శ్రీరామనవమి అయినా శివరాత్రి అయినా కౌసు కౌసే ..ఎవ్వరిపండగ వాళ్ళదే..ఇదీ మా నాయిన దరువు..
పండగపూట పెళ్ళాం మెగుళ్ళు చక్కగాస్నానం చేసి గుడికి కొబ్బరికాయలు తీసుకెళుతుంటే మా నాయిన మాత్రం
తలకాయకూరతో ఎదురుపడతాడు.ఆ రోజు పండగన్న ధ్యాసకూడా వుండదు.
ఉపవాసాలు,ఫాస్టింగుల పదాలింటే మా నాయినకు సివ్వరలేస్తది.పొట్టేలు మాంసమో,పొట్టపేగులో ఏది దొరికితే అది అప్పుచేసైనా కొని కొయ్యాల్సిందే,మా అమ్మచేత ఏ అర్ధరాత్రి అయినాసరే వండించి తిని తీరాల్సిందే..ఇదీ మానాయిన ఫిలాసఫి.అంతేగానీ పూజలు,వ్రతాలు,తీర్ధప్రసాదాలు బాపతు పదాలు మా నాయిన డిక్షనరీలోనే లేవు..
శివరాత్రి రోజు ఊరుఊరంతా దేవుని విగ్రహాలను భక్తిగా కడుగుతుంటే మా నాయినమాత్రం మా ఇంటి ఎదురుగా టెంకలో ఉప్పేసి చాపల్ని కడిగి శుద్ధంచేస్తాడు.
దేవుడికి సొంతాభిప్రాయాలున్నట్టే మా నాయినక్కూడా సొంతాభిప్రాయాలున్నాయి.."ఎవడి అభిప్రాయాలు వాడివే..ఎవడిష్టం వాడిదే"అంటూ చాపల్ని కడిగిన నీళ్ళను పక్కనేవున్న చెట్లకు పోస్తాడు.
మా నాయిన మనుషుల్ని ఎంత ప్రేమిస్తాడో జంతువుల్నికూడా అంతే ప్రేమిస్తాడు..పక్షులు,జంతువులు ఎంతప్రేమంటే వాటిని అమాంతం కూరొండుకొని తినేసేంత.
కుందేళ్ళు,ఉడుములు,పావురాలు,కోళ్ళు,చాపలు,అడవిపంది..ఏదొచ్చినా సరుకు నాణ్యత చూసి దానిమీద మా నాయిన I.S.I మార్కు వేయాల్సిందే..
అమ్మడానికి వచ్చినోళ్ళు ముందు మా ఇంటి ముందు ఆగి మా నాయిన బేరం తర్వాతే వాళ్ళు రెండో బేరానికి కదలాలి..చాపలైతే ముందు వాటి చెక్కిళ్ళు సుతారంగా తాకుతూ లాగి చూస్తాడు ఎర్రగా నిగనిగలాడుతూ వుంటే అప్పటికప్పుడు పట్టుకొచ్చినయన్నమాట..ఇట్లా ఉంటాయ్ కోడ్ లు..
మా ఊరిపొలిమెరల్లో రాత్రివేళ టార్చిలైట్ వెలుతురులో కుందేళ్ళని వేటాడి అమ్ముతుంటారు..వాటిని కొనేసి చక్కగా చర్మం పాడవకుండా రెండు కాళ్ళమధ్యనుంచి సన్నగా కోసి లోపలి మాంసం జాగ్రత్తగా తీస్తాడు..ఆ మాంసంతో కూర లేదా ముట్టీలు[కీమాబాల్స్] నూనెలో గోలించి చేయిస్తాడు..తిత్తిని మాత్రం చక్కగా కడిగి లోపల పత్తి[cotton]తో నింపి వాసనరాకుండా డాంబర్ గోళీలు[నాఫ్తలీన్]వేసి కుట్టి ఇంటి ఫ్లవరువాజుల పక్కన షోకేషుగా పెడతాడు..ఉడుములకు కూడా ఇదే గతి..అచ్చుపానమున్నవాటిలాగే చూస్తాయవి మనల్ని..
