన్మా ఇస్టార్టు అయిపోయింది అంటా ఆన్ని కంగారుబెట్టిన ..ఆడు తొరతొరగా పల్లీ ఫ్యాక్ చేసి నా డుబ్లికేటు నోటు తీస్కొని వాడిచ్చిన ఒరిజినల్ రూపాయ్ బారానాతో సెకండుక్లాసు టిక్కెట్ కొని టాకీసు లోకి జొరబడ్డా..ఇంగ కాలు మీద కాలెసుకొని ఊపుతూ పల్లికాయ తింటూ పక్కోడికి ఆఫర్ చేస్తూ కిస్నంరాజు సిన్మాని ఎంజాయి చేసిన సన్నివేసం ఇట్లా వర్నించడం నా వల్ల అయ్యే పనిగాదుగానీ,
తెల్లారిపొద్దున్నే ఆ పల్లీ బండీగాడు ఆ రెండ్రూపాయలనోటు పట్టుకొచ్చి మా ఈదిలో తిరగుతూ తిట్టిన తిట్లతో కిస్నంరాజు సిన్మా సూస్తే ఎక్కిన కిక్కు దిగి దిమ్మదిరిగి బోర్లాపడ్డా..ఇంగ ఈ ఇషయం మా నాయినకు తెలిస్తే నా ఈపు సున్నంబెల్లం..మోకాళ్ళు చెక్కల్ చెక్కల్ అని భయపడుతుండగా..
"లేరా..లే..నువ్వు గీసిన రెండ్రూపాయల నోటు విలువ ఒరిజినల్ వందరూపాయలకంటే ఎక్కువేరా !" అంటూ మా నాయిన నన్ను గచ్చు మీద కూసోబెట్టి ఓదార్చిండు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chalabagund yippudu 1000 notu geeyandi
రిప్లయితొలగించండివామ్మో రెండు రూపాయల నోటు చేతి తో గీసి తయారు చేసారా ? మీరు సామాన్యులు కాదు నిజం గా నమ్మలేకుండా ఉన్నా .
రిప్లయితొలగించండి@ నా యిష్టం
రిప్లయితొలగించండినిజమే..ఇయన్నీ సొయంగా జరిగినయే..అబద్దాలు అండ్ అతిశయోక్తులు కావు..
అన్నా గ్రేట్ అన్నా నువ్వు
రిప్లయితొలగించండి