19, ఆగస్టు 2010, గురువారం
అంబరుపేటలో డైనోసార్ !
ఏ పార్క్ కు ఎళ్దాం..ఇందిరా పార్కా ? లుంబినీ పార్కా ? అంటే జురాసిక్ పార్క్ అనేవోన్ని నేను..ఏ పెద్దాయన కనిపించినా సార్ కు బదులు "డైనోసార్ !" అని పిలిసేవోన్ని.. అట్లుండేది నా పిచ్చి సొవాయితం..
డైనోసార్ ని సైన్మాల్లో సూడ్డం కాదు..సేసి సూడాలి..సూసి సేయాలి అనుకున్నా..సెంద్రుడు పోయి సూర్యుడు వస్తుండు..గనియారం ముల్లు ఓహో ఒకటే తిరగతా వుంది..టిపిను బాక్సులు పెట్టుకొని ఆపీసుకు,ఇంటికి తిరగతా వుంటి..చాయిలమీద చాయిలు తాగుతావుంటి..ఎనక్కి తిరిగి సూస్తే ఏముంది..సేసింది లే...సూసింది లే..సచ్చింది లే..డైనోసార్ కల అట్నే ఏడిసింది..
ఏదైతే అదైతని పట్టుపట్టి సేయనే సేస్తి..డైనోసార్ ని 2డి లో గుసాయించి 3డి లోపటాయించిన.. డైనోసార్ అంబరుపేటకు రానే వచ్చింది.
2డి యా 3డి యా ఏ డి అయితేనేమి??..డి అంటే డి ..
సేయాలన్న కుతకుత నరాల్లో వుండాలి గానీ,నాలుక మీదే వుంటే వస్తందా సస్తందా..?
18, ఆగస్టు 2010, బుధవారం
ఎంగటేస్పర సామి మీదొట్టు !
గిట్ల జేస్తే సామి కార్యం,సకార్యం కాదా..ఏంది ??..ఐనా ఎంగటేస్పర సామికి మనమొవలం సెప్పడానికి..ఆ డ్యూటీ నారదమగర్సికేస్తె పోదా ఏంది...!
14, ఆగస్టు 2010, శనివారం
జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!

మా ఇస్కూలు మొత్తం పోరగాల్లతో పాటు మా బ్యాచి పిలగాండ్లు పండరినాథ్,కిషోర్ గాడు,సుదర్సన్ గాడు,ఆర్.ఎంకటి గాడు,పి.రవిందర్,దేవకినందన్..ఇద్దరేసి పోరగాల్లం లెక్కన పంద్రాగష్టు రోజు జంటగా మా ఇస్కూల్ నుంచి చెర్వు కట్ట దగ్గర వినోభా మందిరం దగ్గరికెళ్ళి రిటన్ తిరిగి పాతసంఘం,గాంధి బొమ్మ పక్కనుంచి జై భొలో సతంత్రభారత్ కీ.! జై !! అంటూ మార్కండెస్వర స్వామి గుడి ముంగటనుంచి పోచంపల్లి ప్రతి సందూ తిరుగుతూ మా ఇంటి ముందునుంచి మల్లీ ఇస్కూలు కెల్లి జనగనమన పాడేసి ఓ చేత్తో పిప్పర్మెంట్లు,ఇంగో చేత్తో బిస్కత్తులు పట్టుకొని ఇంటికెలుతూ..జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!
11, ఆగస్టు 2010, బుధవారం
ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ !

నేను నైన్తు కిలాసులో ఉన్నప్పుడు మా ఇంగిలీసు టీచరు సుమతి మేడం పాటం చెప్తా టెక్స్ట్ బుక్కు ఇవ్వమన్నప్పుడు మా ముందు బెంచి పిలగాల్లం పుస్తకం ఇవ్వడానికి పోటీలు పడేవోళ్ళం..మా పుస్తకం సూస్తూ మేడం పాటం చెప్పడం అంటే మాకారోజు ఆనందం అంబరాన్ని తాకడమే...