మా నాయిన ఈ తతంగం పూర్తిచేసేసరికి వాటి మాంసం తాలూకు వంట మా అమ్మ సిద్ధం చేస్తుంది.
ఇగ భోజనాలుకు కూసొని కుందేలుముక్క తింటూ షోకేషులో వున్న కుందేలుతిత్తి ముకాన్ని చూడడం..ఉడుము తునకల్ని నముల్తూ ఉడుము తిత్తిని చూడ్డం....
మానాయిన ఆనందం,త్రుప్తి అప్పుడు చూడాలి..వర్ణించడం ఎవరితరం??? ఏ పని చేసినా కాసింత కళాపోసన వుండాలి అన్నది మా నాయిన సిద్ధాంతం.
దీపావళి ముందు వరకు ఆ బొమ్మలుండేవి..ఇల్లు దులిపి సున్నలేసేటప్పుడు వాటిని మా అమ్మ బయటపడేసి కాల్చేసింది..
ఇక మా ఇంట్లో ఎవ్వరికి జరాలొచ్చినా డాక్టర్ దగ్గరికి ఎళ్ళడం అంటూ వుండదు...ప్రేమ్ లాల్ దగ్గరికో,విటాభా దగ్గరికో ఎల్తాడు మానాయిన.ప్రేమ్ లాల్ ,విటోభా లు మా ఊళ్ళొ పేరుమోసిన మాంసం కొట్టిచ్చేవాళ్ళు..[సాయెబులు,చాకలి,మంగలి,కటిక,..ఏ కులపోన్నైనా మానాయిన వరస పెట్టి పిలుస్తాడు..మామా అనో,అప్పయ్యా అనో,తాతా అనో అంతేతప్పా పేరుపెట్టి పిలిచిన పాపాన పోలె బతికున్నంతవరకు]
మా నాయిన ప్రిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది..
జలుబుకు కాళ్ళషోర్వ..గొంతు గరగరకు తలకాయ కూర..మోకాళ్ళనొప్పులకు పావురాళ్ళను కోసిన రక్తంతొ నొప్పిదగ్గర మర్ధన చేస్తాడు[ఈ వైద్యం మా మూడోవాడు దత్తు పై చాలాసార్లు ప్రయోగించాడు..దత్తు కట్టబడుతున్న బిల్డింగులపైనుంచి దూకే స్పెషలిస్టు కావడం మూలాన మోకాళ్ళనొప్పులు ఎక్కువగా వస్తుండేయి వాడికి]
మా ఇంట్లో వస్తుగుణప్రకాశిక అని ఒక పుస్తకం వుండేది..దాన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఎప్పుడో నేను పుట్టకముందుకొనిపెట్టాడు..ఆ పుస్తకంలో ఏ వస్తువ తింటే శరీరానికి ఏం జరుగుతుంది అని వివరంగా ఉండేది..ఆ పుస్తకం కోసం మా వీధిలో క్యూ పద్దతి పాటించేవాళ్ళు..ఆ బుక్కుని చక్కగా బైండింగు చేసి పెట్టాడు..బ్యాంకు లెడ్జర్ పుస్తకం మాదిరి వుండేది..హైటు అమితాబ్బచ్చన్,వెయిటు కల్పనారాయ్..
"పండగ పూట ఈ నీసు వంటలేందిరా"అని అంటూండేవాడు మా తాతా.మా నాయినేమో చాపలకూరని విష్ణుమూర్తి [మత్స్యావతారం]అవతారం అనేవాడు..
"పూటకో అవతారాన్ని తెచ్చి ఖతం చేస్తే సంపాదనెట్లా..పిల్లల పెల్లిండ్లు ఎట్లారా??"అంటూ ఒహటే గులుగుడు మా తాత.