ఒకానొకసారి నేను అట్లా ఇవ్వడానికి పుస్తకం తీసేసరికి నా ఇంగిలీసు బుక్కు నుంచి నేను ఇస్టంగా గీసి దాచుకున్న బొమ్మ రాలి కింద పడింది..ఓ చేత్తో నేనిచ్చిన పుస్తకం తీసుకుంటూ మరో చేత్తో కిందపడిన బొమ్మ అందుకుంది సుమతి మేడం..ఏంటా అంటూ మడత విప్పి చూసే సరికి బిఫోర్ మ్యారేజి..ఆఫ్టర్ మ్యారేజి అంటూ బొమ్మ కనబడే సరికి కళ్ళు పెద్దగా చేసి నవ్వింది..ఒకే బొమ్మ రెండు క్యాప్షన్లు ..అమ్మాయి బొమ్మ నవ్వుతా వుంటది కింద బిఫోర్ మ్యారేజి..పేపరు తలకిందుల చేస్తే అదే బొమ్మ మగాడై ఏడుపు మొగం పెడతాడు.. కింద ఆఫ్టర్ మ్యారేజి ....ఆ బొమ్మ మ్యాజిక్కు,క్యాప్షను తాలూకు ఫిలాసఫి సుమతి టీచరుకు తెగనచ్చింది..ఆ పిరేడు సగం నన్ను పొగడడానికే సరిపోయింది..ఆ కాన్నుంచి నేను రోజుకో డ్రెస్సు మార్చేవోన్ని ఎందుకంటే అంగి కాలరు ఎగరేసి ఎగరేసి మాసిపోతుండేది మరి..
పిరేడు అయిపోగానే ఆ బొమ్మ కాయితం తిరిగి ఇవ్వకుండా ఎళ్ళిపోయింది..ఓ అద్దగంట తర్వాత బెల్లు కొట్టే పిలగాడు వచ్చి మృత్యుంజయని హెడ్ మాస్టరు రమ్మంటుండు అని ఎల్లిపోయాడు..వీడొచ్చి నా గుండె బెల్లు కొట్టి పోయినాడేంటి అంటా నాకు ఒకటే వనుకు.. కంప్లైంట్లు ఇస్తే తప్ప పిలిసే బాపతు కాదు మా హెడ్ మాస్టరు లక్ష్మినారాయన రెడ్డి సారు..ఆయన సుమతి టీచరు భర్త..మక్కెలిరగ్గొడ్తా అంటూ బయాలజీ పాటం సెప్పుతుంటే సూడాలి సారు మొగం, ఎంత దయగలమారాజో.. అసుమంటి మా హెడ్ మాస్టరు పిలిసినాడంటే ఎట్లా వుంటది ఎవ్వారం...
ఇంగ నేను హెడ్ మాస్టరు స్టాఫ్ రూముకెళ్ళే సరికి అక్కడ రకరకాల టీచర్లతో రాయలవారి సభాప్రాంగణం కిటకిటలాడుతోంది..వంతులవారిగా పంతుళ్ళు నేను వెలగబెట్టిన బొమ్మని చూస్తూ నాతో నవ్వుతూ మాటలాడుతుంటే సిగ్గుతో నేను వంకీలు తిరిగిపోతుంటే సూళ్ళేక ఎళ్ళి కిలాసులో కూసోమ్మన్నారు..
ఇంగ తెల్లారిందే పాపం మా కిలాసు తెలతెల్లని గోడలన్నీ నా బొమ్మల్తోని నింపి పడేసా..నిజాకది కిలాసు అనడంకంటే ఆర్టు ఎజ్జిబిషను అనడం సమంజసం..సందర్భానుసారం నా ప్రతిభ భయటపడేది అంటే వినాయక చవితికి ఇనాయకుడి బొమ్మ,దసరాకి దుర్గా మాత, క్రిస్ మస్ కు ఏసుక్రీస్తు బొమ్మ ఇట్లా కిలాసు గోడలు నా బొమ్మల్తోని బిజీ బిజీగా వుండేయి.. సుమతి టీచరు ఇంగిలీసే కాకుండా రసాయన శాస్త్రం కూడా సెప్పేది..పరమాణు మూలకాల చార్టు హైడ్రోజను..01,హీలియం..02 నైట్రోజన్...12 ........అంటూ రాసి ఓ పెద్ద పోస్టరు తయారు సేసి బ్లాకు బోర్డు పైన తగిలించిన..
ఆ కాన్నుంచి ఆడామగా కలిసి అరవై నాలుగు మంది కిలాసు పోరల్లో నేను ఇస్పెషల్ స్టూడెంటుగా కీర్తించబడిన..అట్లాగని నేను సదువులో పోటుగాన్నేంగాదు..యావరేజి స్టూడెంటుని..
ఇహ సుమతి టీచరు చెప్పే ఇంగిలీసు గ్రామరైతే ఎంత శ్రద్ధగా ఇనేవోడినో..ఆక్టివ్ వాయిస్,పాసివ్ వాయిస్ లైతే హరికథ చెప్పినంత భక్తిగా చెప్పేది.."డేవిడ్ కాపర్ ఫీల్డ్" పాటం అయితే కంటస్తం చేసే వరకు వదిలేది కాదు..తెగిపడిన శిల్పాల పాఠం "ఒజిమాండియాస్" లెస్సన్ లో "ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ " కొటేసను ఎంత నచ్చిందంటే నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ ఆ కొటేసనుతోనే ఓపెన్ చేసాను..రెండెళ్ళక్రితం ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ అంటూ ఆర్కుట్ లో చేరి నూటా ఇరవై మంది,ఫేసుబుక్కులో మూడొందలమంది దోస్తుగాల్లని ఆ కొటేసను కస్టమ్ మెసెజ్ తోనే గదా సంపాయించింది..
అదే ఆర్కుట్ లో ఈ మెసేజ్ చూసేసరికి గిర్రున కళ్ళెమ్మటి ఫ్లాష్ బ్యాకు దారల చారలు..
"Hi,This is Sumathi laxmareddy.I worked as a Bio science teacher in ZPHS pochampally from 1986 to 2001 did u study during that period?My husband also worked as Headmaster."
[ఇప్పుడు నేను అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసరుతో అంతో ఇంతో ఇంగిలీసు మాటలాడుతున్నా,బ్రెజిల్,బెల్జియం,టర్కీ,కజకిస్తాన్,ఉజ్బెకిస్తాన్,పాకిస్తాన్ కార్టూనిస్టుల్తో బొమ్మల సంగతులకోసం ఇ_మెయిల్ ముచ్చట్ల ఇచ్చకాల గచ్చకాయలు ఆడుతున్నానంటే ఇంగ్లీషు సరస్వతి మా సుమతి టీచరు వేసిన భిక్షే గదా!]
10, ఆగస్టు 2010, మంగళవారం
ఓ వాలు జడ..మల్లెపూల జడ..

ఇంగ నా పెల్లి సూపుల ముచ్చట మగా ఇసిత్రంగా వుండేదిలే..
ఏ పిల్లని సూడ్డానికి ఎల్లినా ముందు కంటే ఎనకాలే ఎక్కువ సూసేటోన్ని.. జడ కోసం...జడ సిన్నదా?పెద్దదా? ఒరిజినలా? సవరమా? అని మగా ఎగ్జయిటింగుగా,యాంగ్జటింగుగా వుండెడిది..అసలే "జడని దువ్వనీ,పొగడని మొగడు జడపదార్థమే జడ..." అంటూ ఈ టీ.వి మనోరంజని లో బాపు సిన్మా పాటలు రెచ్చగొట్టేయి..
ఎట్లైతేనేం..సిట్టసివరికి ఆ బగమంతుడుగారు రాధిక బికాం కంప్యూటర్స్ పొడుగు జడకు సక్కగా నూనె రాసి అందంగా దువ్వి అంబరుపేటకు పంపిండు..ఇంకేం ఓ.కే అనేసిన..గ్రహ దోష నివారనకు పేరుమార్చమంటే రాధిక బికాం కంప్యూటర్స్ సుమ బికాం కంప్యూటర్స్ అయ్యింది[ఇంగా నయం జడ మార్చమన్లేదు..] "వురే సుమ అచ్చం ముందునుంచి మోహన్ బొమ్మ,ఎనక నుంచి బాపూ బొమ్మరోయ్" అంటూ నా దోస్తుగాల్లు ఒహటే సతాయింపు..
ఇంగ మోహన్ సార్ దగ్గరికెళ్ళి "సా...సా...నాకు సుమకు పెల్లి సా...నేను కార్టూనిస్టుని అని తెల్వాలి సా...జడ హైలెట్ కావాలి సా...మందిని పెల్లికి పిల్వాలి సా.."అంటూ ఓ డిస్క్రిప్షన్ రాసిచ్చినంక మోహన్ సార్ బొమ్మగీసేసరికి అంగో వెడ్డింగు కార్డు అట్ల తయారయ్యింది..
మా నాయిన కుషీ అట్లా ఇట్లా కాదు జీరాక్సులు తీసి మరీ పంచిండు..
మా ఊళ్ళో మా ఇంటి పక్కనుండే కుర్రి రాజయ్య పెండ్లాం,సంగెం లచ్చుమమ్మ,ఎలగందుల రంగయ్య పెండ్లం ఈ పెండ్లి పత్రిక పట్టుకొని మా అమ్మతోని..
"ఏమమ్మో నీ కొడుకు అప్పుడే నీ కోడలు జడ పట్టుకోని,కొంగు పట్టుకోని ఇడుస్తలేనట్టుందీ..ముందు ముందు ఎట్లనో.." అంటూ మా అమ్మను ఎగేసిండ్రు.
[పెల్లికి నూటా పదారు మంది ఆర్టిస్టులు,కార్టూనిస్టులు [రెండు వేల నాలుగు వందల మంది సుట్టాలు మినహాయించి] కలిసి చేసుకున్న పెల్లి కుషీకి,మజాకు ఈరోజుకు విజయవంతమైన తొమ్మిది సమ్మచ్చరాలు]
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)